25-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1

స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో

మహిమకు పాత్రుడు ఆయనయ్యా
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే
నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే
||నే పాడెద||

స్తుతి చెల్లించెద యేసయ్యా
స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా
||నే పాడెద||

స్తోత్ర గీతము 2

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు రాజుల రాజా
యావే నిన్ను స్తుతియింతును
యావే నిన్ను ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా

నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ
నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము
నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము

నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము
నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము
నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం
నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద

స్తోత్ర గీతము 3

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం ||సుమధుర||

ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన ||సుమధుర||

ఆరాధన వర్తమానము

మన దేవుడు స్తుతింపదగినవాడు, నిరంతరము స్తోత్రార్హుడుగా ఉంటున్నాడు. అయితే మనము కొన్ని సమయములలోనే స్తుతిస్తాము, మరి కొన్ని సమయములలో ఆయనను స్వీకరించలేని పరిస్థితిలో ఉండిపోతాము.

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. -యెషయా 12:6

ఎవరైతే ఆయన మన మధ్య ఉన్నాడని గుర్తిస్తారో, వారు ఆయనను అనుభవించగలుగుతారు. యదార్థమైన భక్తి కలవారు ఇటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. ఆ ఆసక్తిని కనుపరచుకున్నప్పుడు ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు.

మన దేవుడు ఏమై ఉన్నాడో అదే మన జీవితం. ఆయన శక్తిమంతుడైతే, మన జీవితము శక్తిమంతమైనది.

యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును. -యెషయా 12:5

ఎటువంటి సందర్భములలో మన జీవితములలో దేవుని మహాత్మ్యము కనపరచబడుతుంది? అని ఆలోచిస్తే, మనము బాగా ఉన్నప్పుడు అది కనపరచబడదు కానీ, మనము శ్రమలో ఉన్నప్పుడు దేవుని మహాత్మ్యము ఖచ్చితముగా వెల్లడి పరచబడుతుంది.

భూమియందంతటను ఇది తెలియబడును అనే మాట చూస్తే, ఆ భూమిలో మనము కూడా ఉన్నాము. మన జీవితములో కూడా ఆయన మహాత్మ్యము వెల్లడిపరచబడుతుంది. మనము దేవుని యొక్క మహిమ కొరకై ఉన్నాము అనేది సత్యము. ఇది మన జీవితములలో నెరవేరవలసినదే. ఆయన మహిమకు అడ్డుగా వచ్చిన ప్రతీ దానినీ ఆయనే తొలగిస్తాడు.

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. -యెషయా 45:1

ఈ వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు కోరెషు జయించునట్లుగా అతని చేతిని పట్టుకున్నాడు. ఇది దేవుడు తాను అభిషేకించిన కోరెషుగూర్చి చెప్పుచున్నాడు. అయితే ఇది మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే –

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

మనము కూడా దేవుని సొత్తైన వారము గనుక, మనము కూడా అభిషేకించబడినవారు. దేవుని ఆరాధించుట అనేది యాజకులు చేసే పని. మనలను ఆయనను ఆరాధించునట్లుగా మనలను రాజులైన యాజక సమూహముగా ఏర్పరిచినాడు. తన మహిమ కొరకు మన జీవితమును పట్టుకున్నాడు.

–నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. -యెషయా 45:2

జెరుబ్బాబెలును అడ్డగించడానికి పర్వతమా నీవేపాటిదానివి అని జెకర్యాలో ప్రభువు చెప్పుచున్నాడు. అలాగే మనకు కూడా మన ఎదుట మెట్టలుగా ఉన్న పరిస్థితులను సరాళము చేస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు. అంతే కాదుగానీ, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఆయన విరుగ గొట్టేవాడుగా ఉన్నాడు.

మన జీవితములో ఏ సమస్య వచ్చినా సరే దానికంటే ముందు వాక్కు బయలుదేరుతుంది. మనము ఆ పరిస్థితిని చేరుకొనేసరికి ఆ అడ్డు తొలగించబడవలసినదే. మన మార్గము రాజమార్గము, మన జీవితము రాజమార్గములో ప్రయాణించేది గనుక ఎటువంటి అడ్డువచ్చినా సరే అది తొలగించబడుతుంది.

మన జీవితములో దేవుడు తన మహాత్మ్యమును వెల్లడి పరుస్తారు అని చూసాము. అది ఎలా వెల్లడిపరుస్తారు? పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు అయితే ఏమీ దొరకలేదు. అయితే యేసయ్య ఒక్క మాట పలకగానే అక్కడ మహాత్మ్యము జరిగింది. అనగా మహాత్మ్యము జరగాలి అంటే ఆయన మాట పలకబడాలి. అంతే కాక ఆ పలకబడిన మాటను మనము స్వీకరించాలి. అనగా ఆ మాట ప్రకారము మనము చేయడానికి సిద్ధపడాలి. మహాత్మ్యము అంటే మన ఊహకు అందనిది.

మనకు ఏమి అడ్డు వచ్చినా సరే అవి తొలగించబడ్డాయి అని ప్రభువు మాట విడుదల చేసాడు. ఆయన మహాత్మ్యము మన జీవితములలో కనపరచబడుతుంది.

ఆరాధన గీతము

నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా

ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా

నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట
||ఏది మారినా||

సింహాల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట
||ఏది మారినా||

వారము కొరకైన వాక్యము

ఆయన నిన్ను విడిచిపెట్టడు అనేది విశ్వాసుల జీవితములలో సత్యము. మన జీవితములలో అనేకమైన సందర్భములగుండా వెళుతూ ఉంటాము. ఒక్కోసారి ఏ సహాయము అందదు, ఎవరూ లేని ఒంటరి పరిస్థితులగుండా వెళ్ళవలసిన సమయములు కలిగి ఉంటాము. అయితే మనము విడిచిపెట్టబడము.

యేసయ్య 40 దినములు అరణ్యములో ఉపవాసము చేస్తున్నారు. ఆ 40 దినములు ఒంటరిగా, ఎవరూ సహాయము లేని పరిస్థితులలో ఉండగా యేసయ్యకొరకు పరలోకము పనిచేసింది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయితే యేహోవా వానికి సహాయము చేయును. ఆయనను కలిగి ఉన్న మన జీవితము కూడా అంతే!

అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.౹ కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.౹ ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.౹ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;౹ నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.౹ -ఆదికాండము 21:13-18

హాగరు అరణ్యములోనికి పంపివేయబడింది. ఏ సహాయము అందించబడలేని సమయము. ఆ అరణ్యములో అటు ఇటు తిరుగులాడుతుంది. తన వద్ద ఉన్న ఆహారము, నీళ్ళు అయిపోయినతరువాత ఇంక తను దుఃఖపడుతుంది. పిల్లవాని చావును నేను చూడలేను అని అనుకుని ఒకపొదవద్ద తనను పెట్టి ఏడుస్తుంది.

మన జీవితములలో కూడా మన వద్ద వనరులు ఉన్నంతవరకు కొంత పని చేయగలుగుతాము. అయితే ఆ వనరులు అయిపోగానే, ఇంక మన వల్లకాదు అనుకుని వదిలివేసే వారిమిగా ఉంటాము. అయితే మన ప్రభువుకు మన మీద ఉన్న ఉద్దేశ్యములు, రానున్న కాలములో ప్రయోజనకరమైన విషయములే ఆయన మన జీవితముల కొరకు ఉద్దేశించాడు.

హాగరు ఆ పరిస్థితిలో ఇంక చేసేది ఏమీ లేక ఎలుగెత్తి ఏద్చినదానిగా ఉంది. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు స్పందించి దూతను పంపించాడు. అయితే దేవుడు ఎందుకు స్పందించాడు? హాగరు అబ్రహామునకు సంబంధించినది గనుకనే హాగరుకు కలిగిన శ్రమలో విడిచిపెట్టలేదు.

మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.౹ -ఆదికాండము 21:19

అక్కడ హాగరు కొరకు ఒక నీళ్ళ ఊట సృష్టించబడింది. అబ్రహాము అనే ఒక మనుష్యునికి సంబంధించిన దానినే దేవుడు విడిచిపెట్టలేదు. మనమైతే దేవునికి సంబంధించినవారము తన స్వరక్తమిచ్చి కొనుక్కున సొత్తైన మనలను విడిచిపెడతాడా?

మన జీవితములలో దేవుని కొరకు ముద్రించబడిన స్వాస్థ్యముగా ఉన్నాము. ఎటువంటి శ్రమ వచ్చినా సరే మన దేవుడు మనలను విడిచిపెట్టడు. మనము ఆయన సొత్తు అయి ఉన్నాము. హాగరు కొరకు నీళ్ళ ఊట సృష్టించబడింది. మన జీవితములలో మన అవసరములలో ఏమి అవసరమో దానికొరకైన నూతనమైన సృష్టి జరిగించబడుతుంది. మన దేవుడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు!

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.౹ పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై –నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;౹ ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.౹ -1 రాజులు 17:1-5

ఇక్కడ ఏలియా రాజు వద్ద ధైర్యముగా ఈ సంవత్సరము వర్షము కురవదు అని ప్రకటించాడు. అటుపిమ్మట కెరీతు వాగు వద్దకు వెళ్ళి దాగి ఉండమని దేవుడు ఏలియాకు చెప్పెను. సూపర్ నేచురల్ గా కాకుల ద్వారా ఉదయము సాయంత్రము భోజనము అందించబడింది.

కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. -1 రాజులు 17:7

ఇప్పుడు ఆ వాగు ఎండిపోయింది. ఏలియాకు తాగటానికి ఇంక ఏమీ లేదు. అయితే ఏ సూపర్నేచురల్ సహాయము ఇంతవరకు అందించబడిందో, అలాగే సూపర్నేచురల్ గా మరొక సహాయము దేవుడు ఏర్పాటుచేసాడు.

అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.౹ -1 రాజులు 17:8-9

ఇక్కడ ఒకవేళ ఒక ధనవంతుడి ఇంటికి పంపితే నమ్మకముగా వెళ్ళగలమేమో. అయితే ఒక విధవరాలి ఇంటికి అది కూడా చివరి ముద్ద మాత్రమే కలిగిన ఒక విధవరాలి ఇంటికి దేవుడు పంపించాడు. అందుకే మన దేవుడు సూపర్నేచురల్ కార్యములు జరిగించువాడు. ఒక్క క్షణమైనా సరే మనలను విడిచిపెట్టడు.

మన జీవితములను కొనసాగించుటకు ఏమి ఆరంభించాడో, అది మన జీవిత కాలమంతా అదే జరిగించబడుతుంది. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అగ్నిరథములు చూసాడు. ఎలీషాను శత్రు సైన్యము చుట్టిముట్టినప్పుడు కూడా అగ్నిరథములు ప్రత్యక్షపరచబడ్డాయి.

ఆ విధవరాలి పరిస్థితి చూస్తే, చివరి ముద్ద తిని తరువాత చనిపోవడానికి సిద్ధపడిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏలియా వచ్చి అడిగినప్పుడు ఆ విధవరాలు ఇవ్వగలిగింది. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు గనుక, ఆ ప్రకారము జరగవలసినదే. అయితే అక్కడ సూపర్ నేచురల్ గా కార్యము జరిగించబడుతుంది.

మన దేవుడు మధ్యలో విడిచిపెట్టడు. ఖచ్చితముగా ముగింపునకు నదిపిస్తాడు. ఏలియా దేవుని ఆత్మను కలిగినవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని ఆత్మను కలిగి, దేవుని కుమారులుగా ఉన్నాము. ఏలియా విడిచిపెట్టబడకుండా కొనసాగించబడ్డాడు అంటే, మనము కూడా విడిచిపెట్టబడకుండా, కొనసాగించబడతాము.

ఏలియాకి ఆహాబు రాజు వద్దకు వెళ్ళి ప్రకటించిన తరువాత కెరీతు వాగు ఆహాబునుండి రక్షించబడునట్లుగా దాచబడటానికి సిద్ధపరచబడింది. ఆ తరువాత కూడా నీళ్ళు అయిపోయిన సందర్భములో కూడా ముందుగానే విధవరాలి ఇంట స్థలము సిద్ధపరచబడింది. ఆ సిద్ధపరచిన ప్రదేశములో సూపర్ నేచురల్ సిద్ధపరచబడింది.

మన జీవితములలో చూస్తే, మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాము. అనేకమైన పరిస్థితులు మన జీవితములను లాక్కుపోయే విధముగా ఉన్నాయి, అయితే ఆ పరిస్థితులు మనలను ముట్టకుండా మనము కూడా దాచబడతాము. దానికొరకైన స్థలము ప్రభువే సిద్ధపరుస్తాడు. ఆ దాచబడిన సమయమంతా సూపర్ నేచురల్ గానే పోషించబడతాము, కొనసాగించబడతాము.

గనుక మనము విడువబడము.