17-12-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం – కృపామయుడా

ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున

చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా
రాజ వంశములో – యాజకత్వము చేసెదను

నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు
నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు

ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను

స్తుతిగీతము – 2

యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా

రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

దేవా నీ కృపాబాహుళ్యముతో
కరుణచూపితివే
మా దోషశిక్షను భరియించి
మమ్మును ధన్యుల చేసితివే

రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

ప్రభువా నీ ఉపకారములకు
ఏమి చెల్లింతుము?
రక్షణపాత్రను చేతబూని
ఆరాధించెదము

యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి సారీ మనము వెలుగుచేత నింపబడెదము. దేవువ్ని వాక్కు మనకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్కును మనము స్వీకరిస్తామో, అప్పుడు ఆ వాక్కులోని వెలుగు, మనలోని చీకటిని పారద్రోలుతుంది. మీ విత్తనముల యొక్క పంట కోసుకొనే దినము త్వరలో రానున్నది. అదృశ్యమైనవి దృశ్యముగా మార్చబడు దినములు రానున్నవి.

ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. -యెషయా 66:13

యెరూషలేము అనగా దేవుని పట్టణము, అనగా నీ నా జీవితమే. దేవుని నివాస స్థలముగా ఉన్న నీవు ఆదరించబడతావు. ఆయన నివాసము ఉండునట్లుగా మన జీవితములు ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన కొరకు మనలను సిద్ధపరచుకున్నాడు. మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా అయితే మనకు ఇష్టానికి అనుగుణముగా నిర్మించుకుంటామో, అలాగే మనలను కూడా దేవుడు తనకు అనుకూలముగా సిద్ధపరచుకున్నాడు.

అయితే మన ధన్యత ఏమిటి అంటే ఆయన కొరకు మనము వేచిచూడలేదు గాని, మనకొరకు ఆయనే వేచి చూసినవాడుగా ఉన్నాడు. మనలను దేవాది దేవుడు ఎన్నిక చేసుకోవడమే మన భాగ్యము. ఆయన మనలో నివాసం ఉన్నదానిని బట్టి మనము ఆదరించబడతాము. మానవుని ఆదరణ వట్టి మాటలే గానీ దేవుని ఆదరణ క్రియలతో కూడినదై ఉంటుంది.

అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. -యెషయా 49:14

సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు అని అనుకుంటుంది. ఎందుకు అంటే, అది పాడైన స్థితిలోనూ, ఎండిన స్థితిలోనూ ఉన్నది. అయితే దేవుడు ఏమి చెప్పుచున్న్నాడో చూస్తే –

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి -యెషయా 49:15-16

ఆయనను కలిగి ఉండటమే మన భాగ్యము. మనమున్న స్థితిలో మనలను మర్చిపోయే దేవుడు కాదు.మనము ఆత్మ చేత ముద్రించబడినవారము గనుక ఎన్నడెన్నడును మరువబడము.

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును -యెషయా 51:3

ఈ సీయోను కొంతసమయము వరకు పాడుగా ఉండి దుఃఖిస్తున్నదేమో అయితే మన దేవుడు మర్చిపోయేవాడు కాదు గనుక ఆదరించి దాని పాడైన స్థలములను ఏదేనువలే చేస్తున్నాడు. ఈ సత్యము నీవు గ్రహించినవెంటనే నీ జీవితములో ప్రత్యక్షపరచబడటానికి సిద్ధపరచబడుతుంది. గనుక మనలో ఉన్న, మనతో ఉన్న దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాము

ఆరాధన గీతము

నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను

నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను

ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు

వారము కొరకైన వాక్యము

సువార్తకు ఒక బలముంది.

సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.౹ -1 కొరింథీయులకు 1:18

క్రీస్తును గూర్చిన మాటలు, దేవుని గూర్చిన మాటలు మనకు శక్తి అయి ఉన్నాయి. దేవుని శక్తి మన జీవితములలో కనపరచబడు దినములు చూడబోతున్నాము. ఈరోజు మన దేవుడు బలపరచేవాడు అనే సత్యము గూర్చి నేర్చుకుందాము. ఆయన మనలను కృంగిపోనియ్యడు. మన వ్యక్తిగతమైన జీవితములలో అపవాది మనలను బంధించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు ఎందుకంటే మనము దేవుని దృష్టిలో ఎంతో ఎంతో విలువైనవారము గనుక.

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.౹ -ఫిలిప్పీయులకు 4:13

ఈ మాటను మనము ధ్యానము చేస్తే, బలపరచువాడు ఒకడు ఉన్నాడు అని అర్థము చేసుకోవచ్చు. ఆ బలపరచువాడు లేకుండా ఏమీ చేయలేను అని పౌలు ఒప్పుకుంటున్నాడు. అంతే కాక మరొక విధముగా చూస్తే, పౌలు వెళుతున్న పరిస్థితులు పౌలు యొక్క బలముచేత చక్కబరచుకొనే పరిస్థితిలు కావు అని కూడా అర్థముచేసుకోవచ్చు.

సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.౹ మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.౹ ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. -2 కొరింథీయులకు 1:8-10

పౌలు అనుభవిస్తున్న శ్రమ వారి శక్తికి మించినది అయి ఉన్నది. కృంగిన పరిస్థితిలలో ఉన్నాడు. అయినప్పటికీ అటువంటి పరిస్థితులలో మరణమునుండి దేవుడు తప్పించాడు అనే సాక్ష్యము ఇస్తున్నాడు.

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.౹ అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.౹ అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ -2 కొరింథీయులకు 12:7-10

ఇక్కడ కూడా పౌలు జీవితములో ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ తొలగిపోవునట్లు ముమ్మారు వేడుకున్నాడు. అయినప్పటికీ ఆ శ్రమ తొలగించబడలేదు. మనమైతే అటువంటి పరిస్థితులలో కృంగిపోతాము. అయితే పౌలు చివరికి చెప్పుచున్న మాట – “నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను”. మనము కూడా దేనికొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థనకు జవాబుగా ఈ భాగము మనకు ఇవ్వబడింది.

పౌలు అనేకమైన కఠినమైన శ్రమలగుండా వెళ్ళినవాడుగా ఉన్నాడు. మరణపు అంచులవరకు వెళ్ళినాడు. అయినప్పటికీ ఈ ఒక్క శ్రమలో ముమ్మారు ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనకు జవాబుగా ఒక మాట వచ్చింది అది “నా కృప నీకు చాలును” అనే మాట. ఈ సత్యము అర్థము చేసుకున్న పౌలు ఇలా చెప్పుచున్నాడు.

నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను – 2 కొరింథీయులకు 12:10

మనము కూడా చేసే ప్రార్థనల జవాబు ఆలస్యమయ్యేటప్పుడు మనము కృంగిపోకూడదు. పౌలుకు ఆలస్యమయినప్పటికీ విడుదల అయిన “నా కృప నీకు చాలును” అనే మాట తను వళ్ళిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను ప్రత్యక్షపరచబడింది. మనము కూడా అదేవిధముగా సత్యము పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఆ సత్యము ఏమిటి అంటే, “నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను”.

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే…యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. -యెషయా 40:29,31

సొమ్మసిల్లినవారు అంటే, ఎదురుచూచినది జరగని సందర్భములో మనలో విశ్వాసము సన్నగిల్లి నిరీక్షణ కోల్పోయే పరిస్థితిగా అర్థము చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితులలో మన దేవుడు బలమిచ్చువాడు అయి వాక్యము చెప్పుచున్నది. అనగా దేనికొరకు నిరీక్షించానో ఆ విషయము పొందుకొనునట్లు క్రియలు కనపరచబడతాయి. తద్వారా నీ విశ్వాసము, నిరీక్షణ తిరిగి పొందుకుంటావు. చివరికి నీవు నిరీక్షించినది నీవు పొందుకుంటావు.

ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు.. -కొలొస్సయులకు 1:9

దేవుని మహిమా శక్తిని బట్టి బలపరచబడాలి అని సంఘము కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మనలను బలపరచువాడు మహిమా శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన ఒక మాట పలకగా ఆ ప్రకారము జరుగుతుంది.

తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. -ఎఫెసీయులకు 6:10

మన ప్రభువు మహిమా శక్తిని కలిగి ఉన్నాడు, మహా శక్తిని కలిగి ఉన్నాడు. అనగా నీవున్న పరిస్థితి ఎంత బలమైనది అయినప్పటికీ నిన్ను బలపరచువాని శక్తి ముందు పనికిరానిదే! పౌలు జీవితములో శరీరమంతా గాయములచేత నిండిపోయింది. అయినప్పటికీ దేవుని మహిమా శక్తి చేత బలపరచబడ్డాడు. మరొక సందర్భములో ఓడ పగిలి ఒక ద్వీపము లోనికి వెళ్ళినప్పుడు. ఒక విష సర్పము కాటువేసింది.

ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలా డుట చూచినప్పుడు–నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.౹ అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.౹ -అపొస్తలుల కార్యములు 28:4-5

ఇక్కడ అక్కడ ఉన్న ద్వీప నివాసుల యొక్క అనుభవము ప్రకారము పౌలు చనిపోవలసినవాడు. సర్పము యొక్క విషమునకు ఉన్న బలము, జీవమును తీసివేయుట. అయితే పౌలు యొక్క విశ్వాసము ఏమిటి అంటే, నన్ను బలపరచువాడు ఒకడు ఉన్నాడు అనే సత్యమే! దానిని బట్టే ఆ సర్పము కాటు వేసినప్పటికీ అతడు మరణము పొందలేదు. అదే దేవుడు మనతో కుడా ఉన్నాడు. మనతో ఉన్నవాడు సామాన్యుడు కాడు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. అటువంటి ఆయన మనకుండగా, ఆ మహిమా శక్తి మహా శక్తి మనకుండగా మనకు వ్యతిరేకముగా ఏమి నిలబడుతుంది? కాబట్టి ఇంక దేనికి మనము భయపడనవసరము లేదు. “భయపడకుడి” అనే మాట 365 సార్లు వ్రాయబడింది బైబిల్ లో. అనగా రోజుకు ఒక్కసారి భయపడకండి ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ప్రతిరోజు అపవాది నిన్ను నన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థము. అయితే దేవుని మహిమా శక్తి, మహా శక్తి మనకు తోడుగా ఉండి.