17-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ దినము దేవుడు మనకొరకు సిద్ధపరచిన దినము. ఈ దినమున దేవుని మనము స్తుతించాలి, ఘనపరచాలి. మన దేవుని గురించిన సంగతులను ధ్యానించడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన ఎటువంటివాడు? ఆయన మనసు ఎటువంటిది? అనే సంగతి ఎంత ఎక్కువగా మనము తెలుసుకొంటే, మనము అంత ఎక్కువగా మనము దీవించబడతాము. అంతే కాదుగానీ మనము సృష్టించబడినదే దేవుని మహిమ కొరకే సృష్టించబడ్డాము.

కోటానుకోట్ల మనుష్యుల మధ్య నీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని నీవు గ్రహిస్తే, ఆయనను స్తుతించక మౌనముగా ఉండలేవు.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను – రోమా 8:30

ఈ రోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటేనే, నిర్ణయించబడిన వారము అని అర్థము. అనాది కాలపు సంకల్పము చొప్పున ఆయన మహిమ నిమిత్తమై నిర్ణయించబడ్డాము. ఆదాముకు అనుగ్రహించబడిన పోగొట్టబడింది. అయితే యేసు క్రీస్తును బట్టి మరలా ఆ మహిమను సంపాదించుకోగలిగాము.

ఈ లోకములో వారు కలిగి ఉన్నదానిని బట్టి ఎంతో గొప్పగా అతిశయించేవారిగా ఉంటారు. అయితే మనము అతిశయిస్తే అది మన దేవునిని బట్టే అతిశయించాలి. అందుకే పౌలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టే అయి ఉన్నాను అని చెప్పుచున్నాడు.

అంతే కాదు గానీ, క్రీస్తు యొక్క జ్ఞానము సంపాదించుకోవడానికి తాను కలిగిన సమస్తము పెంట కుప్పగా ఎంచుకొంటున్నాడు అని చెప్పుచున్నాడు. మనకు కూడా మన దేవుని గూర్చి ఎరగటానికే ఆసక్తి కలిగి ఉండాలి. మన అతిశయకారణమే మన దేవుడు అయి ఉండాలి.

అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు – యిర్మీయా 9:24

ఈ వాక్యములో దేవుడే చెప్పుచున్నాడు, ఆయన ఏమైఉన్నాడో పరిశీలించి గ్రహించి తెలుసుకోవాలి దానిని బట్టే ఒకడు అతిశయించాలి అని చెప్పుచున్నాడు. ఈరోజు ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు అనే సత్యము ఎరిగి ఆరాధించాలి. ఆయన బిడ్డలముగా మన జీవితములో న్యాయమే జరుగుతుంది. అయితే ఇదంతా పరిశీలనగా తెలుసుకొన్నప్పుడే ఇది సాధ్యము అవుతుంది.

అపవాది దాడి చేసినప్పుడుగానీ, గాయపరిచినప్పుడు గానీ, మన దేవుడు రోషము కలవాడు అనే సత్యము నీవు ఎరిగి ఉండాలి. మన దేవుడు మృతమైనదానిని సహితము సజీవముగా చేయగలవాడు. లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగినవాడు.

షద్రకు, మేషాకు, అబెద్నగోలు వారి దేవుని గూర్చి గొప్పగా చెప్పగలిగారు. మా దేవుడు రక్షించ సమర్థుడు అని ధైర్యముగా ప్రకటించారు. వాళ్ళు ఏదైతే ప్రకటించారో అదే ప్రత్యక్షపరచబడింది. వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని వారు ప్రకటించారు. అది వారి అంతరంగములో స్థిరపరచబడిన సత్యము. మనము కూడా అనుభవపూర్వకముగా దేవునిని గూర్చి ఎరిగి ఉంటే, మనము కూడా అలాగే చెప్పగలుగుతాము.

రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును – మత్తయి 6:34

ఈ వాక్యము నీ కొరకే అని నీవు తీసుకోవాలి అంటే, నీవు ఆయన దృష్టిలో ఆకాశ పక్షులకంటే బహు శ్రేష్టుడవు అనే సత్యము నీవు ఎరిగి ఉండాలి. దానిని బట్టి నీవు నిర్ణయించబడినవాడవు కాబట్టి, రేపటి దినములో నీవు అడుగుపెట్టేటప్పుడే నీ జీవితములో జరగవలసినది ఖచ్చితముగా జరుగుతుంది.

దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు – ప్రసంగి 3:11

ఒక దినములో 24 గంటలు ఉంటే, ఆ ప్రతీ గంట ఏ మంచి జరగాలో అది ముందుగానే ఆయన నిర్ణయించాడు. ఆమేన్! దానిని బట్టి మనము చింతించవలసిన అవసరమే లేదు.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము – రోమా 8:28

ఆయన సంకల్పము ఏమిటి అనగా, నన్ను ఆయన మహిమ నిమిత్తమై ముందుగా ఏర్పరచుకున్నాడు. అటువంటి నా జీవితములో నేను రేపటి దినములో అడుగుపెట్టుచుండగానే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్!

అందుకే క్రీస్తు జ్ఞానము మనము తెలుసుకోవాలి. ఆ జ్ఞానమును సంపాదించుకోవడానికి మనము తాపత్రయపడాలి, ఆశ పడాలి, ఆసక్తి కలిగి ఉండాలి అందుకే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఆయ్న భూమి మీద కృపచూపేవాడుగా ఉంటాడు. నీవు ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నపుడు ఆయన కృపను బట్టి నిన్ను బలపరచేవాడు, దీవించేవాడు, సమస్తము దయచేయువాడు. అందుకే వాక్యపు సత్యము తెలియగానే ఎంతో సంతోషించేవాడవుగా ఉంటావు.

దేవుని కృప మనపై ఉన్నంతకాలము మనము బలహీనులము కాము. అంతే కాక ఎప్పుడు మనము బలహీనులమో, అప్పుడే మరింత బలవంతులము, ఆమేన్!

నీ జీవితమును బలమైన జీవితముగా, శక్తివంతమైన జీవితముగా చేయగలిగిన వాడు నీ దేవుడు. కృప చూపేది ఆయనే, నీతి న్యాయములు జరిగించువాడు ఆయనే, మేలు కొరకు సిద్ధపరచేది ఆయనే, నిర్ణయించుకున్నది ఆయనే. మనము చేసేది, చేయగలిగినది ఆయన సొత్తైన జనాంగముగా ఉండటమే! అందుకే మన పితరుల జీవితములో పలికిన శక్తివంతమైన మాట – “దేవుని కృప నిరంతరము ఉండును”.

యోబు దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని చెప్పారు. పౌలు కృపను గూర్చిన సత్యమును ప్రకటించాడు. దావీదు నా బలము యెహోవాయే, యెహోవా నామమే నా బలము అని ప్రకటించాడు. మరి నీ జీవితము ద్వారా కూడా ఒక సత్యము ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నావా?

ఆరాధన గీతము

భయము లేదు దిగులే లేదు

 

వారము కొరకైన వాక్యము

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను – 2 పేతురు 1:1-2

ఎప్పుడైతే మన దేవుని గూర్చిన అనుభవజ్ఞానమును మనము సంపాదించుకుంటామో, అప్పుడు దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దేవుని ద్వారా మనము పొందుకొనగలుగుతాము. మనము సాధారణమైన మనుష్యులము కాదు అనే సత్యము మనము ఎల్లప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. మన జీవితములో ఎటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఉన్నప్పటికీ, మనకున్న దేవుని పిలుపు బట్టియే మన జీవితము స్థిరపరచబడుతుంది.

ఇప్పుడు మనమున్న లోకము ఎంతో భయంకరముగా ఉంది. ప్రత్యేకించి యవ్వనస్తుల యొక్క పరిశుద్ధతపై దాడి చేసే పరిస్థితులు లోకములో ఉన్నాయి. ఈ సమయములో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

మనము బయట ఎలా ప్రవర్తిస్తున్నామో అదే విధముగా మనము సంఘములో ప్రవర్తించగలుగుతామా? ఒకవేళ అలా ప్రవర్తించగలిగితే, దేవుని యెదుట మంచి మనస్సాక్షి కలిగి ఉన్నట్టే. అలా కాకపోతే, మనము సరిచేసుకోవాలి.

మనము దేవుని వెంబడించేది ఆయన ఇచ్చే లోకపు ఆశీర్వాదాలను బట్టి కాదు గానీ, మనము ఆయనకు మహిమకరముగా ఉండడానికి, అలాగే మరో కొంతమందిని ఆయన వైపు నడిపించడానికి. అలాగే మన ఆలోచనలు ఎన్నో సార్లు దేవుని ప్రణాళికను అర్థము చేసుకోలేక మన స్వంత ఆలోచనల కొరకు ప్రయాణము చేసేవారముగా ఉంటాము.

అయితే నిజానికి క్రైస్తవులు అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడేవారు. మన వద్దకు ఎవరైన సమస్య కొరకు వస్తే, వారి సమస్యకు నివారణ మనము ఇవ్వగలుగుతున్నామా? మనపై మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావము చూపిస్తున్నాయా? లేక దేవుని వాక్యము ప్రభావము చూపిస్తుందా?

నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయ నేరడు – ప్రకటన 3:8

బైబిల్ లో మనము చూస్తే తక్కువగా ఉన్నది, చిన్నగా ఉన్నది, కొంచెముగా ఉన్నది ఎంతో బలమైనదిగా దేవుడు యెంచి, బలమైన కార్యములు చేసేవారిగా మార్చినాడు. ఫిలదెల్ఫియా విశ్వాసులు కూడా వారి శక్తి కొంచెమై ఉన్నా సరే, వారు దేవుని వాక్యమును గైకొని ఆయన నామమును ఎరుగను అనలేదు. దానిని బట్టి బలమైన మార్గము దేవుడు వారి యెదుట సిద్ధపరచాడు.

అలాగే మన జీవితములో ఏ ఏ కొరతలు ఉన్నా, బలహీనతలు ఏమి ఉన్నా మనము నమ్మిన దేవుని గూర్చిన సత్యమును బలముగా ప్రకటించేవారుగా ఉండాలి, ఆయన బలముపైనే ఆధారపడేవారిగా మనము ఉండాలి.

ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును – మత్తయి 13:31-32

ఎదైతే కొంచెము అని, తక్కువ అని ఆలోచిస్తామో, వాటి మూలముగానే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్! 5000 మంది అరణ్య ప్రదేశములో ఉన్నప్పుడు ప్రభువు కొంచెముగా ఉన్న రొట్టెలు, చేపలతో దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసాడు.

యెహోవా –నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు– నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో – న్యాయాధిపతులు 7:2

ఇక్కడ చూస్తే, గిద్యోను వద్ద అనేకమంది జనులు ఉన్నారు. దేవుడు వారి చేతికి శత్రువును అప్పగించడానికి ఇష్టపడటములేదు. దానికి కారణము మనుష్యుల చేతి బలమును బట్టి కాక, యెహోవా బాహు బలము చేత జయము పొందాము అనే సత్యము ప్రకటించి దేవునిని మహిమ పరచాలి అనే దాని కొరకే.

నీవు బలహీనుడవా?నీ దగ్గర కొంచెమే ఉందా? నీ శక్తి చాలదా? నీ వైపు ఉన్నవారు కొద్ది మందేనా? అయినా నీ దేవునికి అది చాలు.

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను – 1 రాజులు 17:1

ఒకే ఒక్క మనుష్యుడు మొత్తము రాజ్యము మీదికి ఆశీర్వాదము రాకుండా ఆపగలిగాడు. అయితే ఈ ఒక్కడు దేవుని సన్నిధిలో నిలబడేవాడిగా ఉన్నాడు. మనము కూడా అదేవిధముగా ఉండాలి. గిద్యోను కూడా ఒక్కడే కానీ దేవుడు చెప్పిన ప్రకారముగా 300 మందిని మాత్రమే కూడబెట్టుకుని వెళ్ళి అమ్మోనీయులపై విజయము పొందుకున్నాడు.