ఆరాధన వర్తమానము
మనము ఎక్కడ ఉన్నాము అనే సంగతి మనము ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. మనము మన తండ్రి సన్నిధిలో ఉన్నాము. ఆ తండ్రి సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది. ఈరోజు మీ తండ్రిలో ఉన్నదానిని మీరు అనుభవించెదరు. అయితే నీ తండ్రి ఎటువంటివాడో నీవు ఎరిగి ఉంటే అప్పుడు ఆ తండ్రి సన్నిధిలోని సంతోషము నీవు నిజముగా అనుభవించగలుగుతావు. తండ్రి వద్ద నీవున్నప్పుడు నీవు అనుభవించే సంతోషము ఆయన కళ్ళారా చూడాలని ఆయన ఆశ.
దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆత్మయు మరియు జీవమునై ఉన్నాయి. దేవుని ప్రతీ మాట జీవము అయి ఉన్నది గనుక ఆ మాటలు నీ జీవితములో నీవు అనుభవించాలి అనే ఆశ నీవు కలిగి ఉండాలి.
మనము పాటలు పాడినప్పుడు, నీవు నీ దేవునిని మహిమపరుస్తున్నావు అనే సంగతి మనము ఎరిగి ఉండాలి. గనుక నీవు నీ దేవునిని ఆరాధించే సమయములో నీవు నీ దేవునితో మాట్లాడుతున్నావు, ఆయనకు నీకు ఉన్న సంబంధము గూర్చి నిజముగా యదార్థముగా నీవు ప్రకటిస్తూ, ఆయనను మహిమపరుస్తున్నావు, ఈ సత్యము ఎరిగితేనే నీవు యదార్థమైన ఆరాధన అర్పించగలుగుతావు లేని యెడల ఆచారయుక్తముగా నీవు చేసే ఆరాధన మిగిలిపోతుంది.
దేవుడు మన జీవితములలో కలుగచేసుకోకపోతే మన జీవితములు వ్యర్థమైపోతాయి. ఈ సత్యము నీవు ఎరిగితేనే నీ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీకు అర్థము అవుతుంది. అప్పుడు నీవు సత్యముతో యదార్థముగా నీవు ఆరాధించగలుగుతావు.
జరిపోయినదాని గూర్చి చింతపడకు, జరగవలసిన దాని గూర్చి జాగ్రత్తపడు. నీవు పలికే మాటలు నీ జీవితమై ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు అప్పుడు సమస్తము నిన్ను వెంబడిస్తుంది, ఎందుకంటే నీలో ఆయన నివాసముంటాడు గనుక!
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నిన్ను సరిచేయడానికి ఒకవేళ అవసరమైతే శిక్షిస్తాడు, అయితే అది నీ క్షేమము కొరకే. ఈ సంవత్సరము ప్రభువు నిన్ను విడిచిపెట్టడు, ఆయన తన చిత్తమును నీ యెడల కలిగి ఉన్నాడు.
ఈ దినము నీ దేవుడే అయి ఉండాలి. ఆయన నీకు దేవుడుగా ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన తన ప్రేమను నీ యెడల ప్రత్యక్షపరచేవాడుగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన కలిగిన ప్రేమ మౌనముగా ఉండదు, క్రియలలో ఖచ్చితముగా కనపరచబడుతుంది. నీ దేవుని ప్రేమ వంటి ప్రేమ లోకములో ఎంతగా వెతికినా కనపడదు.
తప్పిపోయిన కుమారుని విషయములో చూపించే ప్రేమను మనము ధ్యానిస్తే, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, అర్థము అవుతుంది. తప్పిపోయి వచ్చిన కుమారుడు హీన స్థితిలో ఉన్నా కూడా పరుగున వెళ్ళి కౌగిలించుకొని, తిరిగి చేరదీసిన ప్రేమ.
మన విషయములో కూడా, ఏ మంచీ లేని మనలను యేసయ్య తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అందుకే ఈ దినము ఈ సత్యము గ్రహించు – “నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు”
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను -యిర్మీయా 31:3
ఆ ప్రేమ ఉన్నంతకాలము నీవు బ్రతికించబడటానికి అవకాశము ఉంది. అయితే ఆ ప్రేమ ఎన్నిరోజులు ఉంటుంది అనే విషయము ఆలోచిస్తే, అది కొద్దికాలమే ఉండే ప్రేమ కాదుగానీ, అది శాశ్వతమైన ప్రేమ. నీవు తిరిగి ప్రేమించకపోయినా, నిన్ను వెతికి రక్షించి సమకూర్చేదిగా ఉంది.
మనము రక్షించబడిన తొలిదినములలో దేవుడు తప్ప వేరేది ఏదీ లేదు అనే ఆలోచనతో ఉంటాము. అయితే కాలము గడిచే కొద్దీ, ఆత్మీయముగా ప్రారంభమైన మన ప్రయాణము, శరీరరీతిగా మరలి తప్పిపోయేదిగా ఉంటుంది. మొదటిప్రేమ కనపరచలేని వారిగా మనము మారిపోతాము.
నీవు రక్షించబడిన మొదటిరోజు, ఆరు నెలల తరువాత పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నీతో మాట్లాడిన మొదటి కొన్ని గంటలు నీవు ఎలా ఉంటావు? ఒక రోజు గడిచాక ఎలా ఉంటున్నావు?
తండ్రి వద్ద ఉన్నప్పుడు కుమారుడికి సంతోషము ఉంది. తండ్రిని వదిలి వెళ్ళిపోయిన తరువాత దుర్వ్యాపారము చేసి, సంతోషము కోల్పోయినవాడుగా ఉన్నాడు. అయితే మరలా తండ్రివద్దకు తిరిగి వచ్చినపుడే తిరిగి సంతోషము పొందుకోగలిగాడు.
దేవుడు నన్ను ప్రేమిస్తునాడు గనుక, ఆయన కృప నా మీద ఉంటుంది, ఆ కృప నాకు కావలిసినవన్నీ సిద్ధపరుస్తుంది అని అనుకుంటే అది మన బుద్ధిహీనతే. తప్పిపోయిన కుమారుడిపై తండ్రికి ప్రేమ ఉంది కానీ, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేవరకు ఆ ప్రేమను బట్టి ఆ కుమారుడికి ఏమి జరగాలో అదంతా దాచిపెట్టి ఉంచాడు. నీ దేవుడు కూడా నీవు ఆయన ప్రేమను నీవు గ్రహించాలి అని దినమెల్ల చేతులు చాచి ఎదురుచూస్తున్నాడు.
ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.౹ -యిర్మీయా 31:4
కట్టబడాలి అంటే, ఒక ప్రణాళిక ఉండాలి. ఇంతవరకు ఆ ప్రణాళిక ప్రకారము నీ జీవితము కట్టబడకపోతే, ఆయన ప్రేమను బట్టి ఆయన కట్టేవాడిగా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితము ప్రణాళిక ప్రకారము మొదలు పెట్టి తరువాత తప్పిపోతే, నీవు తప్పు తెలుసుకొని తిరిగి ఆయన వద్దకు వస్తే, ఆయన తన ప్రేమను బట్టి నిన్ను మరలా కట్టేవాడిగా ఉంటున్నాడు.
ఇకమీదట నీవు కట్టబడునట్లు నిన్ను నేను కట్టింతును – ప్రవచన వాక్యము
అనేక దినములుగా వేచి ఉన్న నీతో ప్రభువు చెప్పుచున్న మాట – “ఇక మీదట నీవు కట్టబడునట్లుగా నిన్ను కట్టిస్తాడు, ఆ ప్రేమ క్రియల చేత నీ జీవితములో ప్రత్యక్షమవుతుంది”
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేదానికి సాక్ష్యమే నీవు సజీవముగా ఉండటం! ఎందుకు అంటే, దేవుని ప్రేమ నీ జీవితములో ప్రత్యక్షపరచబడటానికే!
ఈరోజు మనము మన దేవునిని ఆయన ప్రేమను బట్టి సత్యముతో, ఆత్మతో ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
శాశ్వతమైన నీ ప్రేమతో విడువక నా తోడుంటివే నీవు నన్ను బాగుచేసావే, తిరిగి నిలబెట్టావే ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
వారము కొరకైన వాక్యము
ఇక మీదట నీవు కట్టబడునట్లుగా నిన్ను కట్టిస్తాడు, ఆ రీతిగా నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు తన ప్రేమ చేత నీ జీవితమును కట్టుచుండగా, నీ నోటి మాటలచేత అడ్డుపడవద్దు.
జరగబోయే విషయములను బట్టి మీరు జాగ్రత్తపడుడి. ఏ మాటలైతే మనము వింటున్నామో, ఆ మాటలు మనం విడిచిపెట్టకూడదు.
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.౹ -హెబ్రీయులకు 2:1
నీ రాబోయే భవిష్యత్తు కొరకు దేవుని వలన నీవు వినిన మాటలను విడిచిపెట్టకుండునట్లు జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ మాటలు నీవు విడిచిపెడితే, ఆ మాటలలోని జీవము ప్రత్యక్షము కాక నష్టపోతావు గనుక మరి విశేషముగా జాగ్తత్తపడాలి.
అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. -లూకా 2:19
మరియతో చెప్పబడిన మాటలన్నీ తన హృదయములో మరలా మరలా జ్ఞాపకము చేసుకొంటూ, భద్రపరచుకుంది అనగా బహు జాగ్రత్తపడింది.
దేవుని మాటలే నీకు జీవమై ఉన్నాయి నమ్మితేనే గానీ, వాటి విషయములో నీవు జాగ్రత్త కలిగి ఉండలేవు. నీవు మాటి మాటికీ నీవు జ్ఞాపకము చేసుకోవాలి అంటే, నీవు ఆ మాటలు నమ్మాలి. నీ కళ్ళముందు ఉన్న పరిస్థితి వేరుగా ఉన్నా సరే, నీకు చెప్పబడిన మాటలు నీవు మాటి మాటికీ జ్ఞాపకము చేసుకోవాలి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము -కీర్తనలు 103:1-2
దేనిని మరువకుము అంటే దేవుడు చేసిన ప్రతీ ఉపకారమును పదే పదే జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని అర్థము కదా! కీర్తనా కారుడు మాటి మాటికీ యెహోవా నాకాపరి, నా కొండ, నా కోట, నా రక్షణ దుర్గము అని జ్ఞాపకము చేసుకొంటున్నాదు. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యము ఇచ్చుచున్నాడు.
తాను గొర్రెలు కాచుచుండగా ఎలుగుబటినుండి, సింహమునుండి కాపాడిన దేవుడు గొలియాతునుండి కూడా కాపాడతాడు అని ఎందుకు చెప్పగలిగాడు? పదే పదే తానిని వినిని అనుభవించిన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాదు.
మొదట నీవు వినిన దేవుని మాట నీవు జ్ఞాపకము చేసుకోవాలి, ఆ తరువాత నీవు ఆ మాట నమ్మాలి, చివరికి నీ ఆత్మలో ఆ మాట స్థిరపడాలి. మనము కూడా ఆత్మ అయి ఉన్నాము గనుక, మన ఆత్మ జీవింపచేయబడాలి అంటే, దేవుని మాటలే కావాలి. అయితే ఈ దేవుని మాటలు ఎలా మన ఆత్మలోనికి వెళతాయి?
ఈ శరీరము బలముగా పనిచేస్తే, నీ ఆత్మ బలహీనముగా ఉంటుంది. అదే నీ ఆత్మ బలముగా ఉంటే, నీ శరీరము బలహీనముగా ఉంటుంది.
ఒకవేళ “నీవు పనికిమాలిన వాడవు కాదు, నీవు ప్రయోజనకరమైన వాడవు” అనే మాట దేవుడు చెప్పాడు. నీ శరీరము నీ కళ్ళముందు ఉన్నదే నమ్ముతుంది గనుక, నీవు ఆత్మీయముగా బలహీనముగా ఉన్నదానిని బట్టి ఆ మాటను నీవు నమ్మలేవు గనుక ఈ మాట నీ ఆత్మలోనికి వెళ్ళదు.
అదే నీవు ఆత్మీయముగా బలముగా ఉంటే, నీ పరిస్థితి ఎలా ఉన్నాసరే, నా దేవుడు మృతమైనదానిని కూడా సజీవముగా చేయగలిగినవాడు, నా కొరకు సమస్తము సమకూడి జరిస్తాడు అని నమ్ముతావు గనుక ఆ మాటలు నీ ఆత్మలోనికి వెళతాయి.
ఆత్మీయముగా బలముకలిగి ఉండుట అంటే, ప్రభువు వద్దంటే ఏమైనా చెయ్యను, ప్రభువు చెయ్యమంటే అది ఏదైనా నేను చేస్తాను అనే విధముగా నిలబడటమే! ప్రభువు మాటను బట్టి ఎన్ని మార్చుకున్నావు? ఎన్ని ఇంకా మార్చుకోవాలి? ఇది నీవు జాగ్రత్త కలిగి సరిచేసుకోవాలి.
నీవు వినిన దేవుని మాటలు విడిచిపెట్టకుండా జాగ్రత్త పడితే, నిత్యము కదలక నిలిచి ఉండే సీయోను కొండవలే నీవు ఉంటావు.
నా గిన్నె నిండి పొర్లిపోతుంది అనే వాగ్దానము వచ్చింది. ఇప్పటికి దాదాపు 20 రోజులు అయింది గానీ ఇంకా నీవు ఏమీ పొందలేదు. అయితే సత్యము ఏమిటి అంటే, రోజులు గడిచే కొద్దీ దేవుడు నిర్ణయించినదానికి నీవు దగ్గర అవుతున్నావు.
కానా విందులో మరియ ఎందుకు యేసయ్య వద్దకు వచ్చి అక్కడ పరిస్థితి గురించి చెప్పింది? అంతకుముందు యేసయ్య ఎక్కడా అద్భుతములు అంతవరకు చెయ్యలేదు కదా? ఒకవేళ సాధారణముగా చెప్పిందా అని ఆలోచిస్తే, యేసయ్య గురించి దూత చెప్పిన మాటలు తాను ప్రతీ దినము జ్ఞాపకము చేసుకుంటూ కనిపెడుతూ ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఆశ కలిగి ఎదురుచూస్తూ వచ్చింది. యేసయ్య పుట్టుక ఒక సువర్తమానము, మహా సంతోషము.
అందుకే కానా విందులో సంతోషము కోల్పోయే పరిస్థితి వచ్చినపుడు, ఆ సంతోషమును ఇవ్వగలిగిన యేసయ్య కొరకు కనిపెట్టింది. అందుకే యేసయ్య మరియ అడిగినపుడు, “నా సమయమింకా రాలేదు” అని చెప్పాడు. అంటే, దాని అర్థము సమయము వచ్చినపుడు చేస్తాను అనేకదా అర్థము?
మరియ వద్దకు జ్ఞానులు వచ్చి బాలుడైన యేసయ్య కొరకు బంగారము, బోళములు సమర్పించి, యూదుల రాజు అని చెప్పిన సంగతి ఎప్పుడు నెరవేరుతుంది అని కనిపెట్టింది.
నీవు వినిన సంగతిని మరువక పదే పదే జ్ఞాపకము చేసుకొనేవాడివిగా నీవు ఉంటే, దాని నెరవేర్పు కొరకు ఆశగా కనిపెట్టగలుగుతావు, అప్పుడు ఖచ్చితముగా నీవు నెరవేర్పు చూస్తావు.