22-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ దినమున మన అందరినీ తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే సమస్త ఘనత, మహిమ కలుగును గాక. గడచిన దినములు అన్నీ ప్రభువు యొక్క కృపయే సంతోషింపచేసింది. ఆ దేవుని కృపను బట్టే మనము ఈరోజున ఆయనను స్తుతించవలసి ఉంది. మన స్తుతికి కారణభూతుడు మన దేవుడే, అనగా మనము స్తుతించగలడానికి కారణము ఆయనే.

పౌలు సీలలు బందీలుగా ఉన్నప్పుడు, వారి శరీరము నలగగొట్టబడి వేదన కరమైన పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ వారి ఆత్మ మాత్రము దేవునిలో ఎంతో సంతోషముగా ఉందిగనుక వారు స్తుతిగానములు చేసినవారుగా ఉన్నారు. మన క్రియలే మనము దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియచేసేవిగా ఉన్నాయి.

అపవాది లక్ష్యము ఏమిటి అంటే, మనలను దేవునిని స్తుతించకుండా ఉంచడమే! ఎలాగైనా మనలను తప్పించడానికి, దేవుని సన్నిధిని నష్టపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. మన కళ్ళముందు ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఆలోచనలు పుట్టిస్తాడు. అయితే దేవుని నమ్మి నిలబడేవారు ఆ ఉచ్చులలో పడరు.

యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము – 2 సమూయేలు 7:28

దేవుని వాక్యము చదివినప్పుడు అది నీకొరకే అని తీసుకున్నపుడే దానిలోని జీవము నీ జీవితమును స్థిరపరుస్తుంది. అది హెచ్చరిక వాక్యము అయితే మరింత జాగ్రత్తగా గమనించి నిలబడాలి. మన దైనందిన పరిస్థితులలో మన మనస్సాక్షి మనలను గద్దించే అనుభవము కలిగి ఉన్నట్టయితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అప్పుడు మనము లోబడినప్పుడు మనకు మేలు.

దావీదు మాటలను చూస్తే, “మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము”. అని చెప్పుచున్నాడు. చెప్పిన వాడి యొక్క గుణలక్షణములను బట్టి దావీదు సత్యముగా నమ్ముతున్నాడు. మన జీవితములో కూడా ఎప్పుడైతే, దేవుని వాక్కును సత్యముగా నమ్మి తీసుకుంటామో, అప్పుడు మనము ఆ వాక్యము యొక్క శక్తిని అనుభవించగలుగుతాము.

కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు – 2 సమూయేలు 7:22

దావీదు యొక్క ముందు తరములలో అనగా అబ్రహాము మొదలుకొని చూసినప్పుడు, వినిన దానిని బట్టి ఆయన తప్ప మరెవ్వరూ లేరు అని చెప్పుచున్నాడు. మనకైతే, ఇంతవరకు మనము దేవుని వలన అనుభవించిన దానిని బట్టి, మన దేవుడు తప్ప మరెవరూ లేరు అనే సత్యము మనము ఎరిగి ఉన్నాము.

వినిన దానిని బట్టి దావీదు హృదయానుసారుడు అయితే, ఆయన మేలులను అనుభవించిన మనము ఆయనతో ఏకమైపోవాలి.

నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది – 2 సమూయేలు 7:23

ఈ వాక్యములో నీ జీవితము కనబడినట్టయితే, నీవు దేవునిని స్తుతించకుండా ఉండలేవు. అక్కడ “నీకు”
, “నీ జనులు” అనే చోట మీ మీ పేర్లు పెట్టుకొని ఒక్కసారి ఈ వాక్యము చదివితే, ఆ నీవు అనుభవించిన దేవునిని కృపను జ్ఞాపకము చేసుకోగలుగుతాము. ఈ లోకమునుండి, దాని అధికారము నుండి అధికారమునుండి, బంధకములనుండి మిమ్ములని విమోచించి, ఆయన నామము నిన్ను బట్టి ఘనపరచబడులాగున నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, ఎంత ధన్యమైన జీవితము మనది? అందుకే మన జీవితము ప్రభువు ఏర్పరుచుకున్నాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు.

నీ ద్వారా దేవుడు భీకరమైన కార్యములు చేయబోతున్నాడు! దానికొరకే నిన్ను ఏర్పరచుకుని నిన్ను విమోచించుకున్నాడు. ఈ సత్యము ఎరిగినట్టయితే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనేపాటివాడను? అని దేవుని యెదుట తగ్గించుకుని, ఆయనను ఘనపరచగలుగుతావు. దాని కొరకు నీవు ఈ సత్యములో నిలబడి, కనిపెట్టుకోవాలి.

మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి – 2 సమూయేలు 7:24

మరియు యెహోవావైన నీవు నాకు దేవుడవైయుండి, నేను నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా నన్ను నిర్ధారణ చేసితివి – అని నీ పేరు పెట్టుకొని దేవుని కృపను గ్రహించు. నీ జీవితము ఎంత గొప్పదో అప్పుడు నీకు అర్థము అవుతుంది. నీ వద్ద సామర్థ్యము లేకపోయినా, నీవు కలిగి ఉన్న నీ దేవుడు సమర్థుడు, ఆయనకు సమస్తము సాధ్యమే.

ఇది నీ జీవితములో ఎదో ఒక్కసారి జరిగేది కాదు గానీ, నిత్యము నీవు దేవుని కొరకు ఉండునట్లుగా ఏర్పరచబడ్డావు గనుక నీ జీవితములో అద్భుతము వెంబడి అద్భుతము జరగవలసినదే!

నీ ద్వారా ఆయనకు ఖ్యాతి కలుగునట్లు, నీ ద్వారా భీకరమైన కార్యములు జరుగునట్లు, నీవు ఏర్పరచబడి, విమోచించబడ్డావు. ఇది ఒక్కసారి కొరకు కాదు గానీ, నిత్యము జరుగునట్లుగా ఏర్పరచబడ్డావు.

ఈ సత్యమును బట్టి ఈ దినము మనము దేవునిని స్తుతిద్దాము, ఆరాధిద్దాము.

 

ఆరాధన గీతము

తరతరములు ఉన్నవాడవు

 

వారము కొరకైన వాక్యము

ఇస్సాకు దేవుడు నిర్ణయించిన స్థలములో విత్తనము వేసి నూరంతల ఫలము పొందినవాడుగా ఉన్నాడు. అది కరువుగా ఉన్న సమయము అయినప్పటికీ విత్తనము వేసి సమృద్ధిని పొందుకున్నాడు. మన మందిరము దేవుడు నిర్ణయించిన స్థలము, దానిలో నిలబడి మనము ఆరాధించినపుడు ఏమి జరుగుతుంది? ఇస్సాకు విషయములో కరువుగా ఉన్నది సమృద్ధిగా మార్చడింది అంటే, మన మందిరము విషయములో అయితే – దుఃఖమంతా సంతోషముగా మార్చబడుతుంది.

ముప్పదంతలు, అరువదంతలు మరియు నూరంతలు అయిన ఆశీర్వాదములు గా మనము చూస్తే, చిన్న కార్యములు, దానికన్నా గొప్ప కార్యములు మరియు భీకరమైన కార్యములు దేవుడు జరిగించువాడు అనే రివలేషన్ మనము అర్థము చేసుకోగలము.

మందసము మొట్టమొదట గుడారాలలో ఉండేది. అటు తరువాత మరికొన్ని ప్రదేశములలో ఉంటూ వచ్చి చివరికి శాశ్వతమైన ప్రదేశములోనికి స్థిరపరచబడింది. ఇంతవరకు దేవుడు మనము ఆరాధించిన స్థలము కూడా ప్రభువు దయచేసినదే గనుక, దేవుని మందసము ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ మందసమును బట్టి ఆశీర్వాదము ఖచ్చితముగా కలుగుతుంది.

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము – 1 థెస్సలొనీకయులకు 5:16

“మీ విషయములో” అనగా నీ జీవితమునకు సంబంధించిన ప్రతీ విషయములో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఈలాగు చేయుట దేవుని చిత్తము అయి ఉన్నది.

మన దినము ఉదయాన లేచిన వెంటనే, మొట్టమొదట నీవు జ్ఞాపకము చేసుకోవలసినది ఏమిటి అంటే – ప్రభువా నీవు ఈ దినము కొరకు నీవు దాచిన కృపను బట్టి నీకే స్తోత్రము అని ఆయనకు స్తుతి చెల్లించాలి.

ప్రతీ ఉదయము మనకు ఆయన కృప, ప్రతీ రాత్రి ఆయన విశ్వాస్యత కనపరచేవాడుగా మన దేవుడు ఉన్నాడు. పడుకునే ముందు, మరలా ఆయన చూపిన కృపకొరకు స్తోత్రము చెల్లించి, రాత్రి కనపరచబోయే విశ్వాస్యతను బట్టి కృతజ్ఞతా పూర్వకముగా ప్రార్థించాలి. మనము ఆత్మీయముగా బలముగా ఉన్నప్పుడే శారీరకమైన ఆశీర్వాదములు, మేలులు అనుభవించగలుగుతాము.

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి – ఫిలిప్పీయులకు 4:6

ఏ పరిస్థితి అయినా సరే, ప్రార్థన మరియు విజ్ఞాపన మనము చేయాలి అలాగే మనము చేసేవారిగా కూడా ఉంటాము. అయితే, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి, అప్పుడు ఏమి జరుగుతుంది అంటే –

అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును – ఫిలిప్పీయులకు 4:7

ఎప్పుడైతే మనము కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేస్తామో అప్పుడు, ఏ విషయము గూర్చి నీవు ప్రార్థన చేస్తున్నావో దాని గూర్చి నీవు కలిగిన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విషయము ఏమిటి అంటె, యేసుక్రీస్తు వలన మాత్రమే ఇది మనము పొందగలము. ఆయన లేకుండా ఇది సాధ్యము కాదు.

ప్రభువు పస్కా సమయములో గలిలయ దాటి అద్దరికి వెళ్ళినపుడు అనేక జన సమూహములు ఆయన వద్దకు వచ్చారు. ఆ సమయములో వారికి భుజించుటకు ఏమైనా పెట్టాలి అని యేసయ్య ఫిలిప్పుతో మాటలాడినపుడు. తాను శరీరము ప్రకారముగా ఆలోచించి వీరందరికీ భోజనము పెట్టాలి అంటే అది అసాధ్యము అని చెప్పాదు.

యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి – యోహాను 6: 10

ప్రజలు కూర్చున్నారు అంటే, అక్కడ వారికి భోజనము పెట్టాలి. అయితే ప్రభువు ఏమి చింతపడకుడా, ఆ రొట్టె పట్టుకొని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, దేవునికి విజ్ఞాపన చేసి, విరిచి వడ్డించాడు.

అనగా అసాధ్యమైన పరిస్థితులలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించినపుడు, సమస్తము సాధ్యము అవుతుంది. లోకములో చూస్తే ఐదువేల మంది ఉన్నపుడు, అక్కడ భోజనము సిద్ధపరిచిన తరువాత పంక్తిలో కూర్చుంటారు. అయితే ఇక్కడ ఇంకా భోజనము సిద్ధపరచబడకమునుపే పంక్తిలో కూర్చున్నారు. ఈ భాగము మనము మన జీవితములో ఎలా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలో మనకు నేర్పుతుంది

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. – రోమా 8:28

మన నూతన మందిరము విషయములో చూస్తే, అది దేవుని సంకల్పము. అక్కడ మేలు జరుగుట అంటే ఆ మందిరము కట్టబడుటయే కదా! మన వద్ద ఏమీ లేనప్పుడు శూన్యములో నుండి సమస్తము సృష్టించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుని బట్టి సమస్తము సమకూడుతుంది అని అర్థము.

అదే విధముగా పునాది మొదలుకొని, ఇంతవరకు కూడా సమయానికి తగిన సహాయము సమకూర్చబడింది. గనుక మొదట మనము తీర్మానము తీసుకోవాలి. మన శక్తిని మనము చూసినపుడు భయపడి తీర్మానము తీసుకోలేము గానీ, దేవునిని గూర్చి మనము ఎరిగి ఉన్న దానిని బట్టే తీర్మానము తీసుకొంటాము.

లాజరును లేపేవిషయములో కూడా ప్రభువు చింతపడలేదు గానీ, కృతజ్ఞతా పూర్వకముగా ఆయన తండ్రికి ప్రార్థించి మృతమైన లాజరును బ్రతికించాడు. గనుక మనము విశ్వాసమునకు, మన కృతజ్ఞతాపూర్వక ఆరాధనకు, ప్రార్థనకు దేవునియొక్క శక్తియే ఆధారము. గనుక మనము ఎల్లప్పుడూ ఈ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట మనము దినదినము అభ్యాసము చేయాలి.

“నీ విషయములో” అని నువ్వే కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అని ప్రభువు ఎందుకు చెప్పుచున్నాడు? ఆయన జనులగునట్లు, ఆయనకు ఖ్యాతి కలుగునట్లు ఆయన నిన్ను విమోచించాడు, గనుక నీవు మాత్రమే కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. నీ జీవితమును ఆయన కోరుకుంటున్నాడు.

దేవునిని ప్రశ్నించే హృదయము మనము కలిగి ఉండకూడదు. ఎందుకు అంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఈ సత్యము ఎరిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యము.