19-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – ఆయనే మన నిరీక్షణ

ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన

ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా

వేటకాని ఉరిలోనుండి నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రిందా నాకు ఆశ్రయం ఇచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన

వేయిమంది పడిపోయినా పదివేలమంది కూలిపోయినా
అపాయము రానేరాదు నా గుడారము సమీపించదు
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన

మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు (2)
రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన

నీ ప్రేమ నాలో మధురమైనది

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో ||

చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో – కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)

యేసయ్యా వందనాలయ్యా

ప. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”

అ.ప. వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

“నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”

నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”

యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”


“జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా

నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

ఆరాధన వర్తమానం

దేవుడు నీతో ఆదివారాన మాట్లాడే మాటలు తరువాతి వారములో ఎలా స్థిరపరచబడుతుంది అని మనము పరీక్షించుకోవాలి. అయితే మనము కొన్ని సార్లు మనము చేసిన ఆరాధనకు ఏమీ ఫలితము లేదు అని మనకు అనుకునే ఉంటాము.

నీ విశ్వాసమును మన్నించేవాడు, నీ విశ్వాసమును లెక్కించేవాడు నీ దేవుడు. మన వ్యక్తిగతమైన జీవితాలు ఆయనను ఆధారముగా చేసుకుని సాగే జీవితాలు. మనము క్షేమముగా ఉన్నాము అంటే, దేవుని కృప దాని వెనుక ఉంది. అలాగే మన వ్యక్తిగతమైన విషయాలలో మనము కోరుకొన్న విషయాలకొరకు ప్రార్థనలో కనిపెట్టేవారముగా ఉంటాము. నిజానికి లేఖనము సత్యమే, దేవుని ఆరాధించినపుడు, మార్గము సిద్ధపరచబడుతుంది. అయితే ఆ మార్గము నీ ముందుకు రావడానికి సమయాన్ని దేవుడే నిర్ణయించాడు. ఈరోజు నీవు నీ దేవునిని నమ్మకముగా వెంబడిస్తే, రేపటి నీ జీవితము స్థిరపరచబడుతుంది.

మన చిన్నప్పుడు ఏమి కావాలో ఆయన సిద్ధపరిచాడు. యవ్వన దశలో కూడా ఆయనే సిద్ధపరిచాడు అలాగే పెద్దవారిగా అయ్యక కూడా మనకు కావలిసినవి ఆయనే సిద్ధపరచేవాడు. అలాగే నీ జీవితములో ఆశీర్వాదములు ఏ సమయముకొరకైనవి ఆయన నిర్ణయించి సిద్ధపరిచాడు. మీరు ఆరాధించినపుడు మీరు సంఘములో కూర్చున్నా, ఇంటి దగ్గర ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నాము అనే సంగతి జ్ఞాపకము పెట్టుకోవాలి.

ఈరోజు ఈ సమయములో దేవునిని ఆరాధించడానింకి మనము వచ్చాము. “ఆత్మతోను, సత్యముతోను దేవునిని ఆరాధించాలి” అని లేఖనములు తెలియచేస్తుంది. దేవుడు మనకు బోధిస్తున్న లేఖనములే సత్యములు. ఆ బోధింపబడిన సత్యము ప్రకారము దేవునిని ఆరాధించాలి. మనము దేవుని బిడ్డలము అయి ఉన్నాము. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచిస్తాడు. నీ పరలోకమందున్న నీ తండ్రి, నీవు సంతోషముగా క్షేమాభివృద్ధి పొందుటకై ఆయన అనేకమైనవి సిద్ధపరచాడు. అవి స్వతంత్రించుకోవాలి అంటే ఆయనను యదార్థముగా వెంబడించాలి, వాక్యమును ఆధారము చేసుకొని నడవాలి.

దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను. – కీర్తన 47:6-9

రాజు మాత్రమే సింహాసనముపై ఆసీనుడు కాగలడు. ఆ రాజు మనకు తండ్రిగా ఉన్నాడు.

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. యెషయా 33:22

నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. 9:3-4

ఎవరైతే సింహాసనముపై అసీనుడై ఉన్నాడో, ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడుచున్నాడు. ఆ కారణము చేత శత్రువులు వెనుకకు మళ్ళుతున్నారు. నీవు దేవుడు నిర్ణయించిన సంతోషమునకు అడ్డుగా వచ్చే ప్రతీదీ శత్రువు. చాల సందర్భాలలో ఒంటరిగా అయినట్టు మనకు ఆలోచన కలుగుతుంది. అయితే నీవు ఒంటరివికావు. నీ దేవుడే నీకు రాజుగా నీతో ఉన్నాడు.

ఈ సత్యమును ఎరిగి మనము దేవునిని ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా||

గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా||

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా||

పరలోకములో ఎల్లప్పుడు ఆయనకు స్తుతి చెల్లిచబడుతుంది. ఆ స్తుతి జరిగే సమయములో ఆరాధించులాగున మనకు కూడా అవకాశము ఇవ్వబడింది. ఆ పరలోకములో సింహాసనాసీనుడైనవాడు న్యాయము తీర్చేవాడు.

Main message| మెయిన్ మెసేజ్

దేవుడు తన ప్రేమను వెల్లడిపరచేవాడుగా ఉన్నాడు, ఆయన ప్రేమన బట్టియే మన జీవితాలు స్థిరపరచబడతాయి.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును – కీర్తన 3:5

ఒకవేళ ఆయన మనకు ఆధారము కాని యెడల, ఈ విధముగా చెప్పలేము. మన వ్యక్తిగతమైన జీవితములో, రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటాము గానీ, ఆ రోజులు గడవడానికి కారణము నీ దేవుడే! అపవాది క్రియలు చీకటిలో జరిగేవే! కలలద్వారా, అనేకమైన అపాయములద్వారా అపవాది మనలను నశింపచేయడానికి ప్రయత్నిస్తుండగా, మన దేవుడు మనకు ఆధారముగా ఉన్న కారణము బట్టి మనము క్షేమముగా ఉండగలుగుతున్నాము.

అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మత్తయి 22:29.

అనగా లేఖనములలోని శక్తిని గ్రహించగలిగితే, దేవుని శక్తిని గ్రహిస్తే మనము స్థిరముగా ఉంటాము. మన జీవితములో ఆశ్చర్యకార్యములు జరగాలి అంటే, దేవుని వాక్యము యొక్క మర్మములను ఎరిగి ఉండాలి.

మన శక్తిచేత గానీ, మన జ్ఞానముచేత గానీ మన జీవితములను స్వతంత్రించుకోలేము. పరిపూర్ణమైనది మన జీవితాలలో అనుభవించాలి అంటే దేవుడే మనకు నిరీక్షణ అయి ఉండాలి.

ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను – మత్తయి 15:24

ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, “ఇశ్రాయేలు ఇంటివారు” అయి ఉండుట. అలాగే ఆ ఇంటివారిగా ఉండి, “నశించిన స్థితి” లో ఉన్నవారిగా ఉండుట

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12

పై వాక్యమును బట్టి, మనము దేవుని ఇంటివారము అయి ఉన్నాము. అలాగే మన జీవితములో ఏదైతే నశించిపోయిన పరిస్థితి ఉందో, ఆ స్థితిలో నిన్ను రక్షించడానికి, ఆ నాశనము నుండి నిన్ను తప్పించడానికి ఆయన ఉన్నాడు.

యేసయ్య మాట్లాడిన ప్రతీ మాటలో ఒక అర్థము ఉంటుంది. పేతురుకు రాత్రి అంతా కష్టపడినా ఏమి దొరకని సందర్భములో, ఇంకా లోతుగా వెళ్ళి వలవెయ్యమని చెప్పారు. అలాగే, నీ ఆత్మీయమైన జీవితములో లోతుగా వెళ్ళినప్పుడే విస్తారమైనవి పొందుకోగలుగుతావు. కేవలము యేసయ్యను స్వంతరక్షకుడిగా అంగీకరించాను అనే పునాదిలోనే ఉండిపోకూడదు. నీ జీవితములోని ప్రతీ సందర్భములో, ఆయన నిన్ను నాశనమునుండి రక్షించి తప్పిచుటకు పంపబడ్డాడు అనే సత్యము ఎరిగి, ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి.

లోకములో శ్రమ ఉంటుంది. ఈరోజు ఉన్న శ్రమ వేరు రేపటి దినాన కలుగబోయే శ్రమ వేరు. అయితే ఈరోజు వచ్చిన శ్రమలో మాత్రమే ఆయ్న రక్షించువాడు కాదు కానీ, ఎప్పుడు ఏ సమయమైనా నీ జీవితములో వచ్చే ప్రతి శ్రమ నుండి నిన్ను రక్షించడానికి ఆయన పంపబడ్డాడు. అయితే ఈ సత్యము ఎరిగి, ఆయన యందు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అయితే ఒక్కొక్కసారి, మనము నిరీక్షించింది ఇంకా జరగలేదు అయినప్పటికీ, నీ జీవితము ఇంక ముగియలేదు. ఆ నిరీక్షణ నెరవేరకుండా నీ జీవితము ముగించబడదు. ఈ సత్యముతో ఉజ్జీవము కలిగిన వారి జీవితము అద్భుతముగా ఉంటుంది.

ఈ భూలోకములో యేసయ్యను ఒప్పుకున్నవారిని, పరలోకములో యేసయ్య ఒప్పుకుంటాడు. నీ కొరకే యేసయ్య ఈ లోకములోనికి పంపబడ్డాఅడు. పంపబడిన వ్యక్తి ఎటువంటివాడు?

సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. మత్తయి 11:27
ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుఛూ తమ కిరీటములను పడవేసిరి – ప్రకటన 4:9, 10, 11

దేవుడే సమస్తమును సృష్టించాడు. ఆ సృష్టించబడిన ప్రతీదీ, ఆయన చిత్తమును బట్టి ఉన్నవి. అలాగే సమస్తమూ కూడా అప్పగించబడింది. అలా అప్పగించబడిన దానిలో ఏమి దాగి ఉంది? “దేవుని చిత్తమే” కదా! మనము గ్రహించవలసినది ఏమిటి అంటే, భూలోకములో నీ జీవితములో ఆయన మహిమ పొందటమే అనే ఆయన చిత్తము నెరవేరుతుంది.

మన నిరీక్షణ ఆయనే ఉన్నాడు. మన జీవితములోని సమస్తము యేసు ప్రభువుకు అప్పగించబడింది. యేసు దేవుని చిత్తము నీ జీవితములో జరిగించేవాడుగా ఉన్నాడు.

ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. కొలస్సీ 1:19-20

దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను – యోహాను 10:10

అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; – యోహాను 11: 25

ఒకవేళ నీవు నీ ఆశీర్వాదమును పోగొట్టుకొన్నావు అనుకో, నీవు సమృద్ధి జీవము ఎలా పొందుకుంటావు? నీవు ఎలా వాక్యమును తీసుకుంటావో, అలాగే నీకు స్థిరపరచబడుతుంది.అందుకే వాక్యమును లోతుగా అర్థముచేసుకోవాలి.

బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను – యోహాను 11:26.  ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదము. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు, భూలోకములోను పరలోకములోను కూడా ఆశీర్వదించబడేవాడిగా ఉంటాడు.

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.- యోహాను 14:6

అయితే ఇది కేవలము పరలోకమునకే కాదు గానీ, మన జీవితములో ప్రతి విషయములో కూడా ఆయనే మార్గమే అయి ఉన్నాడు. అది మనము ఆయనయందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు స్థిరపరచబడుతుంది.

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును – యోహాను 10:9

అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక ఆశీర్వాదము రెండూ కూడా యేసు క్రీస్తును బట్టి మాత్రమే కలుగుతాయి.

అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా – మత్తయి 15:26

పిల్లల రొట్టే అంటే అంటున్నాడు అంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర రొట్టె ఉన్నది. ఆ రొట్టె తండ్రి సంపాదించింది. ఆయన సంపాదించింది తన పిల్లలకే ఇవ్వాలనుకుంటున్నాడు. అనగా, ఆయనకున్న సమస్తమూ ఆయన పిల్లలుగా ఉన్న మనము ఆ సమస్తమునూ అనుభవించగలుగుతాము. నీ తండ్రి నీ కొరకు సిద్ధపరచినది, సంపాదించినది అయిన స్వాస్థ్యము నీకే ఇవ్వాలని నిర్ణయించాడు. అదే సరియైనది అని ఈ వాక్యముద్వారా మనము తెలుసుకోగలము.