19-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ఆయన దీవించు వాడు

స్తోత్ర గీతము 1

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||

స్తోత్ర గీతము 2

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||

స్తోత్ర గీతము 3

మహోన్నతుని చాటునా నివసించువారు
సర్వశక్తుని నీడనా విశ్రమించువారు “2”
ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు “2”
“మహోన్నతుని”

1. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును “2”
ఆయనే సత్యము కేడెము డాలును “2”

కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు హల్లెలూయ
కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
“మహోన్నతుని”

2. నీకు ప్రక్కను వేయిమంది పడినగాని
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలినగాని “2”
కీడు నీ యొద్దకు ఎన్నడు రానియ్యడు “2”
“కృతజ్ఞతలర్పించుడి”

3. నీకు అపాయమేమియు రానే రాదుగా
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా “2”
ఆయన నిన్ను గూర్చి దూతలకాగ్నపించును “2”
“కృతజ్ఞతలర్పించుడి”

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో గడుపుట మహాభాగ్యము. శ్రమలు అనుభవించుటకంటెను దేవుని సన్నిధిలో గడుపుట మహాభాగ్యము. క్రైస్తవ జీవితమంతా పోరాటమే! ఈ సత్యము నీవు ఎరిగితే ఇంక దేనికీ భయపడవు. అయితే ఈ పరిస్థితులలో నిలబడాలి అంటే దేవుని గూర్చిన సత్యము ఎరిగి ఉండాలి.

నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి. -కీర్తనలు 6:6-7
నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు. -కీర్తనలు 6:10

మన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు.

నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. -కీర్తనలు 4:1

మీరు పోరాటములో ఉన్నప్పుడు, “నీతికి ఆధారమగు దేవా” అనే వాక్యము బాగా జ్ఞాపకము చేసుకోవాలి. దీని అర్థము ఏమిటి అంటే, నీవు దేవునిని గూర్చి ఏ విషయములో నమ్మి నీ పోరాటములో నిలబడుతున్నావో ఆ నమ్మకమునకు ఆధారము నీవే!

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము -కీర్తనలు 103:1-2

ఇంతకు ముందు నాకు ఇరుకులో విశాలత కలుగచేసినవాడు అయిన దేవుడే నాకు ఇప్పటి నా పరిస్థితిలో నిలబడగలడానికి ఆధారము అని నమ్మి నిలబడితే, నీ పోరాటములో నీకు విజయమే! అలా నిలబడినప్పుడు దేవుని వాక్యము చేత ఆదరణ కలిగేదిగా ఉంది.

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు. -కీర్తనలు 5:11-12

అనేకమైన పరిస్థితులు మీ ముందు ఉన్నప్పటికీ ఓటమికి లొంగిపోవద్దు! అయితే వాక్యమును జ్ఞాపకము చేసుకుని, దానినే ఆధారము చేసుకొని నిలబడినప్పుడు, ఖచ్చితముగా విజయమే!

మనలను కునుకక నిత్యము కాపాడువాడు అయిన దేవుడు ఉండగా మరి ఎందుకు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే, నీ అమూల్యమైన విశ్వాసము అగ్నివంటి పరిస్థితుల ద్వారా పరీక్షింపబడి నీవు దేవుని మహిమకు సాక్ష్యముగా ఉండుట ఆయన చిత్తము.

నీతిగా నీవు జీవించడానికి నీవు సిద్ధపడినప్పుడు ఆశీర్వాదము నీవెంటే. నీతిగా జీవించుట అంటే, ఆయన ఏమై ఉన్నాడో, దానిని నమ్మి నిలబడటమే!

ఆరాధన గీతము

ఆశ్రయమా-ఆధారమా నీవే నా యేసయ్య…
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా
నిన్ను విడిచి నేను ఉండలేను
క్షణమైనా నీ బ్రతుకలేను

కష్టకాలములు నన్ను కృంగదీసిననూ
అరణ్యరోదనలూ నన్ను ఆవరించిననూ
నా వెంట నీవుండినావు- నీ కృపను చూపించినావు “ఆశ్రయమా”

వారము కొరకైన వాక్యము

మన దేవుడు దీవించువాడై ఉన్నాడు. దీవెన అనే మాట వినగానే మనకు ఎంతో సంతోషముగా ఉంటుంది. అయితే వాక్యము ఏమి చెప్పుచున్నదో ఆ ప్రకారము మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. “వాక్యము నా పాదములకు దీపము అయి ఉన్నది” అని వ్రాయబడి ఉన్నది. చీకటిలో మన దగ్గర ఒక దీపము వున్నప్పుడు మనము వెళ్ళే త్రోవ స్పష్టముగా కనబడుతుంది. కాబట్టి అవరోధాలు తప్పించుకుని వెళ్ళగలుగుతాము. అయితే మరి వాక్యము ఎక్కడ వెలుగై ఉన్నది? మన జీవిత ప్రయాణములో వెలుగై ఉన్నది. ప్రయాణాలలో ఎత్తుపల్లాలు ఎలా అయితే రాక మానవో, జీవిత ప్రయాణములో కూడా ఎత్తుపల్లాలు తప్పవు. కానీ, ఎవరైతే వాక్యమును ఎరిగిఉంటారో, వారు ఆ అవరోధాలు తప్పించుకోగలుగుతారు.

మన దేవుడు ఆయన వద్దకు వచ్చిన ప్రతీవారినీ దీవించువాడుగా ఉన్నాడు. అయితే ఆ దీవెనలు ఎవరి జీవితాలలో స్థిరపడతాయి అనేది ఈరోజు తెలుసుకుందాము. ప్రభువు ప్రేమకు కండిషన్స్ ఏమీ లేవు అయితే ప్రభువు దీవెనలు స్థిరపరచబడటానికి కండిషన్స్ ఉన్నాయి.

ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక౹ -యోహాను 4:4

“వెళ్లవలసివచ్చెను” అని వ్రాయబడింది. ఎందుకు వెళ్ళవలిసి వచ్చింది అని ధ్యానిస్తే, అక్కడ సమరయ స్త్రీ జీవితములో దేవుని చిత్తము జరిగించి, దీవించడము కొరకు.

సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹ ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.౹ -యోహాను 4:7-8

దేవుని చిత్తము నీపై ఉన్నపుడు ఆయన నిన్ను సంధిస్తూనే ఉంటాడు. ఎందుకంటే, నిన్ను దీవించాలి అని ఆయన ఆశ. మనము లేమి స్థితిలో ఉన్నప్పుడు మన హృదయములో దేవుని చేత ప్రేరేపించబడిన కొన్ని ఆలోచనలు వస్తాయి. అయితే మనము వాటిని మనస్కరించి ధ్యానించినపుడు వాటి సత్యము మనము ఎరుగగలుగుతాము.

ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.౹ -యోహాను 4:9

భౌతికముగా చూస్తే యూదులు సమరయులను దూరముగా ఉంచుతారు వారితో సాంగత్యము చెయ్యరు. అయితే ఈ స్త్రీ ఆ భౌతికమైన సత్యమునే ఆధారము చేసుకుని అడిగినది ఎవరో అని గ్రహించడములేదు. అయితే ప్రభువు ఆమెను సంధించడము మానలేదు.

అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:10

దీవించువాడైన ఆయన గుణలక్షణము మనలను సంధించటము ద్వారా. మన జీవితములో అనేకసార్లు ఆర్థికమైన విషయాలలో ఆ ప్రేరేపణను వ్యతిరేకించేవారిగా ఉంటాము. అయితే ఏదైనా విషయములో దేవుడు పదే పదే ప్రేరేపిస్తున్నాడు అంటే ఆ విషయము ద్వారా నీకు ఆశీర్వాదము దాగి ఉంది.

ఇంకో సత్యము గమనిస్తే, ఆయన దగ్గరకు వచ్చినవారిని ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అయితే ఏరోజు మనము చూస్తున్నది, ఆశీర్వదించడం కొరకు ఆయనే దగ్గరకు వచ్చి సంధిస్తున్నాదు. ఈ క్రమములో ఉదయము రాత్రి కూడా ఆయన సన్నిధిలో నీవు ప్రార్థనలో గడపాలి. మనమైతే మన అవసరాల నిమిత్తము దేవుని దగ్గరకు వెళతాము. కానీ దేవుడు మన భవిష్యత్తును మార్చడానికి మన దగ్గరకు వస్తాడు.

అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?౹ -యోహాను 4:11

మన ధన్యత “మనము దేవుని చిత్తములో ఉన్నాము” అందుకే ఒకసారి కాకపోతే మరొకసారి ఆయన సంధిస్తూనే ఉంటాడు. అయితే ఆయన సంధిస్తున్న విషయము మన ఊహకు మించినదే అయి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి.

దేవుడు సంధిస్తున్నప్పుడు భౌతికమైన విషయాలను బట్టి గానీ, ఆయన శక్తిని ఎరగలేని స్థితిలోనూ ఆయనను తిరస్కరించేవారిగా ఉంటున్నాము! అయితే ఈ రోజు సత్యమును గ్రహించినవారుగా మారదాము.

అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;౹ నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:13-14

ఊరడము అంటే కంటిన్యూ అవడము. దేవుని దీవెన మన భౌతికమైన జీవితములోని పరిస్థితుల కొరకే కాబట్టి, అవసరము ఉన్న ప్రతీ పరిస్థితిలోనూ ఆ దీవెన స్థిరపరచబడుతుంది. అనగా అది సూపర్ నేచురల్ గా స్థిరపరచబడతాయి.

ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా౹ -యోహాను 4:15

చివరికి ఆ స్త్రీ వచ్చినది సామాన్యమైన వ్యక్తి కాదు అని గ్రహించి ఆయ్నను ఇమ్మని అడుగగా, యేసయ్య ఒక మాట చెప్పాడు.

యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.౹ ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;౹ నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.౹ అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.౹ -యోహాను 4:16-19

ఈ స్త్రీ జీవితములో ఒక పాపము ఉంది. ఆ పాపము దేవుని దీవెనను అడ్డగించేదిగా ఉంది. దేవుని సూపర్నేచురల్ సంగతులు జరగకుండా మన జీవితములోని పాపము అడ్డగిస్తుంది. అయితే ప్రేమగలిన దేవుడు ఆ పాపమునుండి విడుదలచేయడానికి అవకాశము దయచేసేవాడై ఉన్నాడు. ఈమెతో కూడా ఆమె ఒప్పుకొని మారుమనసు పొందులాగున ఆ విషయములను జ్ఞాపకము చేసాడు తప్ప, ఆమెను తృణీకరించడానికి కాదు. ఆమెను దీవించడానికే అక్కడకు వెళ్ళాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించడానికే నీ వద్దకు వస్తున్నాడు. అయితే నీ దీవెనకు అడ్డుగా ఉన్నదానిని నీకు జ్ఞాపకము చేస్తే, మార్చుకోవడానికి సిద్ధముగా ఉంటే ఆ దీవెన స్థిరపరచబడుతుంది.

ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా -లూకా 19:1-5

ఇక్కడ కూడా జక్కయ్యను దేవుడు సంధిస్తున్నాడు. “నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది” అని చెప్పుచున్నాడు. అయితే ఇక్కడ జక్కయ్య వెంటనే అనగా త్వరగా దేవుని మాటను అంగీకరించి స్పందించాడు. అయితే ఇంతకు ముందు చూసిన సమరయ స్త్రీ అనేకమైన ప్రశ్నల తరువాత స్పందించింది. అయితే ఒక సత్యము ఏమిటి అంటే, దేవుని చిత్తములో ఉన్నవారు స్పందించేవరకు ప్రభువు సంధించడము ఆపడు.

యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. -మత్తయి 9:9-10

ఇక్కడ మత్తయి సుంకపు గుత్తదారుడు గనుక ఇతర సుంకపు గుత్తదారులను విందుకు పిలుస్తాడు. ఈ గుంపులో జక్కయ్య కూడా ఉండి ఉంటాడు. మత్తయి ఇంటికి వచ్చిన ప్రభువు నా ఇంటికి కూడా వస్తే బాగుండు అని అనుకుని ఉండవచ్చు. ఎప్పుడైతే ప్రభువు జక్కయ్యను పిలిచాడో, తన జీవితములో ఉన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు.

జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. -లూకా 19:8
సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి–బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు–మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను. -లూకా 3:12-13

మన జీవితములో కూడా దేవుని దీవెన స్థిరపరచబడాలి అంటే “మారుమనస్సుకు తగిన ఫలము” ఫలించాలి. అప్పుడు ఆ దీవెన స్థిరపరచబడుతుంది.

అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. -లూకా 19:9

అంగీకరించి స్పందించింది జక్కయ్య ఒక్కడే, అయితే ఆశీర్వాదము మొత్తము ఇంటికి వచ్చింది. సమరయ స్త్రీ కూడా ఒక్కతే రక్షించబడింది అయితే ఆమెను బట్టి మొత్తము గ్రామము ఆశీర్వదించబడింది. ఈరోజు నిన్ను దేవుడు మాటి మాటికీ సంధిస్తూ ఉండగా తిరస్కరించక అంగీకరించి, ఏదైతే నీ జీవితములో అడ్డుగా ఉందో వాటిని మార్చుకోండి.