18-08-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

మరొక్క సారి, మరొక్క దినము దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి మనకు సమయము ఇచ్చాడు గనుక, ఆయనకే మహిమ, ఘనత కలుగును గాక.

ఒక మంచి గృహము ఉంది అనుకోండి, అందులో ఉన్న సౌకర్యములను బట్టి ఎంతో మంచి అనుభవము ఉంటుంది. ఒకసారి ఆ ఇంటినుండి బయటకు వస్తే, ఇంతకు ముందు ఉన్న మంచి అనుభవము కోల్పోతాము. అయితే దేవునిని స్తుతించుట అనేది మన జీవితములో మంచి జరిగించేదిగా ఉంటుంది.

మన జీవితము ఆత్మీయముగా కట్టబడి నిలబడితేనే రానున్న రోజులలో మనగలుగుతాము. అత్మీయమైన జీవితములో నిరాశకు తావు లేదు. ఆత్మీయముగా బలముగా ఉన్నవాడికి నిరాశ అనేది ఉండదు. అపవాది ఎంతగా ప్రయత్నించినా సరే, మన ఆత్మీయమైన జీవితము బలముగా ఉంటే, ఆ ప్రతి పరిస్థితినుండి మనలను తప్పించబడతాము. గనుక మన ప్రయాస ఆత్మీయమైన జీవితమును బలపరచుకోవడానికి తప్పకుండా పడాలి.

దెవుని స్తుతించే అవకాశము అందరికీ దొరకలేదు గానీ, నీకు నాకు కలిగింది.

యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. -కీర్తనలు 33:12

ఆయనను కలిగి ఉండే ఈ ఒక్క అర్హత మన జీవితమునకు చాలును. నా జీవితము ధన్యకరమైన జీవితమే. నీవు కలిగిఉన్న స్థితిని బట్టి కాదు గానీ, నీవు కలిగి ఉన్న నీ దేవుడిని బట్టి ధన్యకరమైన జీవితమే. ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు ధన్యుడవే.

ధనవంతుడి యొక్క ఆలోచన చూస్తే, నా ప్రాణమా తినుము, త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు గానీ దేవుని కలిగిలేడు. అయితే కురుపులతో బాధపడుతున్న లాజరు ఏమీ లేకపోయినప్పటికీ, చివరికి తన జీవితము ధన్యకరమైనదిగా మారింది.

పరిస్థితులు బాగున్నపుడు మనము దేవుని గురించి గొప్పగా చెప్పగలుగుతాము. అయితే పరిస్థితి బాగాలేనపుడు మన ఆత్మీయ జీవితము కూడా కుంటుపడుతుంది. అదే పౌలు అయితే నేను బ్రతుకుట క్రీస్తే, అని చెప్పగలుగుతున్నాడు.

మనకు ఉన్న పరిస్థితిని బట్టి చచ్చిపోవాలనిపిస్తుంది అయితే మనతో దేవుడున్నాడు అనే సత్యము మర్చిపోకూడదు. అయితే మనము గ్రహంచవలసిన సత్యము ఏమిటి అంటే, ఇప్పుడున్న పరిస్థ్తితితోనే నీ జీవితము అయిపోలేదు. నీ జీవితమును దుఃఖపరిచే ప్రతీ దానినీ నీ దేవుడు జయించాడు.

అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ -అపొస్తలుల కార్యములు 9:4

దమస్కులో సౌలుగా ఉన్న పౌలు విశ్వాసులను హింసిస్తూ వెళుతుండగా, ప్రభువు “నన్నేల హింసిస్తున్నావు?” అని అంటున్నాడు.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

ప్రభువు జయించి పొందిన విజయము ఎవరికీ అని ఆలోచిస్తే, అది ఆయనయందు విశ్వాసముంచే మనకొరకే. కొద్ది కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్ములను పూర్ణులుగా చేస్తాడు. గనుక ఆయనే నీ శ్రమను ముగించేవాడుగా ఉంటాడు. నీవు నిజముగా దేవునిని కలిగినవాడవైతే, ఈ నిరీక్షణ కలిగి ఉండాలి.

మనము సుఖముగా లేనిదానిని బట్టి, మనము పడే శ్రమను బట్టి నెగటివ్ మాటలు పలికేసేవారముగా ఉంటాము. అయితే మన జీవితము ఏమిటొ అర్థమైతే అలా ఉండము.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

ఈ వాక్యములో చూస్తే, మనము వ్యక్తిగతముగా సంతోషించడానికి కాదు గానీ, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురుంచడానికే మనము ఎన్నుకోబడ్డాము. ఎప్పుడైతే ఆయ్నను కలిగి ఉంటామో, అప్పుడు మనము ధన్యులుగా ఉంటాము.

మన దేవుడు సర్వ సమృద్ధి కలిగినవాడుగా ఉన్నాడు, ఆ సమృద్ధి మనము అనుభవించాలి అంటే, ఆయన గుణాతిశయములు ప్రచురముచేసే ఆత్మీయమైన జీవితము కలిగి ఉండాలి.

అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గానీ, దేవుని నోటనుండి వచ్చే ప్రతీ మాటను బట్టి జీవిస్తాడు. నీవు దేవునిని యదార్థముగా వెంబడిస్తే, సర్వసమృద్ధి నీతో వస్తుంది. అనేకులకు ఈ అవకాశము లేదు, అయితే నీకు నాకు ఆయనను దేవుడుగా కలిగి ఉండగలుగుటకు అవకాశము ఇచ్చాడు. దీనికి మనము ఆయనకు ఏమి తిరిగి ఇవ్వలేము. అయితే నీ నుండి నా నుండి కోరుకొనేది మన హృదయము మాత్రమే.

నీవున్న ప్రతీ శ్రమలోనూ నిన్ను రక్షించగలిగిన సామర్థ్యము దేవునికి ఉంది. అయితే ఆ రక్షణ పొందకుండా నీ హృదయము లోకముతో నిండిపోయింది. అయితే నీ హృదయము దేవునితో నిండి ఉంటే, ఆయన లక్షణములను నీవు నీ జీవితము కనపరచగలుగుతావు. ఇది ఎంతో ధన్యత కదా!

దేవునిని కలిగి ఉన్నాము కాబట్టే మనము సూపర్నేచురల్. మనకొరకు సమస్తము అనుకూలపరచేవాడు మన దేవుడు. అటువంటి కృప మనము పొందుకున్నాము గనుక మన దేవునిని స్తుతిద్దాము.

 

ఆరాధన గీతము

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

వారము కొరకైన వాక్యము

ఈరోజు పరలోక రాజ్య ప్రవేశము గురించిన విషయములను గూర్చి నేర్చుకుందాము. పిలువబడినవారు అనేకులు అయితే ఏర్పరచబడినవారు కొందరే. మనలో అనేకులు రక్షణ పొందుకున్నవారున్నారు, అయితే రక్షణలో కొనసాగించబడలేనివారు అనేకులున్నారు గనుక ఈరోజు వాక్యము ఎంతో ప్రాముఖ్యము.

శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. -మత్తయి 5:20
–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. -మత్తయి 7:21

ఈ మాటలు స్వయముగా యేసయ్యే చెప్పినమాటలు. చాలామంది మనము యేసయ్యను అంగీకరించేసాము గనుక లోకములో ఎలా ఉన్నా పరవాలేదు, మనము ఖచ్చితముగా పరలోకము వెళ్ళిపోతాము అని అనుకుంటారు. అయితే పరలోకపు తండ్రి చిత్తప్రకారము చేయువాడే పరలోకరాజ్యములో ప్రవేశిస్తాడు అని యేసయ్య చెప్పుచున్నాడు.

మనము ప్రభువు రాకడ సమయములో ఉన్నాము. మహాశ్రమలకు ముందే మనము ఎత్తబడాలి అనే ఆశ కలిగి ఉండాలి. పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువై ఉండాలి అంటే, పరిసయ్యులు కూడా నీతి కలిగి ఉన్నారు అని అర్థము, అయితే వారికంటే మనము అధికమైన నీతి కలిగి ఉండాలి.

తండ్రి చిత్తము ఏమిటో మనకు తెలియచేయబడిన తరువాత ఆ చిత్తము నెరవేర్చడానికే మనము ప్రయాస పడాలి. దానికంటే ముందు, దేవుని చిత్తము ఎరిగి ఉండుట అనేది కూడా ఎంతో ధన్యకరము. అయితే ఆ చిత్తమును ఎరిగి కూడా ఆ ప్రకారము నెరవేర్చడానికి ప్రయాస పడకుండా ఉంటే అది అస్సలు మంచిది కాదు.

పందెములో పరిగెత్తువాడు శ్రమపడి మొదటి స్థానము గెలిచినపుడు వాడు పడే శ్రమ ఏ మాత్రము జ్ఞాపకము రాదు. శ్రమ పడకుండా మొదటి స్థానము రాదు. ప్రభువు నిన్ను నమ్మి ఒక పని అప్పగించాడు అంటేనే అది ఎంతో ధన్యత. ఈ పని నాకు ఇచ్చాడు, ఈ బాధ్యత నాకు ఇచ్చాడు అనే ఆలోచన కలిగి ప్రయాసపడినప్పుడు, దానిని బట్టే ఫలము ఉంటుంది.

సర్వశక్తుడు సమస్తము ఎరిగినవాడు గనుక నీవు ఏమైతే నీ దేవునినుండి తెలుసుకున్నావో, దాని ప్రకారము నీవు నీ జీవితమును సరిచేసుకుంటూ వెళ్ళాలి. పిలువబడినవారు అనేకులు, అయితే నీవు ఏర్పరచబడినవాడిగా పిలువబడితే, అస్సలు ఆ చిత్తమునుండి తొలగకూడదు. మన పరలోక రాజ్య ప్రవేశము, భూమి మీద ప్రభువు మనకు అప్పగించిన పనిలో మనము పడే ప్రయాసపై కూడా ఆధారపడిఉంటుంది.

పరిసయ్యుల నీతికంటే, శాస్త్రుల నీతికంటే, నీ నీతి అధికముగా ఉండాలి అని ప్రభువు చెప్పుచున్నాడు. పరిసయ్యులు గూర్చి మనము చూస్తే,

–శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. -మత్తయి 23:2-3

ఇక్కడ పరిసయ్యులు చెప్పేవారుగా మాత్రమే ఉంటారు గానీ, చేసేవారుగా ఉండరు. వారు చెప్పే మాటలు ఏమిటి? దేవుని మాటలే! అయితే వారు చెప్పినట్టుగా వారు చెయ్యరు. ఇప్పుడు మనము కూడా దేవుని మాటలు ప్రకటించే మనము ఆ ప్రకారము జీవిస్తునామా? దేవుని మహిమ కొరకు ఎన్నిసార్లు మనము కమిట్మెంట్ చేసుకున్నాము? ఒకవేళ కమిట్మెంట్ తప్పి జీవిస్తుంటే, పరలోక రాజ్య ప్రవేశము కష్టమవుతుంది అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. ఈరోజు ప్రభువు నీకు ఎందుకు జ్ఞాపకము చేస్తున్నాడు అంటే, నిన్ను మరలా సరిచేసుకుని ముందుకు సాగమని మరొక అవకాశము ఇస్తున్నాడు.

అవయవములను నీతి సాధనములుగా ప్రభువుకు అప్పగించమని వాక్యము చెప్పుచుంది. నిజముగా మనము అలాగే మన అవయవములను నీతి సాధనములుగా ప్రభువుకు అప్పగించామా? అయితే మనము పరీక్షించుకుని క్షమించమని అడిగి, మరలా సిద్ధపడి ఇకనుంచి మనము చెప్పేదే మనము చేసేవారుగా మనము సిద్ధపడదాము.

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. -మత్తయి 5:16

ఎప్పుడైతే నీవు మంచి క్రియలు కనపరుస్తావో, అపుడు నీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. నీ తండ్రి మహిమపరచబడుతున్న ప్రతీ సారీ ఏమి జరుగుతుంది అంటే, నీవు రక్షించబడునట్లు మార్గము సిద్ధపరచబడుతుంది. నేను చెప్పేదే నేను చేసేవాడిగా, చేసేదానినిగా ఉంటాను.

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. -మత్తయి 23:23

పరిసయ్యులు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లిస్తున్నారు అయితే ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు అని ప్రభువు చెప్పుచున్నాడు.

వాటిని మానక వీటిని చేయవలసి యుండెను అంటే, దశమభాగము చెల్లించడము మానక, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టకూడదు. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము అవ్వాలి.

–ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. -లూకా 18:10-14

ఇక్కడ పరిసయ్యుని హృదయము ఎలా ఉంది సుంకరి హృదయము ఎలా ఉంది అని ఆలోచిస్తే, పరిసయ్యుడు తాను కలిగిన స్థితిని బట్టి గర్వము కలిగి ఉన్నాడు, దీనిని ఆత్మీయ గర్వము అంటారు. మన ఆత్మీయత మరొకరిని లేవనెత్తడానికే ఉండాలి, ఒకరిని ప్రభువు వద్దకు నడిపించేదిగానే ఉండాలి. మనము ఎంత మంచిగా జీవించినా సరే, ఆత్మీయమైన గర్వము గనుక కలిగి ఉంటే, దేవుడు ఆ మంచిని ఎంచేవాడుగా ఉండడు.

సుంకరి అయితే తన స్థితిని బట్టి రోదించి ఒప్పుకొంటున్నాడు. మనము ఎప్పుడూ తగ్గించుకొనేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, అప్పుడు మనము హెచ్చించబడతాము. దేవుని చిత్తప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. పరిసయ్యుల నీతికంటే మన నీతి అధికముగా ఉండులాగున సరిచేసుకుని సిద్ధపడదాము.