స్తుతిగీతము – 1
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ తిరుపాదమే (2)
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
స్తుతిగీతము – 2
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)
||యెహోవా||
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)
||యెహోవా నాకు||
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)
||యెహోవా నాకు||
స్తుతిగీతము – 3
కనుమరుగు చేయుదుననె వారెదుట ఎనలేని వృద్దిచేయు దేవా నీకే స్తోత్రం
సరిచేయ జాలని నీ బ్రతుకు, సరిపరచ తానే వచ్చుచున్నాడు.
ఓ. ఓ.. సరిచేయును స్థిరపరచును బలపరచి పుర్ణునిచేయున్
నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పుర్ణునిచేయున్
నిన్ను బలపరచి పుర్ణునిచేయున్
సరి సగ రిస, సరి సగ రిస, సపమ పమ నిదప, గరి సరి సగ రిస, సరి సగ రిస, సపమ గరి సస,
1. అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని మంచువలె నీ యెదుట కరిగిపోవన్ (2)
నీ కష్టము, నష్టము అన్నియును తీరున్ (2)
క్షేమములె నీ దరిచేరున్..
ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్….
2.ఖ్యాతిని అణచివెయు, కూటములు అన్నియును యేసు నీ తోడని తలలు వంచున్ (2)
విరోధులు చేసిన గాయములు మానున్ (2)
నీ ఖ్యాతి నీ దరిచేరున్..
ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్….
ఆరాధన వర్తమానము
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.౹ -ప్రకటన 1:6
మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనేది సత్యము. “ప్రేమించుచు” అని వ్రాయబడింది. దాని అర్థము, నీ దినములు కొనసాగించబడుతున్న కొలదీ, ఆ ప్రేమ కూడా కొనసాగించబడుతుంది.
యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. -హెబ్రీయులకు 13:20
“యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని” అని వ్రాయబడింది. దేవుని దృష్టికి అనుకూలమైనది అంటే ఏమిటి? ఆయన మననుండి ఏమి కోరుకునేవాడుగా ఉన్నాడు? ఈ విషయము అర్థము చేసుకోవాలి అంటే, ఆయన ప్రేమను గూర్చి తెలుసుకోవాలి. ప్రేమ ఎప్పుడూ కూడా మనకు మంచిని, క్షేమమును కలిగించేదిగా ఉంది. అంతే కాక, ప్రేమ ఉన్నప్పుడే తప్పును సైతము క్షమించగలిగేదిగా ఉంది. అనగా దేవుని దృష్టికి ఏమి అనుకూలము అంటే, మనము ఆశీర్వాదకరమైన జీవితము కలిగి ఉండాలి అనేదే! అందుకే ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను ఆరాధించుట ఎంతో అవశ్యము.
“ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును”. ప్రతి మంచి విషయము అంటే ఏమిటి? క్షేమము, మంచి, ఆశీర్వాదము కలుగుటకు ఏమి మనము చేయాలో ఆ సమస్తము మనము చేయులాగున మనలను సిద్ధపరుస్తాడు. ఒక్కోసారి క్షేమము కొరకు సరిచేయబడాలి, ఒక్కోసారి నిలబడాలి, ఒక్కోసారి ప్రకటించాలి అలా మనలను సిద్ధపరుస్తాడు.
మనము ఎత్తబడే సమయములో ఉన్నాము గనుక వాక్యము ఏమి చెబితే అది తూచా తప్పకుండా చేయాలి. ఆదాము, హవ్వలు ప్రభువు చెప్పినట్టు తినవద్దు అన్న పండు ఒక్కటే తినకుండా ఉంటే, దేవుని ఆశీర్వాదములో జీవితమంతా సంతోషించేవారుగా ఉండేవారు. అలా చెయ్యలేదు గనుకనే ఆశీర్వాదమును పోగొట్టుకున్నారు. అయితే మనము క్షేమముగా ఉండుట కొరకు తన చిత్తమును కలిగి ఉన్నాడు గనుక, ఆయన చిత్తానుసారమైన వాక్యము ప్రకారము చేయటము ఎంతో అవసరము.
మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.౹ -2 కొరింథీయులకు 9:8
దేవుడు మనలను ప్రేమించాడు గనుక ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ చిత్తము మనలో మంచి జరిగించేదిగా ఉంది. ఆ మంచి జరుగునట్లుగా తన కృపను విస్తరింపచేస్తూ ఉన్నాడు. ఈ కృప మన జీవితకాలమంతా మనకు ఆధారమై ఉంటుంది. మన బంధువులో, స్నేహితులో ఎవరైనా సహాయము చేస్తే, ఎంతగా పొగుడుతాము? అటువంటిది మన జీవితకాలమంతటికొరకు ఇంతగా చిత్తము కలిగి కృప విస్తరింపచేస్తున్న దేవునిని ఇంకెంత పాడి, పొగడి స్తుతించాలి? ఎప్పుడైతే మనము సత్యాన్ని గ్రహిస్తామో, అప్పుడు ఆ సత్యాన్ని బట్టి నీవు స్తుతించగలుగుతావు, అప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి సంతోషించువాడిగా ఉంటాడు. దీనికొరకు మనము చేయవలసినది, కేవలము ఆయన బిడ్డగా జీవించడమే, అనగా ఆయన ఆత్మ చేత ముద్రింపబడి, ఆత్మను కలిగి, ఆత్మానుసారముగా జీవించుటయే.
దేవుడు మనలో నివాసము ఉండి, ఆయన మహిమ పరచబడాలి అనేది ఆయన ఉద్దేశ్యము. అందుకే మనము ఆయన మహిమకొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకే దేవుడు మనకు మార్చుకోవడానికి అవకాశము ఇచ్చినప్పుడు తప్పకుండా మార్చుకోవాలి. అలాకాక, ఇచ్చిన అవకాశములను పోగొట్టుకుంటే నష్టపోయేవారముగా అయిపోతాము.
ఒకవేళ ఎక్కడైనా దేవుని బిడ్డగా జీవించలేకుండా ఉంటే, ప్రవర్తించకుండా ఉంటే, దయచేసి పరీక్షించుకుని, ఒప్పుకొని, విడిచిపెట్టి దేవునితో సమాధానపడి అప్పుడు ఆరాధనకొరకు సిద్ధపడండి.
ఆరాధన గీతము
దేవా పరలోక దుతాళి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా
కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా
నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా
వారము కొరకైన వాక్యము
బలిపీఠము గురించి అనేక విషయములు ఉన్నప్పటికీ ఈరోజు ఒక విషయము గూర్చి ధ్యానిద్దాము. మన పితరుడైన అబ్రహాము జీవితములో చూస్తే, విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టినాడు.
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి– నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹ -ఆదికాండము 12:7
మన జీవితములలో కూడా ఆ విధముగా సిద్ధపడాలి, బలిపీఠము కట్టాలి అంటే, ఆ బలిపీఠము యొక్క ప్రాముఖ్యత మనము ఎరిగిఉండాలి. ఆత్మీయ జీవితములో బలిపీఠము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.
అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹ -ఆదికాండము 12:8
లోకములో సైతము చూస్తే, చేతబడులు చేసే మాంత్రికులు ఒక ప్రదేశమును ఎన్నుకుని ఆ ప్రదేశములో వారి దేవతను ప్రసన్నము చేసుకోవడానికి ఒక బలిపీఠము కట్టి, వారి దేవతకు ఇష్టమైన దానిని సమర్పించి ఎవేవో మంత్రాలు పూజలు చేస్తారు.
అయితే అబ్రహాము నిజమైన దేవునికి బలిపీఠము కట్టాడు, ప్రార్థన చేసాడు. ఇంకా మనము యాకోబు జీవితములో కూడా చూస్తే,
యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.౹ తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. -ఆదికాండము 28:10-19
ఇవే మాటలు అబ్రహాముతో చెప్పబడ్డాయి. అయితే యాకోబు అబ్రహాము యొక్క మూడవ తరము. అబ్రహాము బలిపీఠము కట్టిన ప్రదేశమునకు తెలియకనే యాకోబు వచ్చి విశ్రమించాడు. అయితే అబ్రహామునకు ఏమి ఆశీర్వాదాలు చెప్పబడ్డాయో, అవన్నీ యాకోబునకు ఇవ్వబడ్డాయి. ఇంతకు ముందు అబ్రహాము బలిపీఠమును కట్టి, యెహోవా నామమున ప్రార్థన చేసాడు, ఏ ప్రార్థన చేసి ఉంటాడు? అని ఆలోచిస్తే, దేవుడు చెప్పిన ప్రకారము తనవారిని విడిచి అబ్రహాము బయలుదేరి ప్రయాణము మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన వాగ్దానము పొందడము కొరకు బయలుదేరిన అబ్రహాము దేవుని నమ్మకత్వమును గ్రహించి కొంతదూరము వచ్చిన తరువాత, బలిపీఠము కట్టి, కృతజ్ఞతా పూర్వకమైన స్తుతులు, ప్రార్థన చేసాడు. ఆ తరువాత అక్కడకు వచ్చిన యాకోబునకు ఆ ఆశీర్వాదములు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత అనేక దినములు గడిచిన తరువాత మరలా దేవుడు అదే బలిపీఠము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు.
నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.౹ -ఆదికాండము 31:13
అనగా అబ్రహాము బలిపీఠము కట్టిన ప్రదేశమును దేవుడు ఎన్నుకొని, ఆ ప్రదేశమునకు దేవుడుగా ఉండుటకు ఇష్టపడుతున్నాడు. అనుకే యాకోబును మరలా అదే ప్రదేశమునకు తిరిగి నడిపించాడు. అనగా బలిపీఠముగా కట్టిన ప్రదేశమును దేవుడు అంగీకరించి ఆయనే దానికి దేవుడుగా ఉండుటకు ఇష్టపడుతున్నాడు. మన జీవితములో బలిపీఠముగా దేనిని ప్రతిష్టించి అక్కడ మనము ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనలు అన్నీ అంగీకరించబడి, జవాబు పొందుకుంటాము.
యేసయ్య కూడా ప్రతి రాత్రీ కొండమీద ప్రార్థన చేసేవాడు. యేసయ్య ఆ కొండను బలిపీఠముగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే బలిపీఠము వద్ద దేవుని ఉద్దేశ్యము బయలు పరచబడుతుంది అనే సత్యము మనము గ్రహించాలి. మన జీవితములో కూడ, ప్రత్యేకమైన స్థలమును సిద్ధపరచి అక్కడ ప్రార్థన చేయడానికి సిద్ధపరచుకోవాలి. అయితే మనము వేరే చోట ప్రార్థన చేస్తే అవ్వదా? అంటే, అవుతుంది. యేసయ్య కూడా కొండమీద కాకుండా అనేకులకు భోజనము పంచిపెట్టినప్పుడు కూడా ప్రార్థించాడు. అయితే దానికి ముందుకూడా కొండమీద దేవుని చిత్తమును, ఉద్దేశ్యమును గ్రహించుట కొరకు ప్రార్థనలో గడిపాడు. మన జీవితములో కూడా ఒక స్థలమును ప్రత్యేకించుకుని, దేవుని ఉద్దేశ్యములకొరకు కనిపెట్టడము అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడే సమయములో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించగలుగుతావు. బలిపీఠము వద్ద దేవుని చిత్తము తెలియచేయబడుతుంది. మన జీవితములలో ప్రార్థన బలిపీఠము కట్టాలి.
అబ్రహాము మొదటి తరము, యాకోబు మూడవ తరము అయితే కట్టబడిన బలిపీఠమును బట్టి తరువాత తరము ఆశీర్వదించబడింది. మన జీవితములలో కూడా అదే విధముగా జరుగుతుంది. అబ్రహాము మొట్టమొదట దేవుని వాగ్దానమును బట్టి బలిపీఠము కట్టాడు. అయితే ఇంకా వాగ్దానము నెరవేరలేదు. అయితే యాకోబు ఆ బలిపీఠము యొద్దకు వచ్చేసరికి అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానము కొనసాగించబడింది. అయితే ఇంకా వాగ్దానము నెరవేర్చబడలేదు గానీ, యాకోబునకు తోడైయుండి, అతడు వెళ్లు ప్రతి స్థలమందు అతనిని కాపాడుచు దేవుడు వెళ్ళెను. ఈ విధముగా వాగ్దానము కొనసాగుతూ వచ్చింది. అనగా బలిపీఠము వద్ద చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా మానవు.
యేసయ్య రూపాంతరం అనుభవము ఎక్కడ జరిగింది?
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. -లూకా 9:28-32
బలిపీఠముగా ఎంచుకున్న ప్రదేశములో ప్రార్థన చేస్తున్నప్పుడు శక్తివంతమైన అనుభవములు మనము పొందుకుంటాము అని అర్థము చేసుకోవచ్చు. మోషే మరియు ఏలియా యేసయ్యకంటే అద్భుతములు చేసినవారు. ప్రార్థనా బలిపీఠమును కట్టిన వారుగా అనుభవము కలిగినవారు. గనుక మన జీవితములో బలిపీఠము వద్ద ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంతకు ముందు జరిగిన ఆశ్చర్య క్రియలు కొనసాగేవిగా ఉంటాయి.
మన జీవితములో ఏ ఆటంకము లేకుండా, ఎల్లప్పుడు వెళ్ళగలిగే ప్రదేశము, ప్రార్థన చేయగలిగిన ప్రదేశమును సిద్ధపరచుకోవాలి. ఆ ప్రదేశము నీవు బలిపీఠముగా చేసుకుని, అక్కడ నీవు చేసే ప్రార్థనలు, దేవుని చిత్తమును, ఉద్దేశ్యమును తెలుసుకోగలిగిన అనుభవములోనికి వస్తావు. అంతే కాక, ఆ ప్రార్థనా బలిపీఠమును బట్టి నీ జీవితము ద్వారా అనేకులు దేవుని గూర్చిన మహిమను తెలుసుకోగలుగుతారు.
మన జీవితములో అనేకమైనవి మనము చేసేవారముగా ఉంటాము గానీ, అన్నిటిలోనూ సఫలము కాలేము కారణము ఏమిటి అని చూస్తే.
గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.౹ -న్యాయాధిపతులు 6:13
మిద్యానీయుల చేతినుండి ఇశ్రాయేలీయులను విడిపించి రక్షించడానికి దేవుడు ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. అయితే దానికొరకు ఒకపని చేయమని దేవుడు చెప్పాడు –
మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠముకట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను.౹ -న్యాయాధిపతులు 6:25-26
అనగా మొదట దేవునిది కాక కట్టబడిన బలిపీఠము పడగొట్టిన తరువాత దేవునికి బలిపీఠము కట్టాలి. బలిపీఠము అనగా క్రమము తప్పకుండా చేసేదిగా మనము చూడవచ్చు. అపవాది ప్రేరేపణ బట్టి ప్రతీసారి ఏ కార్యమునకు నీ జీవితమును అప్పగిస్తున్నావో, అదే నీవు కట్టిన బలిపీఠము. మొదట దానిని పడగొట్టి అప్పుడు దేవునికి బలిపీఠము కట్టాలి. అప్పుడు ఆ బలిపీఠము యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాము.