ఆరాధన వర్తమానము
ఈ దినము ఎంతో ప్రశస్తమైన దినము. ఎందుకు అని ఆలోచిస్తే, మన అందరికీ దేవుని స్తుతించే అవకాశము దొరికింది. అనేకులు ఈ దినము చూడనివారు ఉన్నారు. అయినప్పటికీ మనకు అవకాశము దొరికింది. మనము స్తుతించి, ఆరాధించేది ఎవరిని అని చూస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను, దేవాది దేవుని అనే సంగతి మనము ఎరిగిఉండాలి. ఈ అవకాశము ఆయన ఇచ్చాడు గనుకనే మనకు దొరికింది. ఆయన అవరణములో మనము ప్రవేశించకమునుపు మనము మన పరిస్థితులను బట్టి నిరాశలో ఉన్నప్పటికీ, ఒక్కసారి ఆయన సన్నిధిలోనికి రాగానే అవన్నీ ఇంక గుర్తురాకూడదు.
దేవుని గూర్చిన సత్యము నీవు ఎరిగిన వాడవైతే, దేనికీ భయపడకుండా నీవు నిలబడగలుగుతావు. నీకు ఎదురైన ప్రతీ దానిని నీవు జయించడానికి సిద్ధపడతావు. రేపటి గూర్చి నీవు ఇంక చింతించవు.
అసలు రేపటి దినము ఎందుకు ఇవ్వబడుతుంది? ఏదైతే దేవుడు నీ కొరకు సిద్ధపరచినది అనుభవించడానికి, తద్వారా ఆయనను స్తుతించడానికి. క్రీస్తులోనికి రాకమునుపు ఏ దుఃఖములో ఉన్నావో, దానికి రెట్టింపు సంతోషము నీవు అనుభవించడానికి. ఈ సత్యము మనము ఎరిగినపుడే ఆ సంతోషమును, ప్రభావమును అనుభవించగలుగుతాము.
ఈ దినము మిగతా దినములకు తేడా ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే, ఆదివారము అనగా ఈ దినమున, మనము జీవించుట కొరకు ఆయన మాటలు విడుదల చేస్తారు. ఆ మాటల ప్రభావము సోమవారమునుండి శనివారము వరకు అనుభవించి జీవిస్తావు. ఈ సత్యము ఎరిగి నీవు సిద్ధపడి జీవిస్తే, నీ జీవితము ఎంతో శక్తివంతముగా ఉంటాయి. దేవుని వాక్కు గనుక మనకు దొరకకపోతే, ఈ పాటికే మనము నశించిపోయేవారము. అయితే మనము కృంగిపోక, నశించిపోక ఆశ కలిగి ఉండటానికి కారణమే ఆయన మాటలు. అందుకే “నాకు బలమై ఉన్న దేవుడు” అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు.
మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. -కీర్తనలు 81:1-2
మన జీవితములకు ఆధారమే ఆయన. ఈ అనుభవములోనికి మనము రావాలి అంటే, ఆదివారమునకు మిగతా రోజులకు తేడా ఏమిటో గ్రహించి, నిన్ను జీవింప చేసే మాట ఆయన దయచేస్తాడు అనే సత్యము ఎరిగి జీవించాలి.
“నేను నిజమైన ద్రాక్షవల్లి” అని యేసయ్య చెప్పాడు, అనగా జీవము కలిగిన ద్రాక్షావల్లి, ఫలించు ద్రాక్షావల్లి. అటువంటి ఆయన మనకు బలమై ఉన్న దేవుడు. ఈ సత్యము ఒప్పుకోవడమే ఆరాధన.
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.౹ -హెబ్రీయులకు 13:15
దేవునికి చేసే స్తుతియాగము అనగా- ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుటయే. సోమవారమునుండి, శనివారము వరకు నీ దేవుని వాక్కు యొక్క ప్రభావమును నీవు అనుభవించాలి అంటే, నీ దేవుడు ఏమై ఉన్నాడో అది నీవు ఆదివారమున ఒప్పుకోవాలి.
భక్తులందరూ ఇదే సత్యమును ప్రకటించారు. మోషే ఎర్రసముద్రమును దాటిన తరువాత ఆయనను గూర్చిన సత్యమును పాట ద్వారా నాకు బలమై ఉన్నాడు అని ప్రకటించారు.
అలాగే భక్తులందరు విశ్వాసము ద్వారా జీవించారు. ఆ విశ్వాసము ద్వారానే బలము పొందుకున్నారు. విశ్వాసము అంటే, ఏ సత్యమైతే నమ్మావో దానికి సాక్ష్యము కనపరచేదే విశ్వాసము. సింహము ఎంతో బలమైనది అయితే దానిని నోళ్ళను కూడా విశ్వాసమును బట్టి మూయించారు అని వ్రాయబడి ఉంది.
వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;౹ -హెబ్రీయులకు 11:33
బలహీనులుగా ఉన్న వారు, బలమైనదాని నోరు మూయించారు. ఎలా అది సాధ్యపడింది? సింహము నోరు చంపడానికి తెరువగా దానిని మూయాలి అంటే దానికంటే బలమైన వాడివలననే సాధ్యము. ఎప్పుడైతే నా బలము నాదేవుడే అనే సత్యమును బట్టి విశ్వాసము కనపరుస్తామో, ఆ బలమైన సింహము పై దానికంటే బలవంతుడైన దేవుని బలము పనిచేసి, దాని నోరు మూయబడుతుంది.
అలాగే ఈ దినము మనము కూడా నాకు బలము నా దేవుడే అని ఒప్పుకుంటున్నాము. దానిని బట్టి మన జీవితము కూడా బలహీనమైన జీవితము కాదు గానీ, బలము కలిగి గొప్ప కార్యములు చేసే జీవితము. దేవుని ఎరిగిన వారి జీవితము ఇదే! మన అందరి గురి ఒక్కటే, నేను దేవుని మహిమ కొరకే సృష్టించబడ్డాను అనే సత్యము ఎరిగి ఉండుటయే! అప్పుడు ఆయన మహిమలో ఉన్న సమస్తము మనము అనుభవించగలుగుతాము.
ప్రతీ విషయములో, అది ఒక్క అడుగైనా సరే, అది దేవునికి మహిమకరముగా ఉండాలి అనే ఆశ ఆసక్తి కలిగి ఉండాలి. మనలో దేవుడు నివాసముంటాడు అంటే, ఆయనను మనము మోసుకువెళ్ళేవారుగా ఉంటున్నాము.
నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు – 2 కొరింథీ 6:15
మనలో ఆయన నివసిస్తున్నాడు, ఆయనను మనము మోసుకొంటూ, ఆయనకు మహిమకరము కాని పరిస్థుతులలోనికి, ప్రదేశాలలోనికి వెళ్ళగలమా? ఆయన పరిశుద్ధమైన స్థలములలోనే ఉండేవాడు గనుక, పరిశుద్ధము కాని ప్రదేశములలో, పరిస్థితులలో మనము ఉండకూడదు.
మనము ఆత్మీయముగా ఎదిగాము అని చెప్పడానికి సూచన ఏమిటి? నీవు ఎంతగా వాక్యమును అంగీకరించి, ఆ ప్రకారము జీవితాన్ని మార్చుకుని, కొనసాగించగలుగుతున్నావు? నీవు ఎంతగా వాక్యమునకు లోబడితే అంతగా నీవు ఆత్మీయముగా ఎదిగినట్టు.
అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు! -కీర్తనలు 81:13
మాట వినుట అంటే, విన్న మాట ప్రకారము మార్చుకొనుటయే! అప్పుడు ఏమి జరుగుతుంది అని చూస్తే-
అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును. -కీర్తనలు 81:14
అనగా నీవు దేవుని మాట విని, ఆ ప్రకారము నీవు నీ జీవితమును, నడవడికను సరిచేసుకొంటే, వెంటనే దేవుని కార్యము నీ జీవితములో జరుగుతుంది. కేవలము విని, తీర్మానము తీసుకోవడమే కాదు గానీ, ఆ తీర్మానము ప్రకారము నిలబడి జీవించుటయే నిజముగా ఆయన మాట వినుట.
యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. -కీర్తనలు 81:15-16
వారి కాలము శాశ్వతముగా నుండును అనగా అర్థాంతరముగా నశించిపొయేదే లేదు. ఆయనే పోషించి తృప్తిపరచేవాడుగా ఉన్నాడు. అసలు మనము చేసే కొంచెము కోసము దేవుడు చేసేది ఎంతో గొప్పది కదా! నీ మనస్సాక్షి నీ పై ఏ విషయములో దోషారోపణ చేస్తుందో, ఆ విషయములో ఒప్పుకొని సరిచేసుకోవడమే! సమయము చాలా తక్కువగా ఉంది, గనుక మన జీవితములను మనము సరిచేసుకోవాలి.
అపవాది మన చుట్టూ ఉచ్చులు బిగిస్తూనే ఉంటాడు, అదే వాడి పని. ఆ ఉచ్చులలో చిక్కుకుంటే దాని నుండి తప్పించుకొనే జ్ఞానము లేదు, బలమూ లేదు. అయితే నీ దేవుని వాక్కు ప్రకారము నీవు ఆయన నామమును ఒప్పుకొంటే, ఆ ఉచ్చులలోనుండి తప్పించుకొనే జ్ఞానమైనా,బలమైనా నీ జీవితములో ప్రత్యక్షపరచబడుతుంది.
ఆయన వెలుగు గనుక, ఆయన మనలో ఉండగా ఇంక మనలో చీకటి ఉండలేడు. ఆయన వెలుగై ఉన్నట్టుగా మనము కూడా ఈ లోకమునక్ వెలుగై ఉన్నము. దీనికొరకు లోకమునుండి ప్రత్యేకముగా ఉండాలి. అలా మనము మనలను సిద్ధపరచుకోవాలి. ఈరోజు మనకు బలమైన దేవునిని స్తుతించి ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
నా బలమంతా నీవేనయా
వారము కొరకైన వాక్యము
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹ నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹ -యోహాను 15:1-2
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
ఇక్కడ “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు” అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట మనకు అర్థమైతే మనము ఎంతో ధైర్యము కలిగి ఉండగలుగుతాము.
ఈ ద్రాక్షావల్లి నిజమైన ద్రాక్షావల్లి, అది జీవము కలది, ఫలింపు కలది. ఆ ద్రాక్షావల్లికి తీగెలుగా ఉన్న మన జీవితము కూడా జీవము కలిగి, ఫలించే జీవితమై ఉంటుంది. ఆమేన్! ఈ దినము ఈ వాక్యము నీ జీవితమును ముద్రిస్తుంది – ఆమేన్!
తీగెగా నీవున్నావు గనుక నీ జీవితములో కొన్ని విషయములు జరుగుతాయి. ఫలింపు కొరకై ప్రభువు కొన్ని కార్యములతో నిన్ను సిద్ధపరుస్తున్నారు. ప్రభువు నీ జీవితము ఫలించునట్లుగా పనిచేస్తున్నాడు. నీలో పనికిరానివి తీసివేయబడతాయి. ఒకవేళ పనికిరాని స్నేహం, నీవు ఫలించకుండా ఆ స్నేహమే అడ్డువస్తుంటే అది దేవుడు తీసివేసేవాడుగా ఉంటాడు. ఒకవేళ నీ ఉద్యోగము తీసివేసినా, భయపడవద్దు, నీవు ఫలించునట్లుగా దేవుడు పనికిరానివాటిని తీసివేసేవాడుగా ఉంటున్నాడు.
దేవుని ఉద్దేశ్యమే నీవు ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట! 2024 లో కొంచెమే ఉన్నా, 2025 లో మరి ఎక్కువగా ఫలిస్తావు.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
నీవు తీగెగా ఉన్నావు అని ప్రభువు ప్రకటించేసారు. అయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది, అది ఆయనలో నీవు నిలిచి ఉండుటయే! అయితే ఎలా నిలిచి ఉండాలి?
ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. -1 యోహాను 2:5
ఈరోజు నీవు ఆయనలో ఉన్న తీగె అని ప్రకటించబడ్డావు. అయితే నీవు ఆయనలో నిలిచిఉండటానికి ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే నీవు కూడా నడచుకోవాలి.
ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹ -1 యోహాను 4:17
యేసయ్య పరిశుద్ధమైన జీవితమును జీవించాడు. మనము కూడా అదే పరిశుద్ధత కలిగి జీవించాలి. అలాగే క్షమాపణలో కూడా ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. అందరూ వేలెత్తి చూపించారు కానీ, ఆయన మాత్రము క్షమించి, ఇక పాపము చేయకు అని అవకాశము ఇచ్చారు. అలాగే మనము కూడా ఎదుటివ్యక్తులలో తప్పులు మనము ఎత్తిచూపకూడదు. అంతే కాక, ఇతరుల పాపములను క్షమించినపుడే, నీ పాపములను కూడా క్షమించువాడుగా ఉన్నాడు.
నాలో క్రీస్తు ఉన్నాడు గనుక, ఇక జీవించువాడను నేను కాదు గానీ, నాలో ఉన్న క్రీస్తే అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. క్రీస్తు ఎంతటి పాపిని అయినా క్షమించేవాడుగా ఉన్నాడు, గనుక మనము కూడా అలాగే ఉండాలి. అపుడే మనము ఫలించి తీగెగా ఉండులాగున, ఆయనలో మనము నిలిచి ఉండగలుగుతాము.
క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ౹ -2 యోహాను 1:9
తీగె తనంతట తానే ఫలించదు, వల్లిలోని జీవము ప్రవహిస్తేనే అది ఫలిస్తుంది. దానికొరకు ఆ వల్లిలో నిలిచి ఉండాల్సిందే. అలాగే ఆయన బోధ యందు నిలిచి ఉండకుండా మనము ఏమీ ఫలించలేము. బోధలో మనము నిలిచిఉన్నపుడు మన ఆత్మీయ పునాది బలపరచబడుతుంది. ఏ పరిస్థితి అయినా అది కదలదు, జంకదు.
నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను. -లూకా 6:47-49
వరదలు, వాన శ్రమలను సూచిస్తున్నాయి. అయినప్పటికీ మన జీవితము దేవుని బోధ యందు నిలిచిఉన్నంత కాలము, కదిలింపబడని జీవితముగా ఉంటుంది. ఎందుకనగా ఆయన కదిలింపబడనివాడు గనుక ఆయనలో నిలిచి ఉన్న మనముకూడా కదిలింపబడక ఉందుము.
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.౹ -యోహాను 14:11
ఆయన యందు నిలిచి ఉన్నావు అనే సత్యము నిరూపింపబడునట్లుగా క్రియలు ప్రత్యక్షపరచబడతాయి.
మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹ -యోహాను 17:22
క్రియల చేత మన జీవితమునకు సాక్ష్యము ఉంటుంది అలాగే మన జీవితములో ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన బోధను అంగీకరించి ఆయనలోనే కొనసాగాలి. అప్పుడు ఆయనకొరకైన మహిమాజీవితముగా కనపరచబడుతుంది.