స్తోత్ర గీతము 1
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
స్తోత్ర గీతము 2
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
||చాలా||
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
||మాటలలో||
స్తోత్ర గీతము 3
యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో రాజుల రాజునకే
ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము
రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము
ఆరాధన వర్తమానము
ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మరొక దినము ప్రభువు ఇచ్చారు. ఇహ లోకములో ఉన్నవారు వారి వ్యక్తిగతమైన విషయములకొరకు ఉపయోగించుకుంటారు.
శెలవు దినము వచ్చింది అనుకోండి, ఇహలోకములో విశ్రాంతి తీసుకోవడానికి, సరదాగా గడపడానికి ఉపయోగిస్తారు. అయితే దేవునిని ఎరిగిన వారు, ఈ దినము యొక్క ప్రాముఖ్యత తెలిసినవారు మాత్రము ఆయన సన్నిధిని పోగొట్టుకొనరు.
దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషము ఉంది. అయితే లోకములో ఉన్నవారు ఈ దినమును సంతోషముగా ఉండటానికే ప్రయత్నిస్తారు. అయితే దేవుని సన్నిధిలోని శక్తి, ప్రభావము లేదా బలము, నీ ప్రయత్నములు లేకుండా దేవుడే నీవు సంతోషించునట్లు తన కార్యములు జరిగిస్తాడు.
నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.౹ -ఫిలిప్పీయులకు 4:17
“మీ లెక్క” అనగా మనము చేస్తున్న ప్రతీ పనికీ ఒక లెక్క లిఖించబడుతుంది. కాబట్టి ఈ దినము కొరకు నీవు సిద్ధపడే విధానము కూడా ప్రభువు గమనిస్తాడు.
నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. -యెషయా 58:13-14
ఈ దినము చాలా ప్రశస్తమైన దినము అనేది కేవలము మాటలలో కాక, మన క్రియలలో కూడా కనపరచాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, మన అలసట, అవసరములు మాత్రమే ఎక్కువగా కనపడతాయి. అదే దేవుని సన్నిధి యొక్క ప్రశస్తత ఎరిగి, ఆదివారము పోగొట్టుకొనకుండా, రాత్రంతా నిద్రలేకపోయినా సరే, తిరిగి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి నీవు సిద్ధపడితే, నిన్ను తృప్తిపరచడానికి ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంటాడు. మనము చేసే ప్రతీ పనికీ ఒక లెక్క రాయబడుతుంది.
మనలను తృప్తిపరచాలి అనేది తండ్రిగా ఆయన కోరిక. మనము దేవుని కొరకు చేసే ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారము నీ తండ్రి ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ ఫలము ఎలా ఉంటుంది అంటే, “మీ లెక్కకు విస్తారమైన ఫలము”. నాటిన విత్తనము యొక్క ఫలము సరైన సమయములో సిద్ధపరచబడుతుంది.
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. -యిర్మీయా 10:10
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. -యిర్మీయా 10:16
మనము ఎవరి సన్నిధిలో ఉంటున్నామో అనే సంగతి మనము గమనించాలి. అలాగే మన దేవుడు ఎటువంటివాడో అనే సంగతి మనము గమనించాలి. ఆయన నిజమైన దేవుడు, జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన సమస్తమును నిర్మించువాడు, ఏర్పరచబడిన నీవు నేను ఆయనకు స్వాస్థ్యము, మరియు సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. -హెబ్రీయులకు 5:14
నీవు సంతోషముగా ఉండునట్లు, ఉన్న్నతమైన స్థలములలో ఎక్కించబడునట్లు అవసరమైన సమస్తమును అనగా మార్గమైనా, రిసోర్స్ అయినా, నిర్మించువాడు. ఈ సత్యమును ఎరిగి మనము ఆరాధించినపుడు మన కొరకు మార్గము సిద్ధపరచబడుతుంది.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23
మనము దేవుని ఆరాధన చేస్తున్నపుడు, ఖచ్చితముగా కొన్ని క్రియలు కనపరచబడతాయి. “ఉన్నతమైన స్థలములపైన నిన్ను నిలబెడతాను” అని ప్రభువు ఇచ్చిన వాగ్దానము కొరకైన దేవుని క్రియలు ఖచ్చితముగా, నమ్మిన మీ జీవితములో కనపరచబడతాయి.
మనము దేవుని ఆరాధన చేస్తుండగా వెనుక దేవుని క్రియలు నీ జీవితమును వృద్ధిలోనికి తెచ్చునట్లుగా కనపరచబడతాయి. మన జీవితము ఎప్పుడూ దేవునికి మహిమకరముగానే ఉంటుంది. ఈ నిరీక్షణ నుండి మనము తొలగిపోకూడదు.
నీ జీవితము గురించి బయటివాళ్ళకు తెలిసినదానికంటే, నీ ప్రభువుకే యెక్కువగా తెలుసు. నీవు సైతము దేవునికి ప్రియ కుమారుడవే, కుమార్తెవే కదా!
మన దేవుడు నిజమైన వాడు అనగా ఖచ్చితముగా ఆయన చేయు కార్యములు మనకు కనపరచువాడు. మనలను నిర్మించువాడు అనుదినము ఆయనలో మనము నడుస్తున్నపుడు, ఉన్నతముగా నిర్మించబడతాము.
మన అందరికీ కోరికలు ఉంటాయి అయితే దేవుని తీర్మానమే స్థిరము. నా ఇష్టము కాదు కానీ దేవుని చిత్తమే నా జీవితములో ఫైనల్ అని మనము సిద్ధపడినప్పుడు ఆయన సూపర్‌నేచురల్ కార్యములు చూడగలుగుతావు.
సాక్ష్యములతో ఈ సంఘమును కడతాను అని జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ గురించి ప్రభువు చెప్పాడు. గనుక ఈ మినిస్ట్రీ తో జతపరచబడిన మన అందరమూ సూపర్‌నేచురల్ సాక్ష్యములను ఖచ్చితముగా అనుభవిస్తాము, ప్రకటిస్తాము. దేవుడు నీ గురించి మాట్లాడటము అనేది నీ ధన్యత! ఈ సత్యము ఎరిగి నీవు చేసే ఆరాధన వ్యర్థము కాదు!
మన మధ్య ఉన్న దేవుడు నిజమైన దేవుడు, నీ హృదయపు లోతులలోనుండి ఈ దినము నీవు ఆరాధించినపుడు, ఏ జీవమైతే ఎండిన స్థితిలో ఉందో, దానిని జీవముతో ఈ దినము నీ దేవుడు నింపుతాడు.
ఆరాధన గీతము
నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
అనుపల్లవి:వందనం యేసయ్య – వందనం యేసయ్య
ఏ పాటివాడను నేను – నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి – నన్నెంతగానో దీవించావు
బలహీనులమైన మమ్ము – నన్నెంతగానో బలపరచారు
క్రీస్తేసు మహిమైశ్వరములో – ప్రతి అవసరమును తీర్చావు
ఈ దినము ఇంకా మనము జీవించి ఉన్నాము అంటేనే, మన యేదల దేవుని ఉద్దేశ్యము ఏమైతే ఉందో అది ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడేవరకు నీవు మరణించవు.
నీవు ఈ దినము 30 యంతల వరకు ఎదిగావా? 60 యంతల వరకు ఎదుగుతావు. 60 యంతల వరకు ఎదిగావా? సంపూర్ణము చేయబడతావు. నీ యందలి దేవుని ఉద్దేశ్యము నెరవేరకుండా నీ జీవితము ముగించబడదు.
వారము కొరకైన వాక్యము
ప్రభువు మన జీవితములను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన కొరకు నిలబడే భాగ్యము, ఆయన పని చేయడము కొరకు ఇచ్చిన అవకాశము ఎప్పుడూ మర్చిపోలేనివి. దాని విలువను ఎరిగినపుడు మనము కృతజ్ఞతాభావము ఎల్లప్పుడూ కనపరచేవారుగా ఉంటాము.
ఆ పరలోకరాజ్యములో దేవుడు, దేవదూతలు, 24 పెద్దలు సింహాసనములపై ఉన్నారు. ఈ దినము ప్రభువు రాజ్యము మన మధ్య ఉన్నది. ఆయన పరిచర్య చేసేవారు, ఆ పరిచర్యకు సహకరించేవారు అదే ధన్యత కలిగినవారు.
లోకము తనంతట తానే గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రభువును నమ్ముకున్న మన జీవితమును మన దేవుడే గొప్పగా చూపిస్తాడు.
ఈరోజు ఎలా మన జీవితములో మేలు కలుగుతుంది? ఎప్పుడు మేలు కలుగుతుంది అనే విషయములను నేర్చుకుందాము.
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.౹ -1 తిమోతికి 4:7
మనమున్న అంత్య దినములలో, దేవభక్తి విషయములలో మరింతగా నీకు నీవే సాధకము అనగా అభ్యాసము చేయాలి.
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును -1 తిమోతికి 4:8
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును. అయితే, దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను మేలు కలుగచేసేది. అయితే, దైవభక్తిని మనము అభ్యాసము చేయాలి అంటే ఎలా చేయాలి?
శరీరక వ్యాయామము చేసేవాడు రోజూ వ్యాయామశాలకు వెళ్తాడు. బరువులు ఎత్తడము అభ్యాసము చేస్తాడు. అప్పుడు వాడి కండరములు బలముగా మారి, కొవ్వు కరిగి ఒక మంచి రూపములోనికి మారతాడు. అయితే ఇది కొంతవరకు మాత్రమే ప్రయోజనము.
ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ప్రతీరోజు అభ్యాసము చేయుట.
శరీరకముగా వ్యాయమము చేసేవాడు, ప్రతీ సారీ ఎంతగా బలముగా మారాడో, శరీరము రూపు ఎంతవరకు మారిందో చెక్ చేసుకొనేవాడుగా ఉంటాడు. అయితే దైవభక్తి విషయములలో ప్రతీరోజు మనము ఎలా ఉంటున్నాము? ఆదివారము మనము సంఘముగా కూడుకున్నపుడు మన మధ్య ఉన్న దేవునితో ఖచ్చితముగా సహవాసమును కలిగి ఉండాలి, ఆయన నన్ను చూడాలి అనే ఆశతో అభ్యాసము చేయాలి.
ఎలా అయితే శరీరము కొరకు వ్యయామము చేసేవాడు నొప్పులు వచ్చినా సరే ఎలా అయితే వాడి అభ్యాసమును కొనసాగిస్తాడో, అలాగే దైవభక్తి విషయములో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, మనము కూడా గురి కలిగి అభ్యాసము చేయాలి.
దైవభక్తి విషయములో అభ్యాసము చేసినపుడు మొదట అనేకమైన ఆలోచనలతో చంచలమైన స్వభావముతో ఇబ్బందిపడినప్పటికీ, ఆ అభ్యాసము కొనసాగుతున్నపుడు ఆ స్వభావము మారి ఏకాగ్రతగా మనము ఖచ్చితముగా చేయగలుగుతాము.
మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.౹ -హెబ్రీయులకు 5:13
దైవభక్తి విషయములలో, ఉదాహరణకు పరిశుద్ధత విషయములో అభ్యాసము లేకపోతే, అనుభవము లేని వాడవే, శిశువుతో సమానమైనవాడవే.
వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. -హెబ్రీయులకు 5:14
అదే అభ్యాసము చేసిన యెడల, ఏది మేలో, ఏది కీడో ఎరుగగలిగిన స్థితిలోనికి మనము మారతాము. ఆత్మ అనుభవములోనికి మనము నడిపించబడినపుడు, పరిశుద్ధాత్మ ఏమి తెలియచేస్తున్నారో అది తెలుసుకొనగలిగే వారిగా మారగలుగుతాము.
అలా అభ్యాసము చేయుటలో, దేవునితో సహవాసము కలిగి ఉండుట అనేది మొదటగా మనము చేయవలసిన ఆత్మీయమైన వ్యాయామము. అప్పుడు ఆయన నిన్ను ఎలా సంధిస్తున్నాడో నీవు ఎరుగ గలుగుతావు, అప్పుడు దేవుడు నీతో చెప్పే మాటలు గ్రహించగలుగుతావు. అంతే కాక అపవాది వెలుగు దూతవలే మాటలాడినపుడు కూడా దానిని పసిగట్టగలుగుతావు.
తండ్రితో సహవాసము, వాక్యానుభవము, ఆత్మానుభవము ఈ మూడు విషయములలో మనము అభ్యాసము చేయడానికి తీర్మానము చేసుకుందాము.
మనలో ప్రతి ఒక్కరికీ ఆత్మీయమైన వరములు ఉన్నాయి అవి మనము ఎదిగినపుడే ప్రత్యక్షపరచబడతాయి. శిశువుగా ఉన్నపుడు అవి ప్రత్యక్షపరచబడవు. అయితే నీ యందలి ఉద్దేశ్యము గ్రహించి అభ్యాసము చేయడము మానవద్దు.