ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధిలో ఉన్నవారు అత్యాసక్తిని కనపరచాలి. అన్నివిషయములలో ఉత్సాహముగా ఉన్నవారిని దేవుడు అధికముగా ప్రేమించేవాడుగా ఉన్నారు, అధికముగా దీవించబడేవారుగా ఉంటారు. దేవుని చేత ప్రేమించబడే వారి యెడల దేవుడు అద్భుతము జరిగించాడు.
తాను ప్రేమించిన లాజరు అనే మాట వ్రాయబడింది, అతని జీవితములో గొప్ప అద్భుతము జరిగింది. అలాగే యోహాను కూడా యేసు ప్రభువు చేత ప్రేమించబడిన శిష్యుడు. భవిష్యత్తును గూర్చిన విషయములన్నీ యోహానుకే తెలియచేయబడ్డాయి. గనుక మనము కూడా దేవుని సన్నిధిలో ఉత్సాహముగా ఉండేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన సన్నిధిలోని బలమును, ప్రభావమును అనుభవించగలుగుతారు.
దేవుని సన్నిధి నిజమైనది అయితే ఆ సన్నిధి దేవుని కృపను బట్టి ఉచితముగా ఇవ్వబడింది. ఆయన బలమును, ప్రభావమును అనుభవించడానికి మనము ఏమీ వెల చెల్లించవలసిన అవసరము లేదు. రక్త స్రావము చేత బాధపడిన స్త్రీ అనేకుల వైద్యుల దగ్గర వెల చెల్లించి తన ఆస్తిని పోగొట్టుకుంది గానీ యేసయ్య దగ్గర విశ్వాసము చేత అద్భుతమును పొందుకుంది.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమాజముగా కూడుకొమ్మని పిలిచి. వారు కూడుకోగానే అనేకమైన విషయములు వారికి తెలియ చేసేవాడు. ఈ దినము మనము కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నాము. ఆయన వాక్యమును మనము కూడా వింటున్నాము. అయితే దేవుని సన్నిధిలో ఉన్న బలమును, ప్రభావమును నేను అనుభవించాలి అనే ఆసక్తి మనము కలిగి ఉండాలి.
దేవుని ఆత్మ చేత, నీ ఆత్మలో బలము కలుగచేయబడుతుంది. అటువంటి దేవుని ఆత్మను స్వీకరించినవారు గొప్ప బలము కలిగి, గొప్ప కార్యములు చేసేవారుగాను, పొందుకొనేవారుగాను చేయబడతాము. గనుక ఈ దినము మనము పోగొట్టుకోకూడదు.
దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని ఎలాగైనా మింగివేయాలి అనే ప్రయత్నములే చేస్తాడు. అయితే దేవుని ప్రేమను బట్టి ఆయన సన్నిధికి నిన్ను రప్పించి, తన మాటలను నీకు వినిపింపచేస్తాడు. ఒకవేళ మన శరీరములో బలహీనత ఉంది అనుకోండి, అప్పుడూ మన శరీరముతో ఏ పనీ చెయ్యలేదు. అయితే దేవుడు బలముతో కాదు, శక్తితో కాదు గానీ నా ఆత్మతోనే చేస్తాను అనే మాట లేఖనములలో ఉంది. అనగా మన శరీరము ఎలా ఉన్నా సరే ఆత్మలో మనము బలము కలిగి ఉంటే, దేవుని అద్భుతమైన శక్తి మన శరీరాన్ని బలపరుస్తుంది.
దేవుడు మన జీవితాన్ని సిద్ధపరచినప్పటికీ, అపవాది మన జీవితాన్ని స్వాధీనపరచుకున్నాడు. అందువలననే మన జీవితం మన చుట్టూ ఉన్నవారికీ, మనకు మనమే అసహ్యకరముగా కనిపిస్తాము. అయినప్పటికీ నిన్ను ప్రేమించే యేసయ్యకు మాత్రము నీ మీద అసహ్యము లేదు గానీ, ప్రేమ మాత్రమే ఉంది. ఎందుకు అంటే, నీ యెడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుకనే విడువక నీ యెడల కృప చూపుచున్నాడు. దేవుని ప్రేమ ప్రయోజనకరమైన వారిగా మనలను మారుస్తుంది. నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరముగా చేసేదే దేవుని ప్రేమ.
పాపులను రక్షించడానికే ఈ భూలోకములోనికి వచ్చాను. రోగికే గాని వైద్యుడి అవసరము లేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. ఒక్కసారి యేసయ్య ప్రేమలో నిలిచి చూస్తే, ఆయన ప్రేమ గూర్చిన సాక్ష్యము నీవు ఇచ్చేవాడిగా ఉంటావు. నీది ప్రభువు ఇచ్చిన జీవితము అని నీవు గుర్తిస్తే, ఆయన మహిమ కొరకే నీవు జీవించు.
నీ జీవితములో కూడా ఎక్కడైనా నాశనకరమైన గుంటలలో నీవు ఉంటే, దానినుండి తప్పించగలవాడు నీ దేవుడు.
సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి – కీర్తన – 66:1
దేవుని గూర్చి అంటే, ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో, నీ జీవితములో ఏమి చేసాడో నీవు ఎరిగినపుడు, నీవు సంతోషగీతము పాడగలవు.
మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. – కీర్తన – 81:1
దేవుడు మనకు బలమై ఉన్నాడు అనే సత్యమును మీరు గ్రహించాలి. ఆయనే నీకు బలము అయి ఉన్నపుడు, ఇంక యేది నిన్ను బలహీనపరచగలుగుతుంది? నీవు గొప్ప కార్యములు చేయాలి అనేది ప్రభువు యొక్క ఉద్దేశ్యము. మన దేవుడు ఎంత బలమైనవాడో అని ఆలోచిస్తే, మృతమైన దానిని సజీవము చేయగలిగినవాడు, లేనివాటిని ఉన్నట్టుగానే చేయగలవాడు. ఈ సత్యము పైనే మనము ఆనుకుని ఉండాలి.
మన జీవితములో అనేకమైన పరిస్థితులగుండా మనము వెళ్తాము. కొన్నిసార్లు మన జీవితము కోల్పోయినట్టుగానే కనబడుతుంది. అటువంటి సమయములో నీవే నాకు బలమైనవాడవు అనే సత్యము దేవుని యెదుట చెప్పగలగాలి. దేవుని బలము ఎదుట, నీవున్న స్థితి నిలువలేదు, ఈ సత్యము నీవు ఎరిగి ఉండాలి. ఈ సత్యము విశ్వాస సహితముగా మనము పలికినపుడు ఆత్మమండలములో కార్యములు జరిగిపోతాయి. ఎవ్వరు ఏమనుకున్నా సరే, నీవు నమ్మిన దేవుని మాట నీవు ప్రకటించేవానిగా ఉండాలి.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయుదము – కీర్తన 95:1
మన దేవుడు మనకు రక్షణ దుర్గము అయిఉన్నాడు. అనగా ఆపదవేళ నిన్ను కప్పేవాడుగా ఉన్నాడు కాబట్టే, అపవాది ఉచ్చులన్నిటిలోనూ, సజీవులుగా ఉన్నాము. అపవాది ఎప్పుడు మింగుదామా అని చూస్తున్నాడు, అయినప్పటికీ వానికి దొరకకుండా కాపాడబడుతున్నాము అంటే, దేవుడు మనకు రక్షణ దుర్గముగా ఉన్నాడు. అపవాది ఎంత గట్టిగా నిన్ను నాశనము చేయడానికి ప్రయత్నించినా సరే, నీ దేవుడు నీ బలము, నీ రక్షణ దుర్గముగా ఉన్నాడు.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును – కీర్తన 18:1-3
మన దేవుడు రక్షించువాడు అయి ఉన్నాడు. “నా” దేవుడు, “నా” శైలము అనే వ్యక్తిగతమైన సంబంధము మనము అనుభవించి ఈ మాటలు చెప్పగలగాలి. ఈ దినము ప్రభువు గూర్చి నీకు చెప్పబడినమాటలు నీవు గ్రహిస్తే మనస్పూర్తిగా దేవునిని స్తుతించేవారిగా సిద్ధపడదాము.
ఆరాధన గీతము
నా తండ్రీ నా తండ్రీ
నీ ప్రేమే నను మార్చినది
నా తండ్రీ నీకే వందనం
నా తండ్రీ నీకే వందనం
నా తండ్రీ నీకే వందనం వందనం
నాకై ఎదురు చూసి
నను నీలా మార్చి
నాకు యోగ్యతను నీవు ఇచ్చావయా
నా తండ్రీ నీకే వందనం
నా తండ్రీ నీకే వందనం
నా తండ్రీ నీకే వందనం వందనం
బలహీనతలో నా బలమా
నా రక్షణ దుర్గమా
నా తండ్రీ నీవే
నా తండ్రీ నీవే
వారము కొరకైన వాక్యము
దేవుని మాటలు మన జీవితమును కట్టేవిగా ఉంటాయి. ఈరోజు ఆరాధనలో నీవు పలికిన మాటలు నీ జీవితమును కట్టేవిగా ఉంటాయి. యేసు క్రీస్తు యొక్క రాకడ అతి సమీపములో ఉన్న కార్యములు జరుగుతున్న రోజులు. 666 అనే సంఖ్య అధికారికముగా ప్రబలే రోజులు వస్తున్నాయి. గనుక మన జీవితములను మనము సిద్ధపరచుకుందాము.
మనము అందరము మంచి జీవితము జీవించాలి అని కోరుకుంటాము. అలాగే పిల్లల జీవితము మంచిగా ఉండాలి అని ప్రతీ తల్లి తండ్రీ కోరుకుంటారు. అయితే మన శక్తిచేత మనము కట్టుకోలేము అయితే మన జీవితములు దేవుని యొక్క మాట చేత కట్టబడుతుంది. అయితే వాక్యము చెప్పినట్టుగా మనము కట్టుకుంటే, అపవాది మన జీవితములను ఏమీ చేయలేదు. వాక్యము చెప్పుచున్న మాటలు ఒకసారి ధ్యానము చేద్దాము.
నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకమ్ము – 2 తిమోతి 2:1
ఇక్కడ జీవితమును ఎలా కట్టుకోవాలో తిమోతికి పౌలు చెప్పుచున్నాడు. దేవునికి సంబంధించిన దయ, బలము, అద్భుతము అన్నీ దేవుని కృపలోనే దాచబడి ఉన్నాయి. అందుకే మనము దేవుని కృపను మనము కోరుకోవాలి. ఆ కృప ఎంత శక్తివంతమైనదో మనము అనుభవపూర్వకముగా ఎరిగి ఉండాలి.
మనము యేసును అంగీకరించినవారమే. మన యేసయ్య పరిపూర్ణుడు అయి ఉన్నాడు, ఆయన పరిపూర్ణతనుండే సమస్తము మనకు దయచేయబడుతున్నాయి. అయినప్పటికీ మనము పరిపూర్ణులుగా లేకపోవడానికి ఆయన కృపలో మనము నిలిచి ఉండకపోవడమే.
కృప అంటేనే అర్హతలేనివాడికి ఇచ్చేది. ఏ విషయమైతే నీవు ఆశ పడుతున్నావో, ఆ ఆశ నెరవేర్చబడే పరిస్థితులు కనపరచబడకపోయినప్పటికీ, దేవుని కృపను నమ్ముకొని నిలబడితే, ఆ కృపను బట్టి ఆశించినది పొందుకొనే రక్షణ మార్గము తెరువబడుతుంది. క్రీస్తును నమ్ముకొని నిలబడే మనలను ఆయన కృప ఖచ్చితముగా తృప్తిపరుస్తుంది.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను – 2 కొరింథీ 5:17
ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడింది. క్రీస్తులో కృప ఉంది, ఈ కృప పాతవాటిని గతింపచేస్తుంది, సమస్తమును నూతనపరుస్తుంది. కృప నీ కొరకు పనిచేసేదిగా ఉంటుంది, అటువంటి వాని జీవితములో అపజయము అనేది ఉండదు. కృపలో బలవంతుడవు కమ్ము అంటే, దిన దినము అనుభవపూర్వకముగా తెలుసుకొంటూ ఎదగాలి.
మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి – 1 పేతురు 1:10
కృప క్రీస్తు వచ్చిన తరువాత మనకు అనుగ్రహించబడింది. అయితే, క్రీస్తు రాకమునుపే ఈ కృప ద్వారా ఏమి జరుగుతుందో అని అప్పటి ప్రవక్తలు పరిశీలించినవారుగా ఉన్నారు. అందులో ఒక ప్రవక్త అయిన దావీదు, పగటి కాలమందు నీ కృప, రాత్రివేళ నీ విశ్వాస్యత అని చెప్పగలిగాడు.
దేవుని కృప మనలను దేని విషయములో నూతన సృష్టిగా చేస్తుంది? మొట్టమొదటిగా దేవుడు ఏ ఆలోచనతో మనుష్యుని సృష్టించాడో, ఆ ఆలోచన పాపమును బట్టి నిరర్థకము అయింది. అయితే క్రీస్తునందున్న కృపను బట్టి మరలా నూతన పరచబడి, మొట్టమొదట దేవుడు కలిగిన ఉద్దేశ్యము ప్రకారము చేయగలిగేలా నూతనపరచబడుతున్నాము.
దేవుని కృప మన పాపములను సమాధి చేసింది. దేవుని కుమారులనుగా మనలను మార్చివేసింది. దేవుడు పరిపాలించేవాడుగా ఉన్నాడు, అధికారము కలిగినవాడుగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఆయన కుమారుడిగా, కుమార్తెగా మార్చబడిన నీవు కూడా అధికారము కలిగినవాడిగా కలిగినదానిగా చేయబడతావు.
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను – ఆదికాండము 1:28
మన జీవితము ఎటువంటి జీవితము అంటె, ఏలే జీవితము మనది. ఇది క్రీస్తునందున్న కృప మార్చిన జీవితము, నూతనపరచిన జీవితము. అపవాది నీ జీవితమును మొత్తము దోచివేసింది, అయినప్పటికీ నీవు క్రీస్తు అనుగ్రహించు కృప మీద నిలబడి ఉంటే చాలు, ఆ కృప నిన్ను ఫలింపచేస్తుంది. నీవు ఫలించే ఫలింపుకు కారణము దేవుని కృప. నిన్ను వృద్ధిలోనికి తీసుకువచ్చేదే దేవుని కృప.
ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము – కీర్తన 90:14
మోషేకు మనకు ఉన్న తేడా ఎమిటి అంటే, దేవుని కృపకొరకు మొర్రపెడుతున్నాడు, అయితే మనకు దేవుని కృప ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుంది. దేవుని కృప దొరకకపోతే దుఃఖమే అయితే, క్రీస్తును బట్టి మనకు కృప ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది గనుక ఇంక సంతోషమే.
అందుకే నా కృప నీకు చాలును అని పౌలుతో దేవుడు చెప్పాడు. ఆ సత్యము ఎరిగిన పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అని చెప్పుచున్నాడు.
అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను – 2 కొరింథీ 12:9-10
యేసయ్య పౌలు అడిగిన బలహీనత యందు కృప చాలును అని చెప్పాడు. అయితే పౌలు తన అనుభవమును బట్టి తనకున్న ప్రతో బలహీనతనుండి కృపను బట్టి బలవంతుడిగా దేవునిని మహిమపరచాడు. మనము కూడా యేసు క్రీస్తు యందు అనుగ్రహించబడిన కృపను అనుభవించాలి అంటే ఎలా? ఆ కృపలో ఎలా ఎదగాలి?
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము – రోమా 5:2
దేవుని కృపను మనము అనుభవించాలి, ఆ కృపలో మనము నిలిచి ఉండాలి అంటే, విశ్వాసము కలిగి ఉండాలి. మన జీవితములో ఏ విషయములోనైనా సరే ఇదే నియమము.
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని – 1 కొరింథీ 2:4,5.
మన విశ్వాసము మనుష్యుల జ్ఞానముతో చూడక, దేవుని శక్తిని మాత్రమే ఆధారము చేసుకొని ఉండాలి. దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది అని ఆలోచిస్తే, లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగేది. ఈ సత్యము మనము ఎరిగి నిలబడినపుడు ఖచ్చితముగా ఆ కృపను మనము అనుభవించగలుగుతాము.
దేవుని శక్తి చూపబడే రెండు నియమములు – లేని దానిని ఉన్నట్టుగా చేయగలవాడు. మృతమైన దానిని సజీవముగా చేయగలవాడు. ఆ శక్తిని ఆధారము చేసుకొని, విశ్వాసము కనపరచినపుడు, దేవుని కృప నీవు అనుభవించగలుగుతావు. అందుకే కృపను నమ్ముకున్నవాడు ఎవడూ సిగ్గుపడడు. నీవు ఒంటరిగా అయిపోయినపుడు దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు అనే సత్యము నీవు తెలుసుకోగలుగుతావు. మనుష్యులు నిన్ను విడిచిపెట్టినా, దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. గనుకనే కృపలో బలవంతుడవు కమ్ము, అప్పుడు సమస్తము నీ పాదముల చెంతనే ఉంటాయి