స్తోత్రగీతము – 1
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
స్తోత్రగీతము – 2
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని
జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్
శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా
||జీసస్||
విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును
||జీసస్||
ఆరాధన వర్తమానము
మన దేవుడు మన జీవితములలో అనేక రకములుగా ఉంటున్నాడు.
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3
మొదటిగా ఆయన దేవుడుగా ఉంటున్నాడు, మనలను పుట్టించినవాడుగా, సృష్టించినవాడుగా మన తండ్రిగా ఉంటున్నాడు. అంతేకాక, మనలను పాలించేవాడుగా, ప్రభువుగా రాజుగా ఉంటున్నాడు. ఈరోజు ఫాదర్స్ డే గా జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా కూడా వారి వారి తండ్రిని సంతోషపరచడానికి ఈ దినమున ప్రయత్నిస్తారు. తండ్రి హృదయాన్ని గమనిస్తే, పిల్లలు కనపరిచే ప్రేమను కోరుకొనేవాడుగా ఉంటాడు. ఇహలోకములో ఉన్న తండ్రియే ఇలా ఉంటే, పరలోకమందున్న మన పరమ తండ్రి తన పిల్లలు కనపరచే ప్రేమను ఎంతగా కోరుకొంటాడు? అయితే ఏమి ఇస్తే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు? ఆయనకు నీవు కలిగి ఉన్న లౌకికమైన విషయాలు పరమ తండ్రికి అవసరంలేదు గానీ, నీ హృదయము కావాలి. ఆ హృదయము నుండి వచ్చే నిజమైన ప్రేమపూర్వకమైన ఆరాధన కావాలి.
మన జీవితములలో మనము కోరుకొన్నది వెంటనే జరగనప్పుడు దేవునిని తూలనాడేవారుగా ఉంటాము. అయితే మరి మనలను ఎంతో ప్రేమించి మాటి మాటికీ అవకాశములు ఇచ్చే తండ్రి విడువక, యెడబాయక నిన్ను హత్తుకొనే వున్నాడు అనే సత్యమును నీవు గ్రహిస్తే ఎట్టిపరిస్థితులలోనూ దేవునిని విడిచి వెళ్ళవు.
యేసు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేయుచూ ప్రభువు వెంబడిస్తున్నప్పుడు, యేసయ్య ఏమి చెప్పాడు అని గమనిస్తే,
అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా -మత్తయి 15:26
ఇక్కడ తండ్రి హృదయమును గమనిస్తే, తన పిల్లలకొరకు సిద్ధపరచినది తన పిల్లలకొరకే గానీ మరెవ్వరికీ కాదు అని అర్థము చేసుకోగలము. అందుకే నీ తండ్రిని నీవు ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీ జీవితము వర్థిల్లుతుంది. మనము నశించుట తండ్రి చిత్తము కాదు.
ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. -మత్తయి 18:14
నీవు, నేను ఆ చిన్నవారు అనగా ఆయన బిడ్డలు అనే గుంపులో ఉన్నట్టయితే, మనము నశించుట పరలోకపు తండ్రి చిత్తము కాదు అని గ్రహించాలి. చిత్తము అంటే, దేవుని నిర్ణయము లేదా ఉద్దేశ్యము. ఇహలోకములో ఉన్న తల్లి తండ్రులు కూడా వారి శక్తికి మించి పిల్లలకొరకు కష్టపడతారు. పరలోకమందున్న నీ తండ్రి, శక్తికే ఆధారమైనవాడు. సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే మన పరలోక తండ్రి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితముగా నీకొరకు శ్రేష్టమైనదే నీకొరకు దయచేస్తాడు. ఆయన మృతమైనదానిని జీవింపచేయువాడు, లేనిదానిని ఉన్నట్టుగా చేయగలవాడు.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.౹ -హెబ్రీయులకు 2:13
“ఆ పిల్లలు” అనగా దేవుని పిల్లలకొరకు ఆయనే స్వయముగా భూలోకమునకు దిగి వచ్చినాడు. అపవాది మన జీవితములను ఎన్ని రకాలుగా నాశనము చేయడానికి ప్రయత్నిస్తున్నాడో, వాటన్నిటి నుండీ తప్పించడానికి ఆయన భూలోకములోనికి వచ్చాడు. ఈలోకములో ఉన్న గొప్పవారి పిల్లలను గమనిస్తే వారి తండ్రి ఏమై ఉన్నాడో దానిని బట్టి వారు ప్రవర్తించేవారుగా ఉంటారు. మరి నీ పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడో నీవు ఎరిగినట్టయితే నీవు ఎలా ఉంటావు? మన తండ్రి విడిచిపెట్టే వాడుకాదు, తన కుమారుల యెడల జాలిపడేవాడు. అందుకే మన ప్రతీ పరిస్థితిలో ఆ తండ్రినే ఆధారము చేసుకోవాలి.
మన జీవితములు అటు ఇటు అవుతూ నాశనపు మార్గము వైపు వెళుతున్నట్టు కనబడినప్పటికీ, మన ప్రతీ అడుగును సరిచేసి నడిపించువాడు. ఆయన బిడ్డగా నీవు నిలబడినప్పుడు నీ జీవితములు అద్భుతముగా మార్చబడతాయి.
ఆరాధన గీతము
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
నా అడుగులు తప్పటడుగులై – నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండ దెబ్బయైనను – రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
గాడాంధకార లోయలో – నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి (2)
వేయిమంది కుడి ఎడమకు – కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
మెయిన్ మెసేజ్
ఈరోజు నీ తండ్రి గూర్చి తెలుసుకో అని నీకు పిలుపు ఇవ్వబడుతుంది. పరలోకమందున్న తండ్రి గూర్చి తెలుసుకోవడానికి అనేకములు ఉన్నాయి అయితే కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. -మత్తయి 5:48
“నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక నేనును పరిపూర్ణునిగా ఉండెదను, పరిపూర్ణమైన జీవితమునే కలిగి ఉందును” అని దేవుని సత్యమును ఎరిగి ఉంటే, ఖచ్చితముగా ఈ విధముగా ప్రకటిస్తావు.
అయితే అపవాది నిన్ను అసత్యములతో మోసపుచ్చడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. నీ హృదయములో ఇది కాదు, ఇది జరగదు అని ఆలోచనలు పుట్టించి నిన్ను దేవుని అనుమానించేవాడిగా చేస్తాడు. అయితే నీ పరలోకపు తండ్రి గూర్చి నీవు సత్యమును ఎరిగి ఉన్నట్టయితే, నీవు ఆ ఉచ్చులో పడవు.
–ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. -మార్కు 7:37
అయితే నీ తండ్రి ఏమై ఉన్నాడో నీవు తెలుసుకొనే వరకు తండ్రికి కలిగినది నీవు అనుభవించలేవు.
మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.౹ -గలతీయులకు 4:1
తండ్రి కుమారులకే తన రహస్యములను వెల్లడిపరుస్తాడు కానీ, దాసునికి వెల్లడి చేయడు. నీ పరలోకపు తండ్రి కూడా నీకు తన మర్మములను వెల్లడిపరచువాడుగా ఉన్నాడు. ఒక ఉదాహరణకొరకు ఒక వ్యక్తికి ఒక వ్యాపారము ఉంది. దానిలో కుమారుడు, మరియు పనివాడు కూడా పనిచేస్తున్నారు. తన వ్యాపారానికి సంబంధించిన రహస్యములన్నీ కుమారునికే తెలియచేస్తాడు. మన జీవితములో చూస్తే, భూలోకములో యాత్రికులుగా ఉన్నాము, పరలోకము నివాస స్థానముగా కలిగి ఉన్నాము. ఇప్పుడు ఆ పరలోక నివాసము చేరుకోగలుగులాగున అవసరమైన ప్రతీ మర్మము కుమారునివైన నీకు మాత్రమే తెలియచేయబడుతుంది.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19
తండ్రి ఏ విధముగా చెప్పుచున్నాడో, అదే విధముగా చెయ్యడానికి మనము సిద్ధపడి ఉండాలి.
ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10
ఆయన తాను ప్రేమించినవారికొరకు సిద్ధపరచినది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అంటే మర్మము గా ఉన్నాయి అని అర్థము. అయితే ఆ “సిద్ధపరచినవి మరియు పరిపూర్ణమైనవి” మనకొరకు బయలు పరచబడ్డాయి. అందుకే నీ తండ్రి ఏమై ఉన్నాడో అనే సంగతి నీవు ఖచ్చితముగా ఎరిగి ఉండాలి.
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. -మత్తయి 7:7-8
అడగడానికి నిబంధనలు ఏమి లేవు ఒక్క కుమారుడు అనే సంబంధము తప్ప. నీవు దేవుని కుమారునిగా నీవు ఉన్నట్టయితే నీవు అడిగినప్పుడు ఖచ్చితముగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన వెల్లడి పరచిన దానిని నీవు అడిగేవాడిగా సిద్ధపడాలి. ఎలా వెల్లడి పరచబడుతుంది? అంటే, ఆత్మ ద్వారా వెల్లడి పరచబడుతుంది.
మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. -మత్తయి 7:10
దేవుడు నీకొరకు సిద్ధపరచినది, దాచినది అంతా మంచిదే అయి ఉన్నది. అయితే మన జీవితములలో “అసూయ” అనేది అపవాది ఆయుధముగా వెంటాడుతుంది. లూకా సువార్తలో 15 వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని గూర్చిన భాగములో ఆస్తిని పంచిపెట్టమని చిన్నకుమారుడు అడిగినప్పుడు, తన కుమారులిద్దరికీ పంచిపెట్టాడు. అయితే చిన్న కుమారుడు తాను కలిగినదంతా పాడుచేసికొని, అంతా పోగొట్టుకొని, తిరిగి తండ్రి దగ్గరకు చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏమి చేసాడు?
వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. -లూకా 15:20
తండ్రి తిరిగి వచ్చిన కుమారుడు చేసినది జ్ఞాపకము చేసుకోవట్లేదు గానీ, కనికరపడుతున్నాడు. అపవాది యొక్క దుర్వ్యాపారము వలన దేవుడిచ్చిన ఆధిక్యతను పాడు చేసుకుంటున్నాము. అయితే అపవాది మార్గములో ఉండినప్పటికీ, నీవు సత్యము తెలుసుకుని తిరిగి నీ తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితముగా నిన్ను చేర్చుకోనే వాడు.
ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. -లూకా 15:27-28
ఇక్కడ పెద్దకుమారుడు అసూయతో ఇంటిలోనికి వెళ్ళకుండా కోపగించుకున్నపుడు, తండ్రి “వెలుపలకు” వచ్చి “లోపలికి” రమ్మని బ్రతిమలాడుతున్నాడు. “వెలుపలకు” అంటే, అపవాది చేత పట్టబడి, నడిపించబడుతున్న పరిస్థితి. పెద్దకుమారుడు తన తండ్రి గూర్చి, తన తండ్రి కలిగినది ఎరగని స్థితిలో ఉన్నాడు. నిజానికి ఆస్తి పంచినప్పుడు పెద్ద కుమారునికి కూడా తన వాటా ఇచ్చినవాడుగా ఉన్నాడు. అయితే పెద్దకుమారుడు అనుభవించే జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు.
అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, -లూకా 15:31
అయితే తండ్రి మాటలు గమనిస్తే, పెద్ద కుమారుడికి పంచినదే కాదు గానీ, ఆయన కలిగి ఉన్నదంతా తనకే కదా అని సత్యము వెల్లడి చేస్తున్నాడు. నీవు తప్పిపోయి తిరిగి వస్తే నిన్ను చేర్చుకొనేవాడు. ఆయనతోనే నీవు ఉంటే, ఆయన కలిగినదంతా కూడా నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ సత్యము నీవు గ్రహిస్తే, నీవు ఎంతో సంతోషము కలిగి జీవించేవాడివిగా ఉంటావు. “అసూయ” అనే విషయము నిన్ను లోబరుచుకోకుండా నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలి. “అపవాదికి సంబంధిచిన దానిని” విడిచి లోపలికి రమ్మని తండ్రి బతిమాలుతున్నాడు.
అయితే ఒక సత్యము గమనిస్తే, పోగొట్టుకుని వస్తున్నవాడి దగ్గరకి పరిగెట్టుకొని వెళ్ళాడు. తండ్రి గూర్చిన విషయములో నెగటివ్ ఆలోచనలను తొలగించడానికి వెంటనే వచ్చేవాడుగా ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో గమనించి, సరిచేసుకొని, తండ్రి నీకొరకు సిద్ధపరచినది అనుభవించి దేవుని మహిమపరుద్దాము.