స్తోత్రగీతము – 1
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా
స్తోత్రగీతము – 2
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
స్తోత్రగీతము – 3
పల్లవి: యేసు రక్తమే జయము జయము రా….
శిలువ రక్తమే జయము జయము రా…
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా….
తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా….
బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం “2”
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే “యేసు”
పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు “2”
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే “యేసు”
ఆరాధన వర్తమానము
మన జీవితములో అతి శ్రేష్టమైనది దేవుని సన్నిధి. మనము దేవుని సన్నిధికి వచ్చినపుడు మనలోని ఆత్మ నాట్యమాడుతుంది. ఎప్పుడంటే, మన శరీరము పనిచేయనప్పుడు. ఎందుకంటే, మన శరీరము లోకము వైపు మాత్రమే చూస్తుంది అప్పుడు ఆత్మ సంతోషించదు. దేవుని సన్నిధి గడప తొక్కకమునుపు మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒకసారి ఆయన గుమ్మములోనికి ప్రవేశించగానే మన పరిస్థితులు మారిపోతాయి.
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. -కీర్తనలు 33:12
మనము కలిగి ఉన్నదానిని బట్టి మన జీవితము సంతోషముగా ఉండదు. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. సత్యము ఏమిటి అంటే, యెహోవా తమకు దేవుడుగా గలిగిన వారు మాత్రమే సంతోషముగా ఉంటారు. ఈ లోకములో మన స్థితిగతులు ఎలా మారిపోతాయో మనకైతే తెలియదు కానీ మన దేవుడు మాత్రము నిత్యము మారక ఏక రీతిగా ఉన్నవాడు.
ఆయన మనకు దేవుడుగా ఉండుటను బట్టి మనకు ఏమిటి ధన్యత? ఒక్కొక్కసారి, లోకములో వర్థిల్లువారిని గమనించినప్పుడు వారు కలిగిఉన్నదానిని బట్టి మనకు సందేహము కలుగుతుంది. దేవుడిని ఎరగకపోయినా వారు సుఖముగా ఉంటున్నారు, మరి దేవుడిని నమ్ముకున్న నేను ఎందుకు ఇలా ఉన్నాను అని సందేహము వస్తుంది. అయితే, ఒక సత్యము మనము ఎరగవలిసినది ఏమిటి అంటే, “స్థితిగతులు” అనేవి ఎప్పుడైనా మారిపోవచ్చు. అయితే దేవుని కలిగిన మనమైతే గుణాతిశయములను ప్రచురము చేయువారము
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9
లోకములో అన్నీ కలిగినవాడు దేనిని ప్రచురము చేస్తాడు అంటే లోకములో ఏమి ఉందో దానిని ప్రచురము చేస్తాడు. అయితే మనము దేవుని గుణాతిశయములను ప్రచురము చేస్తున్నాము. సర్వశక్తిమతుడైన దేవుడు అసాధ్యములైన కార్యములు మన జీవితములో చేయుటను బట్టి, దేవుని గుణాతిశయములు మన జీవితము ద్వారా ప్రచురపరచబడతాయి. అది విన్న, కన్న వారు దేవుని మహిమపరుస్తుంటారు. దేవునిని కలిగి ఉన్నవారు అన్నీ కలిగి ఉన్నవారే – ఆమేన్.
ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము అయితే ఇప్పుడు మనము వెలుగులో ఉన్నాము. మనము వెలుగులో ఉన్నప్పుడు చీకటి ఎలా ప్రయత్నించినాసరే అది సాధ్యము కాదు. అనగా దేవుని కలిగినవారి జీవితము జయకరమైన జీవితము. మనలను బలపరచువాని యందు మనకు సమస్తము సాధ్యమే.
మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక౹ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. -2 కొరింథీయులకు 4:17-18
అనగా మన ముందు ఏమి ఉంది అనేదానిని కాక, మన దేవుడు ఏమి చెయ్యగలుగుతాడు అని విశ్వసించామో దానిని నిదానించి చూచుట. ఒక్కోసారి దేవుడు మనలను నడిపిస్తున్నప్పటికీ, ఆయన చెయ్యి విడిపించుకుని మన దారిలో మనము వెళ్ళుటకు ప్రయత్నిస్తాము.
నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ -యిర్మీయా 2:17
దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారముగా జీవించుటను బట్టి బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. అయితే మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. నీవు తన మార్గాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పటికీ, ఆయన కోపపడక, నీ మార్గములోనికి తాను వచ్చి, నిన్ను సరైన మార్గములో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ -ఫిలిప్పీయులకు 2:6
ఈ సత్యము ఎరిగినవారి జీవితములు ఎంత ధన్యములు? మన యెడల ఆలోచన కలిగి, తన ఆలోచనలో నిలుపుటకు ఓపికతో ఓర్చుకొని నడిపిస్తున్న దేవుని గుణాతిశయములు ప్రచురించక ఎలా ఉండగలము? దావీదును దేవుడు ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు? అంటే, దావీదు రాజుగా ఉన్నప్పటికీ మందసము నగరమునకు వస్తున్నప్పుడు తన రాజరికపు వైభవాన్ని పక్కన పెట్టి, తన పై వస్త్రము తీసివేసి సంతోషముతో నాట్యమాడాడు. అనగా దేవుని సన్నిధిలో తాను ఏమై ఉన్నాడో, అదే సత్యములో దేవునిని స్తుతించాడు. అందుకే తాను ప్రతిసారీ దేవుని సన్నిధికి పరుగెత్తివెళ్ళుటకు ఆశకలిగి ఉండేవాడు. అందుకే దావీదు అంటే దేవునికి చాల ఇష్టము. ఇప్పుడు మనలను కూడా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఎన్నుకున్నాడు కదా! మనము కూడా సత్యమును ఎరిగినవారిగా ఆయనను సంతోషముతో ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ ఆత్మతో నింపుమా
పరిశుద్ధ ఆత్మతో నింపుమా (2)
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది
||ఈ నీ||
ఓ నా తోటమాలి
ఇంకొంచెం సమయం కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది
||ఈ నీ||
మెయిన్ మెసేజ్
ఈరోజు మన ధ్యానాంశము – “విశ్వాసిగా నీగురి ఏమిటి?”. దాని కొరకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాము.
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.౹ -2 తిమోతికి 4:7.
మొదటిగా “మంచి పోరాటము”. పౌలు ఏమి విషయములో పోరాడాడు? మనము దేని విషయములో పోరాడాలి?
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.౹ -1 తిమోతికి 6:12
నిత్యజీవము అనేది ఒక వైపు లేదా అది చివరి గురి. అది చివరిది అంటే, మొదలు కూడా ఒకటి ఉంటుంది కదా! మన ఆత్మీయ జీవితము యొక్క మొదలు, యేసులో మన రక్షణ. ఈ రక్షణ పొందినవారికే నిత్యజీవమునకు వెళ్ళే అవకాశము ఉంది. ఈ రక్షణ విషయములో మనము పోరాడవలసినది ఉందా? ఉంటే ఎక్కడ మనము పోరాడాలి?
ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.౹ -రోమా 10:10
మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. -లూకా 1:68
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.౹ -ఫిలిప్పీయులకు 2:12
హృదయముతో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలిగింది. ఈ రక్షణ పరిశుద్ధముగా జీవించుటకు ఇవ్వబడింది. అంతే కాక, మనము భయముతో వణుకుతో ఈ రక్షణను కాపాడుకుని కొనసాగించుకోవాలి.
అయితే అనేకసార్లు మనము రక్షణను కాపాడుకోవడానికి మనము పోరాడాలి అనే విషయము మర్చిపోతున్నాము. అయితే,”హృదయమందు విశ్వసించినదానిని నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది”. అయితే మన జీవితములో అనేకసార్లు హృదయముతో విశ్వసించలేని కారణముచేత రక్షణను కాపాడుకోలేకపోతున్నాము. రక్షణ ఒకసారే అనుగ్రహించబడింది, అయితే మనము ఆ రక్షణను కాపాడుకోవాలి. దానికొరకు అసలు రక్షణ ఎందుకు ఇవ్వబడింది అని అర్థము చేసుకోవాలి. “రక్షణ మనము పరిశుద్ధముగాను, నీతిగానూ జీవించుటకు ఇవ్వబడింది”. ఇది ప్రతీ దినము మన చివరి దినము వరకు మన రక్షణను కొనసాగించుకోవాలి.
ఒక్కోసారి మనముందు ఉన్న పరిస్థితులు అసాధ్యముగా కనపడినప్పుడు మన జ్ఞానముచేత విశ్వాసమును కోల్పోయినవారముగా అవుతాము.
ఇది వినినవారు–ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా -లూకా 18:26
ఈ సందర్భము, నీకు కలిగినది అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు నొచ్చుకున్న సందర్భము. అయితే ఇక్కడ సత్యము, “మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమునూ సాధ్యమే”.
మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని౹ -ఫిలిప్పీయులకు 1:19
ఇక్కడ పౌలు జీవితములో సువార్త విషయములో సిగ్గుపడక ఎప్పుడు ఒకే రీతిలో పాటుపడినవాడుగా కనబడుతున్నాడు. చావైనా, బతుకైనా క్రీస్తే ఘనపరచబడాలి అనే తీర్మానము చేసికొని జీవిస్తున్నాడు. అలాగే మనము కూడా ఏ విశ్వాసమైతే మనము కలిగి ఉన్నామో, ఆ విశ్వాసమును ప్రకారము గురి పెట్టుకుని ప్రయాసపడాలి. అందుకే మనము రక్షణ గూర్చిన గురి కలిగి ఉండాలి. అగి గురి అయినప్పుడే మనము ఉదాసీనతను జయిస్తాము.
నా పరుగు కడ ముట్టించితిని.
అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.౹ -అపొస్తలుల కార్యములు 20:24
ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తిమంతుడు.౹ -అపొస్తలుల కార్యములు 20:32
సువార్త అనగా దేవుని మాట. నీకు అనేక సందర్భములలో నీకు విడుదల అయిన దేవుని వాక్కు. ఇప్పుడు నీ జీవితములో ఆ విడుదల అయిన మాటలు నెరవేరునట్లు ఆసక్తి కలిగి సిద్ధపరచుకోవడమే పరుగు కడముట్టించుట అని అర్థము. అయితే ఆ దేవుని వాక్కు యొక్క నెరవేర్పు గురి అయినప్పుడే అలా ప్రయాసపడతాము. “నేను నీతో చెప్పినది నెరువేర్చువరకు నిన్ను విడువను” అని దేవుడు ఇచ్చిన వాక్కు. ఇప్పుడు నీవు చెయ్యవలసింది ఆసక్తితో గురిగా కలిగి కనిపెట్టాలి.
విశ్వాసము కాపాడుకొంటిని:
విశ్వాసమును కాపాడుకోవాలి అని చెప్పబడింది అంటే ఆ విశ్వాసము కోల్పోయే పరిస్థితులుకూడా వస్తాయి అనే కదా! పేతురు జీవితములో యేసు వైపు చూస్తూ నడిచినప్పుడు నీటిపై నడవగలిగాడు. అయితే ఎప్పుడైతే చుట్టూ ఉన్న గాలిని చూసాడో, అప్పుడు ములిగిపోసాగాడు. ఎందుకు అంటే, “సందేహము” కలుగుట ద్వారా. మన విశ్వాసమునకు పెద్ద అవరోధము సందేహము. పేతురు నీటిపై నడుస్తున్నాడు, అప్పుడు పెద్దగా గాలి వీచింది. పేతురు ఆ గాలికి పడలేదు అయినప్పటికి చూసి భయపడ్డాడు. వెంటనే తన విశ్వాసము తగ్గిపోయింది, తాను ములిగిపోసాగాడు. అందుకే మనము విశ్వాసము కాపాడుకునే గురి మనము కలిగి ఉండాలి.
సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.౹ మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.౹ -2 కొరింథీయులకు 1:8-9
మన జీవితములలో కూడా కొన్ని తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా మృతమైనదానిని జీవింపచేయగలిగిన దేవుని యందు విశ్వాసము కలిగి కాపాడుకోవాలి. నా దేవుడు నాకు నష్టాన్ని కలుగనివ్వడు. నా దేవుడు నన్ను దాటిపోడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించకుండా విడిచిపెట్టడు. ఈ సత్యములను ఎరిగి మన విశ్వాసమును కాపాడుకోవాలి. గతించింది గతించింది, ఇప్పటినుండైనా మనము రక్షణను కాపాడుకొనుటయందు, విశ్వాసమును కాపాడుకొనుటయందు గురి కలిగి ఉందాము. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుంది
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.౹ -ప్రకటన 3:10
మొదటిగా దేవుని రక్షణ కొనసాగించుకోవడానికి కొరకు గురి కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్కు నెరవేర్పు కొరకైన గురి కలిగి ఉండాలి. మూడవదిగా నీ విశ్వాసమును కాపాడుకొనుటకు గురి కలిగిఉండాలి.