21-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా
||పావనుడా||

ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి
||దీనుడా||

ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి
||దీనుడా||

బలవంతుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి
||దీనుడా||

స్తుతిగీతము – 2

నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం
||నే యేసుని||

నా ముందు శిలువ
నా ముందు శిలువ
నా వెనుక లోకాశల్
నాదే దారి
నా మనస్సులోప్రభు
నా మనస్సులోప్రభు
నా చుట్టు విరోధుల్
నావారెవరు
నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని
||నే యేసుని||

కరువులైనను కరువులైనను
కలతలైనను కలసిరాని
కలిమి లేములు కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము
||నే యేసుని||

శ్రమయైననూ శ్రమయైననూ
బాధలైననూ హింసయైన
వస్త్రహీనత వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు
||నే యేసుని||

స్తుతిగీతము – 3

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు
||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)
||నిను||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)
||నిను||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)
||నిను||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)
||నిను||

ఆరాధన వర్తమానము

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు అని పాట పాడాము అయితే ఈ మాటలు చెప్పాలి అంటే మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నవారు మాత్రమే చెప్పగలరు.

ఆయన సన్నిధిలో ఉంటే చాలు. మన పరిస్థితులు అన్నీ దారుణముగా ఉన్నప్పుడు ప్రభువు సన్నిధిలో ఉంటే ఏమి జరుగుతుంది? “నిను స్తుతించినా చాలు” అని పాడుతున్నాము, లేఖనములలో చదువుతూ వచ్చాము. స్తుతిస్తే ఏమి జరుగుతుంది?

ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన వద్దకు చేరుతుంది. మనము ఆరాధన చేసినప్పుడు ఆయన మన స్తుతుల సింహాసనము పై ఆసీనుడగుటకు దిగివచ్చేవాడుగా ఉన్నాడు. ఆసీనుడైనవాడు రాజులకే రాజుగా ఉన్నాడు.

దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై యున్నాడు. -కీర్తనలు 47:6-8

మన స్తుతుల సింహాసనముపై ఆసీనుడైనవాడు సర్వభూమికినీ, అన్యజనులకును కూడా రాజు అయి ఉన్నాడు. మనము ఆరాధించినపుడు మనము ఆయన గూర్చి ఒప్పుకున్నదానిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు.

రాజు అనేవాడు ఏమి చేయగలడో అని ఆలోచిస్తే –

నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను. -జెకర్యా 9:8

రాజుగా ఉన్నా ఆయన నిన్ను చూసేవాడుగా ఉన్నాడు. “ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు – జెకర్యా 9:2”. ఏ విధముగా లక్ష్యపెడుతున్నాడు? అని చూస్తే, చుట్టుపక్కన ఉన్నవారు ఇశ్రాయేలీయులను బాధించుట కన్నులారా చూసినవాడుగా ఉన్నాడు. మన జీవితములో కూడా మనలను చుట్టుముట్టిన పరిస్థితులను చూసినవాడుగా ఉన్నాడు. వాటి దాడి నుండి తప్పించడానికి దేవదూతలను కావలిగా దండుపేటగా ఉంచుతున్నాడు. బాధించువారు నీ జీవితము వైపునకు రాకుండా నీ కొరకు ఒక దండుపేటగా తన దేవదూతలను నియమించేవాడుగా ఉన్నాడు, తన కార్యములను చేసేవాడుగాను, శత్రువులకు అడ్డుకట్ట వేసేవాడుగా ఉన్నాడు. దానిని దాటుకుని ఎవరూ రాలేరు.

మన దేవుడు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. ఈ సత్యమును ఎరిగి మనము ఆరాధించినపుడు, నీవు ఏ బాధింపబడిన స్థితిలో ఉన్నావో, ఆ బాధలో నీవు ఇక ఉండకుండునట్లు అటువంటి ఏ బాధా ఇంక నిన్ను చేరకుండునట్లుగా దేవుడు అడ్డుకట్ట వేసేవాడుగా ఉన్నాడు. అపవాది చేతినుండి తప్పించేవాడిగా ఉన్నాడు.

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. -యెషయా 33:22

న్యాయాధిపతిగా మన జీవితములో న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. శాసనకర్త అనగా ఖచ్చితముగా నెరవేరబడునట్లుగా శాసనమును లిఖించువాడు. నీకొరకు లిఖించబడిన శాసనము ప్రకారమే నీ జీవితములో జరుగుతుంది. రాజుగా నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. గనుకనే ఏమున్నా లేకున్నా ఆయనను స్తుతించిన చాలు.

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.౹ -జెకర్యా 9:9

నీవు సంతోషించులాగున నీ ప్రభువు నీ కొరకు శాసనమును లిఖించినవాడుగా ఉన్నాడు. దేవుని వాకును బట్టే మనము నిరీక్షణ పొందువారిగా ఉండగలుగుతాము.

నీవు కలిగి ఉన్నదానిలో కలిగిన నష్టము కొరకు న్యాయము తీర్చేవాడు న్యాయాధిపతి. దాని ప్రకారముగా జరుగులాగున నీ భవిష్యత్తు కొరకు శాసనములను లిఖించువాడు శాసన కర్త. నీ జీవితములో శత్రువు ప్రవేశించకుండునట్లు ఆయన ఒక దండుపేట నీ కొరకు ఏర్పాటు చేసేవాడు రాజు. కొండమీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. అలాగే ఉన్నతమైన స్థితిలో నీ జీవితము ఉంటుంది. అలాగే అది కనుపరచబడేది గా ఉంటుంది.

ఈ సత్యము నీవు నమ్మితే ఖచ్చితముగా ఆరాధన చేయాలి. ఆరాధన ఎంతో బలమైనది శక్తి కలది. నీ దేవుని గూర్చి నీవు ఒప్పుకున్నది ప్రత్యక్షపరచబడుతుంది.

ఆరాధన గీతము

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు
||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
||నిను||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
||నిను||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
||నిను||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
||నిను||

 

వారము కొరకైన వాక్యము

మన జీవితములను తన కొరకు సాక్ష్యముగా మార్చుకొనేవాడు మన దేవుడు. శత్రువు ఇంక మనలను బాధించే అవకాశము లేదు. శత్రువు నా జీవితము లాక్కుపోతాడేమో, అని భయపడవలసిన అవసరము లేదు. ఈరోజు మీరు చేసిన ఆరాధన నీవు ఒప్పుకున్న సత్యమును నెరవేర్చి స్థిరపరుస్తుంది.

ఈరోజు “జనములముందు నీవు సాక్షివై ఉందువు” అనే విషయమును గూర్చి మనము నేర్చుకుందాము. ప్రభువు ఉద్దేశ్యము నిన్ను సాక్షిగా నిలబెట్టడము. ఏ విధముగా మనము సిద్ధపడితే ఆయనకు సాక్ష్యముగా ఉంటామో నేర్చుకుందాము.

యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. -లూకా 7:9

ఇక్కడ యేసయ్య ఎవరిగురించి సాక్ష్యమిస్తున్నాడో ఆ వ్యక్తి ఏమి చేసినదానిని బట్టి ఆ సాక్ష్యము పొందుకున్నాడు? మనకు కూడా దేవునికొరకు సాక్ష్యముగా ఉండాలి అనే ఆశ ఉంటుంది. అయితే ఏమి చేస్తే మనము కూడా ఆ సాక్ష్యము పొందుకుంటాము?

ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. -లూకా 7:2

శతాధిపతి జీవితము ద్వారా ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అతని వద్ద పనిచేసే ప్రియమైన దాసుడు రోగియై చావ సిద్ధముగా ఉన్నాడు. ఆ పరిస్థితులలో శతాధిపతి ఏమి చేసాడు అంటే –

శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. -లూకా 7:3

యూదుల పెద్దలు శతాధిపతి గురించి చెప్పుచున్న సాక్ష్యము చూస్తే –

వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. -లూకా 7:4-5

శతాధిపతి మందిరము కట్టించాడు అంటే, దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, తన ప్రేమను క్రియల రూపములో కనపరచాడు. మనము ఎలా ఉన్నాము? దేవుని గూర్చిన ప్రేమను క్రియలలో కనుపరుస్తున్నామా?

అలాగే దొర్కా అనే చిన్నది చనిపోయినప్పుడు తనను గూర్చిన మంచి విషయములను గూర్చి ఇతరులచే సాక్ష్యము పొందుకున్నది. దొర్కా కూడా దేవుని ప్రేమించి అనేకమైన కార్యములు చేసినది, తాను మరణించినతరువాత ఆ క్రియలను గూర్చి సాక్ష్యముగా చెప్పబడుతున్నాయి.

నిజముగా మనము కూడా దేవునిని ప్రేమించేవారమైతే, ఆ ప్రేమను క్రియలలో కనుపరచినట్లయితే, ఖచ్చితముగా దేవుని సాక్ష్యమును పొందుకుంటాము, ఆ సాక్ష్యమును పొందుటకు యోగ్యుడుగా చేయబడతాము. మన గత జీవితము మన భవిష్యత్తును స్థిరపరచేదిగా ఉంది.

కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. -లూకా 7:6

“కావున” అంటే, ఆ శతాధిపతి గూర్చి చెప్పబడిన సాక్ష్యమును బట్టి అని అర్థము. ఆ సాక్ష్యమును బట్టి యేసు వారితో కూడా వెళ్ళినవాడుగా ఉన్నాయి. మనము కూడా దేవుని ప్రేమించి చేసిన క్రియలు, దేవుని అద్భుతము పొందుకొనుటకు నిన్న్ను యోగ్యునిగా చేస్తాయి.

శతాధిపతి ఇంటికి వెళ్ళినప్పుడు “నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను” అని చెప్పాడు. ఇప్పుడు యేసయ్య యెదుట తన యొక్క తగ్గింపు స్వభావమును కనపరచాడు. ఈ తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది.

క్రీస్తు యేసునకు కలిగిని ఈ మనస్సు గూర్చి ఉదయమున మనము నేర్చుకున్నాము. ఇక్కడ శతాధిపతి కూడా యేసయ్య యెదుట తనను తాను తగ్గించుకున్నాడు.

తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. -లూకా 14:11

ఇది దేవుడు పెట్టిన నియమము. తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. శతాధిపతికి జనములముందు సాక్ష్యము పొందుకోవడానికి కారణము తన తగ్గింపు స్వభావమే! దేవుని సన్నిధిలో విధేయత కలవారమై, ఆ మాటలు నెరవేర్చుట యందునూ విధేయత కనపరచాలి. యేసయ్యకూడా తనను తగ్గించుకొనే స్వభావము కలవాడు.

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹ మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹ -ఫిలిప్పీయులకు 2:5-8

యేసయ్య తనను తాను తగ్గించుకున్నందున హెచ్చించబడ్డాడు –

అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. -ఫిలిప్పీయులకు 2:9-11

హెచ్చులకు పోతే మనము పడిపోవునట్లు ఉచ్చులు బిగించబడతాయి. గనుక ఎల్లప్పుడూ మనము తగ్గింపు కలిగినవారుగానే ఉండాలి. ఇంతకు ముందు ఎక్కడైనా నన్ను నేను హెచ్చించుకుంటే నన్ను క్షమించండి అని ప్రభువును అడుగుదాము.

అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, -లూకా 7:7

శతాధిపతి చెప్పుచున్న మాటలు చూస్తే, “మాటమాత్రము సెలవిమ్ము” అంటున్నాడు. అంటే, యేసయ్య మాట సెలవిస్తే చాలు అలా జరుగుతుంది అని నమ్మాడు. అంతకు ముందు యేసయ్య గూర్చి ఆయన చేతులు ఉంచగానే స్వస్థత కలిగింది అని విన్నాడు. అయితే ఇప్పుడు యేసయ్యను గుర్తించినవాడుగా ఉన్నాడు అందుకే, నీ మాట మాత్రము చాలు ప్రభువా అని చెప్పుచున్నాడు.

నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. -లూకా 7:8

ఈ మాటలను బట్టి శతాధిపతి యేసయ్యలో గుర్తించాడు అంటే, యేసయ్య అధికారము కలిగినవాడు అని గుర్తించాడు. యేసయ్య మరణము మీద అధికారము కలిగినవాడుగా గుర్తించాడు. అధికారము కలవాడు ఒక మాట పలకగానే ఆ ప్రకారముగా జరగవలసినదే!

మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి -ఆదికాండము 22:4-5

ఇక్కడ అబ్రహాము మరలా మీ యొద్దకు వస్తాము అని ఎలా చెప్పగలిగాడు? ఊరకనే చెప్పలేదు గానీ, తన దేవుడు మృతులను సహితము లేపగలవాడు అని గుర్తించినవాడుగా ఉన్నాడు. లేని వాటిని ఉన్నదానివలే చేయువాడు అని గుర్తించినవాడుగా ఉన్నాడు.

మనము కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడొ గుర్తిస్తే కానీ, మనము సాక్ష్యముగా నిలబడలేము.

ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.౹ -ఆదికాండము 22:7-8

దహనబలికి ఇస్సాకును ఇవ్వమని దేవుడు చెప్పాడు. అయితే అబ్రహాము దహనబలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పుచున్నాడు. అయితే ఎలా చెప్పగలుగుతున్నాడు? తన దేవుడు మాట తప్పని దేవుడు గనుక, ఇస్సాకు విషయమై దేవుడు చేసిన మాటను తప్పడు, అన్యాయము చేయ్యడు. ఇస్సాకును కోల్పోతాడు అనే ఆలోచన ఏ కోశానా లేదు.

మనము ఒకవేళ తగ్గింపు స్వభావమును కలిగి ఉంటామేమో గానీ, మన దేవుడు ఏమి చేయగలడో అనేది మాత్రము గుర్తించలేకపోతున్నాము. దావీదు కూడా నా కన్నా బలమైనవాటినుండి నన్ను తప్పించగలవాడు అని దావీదు గుర్తించాడు. శతాధిపతి కూడా యేసయ్య గూర్చిన సత్యము గుర్తించాడు అందుకే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పగలుగుతున్నాడు.

మనము కూడా ఒకవేళ ఇప్పుడైనా సరే మన దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో గుర్తిస్తే మనము కూడా సాక్ష్యులుగా చేయబడతాము. గుర్తించినదానిని నమ్మితే ఖచ్చితముగా అది స్థిరపరచబడుతుంది, ఆలస్యము అనేది ఉండదు.

యేసయ్య శతాధిపతిని గూర్చి మొదట విన్నాడు. తరువాత కళ్ళారా చూసాడు. శతాధిపతి మొదట యేసయ్యను పిలిచాడు, అయితే యేసయ్య రాగానే తన క్రియలను కనపరచాడు. మనము కూడా తగ్గింపు కలిగి ఉండాలి, దేవుడు ఏమి చేయగలడో గుర్తించాలి, గుర్తించినదానిని నమ్మాలి. నిన్ను సిద్ధపడమని ప్రభువు చెప్పుచున్నాదు.