20-Nov-2022 – ఆదివారము ఆరాధన – నీవు క్షేమంగా ఉండటానికి

నన్నాకర్షించిన నీ స్నేహబంధం

నన్నాకర్షించిన నీ స్నేహబంధం – ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన – నీకే యేసయ్యా (2)
నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) {నన్నాకర్షించిన}

మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవూ
సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా..
చేరదీసిన ప్రభువా.. (2)
నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం

చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాధుడవు నీవే
సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా.. .(2)
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం – ఆత్మీయ అనుబంధం

కృపామయుడా – నీలోనా

కృపామయుడా – నీలోనా – నివసింప జేసినందునా (2X)
యివిగో నా స్తుతుల సింహాసనం – నీలో నివసింప జేసినందునా
…కృపామయుడా..ఆ..

ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక (2X)
నా మార్గములన్నిటిలొ.. – నీవె ఆశ్రయమైయుండగా (2X)
…కృపామయుడా..ఆ..

చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలిచిన తేజోమయా (2X)
రాజవంశములో.. – యాజకత్వము చేసేదను (2X)
…కృపామయుడా..ఆ..

నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే (2X)
నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు (2X)
…కృపామయుడా..ఆ..

ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీటమిచ్చుటకు (2X)
నీ కృప ననువీడకా.. – శాశ్వత కృపగా మారెను (2X)
…కృపామయుడా..ఆ..

ఇమ్మానుయేలు దేవా – ఇహపరములకు రాజా

ఇమ్మానుయేలు దేవా – ఇహపరములకు రాజా (2)
సన్నుతించి కిర్తించేదము – సకతము నీ నామము(2)
హల్లెలూయ అరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం

ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పవు (2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనాయ్యా (2) ” హల్లెలూయ “

రాజులకు రారాజు నీవెనాయ్యా
జనులందరి జివదిపతి నీవే
మా యోగ క్షేమము నీవెనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా ” హల్లెలూయ “

ఆరాధన వర్తమానం

ఈ దినము శ్రేష్టకరమైన సమయము అని నీవు నేను కూడా ఎరిగి ఉన్నాము. అయితే ఆ శ్రేష్టకరమైన దినములో పాలుపంపులు కలిగిఉండుటకు దేవుడు దయచేసిన కృపను బట్టి మనము సంతోషించి ఆరాధించాలి.

ప్రభువు రాకడ ఎంతో సమీపముగా ఉంది. మనము ఖచ్చితముగా సిద్ధపడే ఉండాలి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే ప్రభువు రాకడకొరకు సిద్ధపడే ఉండాలి. దేవుని నిజముగా ఆరాధించాలి అనే హృదయముతో మనము సంతోషముగా ఆయన సన్నిధిని చేరాలి.

కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంత టిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు – 2 సమూయేలు 7:22.

దావీదు తనకు కలిగిన అనుభవమును బట్టి, చూసినదానిని బట్టి సాక్ష్యము చెప్పుచున్నాడు. ఒకవేళ నీ అనుభవము బట్టి, నీవు ఎరిగినదానిని బట్టి దేవుడు ఎమై ఉన్నాడు అని నిన్ను అడిగితే, నీ సమాధానము, నీ సాక్ష్యము ఏమిటి? దావిదు మాత్రమే కాదు, యోహాను కూడా అదే సాక్ష్యము ఇచ్చుచున్నాడు. వారే కాదు దేవుని నిజముగా అనుభవపూర్వకముగా ఎరిగిన ప్రతివారు అదే సాక్ష్యము ఇవ్వగలుగుతారు.

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు – నిర్గమకాండము 15:11

పరిశుద్ధతలో మనదేవుడు తప్ప దేవుడుగా పిలువబడే ఎవ్వరైనాకూడా పరిశుద్ధతలో సాటి అయినవారు ఎవ్వరూ లేరు. మనదేవుడు అయిన యేసు ప్రభువు పాపములో ఏమాత్రము కనుగొనబడలేదు ఎందుకనగా ఆయనలో ఏమాత్రము పాపము లేదు. ఉదాహరణకు ఈ లోకములో బహుభార్యలు కలిగి ఉండుట అనేది చట్టవిరుద్ధము అనగా సరైనది కాదు. అయితే ఈ లోకములో దేవుళ్ళుగా పిలువబడేవారు అనేకమైన భార్యలను కలిగిఉన్నారు. దానిని బట్టీ సరైనది కానిదానిని చేసినవారుగా ఉన్నారు కనుక పరిశుద్ధత విషయములో యేసుక్రీస్తుకు సాటి అయినవారుగా ఎవరూ లేరు. దేవుడు అనే వాడు మనుష్యులకు మాదిరి అయి ఉన్నాడు. పరిశుద్ధత లేకుండ ఎలా మాదిరిగా ఉండగలడు?

మనము కూడా మన దేవుడిని బట్టి పరిశుద్ధత కలిగే జీవించాలి. చూపులో, వస్త్రధారణలో, మాటలో ఆయనను వెంబడించేవారుగా మనము పరిశుద్ధతకలిగే జీవించాలి. పరలోకములో కూడా ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను నిత్యము ఆరాధిస్తున్నారు. మనము కూడా మనము మనదేవుని బట్టి కలిగిన అనుభవముచేత మన జీవితము ద్వారా మన దేవుని ఆరాధించాలి.

తన స్వాస్థ్య ములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడ వైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు – మీకా 7:18.

నీవు ఆరాధించు నీ దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినవాడు నీ దేవుడు. మనము పడిపోయినప్పుడు, మనము తప్పిపోయినప్పుడు ఇలా మాటిమాటికీ జరుగుతున్నప్పటికీ నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినవాడు నీ దేవుడు. ఇది నీ అనుభవము, నా అనుభవము. ఈ అనుభవమును బట్టి మనము కూడా సాక్ష్యము ఇవ్వగలము. కొంతమంది పాతరోజులలో దేవుని అనుభవము పొందేవారు అని అనుకుంటారు. అయితే మన దేవుడు మార్పులేనివాడు. ఈరోజుల్లో కూడా మనము విశ్వాసము కలిగి వెంబడించినప్పుడు అదే అనుభవము మనము కూడా కలిగిఉండగలము. మన జీవితము పరీక్షించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఎన్ని సార్లు పెడచెవిన పెట్టి మన ఇష్టానుసారముగా జీవించాము? పదే పదే మన వద్దకు ఆయన వాక్కు వచ్చినప్పటికీ ఎన్ని సార్లు దానిని త్రోసివేసాము? అయినప్పటికీ మనలను క్షమించడానికి సిద్ధమైన మనస్సును కలిగిఉన్నాడు.

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు – కీర్తన 89:8

మన దేవుడు శూన్యములో భూమిని వేలాడదీసినవాడు. భూమి దేవుని చేత సృష్టించబడింది. ఆ సృష్టించబడిన భూమికి దేవుడే ఆధారము అయి ఉన్నాడు. మనము కూడా దేవునిచేత సృష్టించబడి ఉన్నాము కనుక మనకు కూడా ఆయనే ఆధారము. శూన్యముగా ఉన్న భూమిమీద తన మహత్తుగల మాటచేత సమస్తము సృష్టించినవాడు. నీ జీవితముకూడా శూన్యముగా ఉంటే, ఆయన వద్దకు నీవు వచ్చినప్పుడు నీ జీవితములో కూడా నీకు అవసరమైన సమస్తము సృష్టించి సమకూర్చువాడు.

ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఆయన నామములో కూడిఉంటారో వారి మధ్య ఉంటాను అని మన దేవుడు చెప్పాడు కదా! ఈరోజు మన దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. నీవు కూడా దావీదువలే “నీ లాంటి దేవుడు లేడు అని ప్రకటిస్తావా”? నీవు ఏది స్వీకరిస్తావో అది నీ జీవితములో స్థిరపరచబడుతుంది. “యేసు ప్రభువు రక్షణ దయచేయువాడు” అని నమ్మిస్వీకరించిన ప్రతివాడు రక్షణ పొందుతున్నాడు. అలాగే “యేసు ప్రభువు శక్తిమంతుడు, బలమైన కార్యములు చేయువాడు” అని స్వీకరించినవారి జీవితములో ఆయన శక్తి స్థిరపరచబడుతుంది. మన దేవుడు సర్వ సమృద్ధి కలిగినవాడు. ఆయనను స్వీకరించిన నీ జీవితములో సమృద్ధిలేనిచోట ఆయనను బట్టి ఖచ్చితముగా సమృద్ధితో నింపబడుతుంది. అటువంటి మన దేవునిని అనుభవపూర్వకముగా ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నీలాంటి దేవుడులేడు మాకిలలో
నీలాంటి దేవుడులేడు (2)

ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్
ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్

చరణం:
మృతులను సజీవులుగా
లేనివి ఉన్నట్టుగా (2)
చేసినదేవా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రం (2)
నీలాంటి దేవుడులేడు

చరణం:
వేదనలో మాకు శాంతి
కన్నీళ్ళలో సంతోషం (2)
ఇచ్చినదేవా స్తోత్రం
అద్భుతకరుడా స్తోత్రం (2)
నీలాంటి దేవుడులేడు

చరణం:
రోగములో మాకు స్వస్థత
బాధలలో నెమ్మది
ఇచ్చినదేవా నీకు స్తోత్రం
యెహోవా రాఫా స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

చరణం:
కుటుంబములను కట్టువాడా
విజయమునిచ్చువాడా
యెహోవా షాలోం స్తోత్రం
యెహోవా నిస్సీ స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

Main Message | మెయిన్ మెసేజ్

బహు భయంకరమైన అంత్య దినాలలో, క్షేమము కనబడని, అపాయకరమైన దినాలలో నీవు క్షేమముగా ఎలా ఉండగలము? ఏమి చేస్తే మనము క్షేమముగా ఉండగలము.

రూతు గ్రంథము మొదటి అధ్యాయములో నయోమి జీవితము ద్వారా మనము ఈ విషయాన్ని నేర్చుకుందాము.

న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.- రూతు 1:2

కరువు కారణము చేత బెత్లెహేము విడిచిపెట్టి అక్కడ నుండి మోయాబు దేశమున కాపురముండుటకై ఈ మనుష్యుడు తన కుటుంబముతో కలిసి వెళ్ళెను.

నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి. వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు. వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను – రూతు 1:3-5.

మోయాబులో ఉన్న పది సంవత్సరాలలో మొదట నయోమి భర్త చనిపోయాడు. ఇద్దరు కుమారులుకూడా చనిపోయారు. వీరు ఎక్కడనుండి బయలుదేరారు అని గమనిస్తే “బెత్లెహేము” ను విడిచి వెళ్ళారు. “బెత్లెహేము” అనగా “రొట్టెల గృహము” అని అర్థము. అయితే బెత్లెహేము గురించి ఏమి వ్రాయబడింది?

కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును – మత్తయి 2:4.5.

నయోమి కుటుంబముకు బెత్లెహేము విషయములో దేవుని ఉద్దేశ్యము ఎరగని వారుగా కరువు రాగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీ జీవితములో దేవుని ఉద్దేశ్యము నీవు ఎరగకుండా ఉన్నట్టయితే, నీవు కూడా కరువు సమయములో దేవుని ఉద్దేశ్యమును విడిచిపెట్టేవాడవుగా ఉంటావు. నయోమి కూడా దేవుని గూర్చి మంచి విషయాలు చెప్పినదే కానీ, దేవుని ఉద్దేశ్యము ఎరగనిదిగా ఉంటుంది.

నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక – రూతు 1:8

తన కరువులో కూడా దేవుడు దయచూపించువాడు అని ఎరగనిదిగా తన దేశమును విడిచిపెట్టి మోయాబు దేశమునకు వెళ్ళిపోతుంది. మనము కూడా దేవుని అంగీకరించిన మొదటిలో ఉన్నంత ఆసక్తి, ఆశ, సమయము గడిచే కొద్దీ మొదట కలిగిన ప్రేమను మర్చిపోయేవారిగా అయిపోతున్నాము. అందుకే మన జీవితములో దేవుని ఉద్దేశ్యము ఏమి అయిందో దానిని ఎరిగి ఉండాలి.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను – రోమా 8:30.

మనలను పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. దీనిని బట్టి ఆయన మన ద్వారా మహిమ పరచబడాలి అని దేవుని చిత్తము అయి ఉంది.

అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైనీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము – ఆదికాండము 26:1-2.

కరువు వచ్చిన సమయములో ఇస్సాకు కూడా తన దేశమును విడిచి వెళ్ళుటకు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఇస్సాకును వెళ్ళనీయలేదు.

ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.- ఆదికాండము 26:4.

ఇక్కడ అబ్రహాముతో చేసిన వాగ్దానమును ఇస్సాకుకు జ్ఞాపకము చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అక్కడ కరువు ఉంది. మరి దేవుడు కరువు కలిగిన ప్రదేశాన్ని వాగ్దానము చేస్తాడా? దేవునిగూర్చిన సరైన అనుభవము కలిగి ఉన్నప్పుడు సత్యము గ్రహించగలుగుతాము. అసలు దేవుని ఉద్దేశ్యము నీకు మొదటిగా తెలియపరచబడినప్పుడు దేవుడు ఏమి చెప్పాడు? అనేది నీవు జ్ఞాపకము కలిగే ఉండాలి. నీవు పడిపోకుండా, నీవు దేవుని ఉద్దేశ్యము మరిచిపోకుండా ఆయన చిత్తమును దైనందిన జీవితములో గ్రహించులాగున ఆ వాగ్దానములు ఇవ్వబడ్డాయి.

అయితే మన జీవితములలో ధన్యత ఏమిటి అంటే, నీవు కుడికైనను ఎడమకైనను తిరిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సరైన విధానమును బోధిస్తాడు. మన దేవుడు అన్యాయము చేయుట అసంభవము. నీవు పిలువబడ్డావు, నీతిమంతునిగా తీర్చబడ్డావు అటువంటి నీ జీవితములో మహిమపరచబడటమే దేవుని చిత్తము.

లాజరు చనిపోయి సమాధి చేయబడినప్పుడు, మార్తతో చెప్తున్న మాటలు ఏమిటి? ఇప్పుడైనను నీవు నమ్మిన యెడల నీవు అద్భుతము చూస్తావు అని. నీ జీవితములో కూడా మృతమైన నీ పరిస్థితులలో అద్భుతము చేయాలి అని దేవుని ఉద్దేశ్యము. మరి నీవు నమ్మగలుగుతావా?

ఇస్సాకు కూడా తాను ఆ దేశాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ దేశములోనే ఉండి నూరంతల ఫలము పొందాడు. మన జీవితములో కూడా కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎండిన జీవితము కలిగి ఉన్నప్పటికీ ఆయన సమృద్ధియైన జీవము ఇవ్వడానికి వచ్చాడు కనుక ఆయనను ఆయన మాటను నమ్మి ఆశీర్వదించబడతాము. మన కరువులో దేవుని విడిచిపెట్టడము అంటే, మనము దేవుని అనుసరించే విధానములో మార్పు వస్తుంది. ఆదివారము వెళ్ళినా కూడా ఆచార యుక్తముగా మాత్రమే చేసేవారిగా అవ్వటము, దేవుని ఉద్దేశ్యమునుండి తొలగిపోవడమే.

రూతును గమనిస్తే తాను బెత్లెహేమును విడిచిపెట్టిన తరువాత, మోయాబులో నివాసము ఉండుటకు వచ్చింది. కొన్ని దినాలు అక్కడ బాగానే ఉంది. అక్కడ మొదట తన భర్తను కోల్పోయింది. అయినా బాగానే ఉంది, తన బిడ్డలకు వివాహము చేసింది. మన జీవితములో కూడా ఆచారయుక్తమైన భక్తి మాత్రమే కలిగి ఉంటే, మన జీవితములో కొంతవరకు బాగానే ఉండవచ్చు కానీ, ఎదో ఒక పరిస్థితిలో నీ ఆధారాన్ని కోల్పోయేవారముగా ఉంటాము.

యెహోవా యెడల భయభక్తులు కలిగిఉన్నవారి యెడల దేవుని దూత కావలిగా ఉండును. అయితే ఎప్పుడైతే నీవు దేవుని ఉద్దేశ్యమును ఎరగక చేసిన కార్యములను బట్టి దేవుని విసర్జించినప్పుడు నీకు నీవే నష్టము కలిగించుకుంటావు.

దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా – యిర్మీయా 2:17.

దేవుని విడిచిపెట్టిన తరువాత కొన్ని దినాలు బాగానే ఉంటుందేమో కానీ ఖచ్చితముగా కష్టము నష్టము కలుగుతుంది. నీవు చేసిన కార్యమును బట్టి అపవాదికి అవకాశము దొరుకుతుంది. రూతు కూడా అలాగే సమస్తము పోగొట్టుకుంది. దేవునితో ఉన్నప్పుడు సమృద్ధీయిన జీవితము. కరువైనా కూడా దానిలో సమృద్ధిని దయచేయువాడు అయిన వాడు మన దేవుడు.

వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి – రూతు 1:6.

“వారికి” అనగా ఎవరికి? కరువులో కూడా దేవుని మీద ఆనుకుని, దేవుని నమ్మిన వారికి. ఇప్పుడు రూతుకు ఈ విషయము తెలిసినప్పుడు, ఏ బెత్లెహేమును విడిచిపెట్టిందో అదే బెత్లెహేమునకు తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అనగా దేవుని ఉద్దేశ్యము మాత్రమే ఆయనను నమ్ముకున్నవారి జీవితములో నెరవేరుతుంది.

దావీదు జీవితములో అనేకమైన మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనపడటానికి అత్యంత ఆసక్తి కనపరిచాడు.

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? – కీర్తన 42:2
యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము – కీర్తన 94: 22.

ఎప్పుడైతే నీవు ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా దేవుని యందలి విశ్వాసముచేత భద్రపరచుకుంటావో అప్పుడు నీవు దేవుని ఆశ్చర్యకరమైన అద్భుతములు చూడగలుగుతావు. నీవు దేవునికి ప్రత్యేకమైనవాడవు. రూతువలే దేవుని కార్యముల గూర్చి, ఆయనను నమ్మి నిలబడినవారి జీవితములో దేవుడు చేసిన అద్భుతములగూర్చిన సాక్ష్యము నీవు విన్నప్పుడైనా సరే నీ జీవితము సరిచేసుకోవడానికి సిద్ధపడండి. అలాగే నీవు ప్రభువును వెంబడించే విధానములో మార్పు వస్తుందా? ఈరోజు దేవుడు చెప్పిన మాటలకు స్పందించు.