19-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ లోకములో వెయ్యి దినములు గడుపుట కంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట బహు శ్రేష్టము అని వాక్యము చెప్పుచున్నది. ప్రభువు సన్నిధిలో పలకబడే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వలన ఏమి జరుగుతుంది? అనే సంగతి తెలుసుకోవడానికి ఒక విషయం చూద్దాము.

మంచి ద్రాక్షారసము సిద్ధపరచడానికి అనేక సంవత్సరములు పడుతుంది. అయితే ఒక్క దినములోనే మంచి ద్రాక్షారసము కానా విందులో సిద్ధపరచబడింది. నీ జీవితములో మేలు అనుభవించడానికి నీవు చేసిన అనేక ప్రయత్నములు నీకు తృప్తికరమైన ఫలమును ఇవ్వలేదేమో, అయితే నీ దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వలన, నీ కొరకు నీవు అనుభవించవలసిన అన్ని మేలుల సిద్ధపాటు నీవు చూస్తావు. అందుకే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట అనేది వెయ్యి దినములు లోకములో గడుపుటకంటే శ్రేష్టముగా ఉంది.

దేవుని సన్నిధిలో ఉదయము, సాయంత్రము ఈరోజు గడిపిన నీ జీవితములో మంచి దానిని చూడటానికి నీవు ఎదురుచూడవలసిన అవసరము లేదు, ఇదే నీ సమయము, దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు.

దేవుని సన్నిధిలో నీవు ఒక్కరోజు గడుపుట వలన, వెయ్యి దినముల నీ ప్రయత్నముకంటే ఎక్కువైన మంచిని నీవు పొందుకుంటావు, నీ నిరాశ సంతోషముగా మార్చబడుతుంది.

మంచి ద్రాక్షారసము సిద్ధపరచబడటమే కాదుగానీ, ఆ ద్రాక్షారసము పోయబడుతుంది కూడా! నీ జీవితములో మంచిని చూడటానికి నీవు ఎదురుచూస్తుండగా, నీ దినములు గడుస్తున్నాయి గానీ, నీవు ఏమీ పొందట్లేదేమో గానీ, దేవుని సన్నిధిలో ఒక్క దినములో నీవు ఆసక్తి కలిగి గడిపితే, మరింత శ్రేష్టమైనది ఒక్క దినములోనే నీకొరకు సిద్ధపరచేవాడుగా ఉన్నాడు. అలా సిద్ధపరచినదే పోయబడుతుంది అనగా నీకు ఇవ్వబడుతుంది.

అక్కడ భోజన పంక్తిలో కూర్చున్న వారు ద్రాక్షారసము కొరకు వేచి చూస్తున్నారు. అక్కడ వారికి ద్రాక్షారసము అయిపోయింది అని వారికి తెలియదు. అలాగే యేసయ్య దానిని సిద్ధపరచబడింది అని కూడా వారికి తెలియదు. ఇక్కడ వారు ఎదురు చూసింది ద్రాక్షారసమే, అయితే వారికి వచ్చింది కూడా ద్రాక్షారసమే అయితే, ఒక తేడా ఏమిటి అని చూస్తే, యేసయ్య సిద్ధపరచినది శ్రేష్టమైన ద్రాక్షారసముగా ఉంది.

నీవు శ్రేష్టమైన దానిని పొందుకోవాలి అని ఎంతో కాలముగా వేచి ఉన్నావు, అయితే దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి గడిపిన దానిని బట్టి యేసయ్య నీవు ఆశించినదానికంటే శ్రేష్టమైన దానిని సిద్ధపరుస్తున్నాడు. దేనిని నమ్మి ఆయన సన్నిధిలో నీవు వేచి ఉన్నావో, దానిని నిరూపించడానికి నీ దేవుడు దానిని జరిగించేవాడిగా ఉన్నాడు.

దినమంతా దేవుని సన్నిధిలో ఉన్నందుకు దేవుడు నిన్ను తృప్తి పరచేవాడుగా ఉన్నాడు. వెయ్యి దినముల ఆశీర్వాదముకంటే, ఎక్కువైన ఆశీర్వాదము ఈ ఒక్క దినము ప్రభువు ఇచ్చేవాడుగా ఉన్నాడు. గనుక దేవునిని మనము మహిమపరుద్దాము.

సాధారణముగా యేసయ్య వద్దకు అనేకులు వచ్చి స్వస్థపరచబడి, అద్భుతములు జరిగాయి. అయితే యేసయ్యే తనంతట తానే ఒకచోటికి వెళితే, ఇంక ఏ మాత్రము అవకాశము, విడుదల లేని పరిస్థితులన్నీ అద్భుతముగా మార్చబడ్డాయి. ఇంతవరకు నీవు చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థము అయిపోయాయేమో, అయితే ఈ దినము యేసయ్య తనంతట తానే నిన్ను విడుదల చేయడానికి, అద్భుతము చేయడానికి ఇష్టపడుతున్నాడు.

యేసయ్య తానంతట తానే నీ కన్నీరు చూసి, ఎవరూ బాగుచేయలేని నీ జీవితాన్ని, నీవు ఆయనను నమ్మి ఉన్నదానిని బట్టి, నీ ఊహకు అందని ఆశీర్వాదముతో నింపేవాడుగా ఉన్నాడు.

నీవు ఆయన సన్నిధిలో దినమంతా గడిపినందుకు నీవు దేని కొరకు ఎదురుచూసావో, ఆ విషయములో ఎంతో శ్రేష్టమైన దానిని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రభువు.

పదిమంది కుష్టురోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. అప్పుడు ప్రభువు చెప్పిన దాని ప్రకారము ఇంకా చేయుచుండగానే వారికి కార్యము జరిగింది. ఆ తరువాత వారు దేవునికి స్తోత్రము చెల్లించారు. దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నావు అంటే నీ కొరకు దేవుడు సిద్ధపరచినదానిని ఎవరూ ఇంక దొంగిలించలేరు, దానిని నీవు చేసే ఆరాధన ముద్రిస్తుంది.

ఆరాధన గీతము

తండ్రీ నీ సన్నిధిలో నే ఉన్నాను
నిన్ను నమ్ముకుని నే వచ్చాను
నీ మాటకై నే వేచి ఉన్నా
నీ కార్యముకై నే ఆశతో ఉన్నా

యెహోవా ఎలోహిం – నా సృష్టికర్త
యెహోవా ఈరే – నాకు దయచేయువాడా
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – ఆమేన్

వారము కొరకైన వాక్యము

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. -కీర్తనలు 91:1

ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తాడో, వాడే సర్వశక్తుని నీడలో విశ్రాంతి పొందుకుంటాడు. దేవుని యొక్క రహస్యమైన స్థలములలో నివసిస్తాడో, వాడు ఖచ్చితముగా విశ్రాంతి పొందుకుంటాడు. అనగా మహోన్నతుడైన దేవుని సన్నిధి అనే రహస్య స్థలములో నివసించువాడు ఖచ్చితముగా విశ్రాంతిని పొందుకుంటాడు.

యేసయ్యను చూస్తే, తండ్రి సన్నిధిలో గడపటానికి వెళ్ళే సమయములో తానోక్కడే వెళ్ళేవాడు, ఎవరూ ఆటంకపరచలేని ఆ దేవుని సన్నిధిని ఎప్పుడూ తప్పేవాడు కాదు.

ఈలోకములో భార్యాభర్తల గదిలోనికి అందరికీ ప్రవేశము ఉండదు. ఆ గది వారి ప్రేమను, వారి నమ్మకాన్ని పంచుకొనే స్థలము గనుక మరెవరికీ ప్రవేశము లేదు. అలాగే ఆ నీకు దేవునికి ఉన్న రహస్య స్థలములో దేవునితో నీవు గడిపే సమయము నమ్మకముతో నీవు ఉన్నపుడు, నీవు ఆయననుండి నీవు పొందుకుంటావు.

నీకు విశ్రాంతి కావాలి అంటే, నీకు నీ దేవునికి రహస్య స్థలమైన ప్రార్థనా స్థలము ఉండాలి. ఆ స్థలములో నీవున్నపుడు ఏ ఆటంకము ఉండకూడదు, ఫోన్ కూడా ఆటంకము కాకూడదు.

ఆ ప్రార్థనా గదిలోనికి నీవు వెళ్ళినపుడు నీవు ఆయనతో ఐక్యమయ్యే విధముగా నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు ఆయన నీ ఆత్మతో అనుసంధానము అవుతాడు. అక్కడే నీ జీవితమునకు అవసరమైన సొల్యూషన్ ఉంది.

ఈ సహవాసము అనుదినము జరుగుతున్నపుడు నూతనమైన కార్యములు నీ జీవితములో కనపరచబడతాయి. ఆ కార్యములకొరకైన సాక్ష్యము కూడా కనపరచబడుతుంది.

యేసయ్య పరిచర్యను జ్ఞాపకము చేసుకొంటే, రెండు దోనెలు అక్కడ ఉన్నాయి, అయితే పేతురు దోనె మాత్రమే యేసయ్య ఎక్కాడు. అయితే అది ఎలా సాధ్యము అయింది అంటే, అంతకుముందు రాత్రి యేసయ్య తండ్రి సన్నిధిలో గడిపినపుడు పేతురు కనపరచబడ్డాడు.

ఈ రహస్య ప్రార్థనా స్థలము అనుభవము అనేది నీ దైనందిన కార్యముగా ఉండాలి. ఆదాము హవ్వలను చూస్తే, వారు కూడినపుడు ఒక తరము మొదలైంది. అలాగే నీవు దేవుని సన్నిధిలో ఆ రహస్య ప్రార్థనాగది అనుభవము నీవు కలిగి ఉంటే, నూతనమైన సొల్యూషన్స్ పొందుకుంటావు.నీవు కనపరిచే నమ్మికను బట్టి అసాధ్యమయ్యేది సాధ్యమయ్యే సాక్ష్యము కనపరచబడుతుంది. 

ఏలియా తనకు ఎదురైన పరిస్థితులలో చాలా రోషముకలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకు అని చూస్తే, ఆయన ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో గడిపినవాడుగా ఉన్నాడు. అదుకనే అసాధారణ కార్యములు చేయగలిగినాడు. 

నీ ప్రార్థన నీ జీవితమునకు ఆక్సిజన్ వలే పనిచేస్తుంది గనుక, నీవు ప్రార్థన చేస్తున్నంతకాలము, ఏ నెగటివ్ పరిస్థితి నిన్ను ముంచివేయకుండా నీ ప్రార్థనే ఆపుతుంది.