22-01-2023 ఆదివారం మొదటి ఆరాధన

ఏ తెగులు నీ గుడారము

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||

దీనుడా అజేయుడా

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||

సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||

సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||

ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||

ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

ఆరాధన వర్తమానం

మనము దీవించబడినవారము. ఎందుకు దీవించబడినవారము అంటే? ఇప్పుడు నీకొరకు దేవుని మాట విడుదల అవుతుంది. ఆ మాట నీవు వచ్చిన వేదన, బాధల పరిస్థితులలో, నీ హృదయాన్ని సతోషపరుస్తుంది. నీవు వున్న కృంగిన స్థితిలో వచ్చిన దేవుని వాక్యము నిన్ను సంతోషముతో నింపుతుంది. దేవుని మాట ఎంతో విలువైనది దానిని దేనితోనూ వెలకట్టలేము. ఆయన వాక్కులో పరిపూర్ణత ఉంది. ఆ వాక్కు పరిపూర్ణత కలిగిఉన్నది కాబట్టే మనము పరిపూర్ణము చేయబడుతున్నాము.

మీఅపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను – ఎఫెసీ 2:1

ఈ మాటలు కేవలము మన మొదటి రక్షణ కొరకైన మాటలు మాత్రమే కాదు. ఈ మాట లోతుగా ధ్యానము చేద్దాము. మనము చచ్చిన వారముగా ఉంటున్నాము దానికి ఏమిటి కారణము. మొదట మనము రక్షించబడకమునుపు పాపము చేత చచ్చినవారముగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఆయన మనలను బ్రతికించేవాడుగా ఉన్నాడు. నీ ప్రభువు బ్రతికించేవాడు. ఆ ప్రభువు నీ మధ్య ఉన్నాడు. నీవు చచ్చిన స్థితిలో ఉన్నా నిన్ను బ్రతికించేవాడు నీ మధ్యలో ఉన్నాడు.

నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా అని మనము పాడాము. కానీ ఆయన కథ నీకు తెలియకుండా ఆయనను నీ మనస్సు చేరలేదు. ఆయనే నీ గురి అవ్వలేడు, ఆయన దరి నీవు చేరలేవు. అయితే ఆయన కథ నీకు తెలిస్తే, ఆయన సత్యము నీకు తెలిస్తే నీ శరీరమే కాదు గానీ, నీ ఆత్మ కూడా ఆయనను చేరుతుంది. ఆయనే నీ గురిగా ఆయన దరి నీవు చేరతావు.

ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము. తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. 2 కొరింథీ 4:8-9.

చచ్చిన వారిగా ఉంటే బ్రతికించేవాడు నీ దేవుడు. శ్రమపడుతున్నావా? అపాయములో ఉన్నావా? తరమబడుచున్నావా? పడద్రోయబడి ఉన్నావా? నిన్ను బ్రతికించేవాడు నీ మధ్యలో ఉన్నాడు. ఈ సత్యము నీవు ఎరిగియుంటే, వెంటనే ఆయన దగ్గరకు పరిగెడతావు, ఆయన చేరుకుంటావు.

యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము. ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచ బడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము 2 కొరింథీ 4:10-11.

మేము తరమబడుతున్నాము కానీ యేసుయొక్క జీవము మా పరిస్థితులలో ప్రత్యక్షపరచబడుతుంది అని పౌలు చెప్పుచున్నాడు. మపడుతున్నావా? అపాయములో ఉన్నావా? తరమబడుచున్నావా? పడద్రోయబడి ఉన్నావా? నీ పరిస్థితులలో కూడా ప్రత్యక్షపరచబడుతుంది.

కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్త మైనవి మీకొరకై యున్నవి – 2 కొరింథీ 4:13

యేసు యొక్క కృప బయలుదేరింది, నీవు చేయవలసింది హృదయపూర్వకముగా ఆయనను చేరడము, స్తుతించడము, ఆరాధించడము, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే. అప్పుడు నీ జీవితములో దేవుని మహిమ నిమిత్తము, నీ ద్వారా కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున, దేవుని కృప నీ జీవితములో ప్రబలుతుంది.

మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. – 1 పేతురు 1:10-11.

ఎప్పుడు ఈ కృప కలుగుతుంది? నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, ఆయనను వెంబడిస్తావో అప్పుడు కలుగుతుంది. ఆ కృప విడుదల అయిన తరువాత, నీ పరిస్థితులు మారి, దేవునికి నీ ద్వారా మహిమ కలుగుతుంది.

కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. 2 కొరింథీ 4:14-15

మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై యున్నాడు – కీర్తన 38:1

దేవుని పట్టణము అనగా నీ జీవితమే. నీవుని దేవుని ప్రజగా చేయబడ్డావు. మనము నిజమైన వాడిని వెంబడిస్తున్నాము. ఇప్పుడు నీవు విశ్వసిస్తే ఆయన కథ నీవు యెరిగి ఉంటే, ఖచ్చితముగా ఆయనను నీవు చేరతావు. ఆయనను ఆరాధిస్తావు. ఆయనను స్తుతించి మహిమపరుస్తావు. ఈ మాటలు వట్టిమాటలు కాదు. దేవుని మాటలు ఆత్మయు జీవము అయిఉన్నవి. అయితే అనుభవము లేకుండా ఈ సత్యము ఎరగలేవు. నీవున్న పరిస్థితిని ఒక అవకాశముగా తీసుకో. నీవు తరుమబడుతున్న స్థితిలో నమ్మి ఆరాధన చెయ్యి అప్పుడు దేవుని కృప ఎలా వెంబడిస్తుందో నీవు చూడగలవు. నిన్ను శ్రమలో విడిచిపెట్టేవాడు కాడు.

నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు – సామెతలు 8:17

నీవు దేవుని ప్రేమించి హృదయపూర్వకముగా దేవుని ఆరాధించు, అప్పుడు నీ దేవుని ప్రేమ నీ జీవితములో, నీ స్థితిలో ప్రత్యక్షపరచబడుతుంది.

ఆరాధన గీతము

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||

 

Main message| మెయిన్ మెసేజ్

ఆత్మలో బలపడుము. మనము ఏమై ఉన్నాము అనే విషయము చాలా మందికి తెలియదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనము కూడా ఆత్మ అయ్యే ఉన్నాము. మన ఆత్మ నివసించడానికి ఈ శరీరము ఉంది. అయితే లోకము ఏమి చెప్తుంది? నీ శరీరము బాగుంటే, నీవు ఆరోగ్యముగా ఉంటావు అని చెప్తుంది. దానికొరకు అనేకమైన ప్రయత్నాలు అవన్నీ శరీరమునకు మాత్రమే, మరి నీలోని ఆత్మ సంగతి ఏమిటి?

ఈలోకములో శరీరమును అభివృద్ధి చేయడానికి అనేకమైన విధానాలు ఉన్నాయి. అయితే నీ శరీరము ఎంతగా అభివృద్ధి చేసినా సరే ఒకసారి దానిలోని ఆత్మ వెడలిపోయినతరువాత ఆ శరీరమునకు ఏ విలువా ఉండదు. మానవ ప్రయత్నాలు అన్నీ శరీరము కొరకే కానీ ఆత్మకొరకు ఉండటంలేదు. వాక్యము ఏమి చెప్తుంది? ఆత్మను ఆర్పకుడి. మరి మనము ఏమి చేయాలి? శరీరాన్ని, ఆత్మను రెండిటిని అభివృద్ధి చేయాలి.

మనము ఆత్మ, జీవము మరియు ఆత్మల కలయిక అయి ఉన్నాము. మన శరీరము గురించి అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మరి ఆత్మ సంగతి ఏమిటి? నీలో ఉన్న ఆత్మ జీవింపచేయబడినప్పుడు నీ శరీరము కూడా జీవింపచేయబడేదిగా ఉంటుంది. నీ ఆత్మ బలముగా ఉంది, నీ శరీరము బలహీనముగా ఉంది అయితే నీ ఆత్మ నీ శరీరాన్ని బ్రతికిస్తుంది మరియు బలపరుస్తుంది.

అందుకే పౌలు తిమోతికి వ్రాస్తూ శరీర సాధనముకంటే ఆత్మీయ సాధనము ప్రయోజనము అని చెప్పాడు.

నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. రోమా 7:19-21.

అనగా ఏ మంచి అయితే చెయ్యాలో, చెయ్యాలి అనుకుంటున్నానో ఆ మంచి నేను చెయ్యలేకపోతున్నాను. నేను మేలు చేయాలి అని ఆశపడుతున్నాను కానీ నేను కీడు చేస్తున్నాను. ఈ మాటలను బట్టి శరీరము ఏమి కోరుకుంటుంది అలాగే ఆత్మ ఏమి కోరుకుంటుంది అనేది మనము అర్థము చేసుకోవచ్చు

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను గలతీ 5:19-21.

ఈ శరీర కార్యములలో ఏదైనా నీ జీవితములో కనబడుతున్నట్టయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు.

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము – గలతీ 5:22.

నేను మంచి చేయాలి అనుకుంటున్నాను అనగా నేను ప్రేమను కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాను అనుకోండి. అప్పుడు నీ శరీరము చెయ్యకూడనిది ప్రేరేపిస్తుంది. అనగా నీకున్న అసూయనుబట్టి నీవు ప్రేమించలేకపోతున్నావు. నీ శరీరము బలముగా ఉంది గానీ ఆత్మ బలహీనముగా ఉంది. ప్రేమించలేకపోవడానికి కారణము ఏమిటి? నీ శరీరము బలముగా ఉంది. అందుకే ఎంతసేపూ లోకము ఏది తెలియచేస్తుందో దానిని వెంబడిస్తున్నావు.

మేలు చేయకోరుకుంటున్న నీవు కీడు చేస్తున్నావు అంటే నీలో పాపము ఉంది. అయితే నీలోని అంతరింగిక పురుషుడు అనగా ఆత్మ పురుషుడు మంచి చేయాలి అని కోరుకుంటున్నాడు.

అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. – రోమా 7: 22-23.

ఆత్మ మంచిచేయాలి అనుకున్నా వెలుపలి పురుషుడు అనగా శరీరము పాపమునకు చెరగా పట్టబడుతుంది. ఒకవేళ నీ లోపలి వ్యక్తి బలవంతుడైతే బయట ఉన్న వ్యక్తిని జయించగలుగుతావు. అలాకాకపోవడము బట్టే నీ శరీరము నిన్ను లోపరచుకుంటుంది. నీవు మంచిగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఆత్మను బలపరచుకోవాలి.

మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను – ఎఫెసీ 3:15

అయితే ఈ అంతరంగ పురుషుడు ఎలా బలపరచబడతాడు? మాటవరసకి కాదు గానీ యదార్థముగా శరీరము కాదు గానీ, ఆత్మయే నాకు కావాలి అని చెప్పగలగాలి.

కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 కొరింథీ 4:16

ఇది ఎప్పుడు జరుగుతుంది? ఉపవాసములో ఉన్నప్పుడు నీ శరీరము కృశించిపోతుంది గానీ, నీ ఆత్మ బలపరచబడుతుంది. నీ గురి ఏంటి అంటే నీ ఆత్మ బలపరచబడాలి దానికొరకు సిద్ధపడాలి. ఉపవాసము నీ శరీరాన్ని నలగగొడుతుంది ప్రార్థన నీ ఆత్మను బలపరుస్తుంది.

ఎవరు బలాన్ని కలగజేసేవారుగా ఉన్నారు? దేవుని ఆత్మ. నీవు ఉపవాసము ఉన్నప్పుడు నీ ఆత్మను బలపరచుకోవడానికి నీ దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీవు గడుపుతున్నప్పుడు నీవు నీకు బలాన్నిచ్చే దేవునితో సహవాసము కలిగి ఉంటున్నావు.

యేసయ్య కూడా ఉపవాసము చేసినతరువాత ఆత్మలో బలము కలిగినవాడై వెళ్ళాడు. నీ ఆత్మలో బలము కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో గడపాలి. నీవు దేవుని సన్నిధిలో గడపకపోతే నీ ఆత్మ బలము పొందదు. అప్పుడు నీ శరీరము బలముగా నీ జీవితములు లోబరచుకుంటుంది.

శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. రోమా 8:5-8.

దేవుని సన్నిధిలో ఉంటేనే నీ ఆత్మ బలపరచబడుతుంది. ఆయన సన్నిధిలో ఉండకుండా మనము ఆత్మలో బలము పొందలేము. చాలామంది క్యాలెండర్ వాక్యము చదువుకుని వెళ్ళిపోతారు. లేకపోతే 5 నిమిషాలు మాత్రమే ఆయన సన్నిధిలో గడుపుతారు. అది హాయ్ బాయ్ అనే విధానములో యేసయ్యతో మాట్లాడుతున్నారు. అది కాదు. వీలైనంత సమయము ఇష్టపూర్వకముగా దేవుని సన్నిధిలో గడపాలి.

అపవాదినుండి నీవు తప్పించబడాలి అంటే నీవు ఉపవాసము ఉండాలి. శిష్యులు కూడా ఒక దెయ్యమును వెళ్ళగొట్టలేనప్పుడు యేసయ్య వారితో చెప్పాడు, ఉపవాసము మరియు ప్రార్థనల ద్వారానే తప్ప అది వెళ్ళదు అని చెప్పాడు. సమస్త నాశనమునకు అపవాది కారణము. నీవు ఆత్మలో బలము పొందుకున్నప్పుడు నాశనము కలిగించేది ఏదైనా నీ ముందు నిలువదు.

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 8:35

అంటే నీవు ఆత్మలో బలముగా ఉన్నట్టయితే ఏ నాశనకరమైనదీ నిన్ను ఏమీ చెయ్యలేదు. దానిని నీవు జయించేవాడివిగా ఉంటావు.

నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను – ప్రకటన 3:21

నీవు ఆత్మలో బలపరచబడితే నీవు జయించేవాడవుగా ఉంటావు అప్పుడు నీ కొరకు సింహాసనము వేచి ఉన్నది. సింహాసనము అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరచిన స్థానము. నీవు జయించిన ప్రతిసారీ నీకొరకు ఒక కిరీటము ఉంది.

అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను – మత్తయి 4:4

ఆదాము హవ్వలకు ఫలాన పండు తినవద్దు అని చెప్పారు. ఒకవేళ తింటే మీరు నిశ్చహయముగా చచ్చెదరు అని చెపారు.

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను – ఆదికాండము 2:17
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి – ఆదికాండము 3:7

ఇక్కడ తిన్నతరువాత వారు భౌతికముగా చనిపోలేదు కానీ వారిలో ఒక మార్పు జరిగింది. వారి కన్నులు తెరువబడ్డాయి. దాని అర్థము ఏమిటి? దేవుని మాట విన్నంతకాలము అంతరంగ పురుషుడు జీవించి ఉన్నాడు. ఎప్పుడైతే వారు దేవుని మాటకు లోబడలేదో వారి ఆత్మ చనిపోయింది. అందుకే మనము ఆత్మలో బలపరచబడాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న ఆత్మ ఒక కార్యము చేస్తుంది. అది శరీరాన్ని చంపివేయుట. నీ ఆత్మ బలముగా ఉంటే దేవునినే పట్టుకుంటావు. అప్పుడు శరీర క్రియలను చంపివేస్తావు.

నీ ఆత్మలో బలము పొందాలి అంటే ఉపవాసము, ప్రార్థన మరియు దేవుని వాక్యమును ధ్యానించుట అనేది నియమములు.

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను – 3 యోహాను 1:2.

నీ ఆత్మ వర్థిల్లుతుంటే అనగా బలము కలిగి ఉంటే, నీవు వర్థిల్లుతుంటావు మరియు సౌఖ్యముగా ఉంటావు. ఉన్నచోటే ఉండవు, ఖచ్చితముగా ముందుకు అభివృద్ధి చెందే జీవితము కలిగి ఉంటావు. నీవు వివేకము కలిగి ఉంటే ఆత్మను బలపరచుకో. అప్పుడే నీకొరకు సింహాసనము సిద్ధపరచబతుంది.

అందుకే ద్వితీయోపదేశకాండము లో ఒక మాట చెప్పబడింది. జీవము మరణము రెండూ నీ యెదుట ఉన్నాయి. ఏమి కోరుకుంటావు? నీ దేవుడు మాత్రము జీవమునే కోరుకోమని చెప్తున్నాడు.