23-06-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

మనలను సృష్టించిన మన దేవుడు, మనలను నడిపిస్తున్న మన దేవుడు నిత్యము స్తుతింపబడవలసినదే. మన ఆత్మీయమైన జీవితము కొనసాగించబడుతుండగా ఏమి జరుగుతుంది? భక్తిగా జీవించడము వలన ఏమైన ఉపయోగము ఉందా? ఎందుకు మనము ఆత్మీయముగా ఉండాలి, ఎదగాలి అని కోరుకుంటాము?

మనలను సృష్టించిన ఆ దేవుడు పరిశుద్ధుడు. అటువంటి ఆయన మనలను మొదట ఏర్పాటుచేసుకున్నాడు. ముందుగా నిర్ణయించబడి ఆయన చేత పిలువబడ్డాము. ఆయన గుణలక్షణములను ప్రచురము చేయునిమిత్తమే మనము పిలువబడ్డాము.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30

ఆయన సన్నిధిలో ఉన్న మనము అందరము దేవుని చేత నిర్ణయించబడిన వారము, పిలువబడినవారము. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నాము.

దేవుని గుణములను చూస్తే, ఆయన ప్రేమాపూర్ణుడు, శక్తిమంతుడు, మరియు పరిశుద్ధుడు అయి ఉన్నాడు. ఈ లక్షణములు మన ద్వారా ప్రచురము చేయులాగున మనము ఏర్పరచబడినవారము, పిలువబడినవారము.

అటువంటి దేవునిని మనము ఆరాధించడానికి కూడివచ్చాము. అయితే ఎందుకు ఆరాధించాలి? ఆయనైతే, నిత్యము పరలోకములో దేవదూతలందరితో ఆయన కొనియాడబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు. అయితే ఆ దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు గనుక మనము ఆయ్నాను ఆరాధించబద్ధులమై ఉన్నాము.

మనలను చూసుకుంటే, మన కోరికలన్నీ దేవుడు తీర్చాలి అని ఆశపడతాము. అయితే దేవుని కోరిక తీర్చడానికి మనము మాత్రము సిద్ధముగా ఉండలేము. అయితే మనము దేవునిని ఆరాధించువారముగా ఉండాలి.

నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచాడు అంటే, మనము భూలోకమునుండి వెళ్ళిపోవలసినదే. అయినప్పటికీ, ఇంకా మనకు ఈ భూమి మీద ఉండి, ఆయన ఉద్దేశ్యము నెరవేర్చుటకు, అనగా దేవుని మహిమపరచుటకు మనకు సమయము పొడిగించినవాడుగా మన దేవుడూ ఉన్నాడు. మనము ఇంకా జీవముతో ఉంటున్నాము అంటేనే, మనము ఆయనను ఆరాధించాలి.

మనము ఆరాధించే సమయము ఎంతో శ్రేష్టకరమైనది అయితే అది ఎందుకు అంత శ్రేష్టమైనది?

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23

ఆరాధన అనేది స్తుతియాగము అర్పించటమే. అలా ఆరాధించినపుడు ఆయనను మహిమపరచేవారిమిగా ఉంటాము. మన జీవితములో ఆరాధన ఎంతో శ్రేష్టమైనది ఎందుకంటే – “నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను” అని దేవుడు చెప్పుచున్నాడు.

దేవుని రక్షణ అనగా ఆరాధించే ప్రతిఒక్కరి పరిస్థితిలో అవసరమైనది ఉంటుంది. ఒకరికి జీవము అవసరము, ఒకరికి విడుదల అవసరము, అలా ఎవరికి ఏది అవసరమో అది ఆ రక్షణ లో ఉంది. అందుకే ఆరాధన అనేది ఎంతో శ్రేష్టమైనది. అయితే, మన ఆరాధన ఆచారయుక్తమైనదిగా ఉండకూడదు.

నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అనగా దేవుని వాక్యమును విని ఆ ప్రకారము నడచేవారు యదార్థమైన భక్తి కనపరచేవారు.

గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానముచేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. -కీర్తనలు 22:9
శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము. -కీర్తనలు 22:11

మనము భూమి మీదకు రావడానికి కారణమే దేవుడు. మనము భూమి మీదకు వచ్చినతరువాత, గర్భవాసిగా ఉన్నప్పటినుండి ఆధారముగా ఉన్నది ఆ దేవుడే. ఇక్కడ, కీర్తనాకారుడు చెప్పుచున్నమాటలు చూస్తే, నాకు నీవే ఆధారము, మరే ఆధారము లేదు అని ప్రకటించి దేవుని సహాయము కోరుకుంటున్నాడు.

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. -కీర్తనలు 42:5

ఇక్కడ దావీదు కృంగిన సమయములో తన ప్రాణముతో దేవుని గూర్చి చెప్పుకుంటూ తనను తాను బలపరచుకుంటున్నాడు. మన దేవుడు మనలను కోరుకుంటున్నాడు, జీవింపచేయాలి అని ఇష్టపడుతున్నాడు. నిన్ను జీవింపచేయువాడు ఆయన మాత్రమే అనే సత్యము నీవు ఎరిగి ఉంటే, ఇదే విధముగా సిద్ధపడతావు.

యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. -కీర్తనలు 18:1-2

అలా సిద్ధపడినపుడు, నీవు కూడా ఇదే విధముగా ఖచ్చితముగా చెప్పగలుగుతావు. ఒకసారి మనలను మనము పరీక్షించుకుని నిజమైన, స్తుతి చెల్లించి ఆయనను మహిమపరచుదాము.

ఆరాధన గీతము:

నేనును నా ఇంటి వారందరు

 

వారము కొరకైన వాక్యము

మన పరలోకపు తండ్రి కనికరము కలవాడు. ఆ కనికరమును బట్టి మనము ఉండవలసిన స్థితిని ఒకవేళ పోగొట్టుకుని ఉంటే, దానిని తిరిగి పొందుకునేవారిగా ఉంటాము.

ఈరోజు మనము ఆత్మీయముగా ఉండటమును బట్టి మన జీవితములలో ఏమిజరుగుతుంది? అనే విషయము గురించి నేర్చుకుందాము.

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా–దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. -యాకోబు 1:27

ఇహలోకమాలిన్యము అంటకుండా కాపాడుకొనుట అనేది నిజమైన భక్తిగా మనము చూడగలము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే మనము ఎలా మనలను ఈ లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోగలము? అది కేవలము వాక్యముతోనే సాధ్యము. ఎప్పుడైతే మనము వాక్యము చెప్పినప్రకారము సరిచేసుకుని జీవించడము బట్టి, మనము ఈ లోక మాలిన్యము అంటకుండా మనలను కాపాడుకోగలుగుతాము.

చాలా మంది వయసు అయిపోయాక భక్తి కొరకు ఆలోచించేవారుగా ఉంటారు. అయితే అంతకుముందు వరకు భక్తిగా ఉండుటనుబట్టి ఏమి జరగాలో అవి కోల్పోయేవారముగా ఉంటారు.

నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? -యోబు 4:6

అయితే మనము చిన్నతనమునుండే యదార్థమైన భక్తి కొరకు మనము వాక్యానుసారముగా మనలను మనమే సిద్ధపరచున్నప్పుడు, ఆ భక్తిని బట్టి మనము ధైర్యము కలిగి, నిరీక్షణ గలిగి ప్రతీ పరిస్థితిని ఎదుర్కోగలుగుతాము.

అబ్రహామును చూస్తే, దేవునిని నమ్మాడు. తన కుమారుని కోల్పోవలసి వచ్చినపుడు సైతము తన భక్తి తనకు ధైర్యము పుట్టించిన ప్రకారము, భయపడక, దేవుడు అడిగిన ప్రకారము చేయడానికి సిద్ధపడ్డాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తే, నీవు ఏ పరిస్థితికి నీవు భయపడవు.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. -కీర్తనలు 103:1

తానున్న కష్ట సమయములో దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఇక్కడ దావీదు తన యదార్థమైన భక్తిని కనపరుస్తున్నాడు.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. -కీర్తనలు 103:2-3

ఈ మాటలను బట్టి, తన ప్రాణములో ధైర్యమును తెచ్చుకుంటున్నాడు. అందుకే తాను ధైర్యముగా నిలబడ్డాడు. మన జీవితములో ఎక్కడైనా మనము భయపడుతుంటే, మన భక్తిని మనము సరిచేసుకోవాలి. ప్రతీ పరిస్థితిని మనమే ఏలువారముగా ఉండాలి. మన భక్తి యదార్థముగా లేకపోతే ఆ పరిస్థితి మనలను ఏలుతుంది.

భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. -సామెతలు 10:24

క్రీస్తును అంగీకరించినవారు నీతిమంతులు. వారు యదార్థమైన భక్తి కనపరచేవారు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధమైన జీవితము యేసయ్యను నమ్మినపుడు మనకు అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధమైన జీవితమును కొనసాగించువారు ఆశించినది వారికి దొరుకుతుంది.

నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును -సామెతలు 11:8

పరిశుద్ధమైన జీవితమును కొనసాగించువారు బాధనుండి తప్పింపబడును. అందుకే మనము ఆత్మీయముగా నిలబడటానికి, బలబడటానికి ఎల్లప్పుడు సిద్ధముగా ఉండాలి. లేఖనములను పరిశీలించినపుడు, దేవుని మాట విని ఆ ప్రకారము చేసిన ప్రతీసారీ ఆశీర్వాదము కలిగినది.

అందుకే మనతో దేవుడు మాటలాడిన మాటలను విని, ఆ మాటల ప్రకారము మనము వెళ్ళిన ప్రతీసారీ మనకు ఆశీర్వాదమే. మనము యదార్థమైన భక్తిని కనపరుస్తున్నపుడు ఏదీ నీకు అడ్డుగా నిలవడానికి అవకాశమే లేదు. అందుకే దేవుని వెంబడించడానికి నిర్లక్ష్యముగా ఉండకూడదు.

ప్రతీ దినము, మనలను పడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. గనుక, వాక్యము చేత పట్టుకుని, మనము యదార్థమైన భక్తి వలన కలుగు ధైర్యముతో మనము నిలబడాలి. వాక్య ప్రకారము జీవించడము మన ప్రథమ కర్తవ్యము.

సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.౹ -1 తిమోతికి 6:6

దీనిని బట్టి నిజమైన భక్తిని కనపరచబడటము ఎంత ఆశీర్వాదకరమో మనము అర్థము చేసుకోగలము. లాభము అంటే, వృద్ధిలోకి వచ్చుటగా మనము చూడవచ్చు.

నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని –యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు -కీర్తనలు 32:5

ఇక్కడ కీర్తనాకారుడు తన యదార్థమైన భక్తిని కనపరుస్తున్నాడు. తన పాపమును కప్పుకొనక, ఒప్పుకుంటున్నాడు. ప్రతీ క్షణము అపవాది ప్రయత్నము ఏమిటి అంటే నిన్ను పరిశుద్ధమైన జీవితమునుండి నిన్ను తప్పించాలి.

ఒకవేళ వాక్యమునకు వ్యతిరేకముగా ఏమిచేసినా సరే, దేవుని యెదుట ఖచ్చితముగా ఒప్పుకొనువాడే, యదార్థమైన భక్తి కనపరచేవాడుగా ఉంటాడు. దానిని బట్టి ఏమి జరుగుతుంది అని చూస్తే –

కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు. -కీర్తనలు 32:6

నీవు యదార్థమైన భక్తిని కనపరచినపుడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. జలప్రవాహములు పొరలివచ్చిననూ, వారిమీదకు రావు అంటే ఏమిటి అంటే, నీవు కనపరచిన యదార్థమైన భక్తి ఆ ప్రవాహములు నీ మీదకు రాకుండా అడ్డుగా వస్తుంది. బలము కలిగినది నీ మీదకు వచ్చినపుడు నీ యదార్థమైన భక్తి అడ్డుగా వస్తుంది.

నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. -మార్కు 16:17-18

నమ్మడము అంటే యదార్థమైన భక్తిని కనపరచడము అని అర్థము. అలా ఉన్నవారు ఏమి చెయ్యగలరు అంటే – “దేవుని నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు”. అనగా అపవాది ఎన్ని రకములుగా అపవాది నీ జీవితము లాక్కుపోవడానికి ప్రయత్నించినా సరే, నీ భక్తి అడ్డుగా వస్తుంది.

నీవు చూపించే నిజమైన భక్తి, నీకు పరిశుద్ధమైన వరములు, ఆత్మ వరములు నీకు కలుగులాగున నీకు సహాయము చేస్తుంది. అంతే కాక, “మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు” అనగా “మరణకరమైనదేది ఏది నీలోనికి ప్రవేశించినను అది నీకు హాని చేయదు”. అనగా భక్తిగా ఉండటమును బట్టి ఇంత మేలైన జీవితము మనము కలిగి ఉండగలము.

మరణకరమైనదేది త్రాగినను అంటే, అది మరణకరమైనది అని తెలియక తాగుతున్నాడు. అంటే, నీవు చేతులార చేసుకున్నది మరణకరమైనది అని తెలియక నీవు చేసావు. అయితే అది ఇప్పుడు మరణకరమైనదానికి నీ జీవితములోనికి ప్రవేశించిది. అయితే నీవు యదార్థమైన భక్తి కనపరచినపుడు ఆ మరణకరమైన దానినుండి తప్పించబడతావు.

నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. -కీర్తనలు 119:105

మనము వెళుతున్నపుడు వెలుగు ఉంటే, మనము వెళ్ళే దారిలో ఉన్న అడ్డంకులు కనబడతాయి, దానిని బట్టి మనము వాటిని తప్పించుకొనే అవకాశము ఉంటుంది. అలాగే యదార్థమైన భక్తి కలిగి మనము ఉన్నపుడు, వెలుగైన వక్యమును బట్టి, మన ముందు వచ్చే అడ్డంకులు మనకు కనపరచబడతాయి. కనుక వాటినుండి మనము తప్పించుకోగలుగుతాము.

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:10

వాక్య ప్రకారము మనము జీవించినపుడు, ఖచ్చితముగా మనకొరకు సిద్ధపరచినది ఖచ్చితముగా మనము తెలుసుకొనగలుతాము.

రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.౹ -దానియేలు 6:23

దానియేలు మంచి భక్తిని కనపరచాడు, తాను కనపరచిన యదార్థమైన భక్తిని బట్టి ఆకలిగొన్న సింహముల మధ్య ఉన్నప్పటికీ ఎటువంటి హానీ కలుగలేదు. అనగా మనము ఒకవేళ అదేవిధమైన భక్తిని కనపరిస్తే, ఎటువైపునుండి మరణకరమైనది నీకు వ్యతిరేకముగా వచ్చినప్పటికీ, నీకు ఏ హానీ జరుగుదు.

ఆత్మీయముగా మనము ఎదుగుతున్నపుడు శరీర సంబంధముగా మనము జయించగలుగుతాము. ఏలియా కూడా తాను ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, భక్తిని కనపరచాడు గనుకనే తాను చెప్పిన మాటల ప్రకారము దేవుడు కార్యము చేసాడు.

అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను – యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.౹ -1 రాజులు 18:36

ఏలియా చేసిన ప్రార్థన తాను చూపించిన భక్తిని బట్టి, దేవుని చిత్తమును తెలుసుకొనులాగున ఏలియా సిద్ధపరచబడ్డాడు. ఆ ప్రకారము తాను పలికిన మాటలను బట్టి పరలోకమునుండి అగ్ని దిగివచ్చింది.

అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.౹ -1 తిమోతికి 4:7

నేను నిలబడాలి, నేను ఫలానా విధానములో చెయ్యకూడదు, అపవిత్రమైన కార్యములో పాలు కలిగి ఉండకూడదు అని సిద్ధపడి ఆ ప్రకారము సాధకము చేస్తే, ఖచ్చితముగా జయకరముగా నీ జీవితము మారుతుంది.