16-07-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది 

స్తోత్రగీతము – 1

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)
యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము (2)


ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా (2)


ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)

యేసే రక్తమే జయం యేసు నామమే జయం యేసునందే విజయం (2)

స్తోత్రగీతము – 2

విజయం నీ రక్తంలో – అభయం నీ హస్తంలో
సమాధానం సధాకాలం – నా రక్షకుడా నీలో

1. స్వస్థత నీరక్తంలో – భద్రత నీ హస్తంలో

2. రక్షణ నీ రక్తంలో – స్వాంతన నీ హస్తంలో

3. క్షమాపణ నీ రక్తంలో – నిరీక్షణ నీ హస్తంలో

4. పవిత్రత నీ రక్తంలో – వినంమ్రత నీ హస్తంలో

5. ఆరోగ్యం నీ రక్తంలో – ఆనదం నీ హస్తంలో

స్తోత్రగీతము – 3

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా…
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా…
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా


ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…


పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట లోకములో వెయ్యి దినములు గడుపుటకంటే శ్రేష్టము.

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.౹ -రోమా 8:37

దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. ప్రభువు యొక్క మాట మన జీవితములో స్థిరపరచబడాలి. దేవుడు మన గూర్చి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. మన ఆలోచనలు మన పరిస్థితులను ఆధారము చేసుకుని మనలను తక్కువ చేసుకుంటాము. అయితే దేవుడు మనలను గూర్చి ఎంతో ఉన్నతమైన ప్రణాలిక కలిగి ఉన్నాడు. మన పోరాటములు సామాన్యమైన విజయము కాదు గానీ, అత్యధికమైన విజయము పొందుకోవాలి అనే ఆశ కలిగినవాడు. మనము మన పిల్లలను ప్రేమించినదానికంటే అత్యధికముగా మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు.

“వీటన్నిటిలో” అనగా, “శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను” ప్రతీ పరిస్థితిలో ఆయన అత్యధిక విజయము దయ చేసేవాడుగా ఉన్నాడు.

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. -1 కొరింథీయులకు 10:13

అత్యధిక విజయమునకు వారసులగుటకు పిలువబడిన మనము, మనలను ప్రేమించిన యేసయ్యను బట్టి మన ప్రతీ పరిస్థితులన్నీంటిలో మనకే విజయము! అత్యధికమైన విజయము. దేవుడు మనలను ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడచుకోవాలి. మన జీవితాన్ని మన ఇష్టము వచ్చినట్టు జీవిస్తూ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకోవడం ఆత్మీయంగా క్షేమకరముకాదు.

తల్లిదండ్రులుగా మనము పిల్లలమీద అనేకమైన ఆశలు పెట్టుకొంటారు. అయితే పిల్లల యొక్క అవిధేయతను బట్టి వారు తల్లిదండ్రులు ఆశించేది పొందుకోలేని వారుగా అయిపోతాము. మనము కూడా, దేవుడు మనగూర్చి ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నప్పటికీ, లోకానుసారమైన ప్రవర్తనను బట్టి, దేవుడు మనకొరకు ఉద్దేశించిన వాటిని పొందుకోలేకపోతున్నాము. అయితే దేవుని చేత ప్రేమించబడితే ఏమవుతుంది?

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

దేవుని ప్రేమించువారికి “సమస్తము” కష్టమైనా, నష్టమైనా ఏ పరిస్థితి అయినప్పటికీ, సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతాయి. యోసేపు జీవితములో తండ్రి ఎంతో ప్రేమించాడు, అయితే అన్నలు మాత్రము ఎంతో ద్వేషించారు. యోసేపును గుంటలో పడవేసి, చివరికి ఐగుప్తీయులకు అమ్మివేసారు. అయినప్పటికీ యోసేపు జీవితములో సమస్తము మేలు కొరకే సమకూడి జరిగినవి. పౌలు జీవితములో కూడ, ఉపద్రవములైనా, ఆశీర్వాదములైనా మేలు కొరకే జరిగినాయి. మన జీవితము అయినా సరే, ఉద్యోగమైనా, కుటుంబమైనా ఏ పరిస్థితి అయినా సరే సమస్తము మేలు కొరకే జరుగుతాయి.

దేవుని మాట ప్రకారము మనము జీవించినప్పుడు, మన ప్రవర్తన దేవుని యెదుట సరిగా ఉన్నప్పుడు, మనము వెళుతున్న మార్గములో అడ్డుపడుతున్న ప్రతీ విషయములోనూ, అత్యధికమైన విజయము నీవు పొందుకొనులాగున నీకు తోడై ఉంటాడు. యోసేపు జీవితములో పరిస్థితులు విడిచిపెట్టినప్పటికీ, యోసేపు మాత్రము దేవునిని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు కూడ అతనిని విడిచిపెట్టలేదు.

యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. -కీర్తనలు 19:14

ఈరోజు మనము చేసే ఆరాధన దేవునికి అంగీకారము అవ్వాలి అంటే, మన హృదయమును ఆయన యెదుట సరిచేసుకుందాము. అప్పుడు మనము వెళుతున్న ప్రతీ విషయములోనూ అత్యధికమైన విజయము పొందుకుంటాము.

దేవునిచేత నీవు అంగీకరించబడాలి అనే ఆశ నీవు కలిగి సిద్ధపడితే చాలు, నీ ప్రతీ పరిస్థితిలోనూ అత్యధికమైన విజయమే! నీ హృదయమును సరిచేసుకో, దేవుడు విషయము తెలియచేసాడు అంటే, నీ మీద ప్రేమ ఉందనే అర్థము.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23

అనగా నీ సంతోషమునకు అడ్డముగా వచ్చే ప్రతీ దానినుండి అత్యధికమైన విజయము నాకు దయచేస్తాడు. ఏ సత్యమైతే నీకు ప్రకటించబడిందో ఆ సత్యమును బట్టి స్తుతి యాగము అర్పించినప్పుడు, నీవు ఒప్పుకొన్న సత్యము స్థిరపరచబడుతుంది. “నాకు అన్నిటిలో విజయము ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు కనుక నా దేవుడు నా ద్వారా మహిమ పరచబడాలి” అనే ఆశతో స్తుతిద్దాము.

యేసయ్య దగ్గరకు వచ్చిన 10 మంది కుష్టురోగులు, ఏ మాట పట్టుకుని తిరిగి వెళ్ళారో ఆ మాట ప్రకారము స్వస్థత పొందారు. అదే మార్పు లేని దేవుడు నీతో నాతో వున్నాడు.

విశ్రాంతి లేక, అలసిపోయిన స్థితిలో, చేసిన ప్రయత్నాలు ఫలించని స్థితి అయినా, నీకోసము ఆయన ఇచ్చిన మాట, “నీకు అత్యధికమైన విజయము ఇస్తున్నాను” ఈ మాట పట్టుకో చాలు.

దేవుడు నీ మీద ప్రేమతోనే “రేమా” మాటలు దయచేస్తాడు. గనుక నమ్మి, స్వీకరించి, ప్రకటించి ఆరాధించు, నీ జీవితములో మార్పు పొందుకో!

ఆరాధన గీతము

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము “2”
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం “2”

ఎబినేజరే – ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే – ఎబినేజరే
నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం

1.ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి “2”
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం “2”
“ఎబెనేజరే “

2.ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి “2” “ఎబెనేజరే “

3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యం ఆశ్చర్యమే “2”
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృప యే స్తోత్రం “2”
“ఎబెనేజరే”

ఎడారిలో ఉన్న నీ జీవితమును మేళ్లతో నింపాలనీ దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము పాట కాదు పాడుతున్నది. ఈ మాట సత్యముగా రూఢిపరుస్తూ దేవునిని మహిమ పరుస్తున్నాము.

నీ శత్రువుకు దొరకనివ్వక ఆయన కృపలో దాచబడ్డావు.. ఈ విషయము గ్రహిస్తున్నావా? నీవు ఆయన కౌగిలిలో దాచబడ్డావు.

 

వారము కొరకైన వాక్యము

శ్రమలో ఉన్నప్పటికీ మిమ్ములను అపవాదికి దొరకనివ్వక తన కౌగిలిలో, కృపలో దాచిపెట్టాడు. ఈ సత్యము నీవు తప్పక గ్రహించాలి.

“నా దేవుడు” అనే రోషము నీవు కలిగి ఉండి, నీ మాటల ద్వారా, చేతల ద్వారా ప్రకటించినట్టయితే, నీ శత్రువు ఎదుట తిరిగి లేచి జయోత్సాహమును పొందుతావు. ఓటమిని ఎట్టిపరిస్థితులలోనూ అంగీకరించవద్దు, మన దేవునికి సమస్తమూ సాధ్యమే! ఆలస్యము అనేది, “అసాధ్యము” అని కాదు గానీ, “సిద్ధపరచుట”. సత్యము గ్రహించి నిలబడు, నీ దేవుడు ఉన్నవాడను అనువాడు. నీవున్న ప్రతీ శ్రమలోనూ, నీవు మూలుగుతూ ఉన్న ప్రతీ స్థితిలోనూ నీతో ఉన్నవాడు.

ఈ మందిరములో దేవుని లోతైన సత్యములను నిత్యము తెలుసుకుంటున్న మన జీవితములలో భయము అనేదానికి చోటే ఉండకూడదు. మన జీవితము దేవుని అనుభవములచేత ముందుకు సాగాలి. అయితే మనము పరిస్థితుల అనుభవము గుండా వెళుతున్నాము. ఎందుకంటే, దేవుని సన్నిధి అనుభవము మనము కలిగి ఉండలేకపోవుట.

దేవుడు నీకు ఇచ్చిన అధికారము, ఆయన సన్నిధిలో నీవు అనుభవము కలిగి ఉంటే, అని మానిఫెస్ట్ అవుతుంది.

మన దేవుడు నిజమైన దేవుడు. నీ కంటే ఎక్కువగా ఆయనే నీవు ఆయనను తెలుసుకోవాలి, అనుభవించాలి అని కోరుకొంటున్నాడు.

నీకు స్వాస్థ్యముగా ఏమి ఇవ్వబడింది అని నీవు ఆలోచిస్తే,

మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.౹ -గలతీయులకు 4:1

బాలుడుగా ఉన్నంతకాలము నీకు అధికారమును ఉపయోగించే అవకాశము లేదు. బాల్య స్థితిలోనుండి వృద్ధి కలుగచేయబడి ఎదిగితేనే గానీ, నీకు అధికారము స్వాస్థ్యముగా అందదు. మనకున్న స్వాస్థ్యము ఏమిటి అని మనము ఎరిగి ఉండని కారణాన మనము దానికొరకు సిద్ధపడలేక పోతున్నాము. ఈరోజు నీ దేవుడు నీకిచ్చిన పిలుపు – నీ స్వాస్థ్యము ఏమిటో గ్రహించు.

అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹ -కొలొస్సయులకు 1:9

“తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము” అంటే ఏమిటి? యేసును అంగీకరించిన ప్రతీవాడు పరిశుద్ధుడే, అయితే నీకొరకు ఏ స్వాస్థ్యము సిద్ధపరచబడింది? అసలు స్వాస్థ్యము అంటేనే నీవు అనుభవించడానికి.

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ -యోహాను 1:12
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. -రోమా 8:17

యేసును అంగీకరించిన ప్రతీవారు దేవునికి పిల్లలు. పిల్లలమైతే మనము వారసులము. తండ్రి కలిగిన ప్రతిదానికీ వారసులము.

మరియు మీ మనోనేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని..-ఎఫెసీయులకు 1:17

తండ్రి కలిగి ఉన్నది మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. తండ్రి అపరిమితమైన శక్తి కలిగి ఉన్నాడు. ఆ శక్తినే క్రీస్తునందు వినియోగపరిచాడు. అదే శక్తి నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. క్రీస్తునందు వినియోగపరచిన ఈ శక్తి ఏమిటి అని ఆలోచిస్తే, మృతమైనదానిని జీవింపచేసే శక్తి. నీ జీవితములో కూడా ఎక్కడైతే మృతమైన పరిస్థితులు ఉన్నాయో, అక్కడ నీకు స్వాస్థ్యముగా శక్తిని ఉంది అని యెరిగి, బాల్య దశనుండి ఎదిగి ఆత్మలో ఎదిగినప్పుడు ఖచ్చితముగా ఆ శక్తి ప్రత్యక్షపరచబడుతుంది.

యేసయ్య మాటలను ఆయా సందర్భములలో గమనిస్తే, నేను ఒంటరిగా లేను నన్ను ప్రేమించే తండ్రి తనతోనే ఉన్నాడు ప్రతీసారీ చెప్తూనే ఉన్నాడు. అదే విధముగా మనము కూడా ఉండాలి. రుచి చూసి ఎరుగులాగున దేవుడు నీ కొరకు చెప్తున్న మాటలు ఇవి. ప్రాక్టీస్ చేసి అనుభవించి చూడు!

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ -కొలొస్సయులకు 2:3ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ -కొలొస్సయులకు 1:16

ఆయన ద్వారా, ఆయనను బట్టి నీకు కావలసిన సమస్తము సృష్టించాడు. ఆయన నీ తండ్రి గనుక ఆయన సృష్టించిన ప్రతీదీ నీవు అనుభవించుట కొరకే కదా!

మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు;౹ -కొలొస్సయులకు 2:10

ఆయనయందు మీరు సంపూర్ణులై యున్నారు అంటే, సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి, బుద్ధి జ్ఞానము ఆయనలోనే ఉన్నాయి. గనుక ఆయన సృష్టించిన ప్రతీ ఆశీర్వాదము నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఈ విషయమును గ్రహించిన దావీడు, “యెహోవా నా కాపరి” అని చెప్పగలుగుతున్నాడు. అంతేకాదు గానీ, “సింహాసనములైననూ” అనగా నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి సమస్తము సిద్ధపరచబడింది. “ప్రభుత్వములైననూ” అనగా రూల్ చేసే అధికారము. నీవు చదువుతున్నావా, ఉద్యోగముకొరకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నావా? నీ స్వాస్థ్యము ఏమిటో గ్రహించి సిద్ధపడు.

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.౹ -రోమా 8:37

ఈరోజు మన జీవితము బాగా ఉంది కాబట్టి ఈ వాక్యము నాకు కాదు అనుకున్నావు అనుకుందాము. రేపొచ్చిన శ్రమలో ఈ వాక్యము పట్టుకొని ఉన్నప్పుడు నీకు విజయము ఖచ్చితము. రేపేకాదు, ఎప్పుడైనా ఈ సత్యమును పట్టుకొని నిలబడితే నీకు విజయమే. ఇశ్రాయేలీయుల పోరాటములన్నీ దేవుడే చేసినవాడుగా ఉన్నాడు.

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?౹ -రోమా 8:35

ఈ లిస్ట్ లో ఉన్నవి ఏమైనాసరే ఎప్పుడైన సరే మన జీవితములో రానీ విజయము మాత్రము మనకే! ఇవే కాదు గానీ, నీ సంతోషమునకు వ్యతిరేకమైనది ఏమి నిలబడినా సరే, నీవు నీ స్వాస్థ్యము ఎరిగి నిలబడితే, విజయము నీకే.

మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడినవి
1. దేవుని శక్తి,
2. ఆశీర్వాదము
3. అధికారము
4. విజయము