స్తోత్ర గీతము 1
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం
వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ
విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు
జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో
“విశ్వాస వీరులం”
అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను
అబ్రహామును దేవుని నమ్మెను – దేవుడతని కది నీతిగా ఎంచెను
ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే – కదిలెనుగా అబ్రహాము
యెహోవ యీరే అని కొడుకును లేపునని – అర్పించి పొందెనబ్రహాము
విశ్వాసులకు తండ్రయ్యాడు – దేవునికే స్నేహితుడై పేరొందాడు
“విశ్వాస వీరులం”
యోసేపుకు దేవుడు కల లిచ్చెను – ఫలించు కొమ్మగా అశీర్వదించెను
యోసేపు దేవుని ప్రేమించెను – అన్ని వేళల ప్రభు వైపే చూచెను
గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు
ప్రభువే తోడుండా శోధన జయించి – అధిపతిగా ఎదిగినాడు
బానిస కాస్త రాజైనాడు – ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు
“విశ్వాస వీరులం”
దానియేలుకు దేవుడు వరమిచ్చెను – కలల భావము వివరింప నేర్పెను
దానియేలు తన దేవుని ఎరిగెను – ప్రత్యేకముగా జీవించి చూపెను
రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని – దేవుని మహిమను చూపాడు
సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి – సింహాల నోళ్లను మూశాడు
దానియేలు దేవుడే జీవము గల దేవుడని – రాజు చేత రాజ్యమంత చాటించాడు
“విశ్వాస వీరులం”
సౌలును పౌలుగా దేవుడు మార్చెను – దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను
పౌలు యేసుని అంతట ప్రకటించెను – భులోకమంతా సంచారము చేసెను
క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి – దర్శనమును నెరవేర్చాడు
జీవ వాక్యమును చేత పట్టుకొని – సిలువ సాక్షిగ నిలిచాడు
తన పరుగును కదా ముట్టించి – విశ్వాసం కాపాడుకొని గెలిచాడు
“విశ్వాస వీరులం”
వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ
విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు
జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో
స్తోత్ర గీతము 2
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే
స్తోత్ర గీతము 3
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే దేవా నిన్నే
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్
ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని ఫలాలతో తోడైఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
“దేవా నీకే”
నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు
మహోన్నతుడా నీకే వదనం
మహోన్నతుడా నీకే వదనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
“దేవా నీకే”
బంగపడిన వేల తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వతపరిచావు
బంగపడిన వేల తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వతపరిచావు
దుఃఖ్ఖ భాదల్లో నీవు నాకు తొడై వున్నావు
దుఃఖ్ఖ భాదల్లో నీవు నాకు తొడై వున్నావు
మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
“దేవా నీకే”
ఆరాధన వర్తమానము
ఈ దినము ఎంతో ప్రశస్తమైన దినము, ఎంతో ఆశీర్వాదకరమైన దినము అయి ఉంది. వాక్యాన్ని ధ్యానము చేసినపుడు, ఈ దినము యొక్క ప్రాముఖ్యత మనకు వెల్లడి పరచబడుతుంది. ఈ ఒక్క దినము గనుక మనము పోగొట్టుకొంటే, వెయ్యిదినముల ఫలము మనము పోగొట్టుకుంటాము.
ఈ దినము దేవుడు ఏర్పాటుచేసిన నియమము అయిఉంది. మరి ఈ దినము దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేనికొరకు ఈ దినము నియమించబడిందో ఆ విషయము మనము పట్టుకోవాలి.
ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మనకు అంటుకొనే లోక మాలిన్యమును వాక్యముచేత ఉదకస్నానము చేయు దినము ఈ దినము. దీనికంటే శ్రేష్టమైన విషయము, మన దేవుడు స్తుతింపదగినవాడు, ఆరాధింపదగినవాడు. మనము సృజించబడినదే ఆయనను మహిమ పరచడానికి.
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9
నేనే ద్వారమును అని యేసు ప్రభువు చెప్పుచున్నాడు. ఆ ద్వారము ద్వారా వచ్చిన ప్రతివాడూ మేత మేయగలుగుతాడు. మనము దేవుని సన్నిధిలో యేసుప్రభువు ద్వారానే ప్రవేశించాము గనుక ఖచ్చితముగా మనకొరకు సిద్ధపరచబడిన ఆహారము ఉంది.
ఈ ఆహారము ఇహలోక సంబంధమైనదైనా కావచ్చు, పరలోక సంబంధమైనదైనా కావచ్చు. మనము కొన్ని సందర్భములలో జరిగిన పరిస్థితిని బట్టి నిరాశతో దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు కూడా, మన కొరకు సిద్ధపరచబడిన ఆహారము ఖచ్చితముగా ఉంది. ఆకలి ఎవరికి ఉందో వాడే తనకొరకు సిద్ధపరచబడిన ఆహారము ఏమిటో కనిపెట్టాలి. దానికి ఆయన సన్నిధిలో ఏకాగ్రత కలిగి వాక్యపరిచర్యకు, ఆత్మ పరిచర్యకు లోబడి కనుక్కోవాలి.
ఈ దినము శుద్ధిచేయబడే దినము, ఈ దినము తిరిగి నింపబడే దినము. ఈ సత్యము గ్రహించినపుడే ఆ విధముగా సిద్ధపరచగలము. మన ఆత్మ బలముగా ఉన్నప్పుడు విశ్వాసము కనపరచగలుగుతాము.
యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. -కీర్తనలు 145:8
మనము ఆరాధించడానికి సిద్ధపడిన దేవుడు ఎటువంటివాడు? అనే సత్యము తెలుసుకొనుటయందే దృష్టి కలిగి ఉండాలి. ఎందుకంటే, ఆయనను బట్టే మన జీవితములు ఉంటాయి.
ఆయన దయా దాక్షిణ్యములు కలవాడు కాబట్టే మన జీవితములు నిలబడుతున్నాయి. ఒకవేళ ఆయన దయ గనుక మన మీద లేకపోతే, మనలను ఎప్పుడు మింగుదునా అని ఎదురుచూసే అపవాది చేతిలో పడి నాశనమైపోయేవారముగా ఉంటాము.
అలాగే ఆయన దీర్ఘశాంతుడు అయి ఉన్నాడు అనగా ఓపికతో నీకోసము కనిపెట్టుకుంటున్నాడు. ఒకవేళ ఆయన ఓపిక పట్టకపోతే, అపవాది చేతిలో ఎప్పుడో పడి నాశనము అయ్యేవారము.
మన జీవితములలో ఏమి పొందుకున్నాసరే, అది ఆయన కృపను బట్టే మనము పొందుకుంటున్నాము.
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? -మత్తయి 6:26
అంటే మన తండ్రి ఖచ్చితముగా మనలను పోషిస్తాడు అని ఈ వాక్యము స్పష్టము చేస్తుంది? తండ్రి ఆకాశ పక్షులను ఎలా పోషిస్తున్నాడు? ఆకాశ పక్షుల పోషణ కొరకు అవి ఏమీ చేయట్లేదు. అనగా విత్తవు, కోయవు మరియు సమకూర్చుకొనవు గానీ, వాటి కొరకు, అవి జీవించులాగున ఆహారము తండ్రి సిద్ధపరచేవాడుగా ఉన్నాడు.
నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు. -కీర్తనలు 65:9
మనము తింటున్న ఆహారముకొరకు దేవుడు భూమిని దర్శించి, దానిని తడిపి ఆహారము పండులాగున సిద్ధపరుస్తున్నాడు. అలాగే మన దేవుడు మన జీవితమును దర్శించి, మన జీవితమునకు కావలసిన సమస్తము సిద్ధపరచేవాడుగా దేవుడు ఉన్నాడు.
యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. -కీర్తనలు 145:9
మన దేవుడు అందరికి మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితములలో అనుభవిస్తున్న ప్రతి మంచిదాని వెనుక దేవుడి మేలు ఉంటుంది.
నీతిమంతునిని ఒకదారి దేవుని ద్వారా తెరువబడింది. అయితే ఆ ఒక్క ద్వారాము మూయబడితే, మరొక ఏడు ద్వారములు తెరువబడతాయి. మనము దేవుని యొక్క మహిమ కొరకు సృష్టించబడాము. మనకు మూయబడిన ఒక ద్వారా ఎంత మహిమ కలుగువలసిందో, అది మూయబడినప్పుడు తెరువబడే ఏడు ద్వారములద్వారా, ఏడంతల మహిమ కలుగుతుంది.
మన ముద్ర నీతిమంతులం, దేవుని బిడ్డలం. అదే మన బలము, అధికారము. ఈ ముద్రను బట్టే మనకు సమస్తం అనుగ్రహించబడతాయి. గనుక మనకు ఏ విషయములో ఒక్కద్వారము మూయబడిందో, ఆ విషయము సంపూర్ణము అగునట్లు ఏదు ద్వారములు మనకు తెరువబడతాయి.
నీతిమంతులు అనగా దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము కలిగి నడచేవారే!
యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. -కీర్తనలు 145:10
ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములపై ఉన్నవి. మనము కూడా ఆయన కార్యమే గనుక, మనపై కూడా ఆయన కనికరము ఉంది. ఈ సత్యము ఎరిగినవారై, ఆయ్నను మనస్పూర్తిగా స్తుతించాలి.
ఈరోజు చెప్పబడిన సత్యము గ్రహించి, అంగీకరించి ఆయనను ఆరాధించుచుండగా మన జీవితములో ఖాళీ అయిన ప్రతీదీ నింపబడుతుంది.
ఆత్మీయముగా, శారీరకముగా కూడా నింపబడటము జరుగుతుంది. ఆత్మీయముగా ఎక్కడ మనము లేమి కలిగి ఉన్నామో, ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ నింపుదలను బట్టి, మరలా బలపరచబడతాము.
అలాగే శరీరము ప్రకారముగా చూస్తే, మన అందరికీ ధనము చాలా అవసరము అయి ఉన్నది. ఈ ధనము లేని దానిని బట్టి మనము కృశించిపోయేవారముగా, కష్టముతో దుఃఖముతో మనము ఉంటాము. మన ఆత్మ కూడా దానిని బట్టి కృంగిఉంటుంది.
ఎవరైతే ఆయన ద్వారములో ప్రవేశించారో, వారి ఆత్మ మొదటిగా బలపరచబడుతుంది. ఏ విషయము కొరకు మన ఆత్మ కృంగిపోయిందో, ఆ విషయములోనే మొదట మన ఆత్మ బలపరచబడుతుంది. అలాగే ఆ విషయము కొరకైన వనరులు, అది ధనమైనా, మరేదైనా సరే కూడా సిద్ధపరచబడుతుంది.
ఆరాధన గీతము
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా
||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు
||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును
||నా ప్రాణమా||
వారము కొరకైన వాక్యము
ఈరోజు పాపము యొక్క ప్రభావము గురించి నేర్చుకుందాము. ప్రస్తుతము శ్రమదినముల కాలముగా పాటిస్తారు. ఈ 40 దినముల కాలములలో సిలువను గూర్చిన ధ్యానముచేసేవారిగా ఉంటారు.
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువకార్యము మన అందరి పాపముల కోసమే. అయితే యేసు ప్రభువు యొక్క సిలువ త్యాగము వ్యర్థము కాకూడదు అంటే, పాపము యొక్క ప్రభావము మనము ఎరిగి ఉండాలి.
ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ౹ -రోమా 5:12
ఆదాము అనే మనుష్యుని ద్వారా పాపము ప్రవేశించింది. దానిని బట్టి మరణము కూడా ప్రవేశించింది. అలా ప్రారంభమైన పాపము మనుష్యులందరూ పాపము చేయడానికి ప్రేరేపించి విస్తరించింది.
అనగా కేవలం ఆదాము చేసిన పాపము విస్తరించడము మాత్రమే కాదు కానీ, మనము చేసిన పాపము కూడా విస్తరింపచేయబడుతుంది గనుక చాల భయము కలిగి ఉండాలి. మన పిల్లలను ఖచ్చితముగా దేవుని భయములో పెంచవలసిన అవసరము ఎంతో ఉంది.
ఈరోజున చిన్న చిన్న పిల్లలు ఏమి తెలియని వయసులో అశ్లీలముగా అర్థము వచ్చే పాటలకు నాట్యము చేస్తుంటే, తల్లిదండ్రులు అది గమనించక వారిని ప్రోత్సహించేవారిగా ఉంటున్నారు.
ఈ పాపము అనేది దాచబడేది కాదు. రహస్యముగా చేసిన పాపము అయినా సరే అది బయటపడవలసినదే. ఈ పాపము అనేది విస్తరించేది గనుక ఆదిలోనే దానిని ఆపవలసిన అవసరము ఉంది.
అందుకే మన పిల్లల విషయములో అపవాది క్రియలు కనబడుతున్నపుడు మొదట్లోనే వాటిని ఖండించి దానిని సరిచేయాలి. పాపము ప్రభావము వెంటనే కనబడదు. పాపము గర్భము ధరించి, మరణమును కనును. పాపము యొక్క ప్రభావము ఆ కనుపరచబడే మరణము.
అందుకే పాపము నుండి పారిపొమ్మని లేఖనములు చెప్పుచున్నవి. యోసేపు కూడా నేను ఎలా యేహోవా సన్నిధిని ఎలా పాపము చేయగలను? అని తాను పాపమునుండి పారిపోయాడు.
శరీర సంబంధములో మన పిల్లలకు మన నుండి శారీరకమైన విషయములు సంక్రమిస్తాయి. అలాగే మనము చేసిన పాపము యొక్క ప్రభావము కూడా మన పిల్లలకు సంక్రమిస్తుంది.
అందుకే మనము చూసే చూపు, వినే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ లో మనము దేవునికి మహిమకరము కానిది చూసేది, వినేది అది ఏమైనా సరే, దాని ప్రభావము మన తరువాత మన పిల్లలపై ప్రభావము పడుతుంది.
పాపము అనేది ఒక చిక్కుముడిలాంటిది. ఒకదానికొకటి అది చిక్కులు పడుతుంది. ఒకసారి మొదలై, నీ జీవితములో అనేకమైన వాటితో ముడిపడిపోయి నాశనము చేస్తుంది.
ఇంతవరకు పాపము ప్రభావము తెలియక ఒకవేళ అజ్ఞానముగా ప్రవర్తించినప్పటికీ, ఈరోజున దేవుని మాటను బట్టి ఆ పాపమునుండి మనము దూరముగా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోదాము.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23
మనము పాపములో ఉన్నప్పుడు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాడు. మనము పాపము చేయడానికి సిద్ధపడుతున్నపుడు, నేను ఏదో విషయములో దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాను అనే భయము మనకు కలగాలి. ఎందుకంటే మన జీవితము మహిమా జీవితము.
అటువంటి మహిమా జీవితాన్ని హాస్యాస్పదమైన కారణములతో, పాపమునకు ఆస్కారమిచ్చి పోగొట్టుకుంటున్నాము. పాపము, దేవుని మహిమను మన జీవితమునుండి దొంగిలిస్తుంది.
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను . -కీర్తనలు 139:16
మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే దేవుడు నియమింపబడిన దినములు ఆరంభము కాక మునుపే, అనగా మనము పుట్టిన దినము మొదలుకొని, మన దినములన్నియు కూడా కాకమునుపే, ఆ దినములలో ఏమి జరగాలో అవి గ్రంథములో వ్రాయబడ్డాయి.
దేవుడు సిద్ధపరచిన సమాధానకరమైన, సంతోషకరమైన దినములు. ఈ దినములు దేవుడు మహిమకరముగా ఉండునట్లు దేవుడు సిద్ధపరచాడు.
అయితే, మన జీవితములో మనము పాపము చేసినప్పుడు ఏమి జరుగుతుంది అని చూస్తే, మన జీవితములో దేవుడు సిద్ధపరచిన అద్భుతమును మనము చేసిన పాపము మింగివేస్తుంది. పాపముతో ఉన్నంతసేపు దేవుడు సిద్ధపరచిన మహిమ చూడలేవు.
అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు! -కీర్తనలు 81:13
మనము పాపముతో మన జీవితమును కొనసాగించుచుండగా, దేవుని మాట విని పాపమునుండి మనము దూరముగా వెళ్ళి, దేవుని మాటకు లోబడితే, దేవుడు ఎంతో మేలు నేను చేస్తాను అని ఆశపడి పిలుస్తున్నాడు.
అది ఎంతమేలు అంటే, అది వివరించడానికి కూడా సాధ్యము కాదు.
అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. -కీర్తనలు 81:14-16
మనము దేవుని మాటను బట్టి పాపము ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు, ఆయన ఆలస్యము చేయకుండా ఆయన మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎంతగా మనలను కోరుకుంటున్నాడో కదా!
మనకు వ్యతిరేకమైన శత్రువును, దేవుడు సూపర్ నేచురల్ గా అణగద్రొక్కుటకు దేవుడు సిద్ధమే, అయితే పాపమును విడిచిపెట్టి దేవుని మాటను బట్టి నిలబడితేనే గాని ఇది సాధ్యముకాదు.
దేవుని మహిమ మనతో ఉన్నంతసేపు, ప్రతీదీ మనకు లోబడే ఉంటుంది. మరణకరమైనది ఏదైనా సరే, అది మనకే లోబడి ఉంటుంది.
పాపము మొదట చిన్నగా ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా అది అనేకమైనవాటికి చుట్టుకుని నాశనము చేస్తుంది. దేవుని మహిమ మన జీవితములో ప్రత్యక్షపరచబడకుండా దొంగిలిస్తుంది.
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి –కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. -మత్తయి 9:2
ఇక్కడ పక్షవాయువుతో ఉన్న వ్యక్తి శరీర బలహీనతతో ఉన్నాడు. అయితే యేసయ్య అతనితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుచున్నాడు. అంటే, అతను చేసిన పాపమును బట్టి అవిటివాడుగా వాడు చేయబడ్డాడు.
అంటే మనము పాపము చేసినపుడు, అలాగే అదే పాపములో కొనసాగించబడుతున్నపుడు మన జీవితము అకస్మాత్తుగా స్తంభించిపోతుంది. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి. అందుకే అసలు పాపమును మన దరి చేరనివ్వవద్దు.
అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా -యోహాను 5:14
ఒకసారి స్వస్థపరచబడిన తరువాత మనము పాపం చేయుటనుబట్టి ఇంతకుముందుకన్నా మరి ఎక్కువ కీడు కలిగించేదిగా ఈ పాపము ఉంది.
క్షేమకరమైన జీవితము మనము అనుభవించాలి అంటే, ఖచ్చితముగా మనము పాపమును దూరముగా పెట్టాలి, ఆ పాపము చేయుటకు ప్రేరేపించే ప్రతి అవకాశమునుండి పారిపోవాలి. ఒకవేళ అలా కాకపోతే, మనము చేసే పాపము మన పిల్లల జీవితముపై ప్రభావము చూపిస్తుంది.
అయితే ఇప్పటివరకు జగించిన పాపము యొక్క ప్రభావమునుండి తప్పించబడాలి అంతే ఏమి చెయ్యాలి?
ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి -లూకా 7:47
మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.౹ -యోహాను 14:15
ఆమె విస్తారముగా దేవునిని ప్రేమించింది, ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు మనము దేవునిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యమును గైకొనడమే. విస్తారముగా ప్రేమించడము అంటే, ప్రతివిషయములో ఆయన మాటను గైకొనాలి.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.౹ -యోహాను 14:21
దేవుని మాటలను అంగీకరించి మనము నడిచినపుడు తండ్రి చేత ప్రేమించబడేవాడిగా ఉంటాము. పాపము ప్రతీ దోషమును కప్పును గనుక, ఎప్పుడైతే మనము దేవుని వాక్యము బట్టి ప్రతీ పరిస్థితిలో నడుస్తామో, ఇంతవరకు మనము చేసిన పాపదోషము కప్పబడి, తిరిగి మహిమా జీవితము పొందుకుంటాము.
అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. -లూకా 15:21
చిన్న కుమారుడు పాపము చేసి సమస్తము పోగొట్టుకొనిన తరువాత, తండ్రి దగ్గరకు వచ్చి తన పాపమును ఒప్పుకున్నాడు. అప్పుడు ఏమి జరిగింది అంటే –
అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; -లూకా 15:22
అంటే, పాపము చేయక మునుపు ఎటువంటి జీవితము అనుభవించాడో, అదే జీవితము మరలా వీడికి అనుగ్రహించబడింది.
ఈరోజు దేవుడు పాపము ప్రభావము గూర్చి మనకు తెలియచేసాడు. ఎలా దానినుండి తప్పించబడాలో కూడ తెలియచేసాడు. అప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియచేసాడు. ఇక నిర్ణయము నీదే!
ఇంతకు ముందు ఈ సత్యము సంపూర్ణముగా తెలియక పాపము చేసామేమో, అయితే ఈరోజు మనం ప్రేమ గలిగిన ప్రభువు చెంతకు తిరిగి పరుగిడి వచ్చి, మన జీవితమును ఆయన మహిమలో కట్టుకుందాము.