22-03-2026 – ఆదివారము మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మనల్ని అందరిని కూడా ఆయన సన్నిధిలో క్షేమంగా నిలబెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లిస్తున్నాను. మనము దేవుని స్తుతించడానికి, దేవుని మహిమ పరచడానికి ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి రావాలి. సిద్ధపాటు లేకుండా దేవుని ఆరాధన చేయడం అసంపూర్ణంగా ఉంటుంది. సత్యాన్ని గ్రహించిన వారు మాత్రమే హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతారు. దేవుడు ఏమై ఉన్నాడో అది మనము తెలుసుకున్నప్పుడు, ఆయన కృప ఏ రీతిగా మన జీవితంలో కనపరచబడుతుందో గుర్తించినప్పుడు, నిజంగా హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాం. ఇది వేరే వారి జీవితాలను పరీక్ష చేయడం కాదు — నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు నీకే తెలుస్తుంది. అందుకోసమే ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. నీ జీవితంలో ఆయన చేసిన మేలులు, నీ జీవితంలో ఆయన చూపిస్తున్న కృప — వాటిని మీరు పరీక్ష చేసుకుంటేనే గాని ఆయన ప్రేమ ఏంటో తెలియదు. ఆయన నిత్యము ప్రేమించే వాడే. కానీ ఆ ప్రేమ ఏ రీతిగా నీ యెడల కనపరచబడుతుందో మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మాత్రమే హృదయపూర్వకమైన ఆరాధన చేయగలుగుతాం. శారీరకంగా బలహీనపడినా ఆత్మలో మాత్రం దిన దినమూ దేవునికి స్తోత్రం. ఆత్మీయమైన జీవితంలో బలహీనత కనపరచబడకపోవడానికి గల కారణం ఆయన మన యెడల కనపరుస్తున్న ప్రేమ మాత్రమే. దేవుడు వెంబడించుటలో మనం ఎక్కడ కూడా బలహీనపరచబడకూడదు. దినాలు గతించిపోతున్నాయి — కానీ ఆత్మలో బలవంతులముగా ఉండాలి.
ఎఫెసీయులకు 2:1-2 మీరు మీ అపరాధములయందును పాపములయందును చనిపోయినవారై యుండగా ఆయన మిమ్మును బ్రదికించెను; వాటియందు మీరు ఒకప్పుడు ఈ లోకపు రీతిని అనుసరించి, అంతరిక్షమునందు అధికారముగలవాని అనగా అవిధేయులైనవారి యందు ఇప్పుడు కార్యసాధకమగు ఆత్మ అధిపతిని అనుసరించి నడుచుకొంటిరి.
మనం మునుపు పాపం వలన చచ్చిన వారమై, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. అయినప్పటికీ కూడా ఆయన తన ప్రేమను మన యెడల కనపరిచాడు.
ఎఫెసీయులకు 2:5 మనము పాపముల చేత చనిపోయినవారమై యున్నను క్రీస్తుతో కూడ మనలను బ్రదికించెను; కృప చేత మీరు రక్షింపబడియున్నారు.
మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మునుపు జీవం లేని జీవితాలు జీవించాం — ఇప్పుడు క్రీస్తు ద్వారా జీవం కలిగిన వారమయ్యాం. నన్ను జీవింపజేశావు — చాలు నాకు. ఆరాధన అంటే ఆయన నామానికి ఘనపరచడం మాత్రమే. ఆరాధన చేసే సమయంలో ప్రార్థన విన్నపాలు చెప్పకూడదు. ప్రార్థన వేరు — ఆరాధన వేరు. ఆరాధన అనేది నీ స్థితిలో ఆయన ప్రేమ ఏ విధంగా కనపరుస్తున్నాడో, దాన్ని ఒప్పుకోవడం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయం నుంచి ఆరాధన వస్తుంది — కన్నీళ్లు ఆగవు, శరీరం తట్టుకోలేదు. ఇదే యదార్థమైన ఆరాధన. ఆయన మన కొరకు తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. ఆదిమ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెపిల్ల మీద పాపి చెయ్యి ఉంచినప్పుడు పాపం అక్కడికి బదిలీ అయి జీవం ఇక్కడికి వచ్చేది. అదే రీతిగా యేసుక్రీస్తు మన కొరకే బలి అయిన గొర్రెపిల్ల. ఆ శరీరాన్ని స్వీకరించినప్పుడు “ఈ శరీరాన్ని బట్టి నేను జీవమై ఉన్నాను” అని నమ్మికతో ఒప్పుకుంటాం. ఏమి ఇవ్వగలుగుతాను నీ ఎనలేని ప్రేమకు — విరిగి నలిగిన హృదయమే నిన్ను అర్పించెద.
రోమీయులకు 8:30 మరియు ఆయన ముందుగా నిర్ణయించినవారిని పిలిచెను; పిలిచినవారిని నీతిమంతులుగా తీర్చెను; నీతిమంతులుగా తీర్చినవారిని మహిమపరచెను.
దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి పిలిచాడు. ఇతరులతో పోల్చుకొని కృంగిపోకూడదు. 50 మంది గుంపులో నీకంటే ముందు ఉన్నారేమో — కానీ ఆ 50 మందిని పిలిచిన వాడు ఆయనే, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాడి ఆరంభం కూడా ఇక్కడి నుంచే. ఈరోజు లాస్ట్ లో ఉన్నావేమో — వన్ డే నీ స్థానం కూడా అదే. ఆయన నామ మహిమ కొరకై నీ స్థితి మార్చబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
  • 1️⃣ సిద్ధపాటుతో దేవుని ఆరాధించాలి హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధికి రావాలి. సత్యాన్ని గ్రహించి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడు మాత్రమే హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాం.
  • 2️⃣ ఆరాధన అనేది వ్యక్తిగతమైనది నీ జీవితంలో ఆయన చూపిన మేలులు, కృపను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడే ఆయన ప్రేమ తెలుస్తుంది. వేరే వారితో పోల్చుకోవడం కాదు — నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవడమే అసలైన ఆరాధనకు మొదటి అడుగు.
  • 3️⃣ క్రీస్తు మనల్ని జీవింపజేశాడు మనం పాపం వలన చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఈరోజు మనం జీవంతో ఉన్నాం అంటే అది ఆయన ప్రేమ మాత్రమే. మునుపు ఉన్నట్టు మనం ఇప్పుడు ఉండటానికి లేదు — కృతజ్ఞతా హృదయంతో ఆయనను మహిమ పరచాలి.
  • 4️⃣ ఆరాధన మరియు ప్రార్థన వేరు ఆరాధన చేసే సందర్భంలో విన్నపాలు చెప్పకూడదు. ఆరాధన అనేది ఆయన నామానికి ఘనపరచడం మాత్రమే. ఆయన కృప, ప్రేమను జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే నిజమైన ఆరాధన.
  • 5️⃣ పిలవబడిన గుంపులో నువ్వు ఉన్నావు ఇతరులతో పోల్చుకొని నిరాశ పడకూడదు. దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించి పిలిచాడు. ఆయన నామ మహిమ కొరకై నీ స్థితి మార్చబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనను పట్టుకొని వెంబడించే వాడివై ముందుకు సాగు.

వారము కొరకైన వాక్యము

దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మనల్ని అందరిని కూడా ఆయన సన్నిధిలో క్షేమంగా నిలబెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లిస్తున్నాను. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన నడిపించే వారు దేవుని ఆత్మ చేత నడిపించబడే వారుగా ఉండాలి. ఎలా పడితే అలా వచ్చేసి నిలబడటం దేవునికి మహిమ కాదు. ఆరాధన పరిచర్య ఒక స్టేజ్ షో కాదు — ఇది అత్యంత పవిత్రమైనది. ఆరు దినాలు వేచి ఉండిన తర్వాత ఈ ఒక్క దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థన లేకుండా దేవుని సన్నిధిలో నిలబడటం చాలా వేదనకరమైనది. ఆరాధన మన జీవితాన్ని ఒక కవచంలా కప్పి ఉంచుతుంది. ఇశ్రాయేలుకు ఐరన్ డోమ్ ఎంతటి శత్రువు దాడులు వచ్చినా సరే కాపాడినట్టు, ఈ ఆరాధన మన జీవితాన్ని శత్రువు నుండి కాపాడేదిగా ఉంటుంది. ఈ ఆరాధన మన తర్వాతి ఆరు దినాలను సిద్ధపరచి నిలబెట్టేదిగా ఉంటుంది. ఈ ఆరాధన లేకపోతే మన జీవితం క్షేమంగా ఉండదు. ఇది అనుభవంతో చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని నిత్యం చదవాలి. పాత నిబంధనలో ఐదు అధ్యాయాలు, కొత్త నిబంధనలో ఐదు అధ్యాయాలు — వారానికి ఒక్కొక్కటి చదవడం మొదలుపెట్టాలి. రోజుకు ఒక అధ్యాయం గట్టిగా చదివితే కేవలం 15-20 నిముషాలు చాలు. 24 గంటలు దేవుడు మనలను కాపాడుతున్నాడు — మనం ఆయనకు 15-20 నిముషాలు ఇవ్వలేమా? ఆచారయుక్తమైన భక్తి మనకు ఏ పరిస్థితిలోనూ ప్రయోజనం లేదు. వాక్యం లేకుండా మన జీవితం నిలబడదు. రాబోయే ఆపదల నుండి తప్పించబడాలంటే వాక్య జ్ఞానం అవసరం. నీ ఆత్మ వెలిగించబడాలంటే వాక్యాన్ని నెమరు వేయాలి — అందులో నుంచి శక్తి వస్తుంది. అద్భుతం కోసం పరిగెత్తకు — ఆయనను వెంబడించు. అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని రావడం టెంపరరీ. శ్రమ తర్వాత మళ్లీ శ్రమ వస్తే అప్పుడు ఏం చేస్తావ్? ఆయనను వెంబడిస్తే దేవుడే నీ జీవితాన్ని అన్ని వైపుల నుంచి నడిపిస్తాడు. దేవుడు తన దృష్టికి అనుకూలమైన మనస్సు కలిగి ఆయన చిత్తానుసారం నడుచుకునే వారికి దేవుడుగా ఉంటాడు. ఆ కండిషన్ కలిగి ఉన్న వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడు.
రోమీయులకు 8:30 మరియు ఆయన ముందుగా నిర్ణయించినవారిని పిలిచెను; పిలిచినవారిని నీతిమంతులుగా తీర్చెను; నీతిమంతులుగా తీర్చినవారిని మహిమపరచెను.
దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి పిలిచాడు. మీరందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. ఆ ఎన్నిక చాలా శక్తివంతమైనది. ఒకసారి దావీదు జీవితాన్ని పరిశీలిద్దాం — ఆ దావీదు స్థానంలో మీ పేరు పెట్టుకోండి.
మొదటి సమూయేలు 16:12-13 అతనికి వర్తమానం పంపి అతనిని లోపలికి తీసుకొని రప్పించగా అతడు ఎరుపురంగు గలవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూపులకు సుందరమైన వాడునై ఉండెను. అప్పుడు యెహోవా — లేచి ఇతని అభిషేకించుము, ఇతడే అని సెలవిచ్చెను. సమూయేలు సీసా నుండి నూనె తీసి వాని సహోదరుల మధ్య వానికి అభిషేకించెను. యెహోవా ఆత్మ ఆ దినము మొదలుకొని దావీదు మీదికి బలముగా వచ్చెను.
ఎన్నిక చేయబడిన తర్వాత దేవుని ఆత్మ ఆ దినం నుండి చాలా బలంగా దిగి వచ్చిందంట. దావీదు ఎక్కడ ఉన్నాడు? పట్టణంలో సంగీత విద్వాంసుల దగ్గర కాదు — ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాచుకుంటున్నాడు. కానీ ఆ అడవిలో ఉన్న వాడి గురించిన సత్యము పట్టణంలో వినిపించబడింది. ఇది దేవుని ఆత్మ యొక్క కార్యం. నువ్వు ఎక్కడో మరుగున పడిపోయినా సరే — ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను తెలియపరచేవాడిగా ఉంటాడు.
మొదటి సమూయేలు 16:14-18 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను; యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపించుచుండెను. సౌలు సేవకులు అతనితో — దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి యున్నది; సీతారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము; దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సీతారా వాయించుట చేత నీవు బాగుపడుదువు అని అనిరి. వారిలో ఒకడు — బెత్లెహేమీడైన యెష్షయి కుమారులలో ఒకని చూచితిని; అతడు సీతారా చమత్కారముగా వాయింపగలడు; అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియు అయియున్నాడు; మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అనెను.
ఇక్కడ గమనించండి — సౌలు జీవితంలో ఒక దురాత్మ పట్టింది. ఆ దురాత్మ నుంచి విడుదల కోసం పట్టణమంతా వెతికారు. కానీ వెతికినప్పుడు ఎవరు దొరికాడు? ఎక్కడో అడవిలో ఉన్న దావీదు. ఇది దావీదు అడవి నుండి పట్టణానికి రావడానికి దేవుడు సృష్టించిన సన్నివేశం. దేవుడు ఎన్నిక చేసుకున్న వాడిని వెలుగులోకి తీసుకురావడానికి కొన్ని పరిస్థితులు సృష్టించబడతాయి. దావీదుకు ఉన్న టాలెంట్ ని బయటికి తేవడానికి ఈ సీన్ క్రియేట్ అయింది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ఆ సామర్థ్యం ద్వారా దేవుని నామం మహిమ పరచబడటానికి అవకాశాలు కలుగజేయబడతాయి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో — ఆ వెనక పెద్ద ఉద్దేశం ఉంది. ఇది వాష్‌రూమ్ కడిగే పనైనా సరే, తుడిచే పనైనా సరే — దేవుని పని అన్నది ఏదైనా చాలా భాగ్యంతో చేయాలి. దాని వెనక శాశ్వతమైన ఆశీర్వాదం దాచబడి ఉంటది. తగ్గించుకుంటే నీ తరాలు హెచ్చించబడతాయి.
మొదటి సమూయేలు 17:45-47 దావీదు ఫిలిష్తీయునితో — నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు; అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల దేవుడగు సేనల యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమందు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల నరకివేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకనివాసులందరు తెలిసికొనుదురు. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని యీ దండువారందరు తెలిసికొందురు అని చెప్పెను.
గొలియాత్ ఎపిసోడ్ 40 రోజులు వేచి ఉండింది — దావీదు వచ్చిన తర్వాతనే కదిలింది. దావీదు వచ్చే వరకు ఒక్క అంగుళమూ కదలలేదు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు — దావీదు కొరకే ఆ యుద్ధం ఏర్పాటు చేయబడింది. దావీదు నామాన్ని ఈ లోకానికి పరిచయం చేయడానికే ఆ పరిస్థితి సృష్టించబడింది. అప్పటివరకు కత్తులు, ఈటలతో జరిగిన యుద్ధంలో దావీదు ద్వారా ఒక నూతనమైనది లోకానికి పరిచయమైంది — యెహోవా నామంలో ఉన్న శక్తి. నీ ఎన్నిక ద్వారా కూడా సంథింగ్ న్యూ ఈ లోకానికి పరిచయమవుతుంది. నీ ముందు పెద్ద సవాళ్లు వచ్చినప్పుడు భయపడకు. నీ నామాన్ని వెల్లడిపరచడానికే ఆ పరిస్థితి నీ ముందు ఉంచబడింది. దావీదు నాచురల్‌గా దేవుని వెంబడించే వాడిగా ఉన్నాడు — రోషం కలిగి లేచి నిలబడ్డాడు. నువ్వు కూడా ఎదురైన ప్రతి పరిస్థితిలో కృంగిపోకుండా రోషం కలిగి నిలబడితే నీ నామం కూడా కనపరచబడుతుంది.
మొదటి సమూయేలు 18:13-14 కాబట్టి సౌలు అతని తన యొద్ద ఉంచుకొనక అతని సహస్రాధిపతిగా చేసెను; అతడు ప్రజలకు ముందు నిలచి వెళ్లుచు వచ్చుచు ఉండెను. దావీదు తన ప్రవర్తనలో వివేకముగా నడుచుకొనెను; యెహోవా అతనికి తోడుగా ఉండెను.
అడవిలో ఉన్న దావీదు ముందు రాజు ఇంట్లోకి వచ్చాడు — తర్వాత యోధుల మీద అధిపతిగా నియమించబడ్డాడు — తర్వాత సహస్రాధిపతిగా అయ్యాడు. డే బై డే డేస్ గడుస్తున్నాయి. ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తుంది. దేవుని ఎన్నిక నెరవేర్చబడే వరకు ఈ ప్రక్రియ ఆగదు. సౌలు దావీదుని చంపాలని రెండుసార్లు ఈటు విసిరాడు — ఒకే గదిలో ఉండి కూడా రెండుసార్లు తప్పింది. బలశాలి అయిన సౌలు దగ్గర నుంచి వేసినా తప్పింది. కారణం ఒక్కటే — దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉంది. దేవుని మాట నెరవేర్చబడేంత వరకు దావీదు తప్పించబడతానే ఉన్నాడు.
మొదటి సమూయేలు 23:25-28 సౌలు మయోను అరణ్యములో దావీదును తరమబోయెను. సౌలు పర్వతం ఈతట్టునను దావీదును అతని జనులు పర్వతము ఆతట్టునను పోవుచుండిరి; దావీదు సౌలు నుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులు దావీదుని పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి — నీవు త్వరగా రమ్ము; ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో జరబడి ఉన్నారు అని చెప్పగా సౌలు దావీదుని తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి ఆ స్థలమునకు సెలహమ్మకోతు అని పేరు పెట్టబడెను.
సెలహమ్మకోతు అంటే “భయము నుండి విడుదల” అని అర్థం. దావీదు పట్టుబడిపోయే చివరి క్షణంలో దేవుడు ఒక దూతను పంపి సౌలును మళ్ళించాడు. నీ జీవితం ముగింపుకు వచ్చేస్తుందని అనిపించినప్పుడు, శత్రువు నిన్ను బంధించడానికి ప్రయత్నించినప్పుడు — ఆ సందర్భంలో దేవుని సహాయం అందించబడుతుంది. శత్రువు చేతికి నువ్వు దొరకవు. ఆ ఎన్నిక నెరవేర్చబడేంత వరకు ఆయన నిన్ను కాపాడతానే ఉంటాడు. ఎవరు నీ మీద ఎన్ని నెగిటివ్ ప్లాన్స్ చేసినా సరే, ఆ ప్లాన్స్ ఏవి కూడా వర్క్ కావు. దావీదు యదార్థంగా దేవుని వెంబడించాడు — ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వెనకకు తిరగలేదు. నీ కొరకు దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబడేంత వరకు ఆయన నీ పక్షంగా పని చేస్తానే ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. దావీదుకి సీతారా వాయించే సామర్థ్యం ఇచ్చాడు. నీకు ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఉండవచ్చు, పాటలు పాడే సామర్థ్యం ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు. దేవుడు ఇచ్చే సమయంలో ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే నీ జీవితం ఆశీర్వాదమే. పోగొట్టుకుంటే ఫినిష్ అవుతుంది. సౌలుకు “సదాకాలము రాజు” అనే ఆలోచన ఉండింది — కానీ ఒక అవివేక పని వలన ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. తన సంతతి కూడా పోయింది. దావీదుకు మాత్రం — నీ కడుపున పుట్టినవాడు ఆయన సింహాసనంలో ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు.
  • 1️⃣ ప్రార్థనతో సిద్ధపడి ఆరాధించాలి ఆరాధన పరిచర్య ఒక పవిత్రమైన బాధ్యత. ప్రార్థన లేకుండా దేవుని సన్నిధికి రావడం వేదనకరమైనది. ఈ ఆరాధన మన జీవితాన్ని ఐరన్ డోమ్ లాగా కవచంగా కప్పి ఉంచుతుంది — మన తర్వాతి ఆరు రోజులను సిద్ధపరచి నిలబెట్టేదిగా ఉంటుంది.
  • 2️⃣ వాక్యాన్ని నిత్యం చదివి నెమరువేయాలి రోజుకు 15-20 నిముషాలు వాక్యం చదివితే నీ ఆత్మ వెలిగించబడుతుంది. ఆచారయుక్తమైన భక్తి ప్రయోజనం లేనిది. రాబోయే ఆపదలలో నిలబడే శక్తి వాక్యం ద్వారానే వస్తుంది. ఆయనను వెంబడిస్తే అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి.
  • 3️⃣ దేవుని ఎన్నిక చాలా శక్తివంతమైనది దావీదును ఆయన ఎన్నిక చేసుకున్న నాటి నుండి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. నువ్వు ఎక్కడో మరుగున పడిపోయినా సరే — ఆ పరిశుద్ధాత్ముడు నీ ఎన్నికను స్థిరపరచడానికి వర్క్ చేస్తూనే ఉంటాడు. నీ పరిస్థితులు, నీకు ఎదురయ్యే ప్రతి విషయం వెనక దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. నువ్వు చీకటిలో ఉండటానికి పిలవబడలేదు — వెలుగులోకి తీసుకురావడానికే పిలవబడ్డావు.
  • 4️⃣ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సామర్థ్యం ఇచ్చాడు. దావీదుకు సీతారా వాయించే సామర్థ్యం ద్వారా రాజు సన్నిధికి చేర్చబడ్డాడు. వాష్‌రూమ్ కడిగే పనైనా సరే — దేవుని పనిలో ప్రతి సేవ భాగ్యమైనది. నిన్ను తగ్గించుకుంటే నీ తరాలు హెచ్చించబడతాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేయబడతావు.
  • 5️⃣ దేవుని ఆత్మ నీ ఎన్నికను కాపాడుతుంది సౌలు దావీదుని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమైంది. ఫిలిష్తీయులతో అయినా విఫలమైంది. చుట్టుముట్టిన సమయంలో కూడా దేవుడు దూతను పంపి దావీదును రక్షించాడు — ఆ స్థలానికి “భయము నుండి విడుదల” అని పేరు పెట్టబడింది. నీ జీవితంలో కూడా ఎవరు ఎన్ని నెగిటివ్ ప్లాన్స్ చేసినా సరే, ఆ ప్లాన్స్ ఏవి కూడా వర్క్ కావు — ఎందుకంటే దేవుని ఆత్మ నీ పక్షంగా పని చేస్తుంది.
  • 6️⃣ నీ ద్వారా ఈ లోకానికి నూతనమైనది పరిచయమవుతుంది దావీదు యెహోవా నామం పేరట నిలబడినప్పుడు ఒక నూతనమైన శక్తి ఈ లోకానికి పరిచయమైంది. నీ ఎన్నిక ద్వారా కూడా దేవుని గురించిన ఒక నూతనమైనది ఈ లోకానికి పరిచయమవుతుంది. నీ జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడేదిగా ఉంటుంది. ఇది ఎంత గొప్ప ధన్యత! దాని కొరకు సిద్ధపడు.