స్తోత్ర గీతము 1
యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ గంభీరము గా పాడెదను,
ప్రభువుల ప్రభు చేయు మేలులు తలచి కరము తట్టి పాడెదను
యెహోవా షాలోం యెహోవా షమ్మా
యెహోవా రువా యెహోవా రాఫా
ఎల్-రోయ్ హల్లెలూయా నన్ను చూచినావయ్యా
ఆశలన్నీ తీర్చావయ్యా
నా దాహమును తీర్చిన జీవ జల ఊటవు
దాహమంతతీర్చావయ్యా
ఎల్-షడ్డాయ్ గొప్ప దేవ నిత్యము నడుపు వాడా
ఎల్లప్పుడు నాతో ఉందువు
ఎబినేజర్ నీవేనయ్య సహాయము చేయు వాడా
భారమంతా తీర్చావయ్యా
ఎలోహిం సృష్టికర్తా సర్వశక్తి వంతుడా
సర్వము నీ వశమే
ఇమ్మాన్యుయేల్ దైవమా మాకై వచ్చినవయ్యా
నిత్యము మా తోడు నీవే
స్తోత్ర గీతము 2
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను
నే పాడెదన్ – కొనియాడెదన్
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును
||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ
||ప్రేమా||
మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ
||ప్రేమా||
స్తోత్ర గీతము 3
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంతా నేను వెతదకినా
నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన
నా హృదయం పొంగెను
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏది నా సొంతం కాదు అనుకున్నాను
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా
నన్ను మరువని ప్రేమ నీ దయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా
ఆరాధన వర్తమానము
దేవుని నామములో మీ అందరికీ శుభములు. మరొక దినము తన సన్నిధిలో మనలను నిలబెట్టిన ప్రభువుకే మహిమ కలుగును గాక, ఆమేన్!
కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని౹ మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,౹ నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. -ఎఫెసీయులకు 4:22-24
గడచిన సంవత్సరములు వచ్చి దేవుని వాక్యమును విని వెళ్ళిపోయేవారముగా ఉన్నామేమో. అయితే ఈసారి మాత్రము, విన్న వాక్యమును మరువక, ఆ వాక్యము ప్రకారము మన జీవితమును కట్టుకొని, దేవునికి మహిమకరముగా సిద్ధపడదాము.
మన దేవునిని ఆరాధించడానికి ఎల్లప్పుడు జ్ఞాపకము పెట్టుకోవలసిన విషయము, మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉండుట. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని తెలుసుకోలేకపోవడము చేత, వారు దేవుని అద్భుతములు కోల్పోయినవారుగా ఉన్నారు. వారు తమ దేవుడు ఏమై ఉన్నాడో ఎరగని కారణము చేత, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఫరో చేతిలోనుండి విడిపించి, నడిపించిన దేవుని మరచి, ఒక దూడను చేసుకొని, వారిని నడిపించింది ఆ దూడయే అని వారు దేవుని విసిగించినవారుగా ఉన్నారు.
ఈరోజు పెంతెకోస్తు దినము. మోషే దినములలో ధర్మశాస్త్రము ఇచ్చిన తరువాత 50 వ రోజుల తరువాత 3000 మంది చనిపోయారు. అయితే ప్రభువైన క్రీస్తు పునరుత్థానుడైన తరువాత 50 వ రోజుల తరువాత 3000 మంది రక్షించబడ్డారు.
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3
మనలను దేవుడే పుట్టించాడు. ఆయన చేతులు మనలను సృష్టింపచేయబడింది. ఆదామును మట్టితో చేసాడు, అయితే మనలను ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరమును నలుగగొట్టుకొని మనలను నిర్మించారు. యేసు ప్రభువే మన గుర్తింపు. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అయి ఉన్నాము.
మన దేవుడు మన కాపరి గనుక, ఆయనను వెంబడించినంతకాలము, చక్కగా మేలైన మేత మేసి తృప్తిచెందేవారముగా ఉంటాము. ఎందుకనగా ఆయన మనలను జీవము వైపే నడిపించేవాడుగా ఉన్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ -కొలొస్సయులకు 1:16
సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. అనగా మనకు కావలసిన ప్రతీదీ, ఆయనను బట్టి, ఆయన ద్వారా కలుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఉదాహరణకు మనకు ఉద్యోగము కావాలి, ఆరోగ్యము కావాలి అంటే అది ఎలా జరుగుతుంది?
నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. మరి దేవునిని విశ్వసించాలి అంటే ఆ విశ్వాసానికి పునాది ఏమిటి? నీ దేవుడు మృతమైనదానిని సజీవముగా చేయగలవాడు, లేనిదానిని ఉన్నట్టుగా చేయగలవాడు అనే సత్యమే!
దేవుడు కాపరిగా ఉండి, మనము గొర్రెలుగా ఉంటున్నాము. ఎలా అయితే కాపరి వెంట గొర్రెలు నడుస్తాయో అలాగే మనము కూడా యేసయ్య వెంట నడిచేవారిగా ఉండాలి. లోకమునకు యేసయ్యను గూర్చిన సత్యము తెలియలేదు గనుకనే ఆయనను పొందుకోలేని వారిగా ఉంటున్నారు.
ఒక కాపరి తన గొర్రెలను నడిపించే క్రమములో ఒక్కోసారి కొంతకాలము వ్యవధిలో ఇబ్బంది కలగవచ్చేమో గానీ, ఆ ఆటంకములలో, ఇబ్బందిలో, శ్రమలో నీవు ముగించబడవు కానీ, ఆయన సిద్ధపరచిన జీవమును ఖచ్చితముగా పొందుకుంటావు. ఎందుకనగా, ఆయనే సిద్ధపరచి ఇచ్చేవాడుగా ఉన్నాడు.
మన జీవితములో ప్రతీ క్షణము ఆయన మహిమపరచబడాలి అనేది ఆయన కోరిక. గనుకనే ఆయన మనలను తృప్తిపరచడానికి సమస్తము చేసేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయనే రాజుగా ఉండాలి అని కోరుకున్నాడు. అయితే వారు మాత్రము మరొక మనుష్యుడు వారికి రాజుగా ఉండాలి అని కోరుకున్నారు. ఈ లోకములో తల్లి ప్రేమకు సాటిలేదు, గానీ దానికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ.
తల్లి మరణమగునంతగా శ్రమపడటానికి సిద్ధపడి జన్మనిస్తుంది. యేసయ్య తన ప్రాణమంతా ధారపోసి మనలను కనినవాడై ఉన్నాడు.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును. -కీర్తనలు 100:4-5
గతవారమంతా మనకు కావలసిన సమస్తము సిద్ధపరచారు గనుక మనము మన హృదయమును కృతజ్ఞతగా అర్పించాలి. ఎలా అంటే, ప్రభువా నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణము నా బలము, నా శక్తి కాదు గానీ, నీ కృపయే నీ దయయే అని ఒప్పుకొనుటయే కృతజ్ఞతార్పణ చెల్లించుట.
అన్నీ బాగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించడము సులభమే! అయితే మరి పరిస్థితి బాగా లేనపుడు ఎలా కృతజ్ఞత చెప్పగలము?
శ్రమలోనూ నీ దేవునికి కృతజ్ఞత చెల్లించగలగాలి అంటే, నీ దేవుడు మృతమైనదానిని సజీవముగా చేయగలవాడు, లేనిదానిని ఉన్నట్టుగా చేయగలవాడు అనే సత్యమును ఎరిగిఉండాలి. ఆయన నమ్మదగినవాడు, పోషించువాడు, విడిచిపెట్టేవాడు కాదు. నీకున్న వెలితిని తీర్చగలవాడు నీ దేవుడు.
ఈ సత్యమును గ్రహించాడు గనుకనే, గొల్యాతు రూపములో శ్రమ మరణ భయము ఎదురుగా ఉన్నపుడు, దావీదు సింహము, ఎలుగుబంటి నోటినుండి తప్పించిన దేవుడు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడి చేతిలోనుండి తప్పిస్తాడు అని చెప్పగలిగాడు.
మనము దేవుని సన్నిధికి కానుకలు తీసుకుని వస్తాము. అయితే దానికి ఎలా అర్పించాలి. గతవారమంతా నా జీవితములో నీవు చూపిన నమ్మకత్వమును బట్టి, ఆయనకు కృతజ్ఞతాపూర్వకముగా, ఆయన ఇచ్చినదానిలోనుండే అర్పిస్తున్నాను అనే హృదయముతో మనము అర్పించినపుడు అది దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటుంది.
చిన్న మేలు ఒకరి ద్వారా పొందుకున్నపుడు, వారికి ఎదో ఒకటి కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చేవారముగా ఉంటాము. అలాగే మనము పొందిన మేలును బట్టి మనము చూపించే కృతజ్ఞత కూడా వేరుగా ఉంటుంది. ఆ కృతజ్ఞతాభావముతో స్పందించినపుడు ఆ సహాయము చేసినవాడి హృదయములో మంచి స్థానము ఇస్తాడు. మారలా ఎపుడైనా మరొక అవసరము వచ్చినపుడు చేయడానికి సిద్ధముగా ఉంటాడు.
గనుక ఈ రోజు మనము మన దేవునికి హృదయపూర్వకముగా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మహిమపరచి ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంతా నేను వెతదకినా
నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన
నా హృదయం పొంగెను
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏది నా సొంతం కాదు అనుకున్నాను
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా
నన్ను మరువని ప్రేమ నీ దయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా
వారము కొరకైన వాక్యము
కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని౹ మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,౹ నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. -ఎఫెసీయులకు 4:22-24
దేవుని మాట ఎంతో శక్తివంతమైనది. ఆత్మీయమైన జీవితమును ఆశీర్వదించాలి అనేది దేవుని ఆలోచన అయి ఉన్నది.
ఆత్మీయముగా ఉండాలి, బలపరచబడాలి అనే ఆలోచన, ఆశ ప్రతీ క్రైస్తవుడికి ఉంటుంది. అయితే దానికొరకు మనలో ఒక మార్పు కనపడాలి.
మనం మునుపటి ప్రవర్తన ఎలా ఉండేది? క్రైస్తవులము గనుక, ఆదివారము సంఘమునకు వెళ్ళాలి, కానుక అర్పించాలి అనే ఆలోచనతో ఉండేవారము.
శూన్య స్థితి అనేది క్రీస్తును అంగీకరించకమునుపు. అది మరణముతో కూడిన స్థితి. ఆ తరువాత క్రీస్తును అంగీకరించిన తరువాత పునాది వేయబడిన స్థితిలోనికి వెళతాము. అలా మనము క్రీస్తులో ఎదిగిన తరువాత మొదటి మెట్టు ఎక్కిన స్థితిలోనికి వెళతాము. అప్పుడు మన ఎదుగుదలను ఎలా పోల్చుకుంటాము? పునాది స్థితిలో ఉన్నపుడు ఎలా ఉన్నామో దానితో పోల్చుకుంటాము.
పునాది స్థితిలో ఉన్నపుడు, మనకు వాక్యము తెలియదు. అయితే దేవునిలో ఎదిగిన తరువాత వాక్యము మనకు కొంత తెలిసింది. పునాది స్థితిలో ఉన్నపుడు, పాటలు అయిపోయాక, ఆరాధన అయిపోయాక వాక్యము సమయానికి వెళ్ళేవారముగా ఉంటాము. అయితే క్రీస్తులో ఎదిగిన తరువాత మొదటి ప్రార్థన సమయమునకే వెళ్ళి కూర్చొనేవారముగా ఉంటాము. ఇలా మనలో మునుపటి ప్రవర్తన విషయములో మార్పు ఉండాలి. ఇటువంటి మార్పు మనలో ఉంటుందా లేదా అనే పరీక్ష మనము చేసుకోవాలి. ఆ మార్పు లేనపుడు ఎన్నిసార్లు సంఘమునకు వెళ్ళినప్పటికీ, హృదయములో ఏ మార్పు కనపడదు.
చిన్నపిల్లలను చూస్తే, నడవటము నేర్చుకునే సమయములో అనేకసార్లు పడతారు. అయితే నడక వచ్చిన తరువాత వారు ఇంక పడరు. అలాగే మనము మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకోవాలి. దురాశ అనేది శరీర కార్యములకు సంబంధించినది. ఉదాహరణకు సోమరితనము అనేది శరీరకార్యము. ఇంతకుముందు అనగా పునాది స్థితిలో ఉన్నపుడు, దేవుని వెంబడించకుండా నీ సోమరితనము అడ్డుగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ శరీరమును జయించగలిగిన ఆత్మచేత నడిపించబడే నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. అనగా దేవుని సన్నిధిలో కనబడటానికి ఎంతో ఆశకలిగి పెందలకడనే సిద్ధపడేవారిమిగా ఉండాలి.
అలాగే మునుపు దేవుని సన్నిధికి వచ్చిన మనము వాక్యము విని వెళ్ళిపోయేవారముగా ఉండేవాళ్ళము. అయితే ఆయనలో ఎదిగిన మనము ఎలా ఉండాలి? దేవుని స్వాస్థ్యములో సమస్తము పొందుకొనుటకు అర్హుడవే, అర్హురాలివే కానీ నీలో ఎదుగుదల లేని కారణముచేత నీవు పొందుకోలేకపోతున్నావు. వారసుడు అన్నింటికీ కర్త అయినప్పటికీ, బాలుడై ఉన్నంతకాలము దాసునితో సమానముగా ఉంటాడు.
తండ్రి, కుమారుడు, దాసుడు అనే వారిని చూసినపుడు. కుమారుడు పుట్టినప్పుడు కుమారుడే, 40 యేళ్ళు దాటినా కుమారుడే. తండ్రికి కలిగిన సమస్తములో తీసుకొనగలిగే అర్హత ఉన్నప్పటికీ, వాడు పరిపక్వము చెందనికారణముచేత, మనసు ఎదగని కారణము చేత, దాసుని వలే తండ్రిని అడిగి, ఇస్తేనే తీసుకొనేవారిగా ఉంటాడు.
మనము కూడా ప్రతీ వారము మనము దేవుని సన్నిధిలో బైబిల్స్ తెచ్చుకుంటాము, నోట్స్ రాసుకుంటాము. అయితే ఇంటికి వెళ్ళినతరువాత వాటిని పక్కన పెట్టేవారముగా ఉంటాము. పునాది స్థితిలో ఉన్నపుడు మనలో ఎదుగుదల లేదు గనుక అలా ఉండేవారము. అయితే ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు.
మనము క్రీస్తులో పునాది స్థితి నుండి మొదటి మెట్టు ఎక్కుతాము, ఆ తరువాత రెండవ మెట్టు ఎక్కుతాము. ఎలా ప్రతీ మెట్టుకూ ఒక్కోక్క నూతనమైన ఆశీర్వాదము దాచిపెట్టబడి ఉంది. మన జీవితములో పిల్లలు వయసుకు వచ్చినా సరే, వారు మానసికముగా ఎదగకపోతే ఎంతగా మనము కుమిలిపోతాము? అదే మరి క్రీస్తును అంగీకరించిన మనము ఎన్ని సంవత్సరములు అయినా సరే మరలా మరలా సాతానుకు లోబడిపోయే జీవితము కలిగి ఉంటే, మన పరలోక తండ్రి ఎంతగా కుమిలిపోతాడు?
బాప్తీస్మము తీసుకున్నపుడు మనము మన జీవితమంతా దేవునికే సాక్ష్యముగా ఉంటాను అని చెప్తాము. అలా మనము సాక్ష్యము కలిగి ఉండాలి అంటే, దేవుని వాక్యమే ఆధారము. మన జీవితములో ఆత్మీయమైన ఎదుగుదల కనపడనపుడు, ఇంకా మన ఆత్మీయ జీవితము పునాది స్థితిలోనే ఉన్నట్టయితే, మనకు సిగ్గు కలగాలి. ఖచ్చితముగా నీవు నవీన స్వభావమును కలిగి ఉండాలి.
పునాదిలో దేవుని వాక్యమును వింటాము. మొదటి మెట్టులో దేవుని సన్నిధికొరకైన ఆసక్తి వృద్ధిచెందుతుంది. రెండవ మెట్టులో దేవుని వాక్యము హృదయములో నాటబడుతుంది. మూడవ మెట్టులో, ఆ నాటబడిన వాక్యము ప్రకారము జీవితమును సరిచేసుకుంటాము. నాల్గవ మెట్టులో, నీవు అనుభవించిన వాక్యమును ధైర్యముగా ప్రకటించేవాడివిగా ఉంటావు.
యదార్థమైన భక్తి నవీన స్వభావమును కలిగిస్తుంది. ప్రాచీన స్వభావము మనలను చెడగొడుతుంది. అలా ప్రాచీన స్వభావమును మాత్రమే కలిగి ఉంటే, ఎక్కడికి వెళతాము అంటే? మరణమునకే! అందుకే ఆత్మీయమైన విషయములో నిర్లక్ష్యము అనేది ఎంతో ప్రమాదకరమైనది.
–ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. -లూకా 18:10-12
ఈ పరిసయ్యుడు దొంగతనము చెయ్యట్లేదు, అన్యాయము చేయ్యట్లేదు అలాగే దేవుని కొరకైన ఆచారములను నిష్టగా పాటిస్తున్నాడు అని ప్రభువునొద్ద ప్రార్థిస్తున్నాడు అయితే తన హృదయములో తగ్గింపు లేదు. ఈ పరిసయ్యుని భక్తి ఆచారయుక్తమైనదే కానీ, యదార్థమైనది కాదు.
దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలిక అంటే ఏమిటి? దీనికొరకు యేసయ్యను జ్ఞాపకము చేసుకుందాము. యేసయ్య ప్రతీ దినము దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఇంకా తెల్లవారక మునుపే ఆయన దేవుని సన్నిధిలో కనపడటము అసలు మానలేదు. తండ్రి ఏమైతే చెప్పుచున్నాడో, ఆ మాటలను వినినవాడుగా ఉండి, ఆ విన్న మాటలనే తన జీవితము ద్వారా కనపరచి, ప్రకటించినవాడుగా ఉన్నాడు, దేవుని కొరకైన సాక్షిగా ఉన్నాడు.
గనుక మనము ఎలా ఎదుగుతున్నాము? ప్రాచీన స్వభామును వదలుకుని నవీన స్వభావమును కలిగి ఉంటున్నామా? పునాది స్థితినుండి మెట్టు మెట్టు ఎదుగుతున్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు ప్రభువు ఇచ్చిన ప్రేమ పూర్వకమైన హెచ్చరికను మనము అంగీకరించి, మన జీవితమును మార్చుకుని ప్రభువును సంతోషపెడదాము.