23-07-2023 – ఆదివారం మొదటి ఆరాధన – అపవాది నుండి తప్పించబడటానికి

స్తోత్రగీతం – 1

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||

శరీర వ్యాధులన్ని బాగుచేయును
నజరేయుడైన యేసు నామము
సమస్త బాధలను తొలగించును
అభిషిక్తుడైన యేసు నామము||యేసు నామము ||

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము ||

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||

 

స్తోత్రగీతం – 2

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||

సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||

సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||

ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా

స్తోత్రగీతం – 3

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

ఆరాధన వర్తమానము

ఆదివారము ఎంతో ప్రాముఖ్యమైనది మరియు దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో భాగ్యము.

మన కాపరి క్షేమము కొరకు ప్రార్థించుట మనకే క్షేమకరము. సంఘముకొరకైన ఆశీర్వాదములు దేవుడు కాపరి ద్వారా విడుదల చేస్తాడు.

దేవునిని స్తుతించకుండా ఆరాధించకుండా మన నోరు మూయబడి ఉండకూడదు. మన నోరు తినడానికి కాదు గానీ, ఆయనను స్తుతించడానికి.

యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.౹ -యిర్మీయా 1:4

గర్భములో ఇంకా పిండముగా ఉన్నప్పుడే మనలను ఎరిగి ప్రతిష్టించినవాడుగా మన దేవుడు ఉన్నాడు. యిర్మీయా ఎలా అయితే దేవుని పనికొరకు నియమింపబడ్డాడో, మనము కూడా దేవుని స్తుతించుటకు నియమింపబడ్డాము.

అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను–ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.౹ పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను. -యిర్మీయా 1:9-10

యిర్మీయా నోరు ముట్టి ఆయన ఏమి చేయాలో ప్రభువు చెప్పాడు. అలాగే మన నోటిలో ఆయన మాటలు ఉంచాడు. ఆయన చేసిన కార్యములు మన హృదయములలో ఉంటున్నాయి. ఈరోజున మనకు కూడా ఒక సత్యము తెలియ చేయబడుతుంది. ఆ సత్యమును మనము ప్రకటిద్దాము.

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. -యిర్మీయా 10:10

నిజము అంటే మన కళ్ళముందు జరిగితేనే నిజము అని నమ్ముతాము. అయితే వాక్యము సత్యము. బైబిల్ లో మన దేవుడు ఎలాంటివాడో తెలియడానికి మన పితరుల జీవితమును లిఖింపచేసి ఉంచాడు. నిజమైన దేవుడు అంటే ప్రత్యక్షపరచుకునే వాడు దేవునిగా కనపరచుకునే వాడు అని అర్థము.

అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను – యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.౹ యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.౹ -1 రాజులు 18:36-37

యేలియా దేవుడు ఏమై ఉన్నాడో, తనకు దేవుని కలిగిన సంబంధము ఏమిటో స్పష్టముగా ఎరిగి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు మరియు ఇశ్రాయేలీయుల జీవితములలో దేవుడుగా కనపరచుకున్నాడు. ఈ దినము నీ జీవితములో కూడా కనపరచుకునే వాడు. ఆయన నిజమైన వాడు. ఏలియా దేవునిని నమ్మాడు గనుక ఈరోజు నీవు ప్రత్యక్షపరచుకో అని అడుగుతున్నాడు.

అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.౹ అంతట జనులందరును దాని చూచి సాగిలపడి–యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.౹ -1 రాజులు 18:38-39

ఏలియా ఒక్కడే అయినప్పటికీ దేవుని కొరకు నిలబడ్డాడు. సమరయ స్త్రీ ఒక్కతే అయినప్పటికీ అనేకులను దేవుని యొద్దకు నడిపించింది. మనము అనేకులుగా ఉన్నాము, మరి మనము కూడా దేవుని కొరకు నిలబడి ఆయన నిజమైన దేవుడు అని సాక్షులుగా ప్రకటిద్దామా!

ఏలియాను నిలబెట్టడానికి ఆయన ప్రకటించినది దేవుడు కనపరిచినాడు. ఈరోజు కూడా నీవు దేవునిని నమ్మి ఏ కార్యము కొరకు నిలబడతావో, ఆ కార్యమును జరిగించి కనపరచుకొనేవాడు. నీవు స్తుతిస్తున్నది, కీర్తిస్తున్నది, మహిమపరుస్తున్నది నిజమైన దేవునిని.

మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు,౹ సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. -1 సమూయేలు 17:36-37

దావీదు యుద్ధము కొరకు తన శక్తిని ఆధారము చేసుకొని సిద్ధపడలేదు గానీ, దేవుడు ఏమై ఉన్నాడో, ఇంతకు ముందు ఏమి జరిగించి తన దేవుడు రక్షించాడో, ఆ సత్యమును ఎరిగి ప్రకటించాడు. తరము వెంబడి తరము దేవుడు తాను నిజమైన వాడు అనే సత్యము ప్రకటిస్తూ, కనుపరుస్తూ ఉన్నాడు. ఈ దినము మన తరము. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ మనలను బలపరచుటకే ఉంటాడు. ఆయన చెప్పుచున్న మాట నేను నీ పక్షమున ఉన్నాను గనుక నీవు ఓడిపోవు.

రేమా: నీ దేనిని నమ్మి ప్రకటిస్తావో అదే స్థిరపరచబడుతుంది.

రేమా:నీ పరిస్థితిలో నీవు ధైర్యముగా నిలబడి ప్రకటించు. నీవు ఏ నామములో ప్రకటిస్తావో ఆ నామమునకు గల శక్తిని బట్టి సమస్తము తల వంచవలసినదే

అపవాది ఆలోచన నిన్ను కృంగదీయుట. మన పరిస్థితిని బట్టి దేవునికి దూరం అవుతాము. అయితే అటువంటి సమయములో “దేవా నీవే నా దేవుడవు” అని ప్రకటించు. అప్పుడు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నీవు పైకి లేపబడుటకు మార్గములు కనపరచబడతాయి. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆ సత్యమును ఒప్పుకొని ప్రకటించడమే.

జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ ధనము కొరకైన పరిచర్య కాదు గానీ ఆత్మ చేత నడిపించబడే పరిచర్య.

ఈరోజు మన ద్వారా వ్యక్తిగతముగా మన దేవుని నామము మహిమపరచబడాలి. ఏలియాను, దావీదును సిగ్గుపడనివ్వని దేవుడు నిన్ను కూడ సిగ్గుపడనివ్వడు.

నీవు ఏమైతే తెలుసుకున్నావో దానిని ప్రకటించు. నీవు ప్రకటించినది దేవుడు స్థిరపరుస్తాడు.

ఆరాధన గీతము

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

మీరు ఆన్ లైన్ లో ఉన్నప్పటికీ ప్రభువు సన్నిధిలోనే ఉన్నారు అనే సత్యము గ్రహించి ఆత్మ నడిపింపుకు లోబడి మీరు తెలుసుకున్న సత్యముతో, నింపబడిన ఆత్మతో ప్రభువును ఆరాధించండి.

నీవు ఎటువంటి పరిస్థిలో ఉన్నప్పటికీ, దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతున్నప్పటికీ, నీ ప్రభువు నిన్ను ప్రేమిస్తునాడు, దయ కలిగినవాడు, దీర్ఘశాంతము గలవాడు. ఈరోజు నీవు ఒక సత్యము ప్రకటించు, “నీవే నా ప్రాణ విమోచకుడవు”.

నీ దేవుడు ప్రత్యక్షపరచుకునేవాడు నీవు సత్యము ప్రకటించి ఆయన ఎలా నీ పరిస్థితిలో ప్రత్యక్షపరచుకుంటాడో నీకు నీవే అనుభవించు.

అవును ప్రభువా నీవు లేకుండా మా జీవితములు లేవు. మా జీవితలకు నీవు మాత్రమే ఆధారము దేవా. మేము ఈ సత్యము రుచి చూసినవారిగా ప్రకటిస్తున్నాము దేవా!

నీవు ఎంతగానో హెచ్చించబడి నీవు దేవుని మర్చిపోవడము దేవుని చిత్తము కాదు. నీ హృదయమారా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయనను నీవు స్తుతించుటయే ఆయన చిత్తము.

మన మనసులో దేవుని తప్ప మరెవ్వరికీ మరి దేనికీ స్థానము ఇవ్వవద్దు.

అందరము చెబుదాము, “దేవా మా ప్రాణ విమోచకుడవు నీవే దేవా”.

నీ హృదయమును మేలుతో తృప్తిపరచడము నీ దేవునికి ఎంతో సంతోషము.

అందరము నిజముగా చెబుదాము, “నా ప్రాణము ఉన్నంతవరకు నీతోనే ప్రభువా! నా ప్రాణవిమోచకుడవు నీవే, నా హృదయమును తృప్తిపరచువాడవు నీవే”.

నీ దేవుడు నిన్ను విడువడు, నిత్యము నీతోనే ఉంటాడు, నమ్ము

నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టుట అసంభవము

 

వారము కొరకైన వాక్యము

అపవాదినుండి ఎలా తప్పించబడతాము? ఏమి చేస్తే తప్పించబడతాము? మన ఆత్మీయ జీవితములు బలముగా నిలబడితేనే, ఈ జీవితాన్ని స్వతంత్రించుకోగలము. అలా కాకపోతే సమస్తము కోల్పోతాము.

నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.౹ -1 పేతురు 5:8

అపవాది వెతుకుతూ తిరుగుతుంటే దేవుడు ఏమి చేస్తాడు? ఒక ఉదాహరణ మనము చూద్దాము. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి బాధ్యత ఏమిటి అంటే, ఆ కుమారుని ప్రయోజకునిగా సిద్ధపరచడము. దానికొరకు చిన్నప్పటినుండి చదివించి సిద్ధపరుస్తాడు. ఆ కుమారుడు చదివిన తరువాత ఉద్యోగము వచ్చిన తరువాత తన జీవితాన్ని ఎవరు కొనసాగిస్తాడు? కుమారుడే కదా! కుమారుడు ఏమి నేర్చుకున్నాడో, ఆ నేర్చుకున్న దాని ప్రకారము తన పరిస్థితులలో ముందుకు వెళతాడు. అయినప్పటికీ తన తండ్రి తోడుగానే ఉంటాడు.

మనకు కూడా తండ్రి తన వాక్యము ద్వారా మనలను సిద్ధపరచుచుండగా మనము మన జీవితములను కొనసాగించవలసిన పరిపక్వతలోనికి మనము వచ్చినప్పుడు, మనము నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువగా ఉండిన యెడల అపవాదిని తప్పించుకుని జీవితమును కొనసాగించగలుగుతాము.

బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. -మత్తయి 25:4

నిబ్బరమైన బుద్ధి గలవారు “ఖచ్చితముగా” అపవాది నుండి తప్పించబడతారు. దివిటీ అనగా వెలిగించబడేది. అది వెలిగించబడటానికి నూనె కావాలి. ఆ నూనె ఉంచుకొనుటకు సిద్దెలు కావాలి. మన వద్ద సిద్దెలు ఉంటున్నాయి గానీ, నూనె ఉండటము లేదు.

సిద్దె అనగా వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. బుద్ధికలిగినవారు, లేని వారు కూడా వాక్యమును కలిగే ఉంటున్నారు. మన ఉద్దేశ్యములు మంచివే ఆత్మీయముగా జీవించాలి, అపవాదికి దొరకకుండా జీవించాలి అని. అయితే అనేకసార్లు అపవాది చేతిలో చిక్కుబడిపోతున్నాము.

నూనె అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. అనేకులు ఈరోజున పరిశుద్ధాత్మ చేత అద్భుతములు, స్వస్థత పరిచర్యలు లేవు అని అంటారు. అయితే వాక్యము సత్యము –

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹ -అపొస్తలుల కార్యములు 10:38

ప్రభువైన యేసు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. వాక్యము ఎక్కడ ఉంటుందో, అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము చేసేవాడుగా ఉంటాడు. యేసయ్య పరిశుద్ధాత్మను బట్టి “అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచినాడు”. అనగా పరిశుద్ధాత్మ సహవాసము లేనివారు అపవాది చేతికి చిక్కుబడతారు.

అపవాదిని తప్పించుకోవాలి అంటే మొట్ట మొదట మనము వాక్యమును కలిగి ఉండాలి. ఆ తరువాత పరిశుద్ధాత్మ సహవాసము ఖచ్చితముగా కలిగి ఉండాలి.

అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹ -యోహాను 16:7

పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిగానే ఈరోజుల్లో చూస్తున్నారు గానీ, ఆయన ఒక వ్యక్తి. అందుకే, “ఆయన” అని సంబోధించబడింది. పరిశుద్ధ త్రిత్వంలోని పరిశుద్ధాత్మ అనే వ్యక్తి యొక్క శక్తిని మనము గమనించగలుగుతున్నాము. అయితే ఆయన వ్యక్తి అనే సత్యము మర్చిపోతున్నాము.

తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.౹ -యోహాను 15:26
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹ -యోహాను 16:13

పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండుట అనగా ఆయనతో ప్రత్యక్షమైన సహవాసమును కలిగిఉండుట మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ఆవశ్యము. “వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” మన ఆత్మీయ జీవితములలో అపవాది ఎటువంటి ఉచ్చులు పన్నాడో, ఆ విషయములను ముందుగా మనకు తెలియచేసి మనకు సహాయము చేస్తాడు.

యేసయ్య “సమృద్ధి అయిన జీవమును దయచేయుటకు” ఈ భూలోకమునకు వచ్చాను అని చెప్పాడు. ఈ మాట వినిన పరిశుద్ధాత్ముడు ఆ మాటను కార్యరూపకముగా నెరవేర్చి సాక్ష్యము ఇచ్చేవాడుగా ఉంటాడు.

బుద్ధి గల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు ఎలా బయలుదేరారు? ఇద్దరూ కూడా దివిటీలు నూనెతో వెలిగించబడే బయలుదేరారు. బుద్ధిలేని వారికి నూనె యొక్క ప్రాముఖ్యత తెలియలేదు గనుక వారు సిద్ధపడలేదు. అలాగే మనలో కూడా రక్షించబడి బాప్తీస్మము పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందాము. అయితే పరిశుద్ధాత్మ యొక్క అవసరము, ప్రాముఖ్యత ఎరగలేని స్థితిలో ఆయనను కలిగి ఉండలేని పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నాము.

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:17

ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. లోకమైతే ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. కానీ మీరైతే, మీరు ఆయనను ఎరుగుదురు అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనే కదా! పరిశుద్ధాత్ముడు అనేకమైన విధానాలలో ప్రత్యక్షపరచుకుంటాడు. నీవు ఆయనను అనగా ఆయన ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడో నీవు ఎరిగి ఉన్నావు అంటే, నీవు ఆయనను పొందుకున్నావు అని అర్థము. ఒక సత్యము ఏమిటి అంటే, నీ ఆసక్తి కొలదీ నీవు ఆయనను ఎరగగలుగులాగున పరిశుద్ధాత్మ దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు.

నిబ్బరమైన బుద్ధి వాక్యము, పరిశుద్ధాత్మ సహవాసముల ద్వార మనము కలిగి ఉంటాము.

ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు౹ గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. -2 కొరింథీయులకు 11:14-15

సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక మనము ఎలా ఆత్మీయ జీవితములో మనగలుగుతాము? కేవలము మనము వాక్యములో నిలిచి ఉండుట, పరిశుద్ధాత్మ సహవాసములో ఆ వాక్యమునకు కార్యరూపమును అనుభవించుట ద్వారామాత్రమే అపవాది ఉచ్చులను గ్రహించగలుగుతాము. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిచేత ఆ అపవాది ఉచ్చులను జయించగలుగుతాము.

దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. -మత్తయి 12:28

ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత మనము అపవాది క్రియలను లయపరుస్తామో, అప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరచిన సమస్తము మనము పొందుకుంటాము. అదే దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అనగా అర్థము. ఒక సత్యము అపవాదిని జయించకుండా నీకొరకు దేవుడు సిద్ధపరచినది పొందుకోలేవు.

పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; -మత్తయి 25:10

విందు అనేది అనేకమైన ఆహార పదార్థములతో సిద్ధపరచబడి ఉంటుంది. బుద్ధికలిగినవారు వారికొరకు సిద్ధపరచబడిన సమస్తము పొందుకుని సంతోషము అనుభవించగలిగినారు. అదే బుద్ధిలేని వారు, సమయమునకు సిద్ధపడలేని కారణాన, వారి కొరకు సిద్ధపరచినది వారు పొందుకోలేక విడువబడ్డారు.

ఆసక్తి లేకుండా పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండలేవు, ఆయనను కలిగిన శక్తివంతమైన జీవితమును జీవించలేవు. గనుక ఈరోజైనా దేవుని ఆత్మ పరిచర్యకు లోబడి జీవితములను సరిచేసుకుందాము. పరిశుద్ధాత్ముడు లేకుండా మన జీవితములో దేవుని కొరకైన సాక్ష్యము రాదు.