స్తోత్ర గీతము 1
పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్య
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
స్తోత్ర గీతము 2
ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా
పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
నిబంధన స్థిరపరచువాడా వాగ్దానము నెరవేర్చువాడా కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
స్తోత్ర గీతము 3
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
||యెహోవా||
ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
||యెహోవా||
ఆరాధన వర్తమానము
గతవారమంతా మన ప్రభువు మనతో ఉంటూ మనలను తిరిగి ఆయన సన్నిధికి నడిపించాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరచిపోకూడదు. మన జీవితములు దేవునిని ఆధారము చేసుకుని కొనసాగించబడే జీవితములు.
ఈ జీవితమును ప్రభువు సృష్టించాడు. ఆయనే మన సృష్టికర్త. మన అందరి యెడల ఆయన తన చిత్తమును, మంచి ఉద్దేశ్యమును కలిగిఉన్నాడు. గత వారములో మందిరపు పని ఆరంభించబడింది. ఆ పనిలో అనేకమైన అనేకమైన ఆటంకములు, అడ్డంకులు చూసిన తరువాత తెలుసుకున్న సత్యము, మన దేవుని ఆధారము చేసుకోకపోతే, ఆయన లేకపోతే మన జీవితములు శూన్యము. అయితే మనపై ఆయనకున్న ప్రణాళికనుబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన మనలను విడిపించి నడిపించేవాడుగా ఉన్నాడు. అనేకమైన సందర్భములలో మనకు అడ్డుగా, ఆటంకముగా మన జీవితములను కోల్పోయేటట్లుచేయడానికి అనేకమైన ఉచ్చులు ఉన్నప్పటికీ, మన దేవుని ఉద్దేశ్యమును బట్టి మన జీవితములు నడిపించబడుతున్న్నాయి.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
నేనే నీకు ఆధారము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏ జీవమైతే ఆ ద్రాక్షావల్లిలో ఉందో, ఆ జీవమే ఆ తీగెలలో కూడా ప్రవహిస్తుంది. మనము దేవునిలో నిలిచి నడుస్తున్నప్పుడు, ఏ ప్రణాళిక, ఉద్దేశ్యముతో దేవుడు మనలను సృష్టించాడో, అదే ఉద్దేశ్యము ప్రణాళికలే మన జీవితములో నెరవేరతాయి. ఈ సత్యము ఎరిగితే, మనము ఎంతో సంతోషముతో ప్రభువును స్తుతించేవారుగా ఉంటాము.మన జీవితమునకు ఆధారము ఆయనే గనుక మన జీవితమునకు ఏమి అడ్డు వచ్చినా నిలబడదు.
నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ -యిర్మీయా 29:11
అనగా మన జీవితముల కొరకు సిద్ధపరచబడిన ఉద్దేశ్యము, చిత్తము దేవుడు ఎరిగే ఉన్నాడు అనే సత్యము మనము గ్రహించాలి. అప్పుడు మన ప్రస్తుత సందర్భములో ఎటువంటి అడ్డు వచ్చినా సరే ఈ సత్యము పై నిలబడి ముందుకు సాగగలుతాము. ఎందుకంటే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గనుక!
మన జీవిత్ములలో అనేకమైన కాలములు ఉంటాయి. కొన్ని ఆశీర్వాద సమయములు, కొన్ని విశ్వాస పరీక్షల సమయము, కొన్ని అగ్నివంటి శ్రమల కాలములు. అయితే మనము నమ్ముకొనదగిన ఒకే సత్యము – “నా యెడల దేవుడు మంచి ఉద్దేశ్యములు కలిగి ఉన్నాడు”. ఈ సత్యమే మనకు నిరీక్షణ కలిగిస్తుంది, అపవాది ఉచ్చునుండి తప్పించబడతాము. అందుకే మన దేవుడు మంచి దేవుడు. కీర్తనాకారుడి మాటలలో చూస్తే –
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. -కీర్తనలు 18:2
సాధారణముగా మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుని జ్ఞాపకము చేసుకోలేని స్థితిలో ఉంటాము గానీ, ఆయనను తిరిగి జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎంత కఠినముగా శ్రమ ఉన్నప్పటికీ, ఆయన మాటను పట్టుకుని మనము నిలబడినప్పుడు ఒక్కొక్కటిగా మన పరిస్థితులు మనకు అనుకూలముగా మార్చబడతాయి.
కీర్తనాకారుడు చెప్తున్న మాటలు చూస్తే, దేవుడే బలము, దేవుడే కేడెము, దేవుడే కోట, దేవుడే శైలము, దేవుడే దుర్గము, దేవుడే నా ఆశ్రయము అని చెప్పుచున్నాడు. అనగా తనకంటూ దేవుడు తప్ప వేరే ఆధారము ఏమీ లేదు అని అర్థము.
షద్రకు మేషాకు అబెద్నగోల జీవితములలో “మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే ఆయనే మా దేవుడు” అని రాజు ఎదుట వారు ధర్యముగా నిలబడ్డారు. అప్పుడు ఏమైతే నమ్మారో దానిని దేవుడు స్థిరపరచాడు.
మనము కలత చెందిన సమయము అపవాదికి మన మనసుపై ఆలోచనల ద్వారా దాడిచేయడానికి సరైన సమయము అయి ఉన్నది. ఎలాగైనా మన జీవితమును పోగొట్టుకోవాలి అనే ఆలోచన అపవాది కలిగి ఉంటాడు. ఆ క్రమములో మన దేవుడికి మనపై మంచి ఉద్దేశ్యము గలిగి ఉన్నాడు అనే సత్యమును మరిచిపోయేలాగా దాడి చేస్తాడు. అందుకే మనము కృంగి ఉన్నపుడు మరింత ఎక్కువగా మన దేవుడూ మాటను జ్ఞాపకము చేసుకోవాలి.
ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. -కీర్తనలు 144:2
నిధి అంటే భవిష్యత్తు గురించి సిద్ధపరచబడి దాచబడినది అని అర్థము. కృపానిధి అనగా మన జీవితము యొక్క ప్రతీ పరిస్థితిలో దేవునిచేత సిద్ధపరచబడి మనకొరకు దాచబడిన దేవుని కృప!
మనము కృప ద్వారానే రక్షించబడ్డాము. కృపద్వారానే కొనసాగించబడుతున్నాము. మన ప్రస్తుత కష్ట కాలములో కూడా మనకు ఆధారము ఆయ్న కృపయే గనుక మన జీవితములో ఆయన కృప ఒక నిధిగా ఉంది.
మనలను రక్షించువాడు ఆయనే, మనలను తప్పించువాడు ఆయనే ఇంక మనలను అడ్డుకోగల శక్తి దేనికి ఉంది? ఈ సత్యము ఎరిగితే మన జీవితము ఎంతో శక్తిమంతమైనది. అపవాది యొక్క భయంకరమైన దాడిలో ఇంకా మనము ముగించబడకుండా ఇంకా కొనసాగించబడుతున్నాము అంటేనే మన దేవుడు తన కృపచేత రక్షించి, తప్పించి, నడిపించి కొనసాగిస్తున్నాడు అని గమనించగలము.
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే. -2 సమూయేలు 22:3
బలాత్కారులు అంటే బలహీనమైనవాడిపై తన బలమును ప్రయోగించి లోబరుచుకునేవారు. మన జీవితములో పరిస్థితులే బలాత్కారులుగా ఉంటున్నాయి. అయితే ఆ ప్రతి పరిస్థితులనుండి రక్షించువాడు ఆయనే! అందుకే ఆయనే మనజీవితమునకు ఆధారము. ఆలా మనలను నడిపిస్తూ తన మహిమను మన జీవితముల ద్వారా వెదజల్లేవాడుగా ఉన్నాడు.
ఆరాధన గీతము
ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరికి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా)
||ఆధారం||
నీ మహిమ కొరకే నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరి కి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా)
||ఆధారం||
వారము కొరకైన వాక్యము
మన దేవుడు మన జీవితములో పూజింపదగినవాడు అనే సత్యమును గూర్చి మనము నేర్చుకుందాము. మనము ఆరాధించడానికి యోగ్యుడు, మనము ఆయనను వెంబడించడానికి అర్హుడు. ఎందుకంటే పాపులముగా ఉన్న మనలను పరిశుద్ధులుగా చేసారు.
పాపి యొక్క జీవితము గూర్చి తెలుసుకుంటే పరిశుద్ధుల యొక్క జీవితము యొక్క గొప్ప తనము తెలుస్తుంది. మనలను పరిశుద్ధులుగా దేవుడు తప్ప ఇంక ఎవ్వరూ చెయ్యలేరు.
ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్ర్తీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. -లూకా 7:39
ఈ వాక్యములో చూస్తే, ఆ స్త్రీ పాపి అయి ఉన్నది. యేసయ్య ఒక మంచికి పరిశుద్ధతకు సూచనగా ఉన్నాడు. అయితే ఆ స్త్రీ పాపి గనుక యేసయ్యను ముట్టుకునే అర్హతే లేదు. అంటే యేసయ్యలో ఉన్న సమస్తమైన జ్ఞానము, బుద్ది, జ్ఞానము, ఆశీర్వాదము అన్నీ పాపికి పొందుకునే అవకాశము లేదు. అనగా మంచి అనేదానిని ఆలోచించడానికి కూడా పాపికి అవకాశములేదు. అయితే మన యేసయ్య పాపిగా ఉన్న మనలను పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులనుగా చేసాడు.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము – కొలస్సీ 1:12
మనము యేసయ్యలో లభించే మంచిలో చెయ్యి వెయ్యటానికి మనలను పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు.
అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. -లూకా 19:7
అంటే పాపి యొక్క ఇంటిలో పరిశుద్ధుడు, మంచివాడు ఉండటానికి అవకాశము లేదు. మరొకలా చూస్తే, మనము పాపిగా ఉంటే మన జీవితములో మంచిది అనేది కనీసము కొంచేము సేపు కూడా ఉండటానికి అవకాశము లేదు. అయితే అటువంటి పాపపు జీవితమును పరిశుద్ధముగా మార్చకపోతే, ఈరోజు మన జీవితములో ఏ మంచీ అనుభవించలేము.
యేసయ్యలోనుండి జీవము బయలుదేరింది. బయలుదేరిన జీవము కొనసాగించబడేది. అనగా మన జీవితములో ఏ మంచి అయితే ప్రారంభించబడిందో ఆ మంచి కొనసాగించబడుతుంది కూడా. ఒకవేళ మనము పాపిగానే ఉన్నట్టయితే, ఆ మంచి గురించి ఆలోచించడానికి కూడా అవకాశము లేదు.
శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి౹ –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;౹ అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.౹ -యోహాను 8:3-5
ఆ పాపము చేసిన స్త్రీకి రాళ్ళతో కొట్టి చంపివేయవలెను అనే ఆజ్ఞ ఉంది. మన జీవితములను చూస్తే, పాపముతో గనుక ఉంటే, ఆ పాపమును బట్టి ఎన్నో శిక్షలచేత గాయపరచబడేవారిగా ఉండవలసిన వారము కదా!
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. -కొలొస్సయులకు 2:13
మీరు మృతులై యుండగా అంటే పాపిగా ఉండగా, ఏ మంచి కూడా ఆలోచించడానికి అవకాశము సైతము లేకుండా ఉండగా! వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము అనగా మన పాపమును బట్టి ఏ ఏ శిక్ష అయితే వ్రాయబడిందో ఆ పత్రము. ఆ పత్రములోని శిక్షలు అమలుపరిస్తే ఇంక మన జీవితము ముగించబడేదే!
ఆ సిలువపై మన పాపపు జీవితమును ముగించి, పరిశుద్ధమైన జీవితమును నేను జీవించునట్లుగా యేసయ్య చేసాడు. జక్కయ్యను చూస్తే, తాను పాపమునుండి విడిపించబడిన తరువాత పరిశుద్ధమైన జీవితమును పొందుకున్నావాడై, పూర్వపు పాపపు జీవితమును అసహ్యించుకుని, తన జీవితమును మార్చుకున్నాడు.
యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు౹ ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. -యోహాను 8:10-11
యేసయ్య ఒకసారి పరిశుద్ధమైన జీవితమును ఇచ్చినతరువాత ఇంక ఎవ్వరూ మనకు శిక్షవిధించలేరు. మనము కూడా పాపులముగా ఉండేవాళ్ళము. ఆ పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనము చేసిన వాటికీ అనేకమైన శిక్షలు అమలుపరచడానికి సిద్ధముగా ఉన్నాయి. అయితే యేసయ్య కలువరి సిలువలో బలియాగము చేసారో, అప్పుడు మనకు పడవలసిన శిక్ష అంతా కొట్టివేయబడింది.
పాపమునకు మూలము అపవాది మరియు పరిశుద్ధమైన జీవితమునకు యేసయ్య మూలమై ఉన్నాడు. మన జీవితమునకు యేసయ్య మూలముగా ఉన్నంతవరకు మన జీవితమును శిక్షించడానికి ఎవరికీ అధికారములేదు. మన సాక్ష్యము ఇదే అయి ఉండాలి.
అయితే యేసయ్య ఆ స్త్రీతో చెప్పిన మాట – “నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము”. మనము కూడా ఏ పాపము విషయమైతే క్షమాపణ పొందామో అదే పాపము మరలా చెయ్యకూడదు. అలా సిద్ధపరచుకున్న పరిశుద్ధమైన జీవితము ఎలా ఉంటుంది అంటే –
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. -ఎఫెసీయులకు 3:20
మనము ఒకసారి అడిగినదానికంటే, ఊహించినదానికంటే అత్యధికముగా నీ పరిశుద్ధ జీవితమును బట్టి నీవు పొందుకుంటావు. అటువంటి విలువైన పరిశుద్ధమైన జీవితమును ఇచ్చినవాడు నీ దేవుడు గనుక ఆయన పూజ్యనీయుడు.
పరిశుద్ధుడుగా చేయబడి ఆ జీవితమును కలిగి ఉండి, పాపి యొక్క జీవితము యొక్క విషయములు నీ జీవితములో ఇంకా కనబడుతుంటే, యేసు నామములో ఇప్పుడు ప్రకటించండి – నా పరిశుద్ధమైన జీవితమునకు ఆధారము, మూలము నీవే దేవా” అని ప్రకటించండి.