స్తోత్ర గీతములు
ఆరాధన వర్తమానము
ఈ దినమున మన అందరినీ తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే సమస్త ఘనత, మహిమ కలుగును గాక. గడచిన దినములు అన్నీ ప్రభువు యొక్క కృపయే సంతోషింపచేసింది. ఆ దేవుని కృపను బట్టే మనము ఈరోజున ఆయనను స్తుతించవలసి ఉంది. మన స్తుతికి కారణభూతుడు మన దేవుడే, అనగా మనము స్తుతించగలడానికి కారణము ఆయనే.
దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషము కలదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము అందరము ఆయనను ఎరిగి అనగా ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి వచ్చాము. ఆయన శక్తి, మహిమ గ్రహించిన వారుగా మౌనముగా ఉండక ఉత్సహించి ఆరాధించేవారుగా ఉంటాము.
మనము అంత్య దినములలో ఉన్నాము. 666 అనే ముద్ర వేయబడితేనే గానీ, మనము ఏమీ పొందలేను, కొనలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. మనకు తెలియకుండానే చాలా త్వరగా పరిస్థితులు మారిపోతున్నాయి. గనుక మనము మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. మన ఆత్మ మాత్రమే దేవుని స్వరమును వినగలుగుతుంది గనుక మన ఆత్మను సిద్ధపరచుకోవాలి.
దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట వలన ఏమీ ఉపయోగములేదు. మరణించినవాడే మౌనముగా ఉంటాడు. జీవించినవాడు మౌనముగా ఉండక స్తుతించేవాడుగా ఉంటాడు. మనము సజీవులమై ఉన్నందుకు దేవునికి స్తోత్రము. సజీవులే దేవుని స్తుతించేవారుగా ఉంటారు.
న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్లెను – రూతు 1:1
వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి – రూతు 1:6
బెత్లెహేములో కరువు వచ్చిన కారణమున నయోమి కుటుంబము బెత్లెహేమునుండి బయటకు వెళ్ళారు. అయితే దేవుడు ఆ బెత్లెహేమును దర్శించినవాడుగా ఉన్నాడు. అదేవిధముగా మన పరిస్థితులలో కుడా మనలను దర్శించేవాడుగా ఉంటాడు, ఎందుకనగా మనము కూడా దేవుని బిడ్డలమే.
బెత్లెహేములో కరువు వచ్చింది, అయితే దేవుడు తన జనులను విడిచిపెట్టలేదు. ఇది ఎంతో గొప్ప సత్యము. దేవునిని తండ్రిగా కలిగిన మన జీవితములో ఏ కష్టము వచ్చినా సరే ఆయన మనలను విడిచిపెట్టడు. కొంతకాలము కష్టము ఉన్నప్పటికీ, దేవుడు తప్పక దర్శించి పరిస్థితి మార్చేవాడుగా ఉన్నాడు.
యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను – నిర్గమకాండము 16:4
దేవునిలో మనము ఎలా ఎదుగుతున్నాము, ఆయనను గూర్చి ఏమి మనము తెలుసుకున్నాము? ఎలా వెంబడిస్తున్నాము అనేది పరీక్షించుటకే దేవుడు ఆలస్యమును అనుమతిస్తాడు.
మార్త మరియల ఇంటిలో లాజరు చనిపోకముందు, అనేకసార్లు బోధించినవాడుగా ఉన్నాడు. అయితే వారు ఎంతగా నేర్చుకున్నారో, ఎంతగా ఎదిగారో పరీక్షించడానికే లాజరు చనిపోయినప్పుడు ఆలస్యము చేసాడు. మరియ ప్రభువు పాదాల చెంత కూర్చుని వాక్యము వింటూ వచ్చింది. దానికొరకు ఉత్తమమైనదానిని ఎన్నుకుంది అనే సాక్ష్యము కూడా పొందింది. అయితే పరీక్ష సమయము వచ్చే సరికి మార్త వలెనే మరియకూడా స్పందించింది.
మనలను కూడా దేవుడు పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని గూర్చిన సత్యమును ఎరిగి ఉంటామో, అప్పుడు ఆయనను స్తుతించగలిగే విధముగా సిద్ధపడగలుగుతాము. అలా కాని యెడల, కేవలము హాజరు కోసమే ఆయన సన్నిధికి వచ్చేవారివిగా ఉంటావు.
ఆదివారము ఎంతో ప్రశస్తమైన దినము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే దినము. రాత్రి సమయములో ఈ దినము కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చెదను అని ప్రభువు చెప్పుచున్నాడు. దినములు గడిచే కొద్దీ, మన ఆత్మీయమైన జీవితము బలముగా ఎదగాలి. లోకము వైపు చూడక దేవుని కొరకే మనము కనిపెట్టేవారిమిగా ఉండాలి.
మన దేవుడు ఎటువంటి దేవుడో అని జ్ఞాపకము చేసుకొంటే, తన జనులను దర్శించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు మనలను దర్శించేవాడు. పౌలు తన కష్ట సమయములో సంతోషముగా ఉండటానికి కారణము, ఈ సత్యము ఎరిగి ఉండుటయే! మనము కూడా ఇటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది ఆయనను గూర్చి ఎరిగి ఉంటేనే గానీ, సాధ్యము కాదు.
నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే – కీర్తనలు 147:14
మనలను పోషించేవాడు, మనకు సమాధానము కలుగచేయువాడు ఆయనే. సరిహద్దు అంటే, మనకు కలిగిన సమస్తమును సూచించేది. ఆ సరిహద్దు లోపల ఎక్కడ ఏమి సమస్య ఉన్నప్పటికీ, అక్కడ సమాధానము కలుగచేసేవాడుగా ఉన్నాడు. అయితే మనము ఈ సత్య వాక్యమును పట్టుకొని నిలబడినప్పుడే సాధ్యమవుతుంది.
ఒకవేళ నీ జీవితములో వాక్యమును పట్టుకొని నిలబడినప్పటికీ ఇంకా ఏ మార్పు నీ జీవితములో లేకపోతే, ఈ సత్యమును జ్ఞాపకము పెట్టుకో –
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది – రోమా 5:5
ఈ నిరీక్షణ అంటే వాక్యమును పట్టుకొని నిరీక్షించుట. ఇలా వాక్యమును పట్టుకొని నిరీక్షించినపుడు నీవు సిగ్గుపడవు. నీ సరిహద్దులలో సమాధానమును కలుగచేయువాడు నీ దేవుడు. ఈ నిరీక్షణ నీ శక్తిని బట్టి సమాధానము కొరకు ఎదురుచూడటములేదు గానీ, దేవుని శక్తిని బట్టి, కృపను బట్టి నీవు ఎదురుచూస్తున్నావు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు అంటే, ఏ వాక్యము పట్టుకుని నిలబడ్డావో దాని ప్రకారము సమాధానము కలుగుట ఖచ్చితము.
వాక్యమునకు సృష్టించే శక్తి ఉందా? అని చూస్తే ఆదికాండములో సృష్టి విధానమంతా కూడా దేవుని వాక్కు వలననే జరిగింది. మన జీవితములో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, దేవుని వాక్యమునకు శక్తి ఉన్నది. అటువంటి వాక్యము తప్పిపోయే చిన్న అవకాశము కూడా మనము ఇవ్వకూడదు. ఇటువంటి అవకాశము, మన ఆలోచనలలో ఇచ్చేవారముగా ఉంటాము. అందువలన, మన ఆలోచనలలో సహితము దేవుని వాక్కు మీద ఉన్న నిరీక్షణ తప్పిపోనివ్వకూడదు.
నయోమి విషయములో చూస్తే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను శపించాడు అనే మాటలు పలికింది. అయితే, మనము ఆ విధముగా ఉండక, దేవుడు దర్శిస్తాడు అనే నిరీక్షణ కలిగి నిలబడి ఉండాలి. పరిస్థితి ఏదైనా, కొదువ ఏదైనా మన దేవుడు మనలను దర్శించేవాడు, తన ప్రేమను మాటి మాటికీ కనపరచేవాడు. చిన్న విషయాలలో ఆయన ప్రేమను గుర్తించినపుడు, గొప్ప విషయాలలో ఆయన ప్రేమను నమ్ముకుని ధైర్యముగా నిలబడేవారిగా ఉంటాము.
చాలామంది అనుకుంటారు, వారికి మంచి ఉద్యోగము ఉంది కాబట్టి తన జీవితమును మంచిగా జీవిస్తున్నాము అనుకుంటారు.
అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని – ప్రసంగి 2:24
మనము మంచి ఉద్యోగము కలిగి ఉన్నాము అంటే, మన అవసరములు మనము తీర్చుకోగలుగుతున్నాము అంటే దాని అర్థము దేవుని కృప మనకు తోడుగా ఉంది అనే. ఆ ప్రేమను, కృపను పొందుకున్న మనము మనస్పూర్తిగా దేవునిని స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి.
ఆరాధన గీతము
నిను విడిచినను నీవు విడువవు
వారము కొరకైన వాక్యము
ఈరోజు మన వ్యక్తిగతమైన జీవితాలు ఆత్మలో కట్టబడుతూ ఈ లోకములో అనేకమందికి వెలుగు ఇచ్చేవారిగా ఉండాలి. ఈలోకములో కడవరి దినములలో జరగవలసిన అనేక కార్యములు జరిగిపోతూ ఉన్నాయి. ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో మనము ఉండటానికి సిద్ధపడి ఉండాలి. ఈ పరిస్థితులలో మనము ఎలా సిద్ధపడాలి అని చూస్తే, మన ఆత్మీయ జీవితము వృద్ధి పొందినపుడే అది సాధ్యము. మన జీవితములను ఎవరో వచ్చి సిద్ధపరచరు గానీ, మనకు మనమే ఆ పని చేయాలి. దేవుని కొరకు నేను మహిమ కొరకు నిలబడాలి అనే ఆసక్తి ఎవరికి వారము కలిగి ఉండాలి. అయితే ఈ ఆసక్తి వేటి విషయమై కనపరచాలి అని చూద్దాము.
దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను – అపొస్తలుల కార్యములు 12:1-5
ఇక్కడ రెండు విషయములు మనము చూడవచ్చు. యాకోబు చంపివేయబడ్డాడు, పేతురును కూడా చంపడానికి బంధించారు. ఇక్కడ చూస్తే, యాకోబు సంఘము ఎదుట చంపివేయబడ్డాడు, అలాగే సంఘము ఎదుట పేతురును కూడా చంపడానికి పట్టుకొన్నారు. సంఘము యాకోబు గురించి ప్రార్థన చేయలేదా అని ఆలోచిస్తే – సంఘము యెదుట యాకోబును పట్టుకొని వెళ్ళిపోయారు తరువాత చంపివేసారు. ఈ సమయములో యాకోబు కొరకు ప్రార్థించే అవకాశము సంఘమునకు దొరికి ఉండకపోవచ్చు. అయితే పేతురు విషయములో పస్కా పండుగ వలన సమయము దొరికింది.
గనుక సంఘము పేతురు విడిచిపెట్టబడులాగున వారు మొదటి దినమున ప్రార్థించి ఉండవచ్చు. ఏమీ మార్పు కనబడనప్పటికీ, ఎడతెగక, అత్యాసక్తితో ప్రార్థించారు. అలాగే యాకోబును చంపటము యూదులకు ఇష్టమైన కార్యముగా ఉంది. మన జీవితములో చూస్తే, దేవుని ఆశీర్వాదమును కోల్పోవడము అపవాదికి ఇష్టమైన కార్యము.
ఒకసారి మనము దేవుని ఆశీర్వాదమును యాకోబును కోల్పోయినట్టు, మనము పోగొట్టుకొన్నామేమో. అయితే ఈసారి ఆశీర్వాదముకొరకు ఆసక్తిగా ప్రార్థించాలి. పేతురు విషయములో సంఘము ప్రార్థించకపోతే, పేతురు కూడా చనిపోయేవాడే. ఈ యోహాను, యాకోబు మరియు పేతురులను సంఘముకొరకే దేవుడే సిద్ధపరచాడు.
మన జీవితములలో కూడా ఆశీర్వాదములను దేవుడు మనకొరకే సిద్ధపరచాడు. వాటిని మనము పోగొట్టుకుంటే, అపవాది సంతోషిస్తాడు. ఆ ఆశీర్వాదములను మనము అనుభవించినపుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు.
పేతురు చంపివేయబడటానికి దినము సిద్ధపరచబడింది. ఆ దినము రాకమునుపే పేతురు విడిపించబడ్డాడు. అనగా మనము చేసే ప్రార్థన, పోగొట్టుకొనే సమయము రాకమునుపే, తప్పించబడి, సమకూర్చబడే అనుభవములోనికి మనలను నడిపిస్తుంది. అటువంటి ప్రార్థనకు పరలోకము సహితము పనిచేస్తుంది.
అయితే మరొక ముఖ్యమైన విషయము గమనిస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు గానీ, విశ్వాసము లేని వారుగా ఉంటున్నరు. అందుకనే, రోదె అనే చిన్నది పేతురును గుర్తుపట్టినప్పటికీ, మిగతావారు నమ్మక ఆమెను గద్దించారు. ఫలితము మీద నమ్మకము లేకపోయినా సరే, ప్రార్థన మాత్రము ఆసక్తితో చేసారు.
మన కళ్ళముందు కూడా అనేకమైన అసాధ్యమైన కార్యములు జరుగుతుండవచ్చు, అయినప్పటికీ మనము ఆసక్తిని కనపరచినపుడు, ఫలితమును మనము పొందుకోగలుగుతాము. వారు ఆసక్తిని కనపరచినపుడు పేతురును విడిపించడానికి పరలోకమునుండి దూత పంపించబడ్డాడు. ఫలితము చూస్తాము అనే నమ్మకం లేనప్పటికీ, ఫలితము వచ్చేవరకు ఆసక్తిని కనపరచారు.
ఆ సమయములో వారికి తెలిసిన వాక్య జ్ఞానము కొంచెమే! అయితే ఈ దినములలో మనకు ఇవ్వబడిన కృప పరిశుద్ధాత్మ ద్వారా వాక్యములోని లోతైన విషయములను తెలియచేస్తుంది. దానిని బట్టి మన ఆసక్తి ఇంకెలా ఉండాలి? విశ్వాసము కలిగి మనము ఆసక్తి కనపరచినపుడు, ఎలా దేవుని కార్యము జరగబోతోందొ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియ చేసేవాడుగా ఉంటాడు.
ఇది దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదము అని నీవు గుర్తించినపుడు, నీ ఆసక్తి పట్టు విడువకూడదు.
ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹ అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.౹ అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను – అపొస్తలుల కార్యములు 12:7-9
తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.౹ హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను – అపొస్తలుల కార్యములు 12:18-19
అద్భుతమైన రీతిలో పేతురును ప్రభువు విడిపించాడు. మన ఆశీర్వాదము కూడా మనము ఆసక్తిని కనపరచి ప్రార్థన చేసినపుడు పరలోకము స్పందించి ప్రభువు కార్యము జరిగించేలా పరిస్థితి మారిపోయింది. అంతే కాక పేతురును చంపాలి అనే ఆలోచన కలిగిన హేరోదు ఈ కార్యము జరిగిన తరువాత మరలా అక్కడ ఉండక వేరే ప్రదేశమునకు వెళ్ళిపోయాడు.
అలాగే మనము కూడా ఆసక్తిని కనపరిస్తే అపవాదిని జయించి అతడి ప్రభావమునుండి మన ఆశీర్వాదము విషయములో ఖచ్చితముగా తప్పించబడతాము. దేవుడు ఏమి చేయగలుగుతాడో, ఆ విషయములను ఆ సంగతులను జ్ఞాపకము చేసుకొని, వారి ఆసక్తిని కనపరిచారు. అలాగే మనము కూడా ఆసక్తిని కనపరచాలి అంటే, మనకు కూడా దేవుని గూర్చిన సత్యము మనము తెలుసుకొని ఉండాలి. అప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితిలో నుండే కాక, భవిష్యత్తులో మరొకసారి అపవాది ఉచ్చులో పడక వాడిని జయించేవారిగా ఉంటాము.