స్తోత్ర గీతము 1
అన్ని నామములకన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది
క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయం
సాతాను శక్తుల్ లయం లయం
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్
పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును
క్రీస్తేసుని నామము ‘యేసు’
సాతానుపై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసు నామము
శత్రుసమూహముపై జయమిచ్చును
జయశీలుడైన
యేసు నామము ‘యేసు’
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము ‘యేసు’
స్తోత్ర గీతము 2
స్తోత్రార్హుడవు మహిమార్హుడవు
ఘనతార్హుడవు బహు స్తుతికి పాత్రుడవు
స్తుతులందుకో సింహాసనాసీనుడా
మహిమ ఘనతా ప్రభావము నీకే
కలుగును గాక…కలుగును గాక… కలుగును గాక
(నా)స్తుతులందుకో సింహాసనాసీనుడా ….
మహిమ ఘనతా ప్రభావము నీకే
కెరూబులు సెరపులు మహా దూతల సైన్యం
దివారాత్రులు నిన్ను స్తుతిస్తూవుండగ
ఏ పాటి దాననాయ .. ఎంతటి దాననాయ
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక
ఇరువది నలుగురు పెద్దలందరూ కూడి
సాగిలపడి నిన్నే నమస్కరింపగా
పరిశుద్ధుడు పరిశుద్ధుడని .. నిత్యము మ్రొక్కుచుండెను
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా ….
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక
ప్రతిజాతి వంశములు నీ సన్నిధి చేరి
మహా దేవుడా నిన్నే సేవింప వేడగా
ఆ దినము నే తలచగా ..
నా హృదయం ఉప్పొంగేనే ..
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా ….
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక
స్తోత్ర గీతము 3
నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
అనుపల్లవి:వందనం యేసయ్య – వందనం యేసయ్య
ఏ పాటివాడను నేను – నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి – నన్నెంతగానో దీవించావు
బలహీనులమైన మమ్ము – నన్నెంతగానో బలపరచారు
క్రీస్తేసు మహిమైశ్వరములో – ప్రతి అవసరమును తీర్చావు
ఆరాధన వర్తమానము
ఈ సమయములో దేవుని సన్నిధిలో మన అందరము ధన్యులము. దేవుని ఆరాధించడానికి లోకమంతా ఒకవైపుకు వెళుతుంది, మనము మరొక వైపు ఉంటున్నాము. ఎందుకు మనము నమ్మిన దేవునిని వెంబడిస్తున్నాము అనేది మనము ఎరిగి ఉండాలి.
ఆయనను వెంబడించినంత కాలము, మనము పోషించబడతాము. గొర్రెలు కాపరిని వెంబడించినంత కాలము పోషించబడతాయి. మేత కొరకు స్థలము సిద్ధపరచుటలో కొంత సమయము కష్టము కలుగవచ్చు గానీ, మనము పోషింపబడటము మాత్రము ఖచ్చితము. పోషణ అంటే, నీ జీవితమునకు అవసరమైన ప్రతీదీ కేవలము ఆహారము మాత్రమే కాదు.
మన జీవితములు ఎండిన జీవితములు కానే కాదు! మన జీవితమునకు ఆధారము మన దేవుడే అయి ఉన్నాడు. సమస్తమును ఆయనను బట్టి, ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడుతున్నాయి.
కాపరి అందించే పోషణ కొరకు గొర్రెలు చేయవలసిన ఏకైక పని, ఆయనను వెంబడించడమే! ఒక్కోసారి రాళ్ళమీద నడిపించవలసి ఉంటుంది, అయితే ఆ సమయము అయిపోయిన తరువాత, మరల మంచినేల ఖచ్చితముగా వస్తుంది.
యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. -కీర్తనలు 150:1
మనము మన దేవుని సన్నిధికి నడిపించబడ్డాము, ఇప్పుడు ఆయనను స్తుతించాలి. ఆయన సన్నిధిలో ఉన్నపుడు ఆయనను స్తుతించకుండా మౌనముగా ఉండకూడదు. ఆయనను గూర్చిన సత్యమును ఎరిగిన వారు ఖచ్చితముగా మౌనముగా ఉండరు.
ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. -కీర్తనలు 147:8-9
ఈ వాక్యమును బట్టి మన దేవుడు “సిద్ధపరచేవాడు” అని అర్థము చేసుకొనగలము. అరచుచుండు పిల్లకాకులకే ఆయన ఆహారమిచ్చువాడు అయితే వాటికంటే ఎంతో శ్రేష్టమైన మనకొరకు ఇంక ఎంత ఖచ్చితముగా సిద్ధపరుస్తాడు?
భూమి కొరకు ఎలా అయితే వర్షమును సిద్ధపరచాడో, అలాగే మనకొరకు కూడా ఆయన సిద్ధపరచినవాడుగా ఉన్నాడు. ఉదాహరణకు మనకు జన్మదినము గానీ, మరే దినమైనా గానీ మనము జరుపుకుంటున్నపుడు, నూతన దయాకిరీటము దయచేసాడు అని ఆరాధిస్తాము. అయితే ఆ సంవత్సరములో ఏమి జరగాలో ఎప్పుడు జరగాలో అంతా ముందే నిర్ణయించి ఆ దయా కిరీటము ధరింపచేసాడు. అలాగే, అపవాది మన జీవితములను లాక్కుపోవడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తూనే ఉంటాడు. మనము దేవునికి స్తుతి ఆరాధన చేసినపుడు, కృతజ్ఞత చెల్లించినపుడు ఆ అపవాది ప్రయత్నములను లయము చేసేదిగా ఉంటుంది. ఒకవేళ నీ జీవితములో ఎండిన స్థితి ఉంటే, నీవు చేసే స్తుతి ఆరాధన ఆ ఎండిన స్థితిని జీవముతో నింపుతుంది.
అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారము ఇస్తున్నాడు అంటే, ఏమికావాలి అని అవి అరుస్తున్నాయో, ఆ కోరిక తీరులాగున వాటికొరకు సిద్ధపరచువాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా కోరినదానిని దయచేయువాడుగా మన దేవుడు ఉన్నాడు. అసలు దేవుని కృపను గూర్చి తెలిసినవాడు అలా నిలబడగలుగుతాడు. కృప మన వల్ల కానిదానిని సాధ్యము చేస్తుంది. మనము ఎప్పుడు కృపకొరకు కనిపెడతాము? మనకు కష్టము, శ్రమ ఉన్నప్పుడు కృప కొరకు కనిపెడతాము.
గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీమధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. -కీర్తనలు 147:10-13
మనము కృపకొరకు కనిపెడుతున్నపుడు ఆశీర్వాదము కలుగుతుంది. గుమ్మముల గడియలు బలపరచబడుతాయి, అంటే శత్రువు చేసే ప్రతీ దాడినుండి రక్షణ కలుగుతుంది. అలాగే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించియున్నాడు.
అటువంటి దేవునిని మనము స్తుతించకుండా ఎలా ఉండగలము? మన సంతోషమునకు వ్యతిరేకముగా ఏమి జరగనివ్వని దేవుడు మన దేవుడు. ఏ మానవుని అపవాది తన కుయుక్తి ద్వారా మోసముచేసి, దేవుడిచ్చిన దానిని పోగొట్టుకొనేలా చేసాడు. అప్పుడు నీ దేవుడు రోషము కలిగి, మానవ రూపములో వచ్చి ఆ మరణమును జయించి మనకు స్వాతంత్ర్యము ఇచ్చాడు. ఇంక మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్థిల్లదు అని ప్రభువు చెప్పుచున్నాడు. అయితే మనము యదార్థముగా వెంబడించాలి.
యోబు యదార్థముగా దేవునిని వెంబడించాడు. సమస్తమును పోగొట్టుకున్న తరువాత కూడా యెహోవ ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పగలిగాడు. దేవుని చేత ఆశీర్వాదము మాత్రమే అనుభవిస్తామా? శ్రమ అనుభవించమా? అని అడగగలిగాడు. అందుకే ఆ శ్రమ తీరిన తరువాత, రెండంతల ఆశీర్వాదము పొందగలిగాడు.
మన జీవితము దినదినము, అంతకంతకు వృద్ధి కలుగజేయబడే జీవితము. దేవుని వెంబడిస్తున్న మన జీవితములో మరణమే లేదు.
ఆరాధన గీతము
నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు
నీవు లేని జీవితం అంధకార బంధురం
నీవు నాకు తోడుంటే చాలును యేసు
శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
వారము కొరకైన వాక్యము
దేవుని వాక్యము మనలను జీవింపచేస్తుంది. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నవాడు నిలబెట్టేవాడుగా ఉంటాడు. ఈరోజు తగ్గింపులో ఉన్న ఆశీర్వాదమును గూర్చి నేర్చుకుందాము.
తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. -మత్తయి 23:12
తగ్గింపులో ఏదో దాచబడి ఉన్నది, ఆ తగ్గింపులో ఆశీర్వాదము ఉంది. ఒకసారి పరిసయ్యుడు, సుంకరి భాగము మొరొక సారి జ్ఞాపకము చేసుకుందాము.
పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. -లూకా 18:11-12
పరిసయ్యుడు చేసినదానిలో ఏమైనా తప్పు ఉందా? అని ఆలోచిస్తే, “యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను” అని చెప్పుచున్నాడు. అలాగే తన ఆచార వ్యవహారములలోని నిష్టను చెప్పుచున్నాడు. ఈ మాటలను బట్టి, తాను అలా ఉన్నందుకు గర్వముగా పరిసయ్యుడు భావిస్తున్నాడు. గనుక ఈ తగ్గింపులేని స్వభావమును బట్టి ఈ పరిసయ్యుడు విడిచిపెట్టబడ్డాడు.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. -లూకా 18:13-14
ఈ సుంకరి పరిసయ్యుని వలే మంచి క్రియలు, లేదా నిష్ట అయిన ఆచారమును పాటించని దానిని బట్టి పాపిగా తనకు తాను ఒప్పుకుని, తనను తాను తగ్గించుకున్నదానిని బట్టి, అర్హత లేనప్పటికీ, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు.
ఇది మనకు ఎంతో ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఒకవేళ నీవు ప్రభువు కొరకు చేస్తున్న దానిని బట్టి, నీ గురించినీవు ఒకవేళ నీవు అతిశయిస్తే, నీవు నీతిమంతుడివిగా ఎంచబడవు. అదే నీవు చేయగలుగుటకు కృపనిచ్చిన దేవుని యందే నీవు అతిశయించినయెడల, నీతిమంతుడివిగా చేయబడతావు.
మనుష్యుల దృష్టికి నీవు తగ్గించుకున్నపుడు నిన్ను వారు ఉపయోగించుకుంటారు, లేదా నిన్ను కించపరచేవారుగా ఉంటారు. అయితే దేవుడు మాత్రము, నీవు తగ్గించుకున్నదానిని బట్టి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. -మత్తయి 15:24-28
ఇక్కడ కనానీయురాలు యేసయ్య దగ్గర తనను తాను చాలా తగ్గించుకుంది. యేసయ్యను యజమానుడుగా అంగీకరించి, తనను తాను కుక్కపిల్లగా కూడా అంగీకరించింది. వెంటనే “అమ్మా” అని యేసయ్య పిలిచి ఆమె కోరినట్టే ఆమెకు చేసాడు. తగ్గింపులోని ఆశీర్వాదము ఇదే!
దేవుని పని విషయములో, ఆత్మ సంబంధమైన విషయములలో మనము తగ్గింపు కలిగి ఉండాలి. మన స్టేటస్ ని దేవుని పనిలో చూపించకూడదు. అలాగే మన అహం అనేది, సంఘపు పనిలో మనము చూపించకూడదు. అలా మనలను మనము తగ్గించుకున్నప్పుడు మనము కోరినది దయచేసేవాడుగా మన దేవుడు ఉంటాడు.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి –ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు –నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. -మత్తయి 8:5-8
శతాధిపతి ఏ ఆలోచనతో యేసయ్య వద్దకు వచ్చాడు? యేసయ్య ముట్టవలసిన అవసరమే లేదు, మాట పలికితే చాలు అనే ఆలోచనతో వచ్చాడు. యేసయ్య ఇంటికి వస్తాను అని చెప్పగానే, నేను యోగ్యుడను కాదు ప్రభువా అని చెప్పి, నీవు మాట పలుకు అని చెప్పాడు. ఇలా తనను తగ్గించుకున్నాడు కాబట్టి, తాను కోరుకున్నట్టే, తన దాసుడు స్వస్థపరచబడ్డాడు.
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. -మత్తయి 8:10
అంతట యేసు – ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. -మత్తయి 8:13
ఆ శతాధిపతి తగ్గించుకున్న దానిని బట్టి, ఆ గడియలోనే ఆ శతాధిపతి కోరినట్టే, తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. మనము కూడా ఇటువంటి తగ్గింపు స్వభావము కలిగి ఉంటే, మనము కోరినట్టే జరుగుతుంది. మనము ఎంతగా ఆశీర్వదించబడినా, ముప్పదంతలయినా, అరువదంతలైనా, నూరంతలైనా మనము మాత్రము మన నిజ స్థితి గ్రహించి, ఒప్పుకుని, తగ్గించుకుని ఉన్నపుడు మన హృదయవాంఛలు తీర్చబడతాయి.