23-02-2025 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతములు 

కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా (Update the lyrics)

యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

ఆరాధన వర్తమానము

ఈ దినము చాలా శ్రేష్టకరమైన దినము. ఈ దినము దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చింది. ఈ దినము మనము పోగొట్టుకుంటే మనకంతే దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. ఈ దినము నీకొరకు ప్రభువు ఏర్పాటుచేసిన దినము. ఎందుకంటే, అపవాది ఉచ్చులు మనకు తెలియవు కానీ, దాని శక్తినుండి మనలను కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము.

దేవుని ఎరగని వారికి దేవుడు కనికరము చూపిస్తున్నాడు. అయితే ఆయనను ఎరిగిన మనము ఆయనను మహిమ పరచవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయన నామము ఈ దినము ఘనపరచవలసినదే, మహిమ పరచవలసినదే. దానికొరకు ఆయన మనకు అవకాశము ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, సమయము ఇచ్చాడు. ఆయనను స్తుతించకుండా, మహిమ పరచకుండా నీవు ఏ మాత్రము ఆటకంకముగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో భయము కలిగి మనము ఉండాలి.

యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు. -కీర్తనలు 96:4

యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు, దానికొరకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఒకవేళ నీవు నేను ఆయనను స్తుతించకపోతే, ఆయనకు తగిన మహిమ చెల్లించకపోతే రాళ్ళతో సహితము మహిమ పొందగలిగినవాడు.

యెహోషువా ముందట ఎవరూ నిలువలేరు అనే వాగ్దానము ఉంది అయితే ఒక చిన్న ఆయి పట్టణము యెదుట ఓడిపోయాడు. యోనా ఒక్కడే అయితే ఓడలో ఉన్నవారు నాశనము అవడానికి కారణము అయ్యాడు. ఆ ఒక్కడిగా నీవు నేను ఉండకూడదు. అందుకే దేవుని భయము ఖచ్చితముగా మనము కలిగి ఉండాలి.

దేవుని మందసమును మోసేవారికి కలిగిన భాగ్యము ఎంతో గొప్పది. అటువంటి అవకాశము కలిగినవారు ఎంతో ధన్యులు. మన దేవుడు అధిక మహిమ పొందదగినవాడు అందువలననే దేవుని భయము మనము కలిగి ఉండాలి. ఆ భయమే మనలు సిద్ధపరుస్తుంది. ఆ భయము లేని యెడల మనము అపవాదికి ఆయుధముగా మారిపోతాము.

దేవుని ప్రేమను దూరము చేసుకుంటే మనము దేశ ద్రిమ్మరులుగా అయిపోతాము. ఆ ప్రేమలో ఉన్నంతవరకే మన క్షేమము. ఆ ప్రేమను దాటి బయటకు పోతే, మనము వెళ్ళేది మరణమునకే! అయితే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను నిలబెట్టడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. నీకొరకు ఆయన కుమారునినే అర్పించినవాడుగా ఉన్నాడు.

యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.౹ -యిర్మీయా 10:6

మన దేవుని నామము ఘనమైనదిగా ఉంది. ఆయన నామమును బట్టియే మన జీవితములు క్షేమముగా ఉంటున్నాయి. ఆయనను అంగీకరించినవారు దేవుని పిల్లలుగా ఉంటున్నారు. ఆ పిల్లలకు ఆయన ఘనమైన, బలమైన నామము అనుగ్రహించబడింది. ఆ నామము అపవాది క్రియలన్నిటిని లయపరచగలిగిన నామము అయి ఉన్నది. మన ధన్యత మనము కలిగిన స్తోమతను బట్టి కాదు గానీ, ఆయన నామమునుబట్టియే!

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ -యోహాను 1:12

ఈ దినము యేసు నామము మనకు అధికారముగా ఉంది. ఆయన నామములో మనకు ఉన్న అధికారము బట్టియే రావడము, పోవడము. రావడము అనేది ఆశీర్వాదము, పోవడము అనేది అపవాది ఉచ్చులు.

ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. -లూకా 1:75

పరిశుద్ధ నిబంధన ఏమిటి అంటే, అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణము. దానికొరకు మనకు అనుగ్రహించబడినదే యేసు నామములో రక్షణ. అబ్రహాము జీవితములో చేసిన నిబంధన విశ్వాసమును బట్టి వారసత్వముగా యేసు నామములో మనము కలిగిన రక్షణను బట్టి మనకు సంక్రమిస్తుంది.

మనము దేవుని సొత్తు అయి ఉన్నాము, అనగా యెహోవా నామము ధరింపచేసుకొనిన వారైన మనము ఆయన సొత్తు అయి ఉన్నాము.

యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.౹ -యిర్మీయా 10:6

దేవుని శౌర్యము ఎక్కడ కనపరచబడుతుంది అంటే, ఎక్కడ అపవాది క్రియలు ప్రబలమౌతాయో, అక్కడ వాడి కార్యములు లయపరచబడునట్లు, ఆయన శౌర్యము కనపరచబడుతుంది. ఆయన నిన్ను నన్ను ప్రేమించినవాడుగా ఉన్నాడు, ఆ ప్రేమనుబట్టే సమస్తము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు.

తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?౹ -రోమా 8:32

నీవు ఏ శిక్ష అనుభనించవలసి ఉందో, ఆ శిక్ష నీకు మారుగా ఆయన పొందాడు. అటువంటి దేవుని ప్రేమను నీవు నేను జ్ఞాపకము చేసుకోవాలి. ఈ దినము మనము క్షేమముగా జీవిస్తున్నాము అంటే, అది ఆయన ప్రేమయే! దీనికి బదులుగా నీవు నేను ఏమి ఇవ్వగలుగుతాము? ఏమిస్తే సరిపోతుంది?

అనేక సందర్భములలో మన అహము అడ్డువస్తుంది. మన చేసిన కష్టమును బట్టి మనము పొందుకున్నాము అనే ఆలోచన కలిగి ఉంటాము, అయితే ఆయన లేకపోతే ఒక్క క్షణములో మన జీవితములు అంతరించిపోతాయి. ఆయన కలుగ చేసిన అవకాశము, అందించిన సహాయము, అనుగ్రహించిన జ్ఞానము, బలము, ఆరోగ్యము మరియు కృప అన్నీ కలిసి మనము సాధించగలుగునట్లు సిద్ధపరచాయి.

గొల్యాతు బలమైనవాడే కానీ వాడి బలము వాడికి కలిగిన ఆయుధములు, వాడి శరీర బలము. అయితే దావీదు కేవలము తాను నమ్మిన దేవుని యొక్క నామము, ఆ నామములోని బలమును బట్టి అక్కడ నిలబడ్డాడు. దావీదు వడిసెల మాత్రమే తిప్పాడు, అయితే అది ఎక్కడ తగలాలో నిర్ణయించింది మాత్రము దేవుడే! యెహోవా నామము బలమైనది, ఆ బలమైన నామము పట్టుకొని నిలబడితే ఎంతటి గొలియాతు అయినా పడద్రోయబడవలసినదే.

మనము రక్షణ పొందిన దినమునుండి అనేకసందర్భములలో గొల్యాతు నిలబడి ఉండవచ్చు. అయితే నిలబడిన ప్రతీసారీ ఆ గొల్యాతు హతము చేయబడ్డాడు. అటువంటి ఘనమైన నామమును మనము హృదయమారా స్తుతిద్దాము.

 

 

ఆరాధన గీతము

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో

 

వారము కొరకైన వాక్యము

మన దేవుడు మనలను ఎలా చూస్తున్నాడు అంటే, తన కుమారులుగాను, కుమార్తెలుగానూ చూస్తున్నాడు.

మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:18
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు.౹ -రోమా 8:14

దేవుని ఆత్మ చేత నడిపించబడటము అంటే ఏమిటి? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము ఎలా ఉండాలి?

మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹ -రోమా 8:13

శరీరానుసారముగా మనము ప్రవర్తించవలసినవారము కాదు. శరీర క్రియలు గురించి గలతీకి రాసిన పత్రికలో స్పష్టముగా వ్రాయబడ్డాయి.

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ -గలతీయులకు 5:19-21

ఇవే కాక, నీ శరీరము వేటిని కోరుకుంటుందో వాటిని బట్టి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అయితే మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా ఉన్నారు. అయితే, దేవుని కుమారులు అని చెప్పడానికి, దేవుని కుమారులుగా ఉందురు అనే దానికి వ్యత్యాసము ఉంది. నీవు శరీరానికి లోబడక ఆత్మను బట్టి నీవు నీ జీవితమును సరిచేసుకొని నడిచినట్టయితే, అప్పుడు నీవు దేవుని కుమారునిగా, కుమార్తెనుగా ఉందువు.

ఒకవేళ నీకు ఎదుటివ్యక్తిని చూసి అసూయ పుట్టింది అనుకోండి, అప్పుడు ఆత్మ చేత ఎలా మనము ఆ అసూయను చంపగలుగుతాము? శరీరము ఎదుటి వ్యక్తి ఎదుటివాని నష్టమును కోరుకుంటుంది, అయితే ఆత్మ చేత నడిపించబడినపుడు, యేసు నామములో ఆ ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదము పలకాలి.

ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది గనుక ఎంతో జాగ్రత్త కలిగి, భయము కలిగి సిద్ధపడాలి. నీవు ఆత్మ చేత నడిపించబడినపుడు దేవుని కుమారునిగా ఉందువు. అంత్య దినములలో వాక్యము కొరకు నిలబడేవాడినే ప్రభువు వాడుకుంటాడు, అలా ఆశ కలిగిన వాడినే వాడుకుంటాడు. అయితే ఆ ఆశ ఒక్కటే సరిపోదు గానీ, నీవు దేవుని కుమారునిగా ఉండాలి.

శరీర క్రియలు దేవునిని మహిమ పరచలేవు గనుక ఆత్మ చేత మనము ఆ క్రియలు చంపివేయాలి.

యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.౹ -గలతీయులకు 3:26

దేవుని కుమారుడివిగా నీవు ఉన్నావు అంటే, నీలో ఖచ్చితముగా విశ్వాసము ఉండాలి. అనగా నీవు విశ్వాసము కలిగి ఉంటే, నీవు ఖచ్చితముగా దేవుని కుమారునిగా పిలువబడతావు. నీవు విశ్వాసము కలిగి ఉంటే, నీవు దేవుని మాటకు లోబడతావు.

నీవు దేవుని కుమారునిగా ప్రకటించబడ్డావు, అయితే ఆ ప్రకటన మాత్రమే సరిపోదుగానీ, నీవు దేవుని కుమారునిగా నడవాలి.

సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. -మత్తయి 5:9

మన తండ్రి సమాధానమునకు కర్త అయి ఉనాడు, అపవాది బేధములు కలిగించువాడు. మనము దేవుని కుమారులము అంటే, సమాధాన పరచేవారిగానే ఉండాలి.

జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును.౹ -ప్రకటన 21:7

నీవు ప్రతీ దానిలో నీవు జయించేవాడిగా ఉన్నపుడు నీవు దేవుని కుమారునిగా ఉంటావు.

అలాగే ఆయనను అంగీకరించిన ప్రతి వాడు కూడా దేవుని కుమారుడు అనే ముద్ర పొందుకుంటాము. పస్కా పండుగ అప్పుడు మరణ దూత, ఏ ఇంటిపై ఆ రక్తము ప్రోక్షించబడి ఉందో, ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. అలాగే మనము ఈ దినము కలిగి ఉన్న దేవుని కుమారులు అనే ముద్ర కలిగి ఉండటమునుబట్టియే మనము మరణమును తప్పించుకుంటాము.