ఆరాధన వర్తమానము
ఈ దినము ప్రభువు దినము అనగా ఈ దినము ప్రభువుకు సంబంధించిన దినముగా ఉంటుంది. ఈ ప్రభువు దినమున ఆయన ఏమి కోరుకుంటున్నాడో, ఆ ప్రకారముగా సిద్ధము చేసుకుందాము. ఆయన తన బిడ్డలు సంతోషముగా ఉండాలి, ఆయన ఎమై ఉన్నాడో అనే సత్యము తన బిడ్డలు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాడు.
మన దేవుడు అధికమైన మహిమ పొందదగినవాడు. ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి అని లేఖనములు తెలియచేస్తున్నాయి.
నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును. -కీర్తనలు 145:13
తరతరములు అనే మాటను చూస్తే, అది సమయమును సూచిస్తుంది. లోకములో మంచిగా బతికిన దినములు, కష్టములతో కూడిన దినములు అనే కొన్ని సమయములు ఉన్నాయి. అవి తరములుగా చూస్తే, ఆ మంచి దినములైనా, చెడ్డ దినములైనా దేవుని రాజ్య పరిపాలన ని జీవితములో నిలుచును.
ఈ దినము మన ధైర్యము ప్రభువే. ఈ లోకములో మనము మంచిగా జీవించినపుడు, మనతో అనేకులు ఉంటారు. అయితే మనము కష్టకాలములో ఉన్నపుడు అనేకులు విడిచిపెట్టేవారిగా ఉంటారు. అయితే మన ప్రభువు మాత్రము నిత్యము నీతోనే ఉండేవాడిగా ఉన్నాడు. ఆయన నీ స్థితిగతులను బట్టి నీతో ఉండడు గానీ, ఆయన ప్రేమను బట్టియే ఆయన మీతో ఉంటాడు.
యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. -కీర్తనలు 145:14-15
మన దేవుడు లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు. అయితే నీ కన్నులు ఆయన వైపు చూసినప్పుడు, తగిన కాలమందు ఆయన కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు. తగిన కాలము అంటే, ఉదాహరణకు, నీవు ఆకలిగా ఉన్నావు అనుకో, ఆ సమయమే నీకు ఆహారము అందించే సమయము. అనగా నీవు ఆయన వైపు చూసిన సమయములో, ఏ అవసరము కొరకు నీవు ఆయన వైపు చూసావో, ఆ విషయములో నీకు కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు.
అయితే ఆయన వైపు చూసే సమయములో సత్యము ఎరిగి, ఆయన వైపు చూడాలి. సత్యము అనేది మార్పు చెందనిది. ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది అనేది సత్యము. నీ పరిస్థితి కృంగిపోయి ఉంటే, కృంగిపోయినవాడిని ఆయన లేవనెత్తువాడు గనుక, ఈ సత్యమును నీవు నమ్మి ఆయన వైపు నీవు చూస్తే, అప్పుడు ఖచ్చితముగా ఆయన ఉద్ధరించేవాడే గానీ, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీ ఆనందమే ఆయనకు కావాలి. నీ సంతోషము కొరకు సమస్తము సమస్తము సమకూరుస్తాడు.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28
సత్యమును నీవు నమ్మి ఆయన వైపు నీవు చూస్తే నిన్ను లేవనెత్తడానికి, ఉద్ధరించడానికి, సమస్తము సమకూర్చేవాడిగా నీ దేవుడు ఉన్నాడు.
ఏలియాను జ్ఞాపకము చేసుకొంటే, కేరీతు వాగు దగ్గర ఉన్నపుడు, ఉదయము మధ్యాహ్నము, సాయంకాలము భోజనము కావాలి. అయితే ఆ అవసరమైన ప్రతీ సమయములో సూపర్నేచురల్గా దేవుడు సిద్ధపరచాడు. దేవుడు వ్యర్థము చేయడు, నిన్ను ఆయనే సృష్టించాడు గనుక, నీవు వ్యర్థుడవు కాదు. నీ జీవితము ప్రయోజనకరమైనదే కానీ, పనికిమాలినది కాదు!
ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యపరిపాలన ఉద్దేశ్యము నిన్ను ఉద్ధరించడము, లేవనెత్తడము, నీకు ఆహారమివ్వడమే.
నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. -కీర్తనలు 145:16
గుప్పిలి విప్పడము అంటే ముందుగా ఆయన గుప్పిలిలో దాచిపెట్టినదే నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనకు కావలసిన ప్రతి దాని వెనుక దేవుని హస్తము పనిచేస్తుంది.
యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. -కీర్తనలు 145:20-21
వాక్యము ఏమైతే నీకు తెలియ చేస్తుందో ఆ ప్రకారముగా నీవు కలిసిపోవాలి. అలా నీవు కలిసిపోయినపుడు నీవు నిజమైన సంతోషమును అనుభవిస్తావు. ఈ లోకములో నీవు ఏమి సంపాదించినా సరే, దేవుడు నీకు సమకూర్చి ఇచ్చినదానితో పోలిస్తే, సంతోషమును ఇవ్వలేదు.
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.౹ -యోహాను 15:7
దేవుని మాటలు అంటే వాక్యమే. ఆయనయందు ఉండటము అంటే, ఆయన వాక్య ప్రకారము ఉండటమే! అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది ఒక్కరోజు కాదు గానీ, మన జీవిత విధానము అయి ఉండాలి.
నిన్ను ఒక్కసారి దేవుడు తన బిడ్డగా చేసుకున్నాక, నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రేమ ప్రతీ సమయములో నిన్ను నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది, సమకూరుస్తుంది. అలా వాక్యప్రకారము నీవు ఉండాలి అంటే ఎప్పుడు సాధ్యము అవుతుంది? శరీరము చనిపోయినప్పుడే ఇది సాధ్యము అవుతుంది, ఎందుకంటే శరీరము ఎల్లప్పుడు పాపపు కార్యములే కోరుకుంటుంది.
ప్రభువు మాటలుగా నీవు ఈ దినమున అంగీకరిస్తే, నీ పైన దేవుని వెలుగు ఉదయిస్తుంది, నీవు అనేకులకు వెలుగుగా చేయబడతావు!
మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును – అనుగ్రహము అంటే, అప్పటి వరకు లేనిది, నీవు అడిగినదానిని ఇచ్చి నిన్ను తృప్తిపరచాలి అనే దేవుని కోరిక. ప్రతీ వారము ప్రభువు నీతో ఏదో ఒకమాట మాట్లాడుతున్నాడు అంటే, దేవునికి నీ యెడల ఒక చిత్తము ఉంది. నిన్ను లేవనెత్తువాడు, నిన్ను ఉద్ధరించువాడు, నీకు ఆహారము దయచేయువాడుగా ఆయన నీకున్నాడు.
ఆరాధన గీతము
యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును
వారము కొరకైన వాక్యము
మన దేవుని మాటలచేత తృప్తిపరచలేము గానీ, మన క్రియలచేతనే ఆయనను తృప్తిపరచగలము. మనము ఏమి చెప్పుచున్నామో, అది మన క్రియలలో కూడా కనపరచాలి.
జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును.౹ -ప్రకటన 21:7
దేవుని కుమారులము, కుమార్తెలము అయిన మనము జయించువారిగా మనము ఉండాలి. ఓటమి అనేది మన జీవితములో కనపడకూడదు. దేవుని కుమారుడు ఖచ్చితముగా జయించేవాడు. అయితే ఆ జయము మనము ఎలా పొందుకోవాలి?
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹ -1 యోహాను 4:4
దేవుని సంబంధి అయిన మీలో, ఉన్నవానిని బట్టి, మీరు జయించువారిగా ఉంటారు. మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి అయితే సమస్తము సాధ్యమే. అటువంటి సమస్తము సాధ్యము చేయగలిగిన వానిని బట్టి నీవు జయించెదవు. అయితే నీలో ఎప్పుడుంటాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములోనే ఉండగలడు గనుక, నీవునూ నీ హృదయమునూ పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అది జయమే! అయితే అది నీ శక్తిని బట్టి కాదు గానీ, నీలో ఉన్నవానిని బట్టే అది జరుగుతుంది. అంటే నీకు అనుకూలముగా లేనిది కూడా నీలో ఉన్నవానిని బట్టి అది జరుగుతుంది. అయితే ఈ జయము అనేది నీలో ఆయన ఉంటేనే సాధ్యము అవుతుంది.
దేవుని సంబంధి అయిన నీలో, ఆయన నివాసముంటాడు. నీలో ఉన్న ఆయనను బట్టి నీవు జయించువానిగా ఉంటావు. అయితే నీలో ఆయన నివాసముండుటకు, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి.
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.౹ -ఫిలిప్పీయులకు 4:13
ఆయన చేయగలిగిన సమస్తము ఎక్కడ? అని చూస్తే, అని నీ జీవితములోనే! ఆయన నీలో నివాసము ఉండునట్లు నీవు సిద్ధపరచుకొంటే, నీవు చేసే ప్రతి దాని యందు, నీదే విజయము.
నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:16-17
పౌలు సమయము శిష్యుల సమయము అయిపోయింది, ఇప్పుడు నీ జీవితము ఒక సాక్ష్యముగా ఉండాలి. ఆయన నీతో ఎల్లప్పుడు ఉన్నాడు అనే సాక్ష్యము నీ జీవితము ద్వారా కనబడాలి. అంటే, నీ జీవితములో అసాధ్యము అయినది ఏమీ ఉండదు ఉండకూడదు. దినములు గడిచే కొద్దీ, అపవాది వేసిన ప్రతీ ఉచ్చు, నీలో ఉన్నవానిని బట్టి సూపర్నేచురల్ గా నీవు జయము పొందుకుంటావు.
నీలో పాపము ప్రవేశించినట్టయితే, ఆయన నీలో ఉండలేడు గనుక, నీలో నుండి బయటకు వచ్చి, నీ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ, నీవు చేసేది తప్పు అని తెలియచేస్తాడు. ఎప్పుడైతే, నీవు ఒప్పుకొని, విడిచిపెట్టి సరిచేసుకుంటావో, అప్పుడు మరలా ఆయన నీలో నివాసముండుటకు తిరిగి వస్తాడు.
అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. -జెకర్యా 4:6
దేవుని కార్యము నీ శక్తిచేతనైనను బలముచేతనైననుకాక దేవుని ఆత్మచేతనే జరుగునని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేసేవాడు, ఏ కార్యము ఆయన చేస్తాడు అని చూస్తే-
ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10
“మనకైతే”, అనగా ఎవరిలో అయితే ఆయన నివాసముంటాడో, వారికి – “దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు…”. అనగా ఆయనను కలిగి ఉన్న మన కొరకు ఏమి సిద్ధపరచబడ్డాయో అవి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి, మన కళ్ళముందు కనపరచబడతాయి.
ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు.౹ -1 కొరింథీయులకు 2:11
దేవుని సంగతులు అనగా ఏమై ఉంటాయి? ఆయన నాలో ఉంటున్నాడు అంటే, నా గురించి ఆయన ఆలోచన ఏమిటి? ఆయన ఉద్దేశ్యము ఏమిటి? ఎలా నడిపించాలి అనుకుంటున్నాడు? అనే అన్నీ దేవుని సంగతులే! ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఎరిగినవాడు. గనుక నీవు ఆయనను కలిగి ఉండుటకు మాత్రమే నీవు ప్రయాస పడాలి, అప్పుడు నీవు జయించువారిగా నీవు ఉంటావు.
అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును.౹ ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.౹ -ప్రకటన 21:3-4
నీవు జయించువానిగా ఉన్నపుడు, నీ ప్రతి బాష్పబిందువు తుడిచివేయబడుతుంది, మరణముగా నీ జీవితములో ఉన్న ప్రతీదీ ఇంక ఉండదు, దుఃఖము ఉండదు, వేదన అయినా సరే ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి. ఎవరైతే క్రీస్తునందుంటారో, వారి జీవితములో ఉన్న మొదటి సంగతులు గతించిపోయాయి.
