ఆరాధన వర్తమానము
కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. ప్రతీ సమయమునకు ఒక పని జరుగునట్లుగా ఉన్నది. యేసయ్య “నా సమయము ఇంకా రాలేదు” అని చెప్పుచున్నాడు. అలా చెప్పిన సందర్భము గూర్చి ఆలోచిస్తే, ద్రాక్షారసము తయారుచెయ్యడము అనేది చాలా పెద్ద పని. అయితే అక్కడ ద్రాక్షారసము అయిపోయినతరవాత మరియ వచ్చి యేసయ్యకు చెప్పిన సందర్భము. అంటే అక్కడ యేసయ్య ద్రాక్షారాసము ఇవ్వాలి అంటే, అక్కడ అద్భుతమే జరగాలి. అయితే, యేసయ్య చెప్పుచున్నమాట, “నా సమయమింకా రాలేదు”.
అయితే సమయము వచ్చినపుడు, ద్రాక్షారసము తయారుచేయబడటము అనే కార్యము అంతా ఆ ఒక్క క్షణములో జరిగిపోయింది. అనగా ఒకవేళ ద్రాక్షారసము చెయ్యడానికి కొన్ని నెలల సమయము పడుతుంది అనుకుందాము, అయితే సమయము వచ్చినపుడు, ఆ నెలలకాలము పట్టే కార్యము, అద్భుతముగా ఒక్క క్షణములో జరిగిపోయింది.
ఈ సమయము కూడా అద్భుతము జరుగులాగున నిర్ణయించబడింది. మరియ ఏది జరగాలని వచ్చి యేసయ్యను అడిగిందో, ఆ అడిగినదే అక్కడ అద్భుతముగా జరిగింది. మన జీవితములో కూడా అవసరము ఉన్న పరిస్థితిలో, మనము అడిగినదే మనకు అద్భుతముగా జరుగులాగున, ఈ సమయము సిద్ధపరచబడింది. అయితే ఈ సమయము దీనికొరకే నిర్ణయించబడింది అని ఎలా నమ్మగలము? మరియ ద్రాక్షారసము అయిపోయిన సందర్భములో యేసయ్య నా సమయము రాలేదు అని మౌనముగా ఉన్నాడు. అయితే సమయము వచ్చినపుడు ఆయన మాటలాడటము ప్రారంభించాడు. అంటే ఆయన మాటలు మాటలాడుతున్నాడు అంటే అద్భుతము జరగడానికి సమయము అని అర్థము చేసుకోవచ్చు.
ఈరోజు మనము కూడా, ఆశకలిగి ఆయన సన్నిధిలో ఉంటున్నాము. ఇప్పుడు ఆ ఆశ నెరవేరుటకు ప్రభువు మాట మాట్లాడుతాడు గనుక, ఇది అద్భుతము జరిగే సమయము అని అర్థము చేసుకోవచ్చు. ఈరోజు మన జీవితములో జరగవలసిన అద్భుతము జరగడము కొరకు అనగా నీ కోరిక సిద్ధింపచేయబడటము కొరకు, మన ప్రభువు ఇప్పుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు.
దేవుని మాటలలో చాలా శక్తి ఉంటుంది. దేని కొరకు ఆ మాట వెల్లడి చేయబడిందో, ఆ కార్యము జరుగుటకొరకు ఆ శక్తి సిద్ధపరుస్తుంది. యెరికో గోడలు చాలా బలమైనవి. అప్పుడు ప్రభువు ఆరు దినములు దాని చుట్టూ తిరిగి, ఏడవ దినమున మాత్రము అందరు కలసి గట్టిగా అరవమని ప్రభువు చెప్పాడు. ఆ ప్రకారముగా వారు చేసినపుడు, దేవునిచేత పలకబడిన మాటలోని శక్తి కార్యము స్థిరపరచబడింది.అందుకే ప్రభువు నీకొరకు మాట్లాడే మాటలో ఎంతో శక్తి ఉంది.
ఎక్కడైతే పోగొట్టుకున్నావో, అక్కడే నిన్ను తిరిగి నిలబెట్టేవాడుగా ఉన్నాడు మన దేవుడు. అందుకే నీ జీవితములో, నీవు ముందుకు వెళ్ళకుండా అడ్డుగా ఉన్న ప్రతీ కోట కూల్చివేయడానికే ప్రభువు నిన్ను తన సన్నిధికి నడిపించాడు.
నీ అపజయముతో కూడిన సాక్ష్యము ఈరోజు అద్భుతముగా ప్రభువు మార్చివేస్తున్నాడు. ప్రభువు కానాలో చేసిన అద్భుతము మొదటి సూచక క్రియ. అక్కడ రెండు కార్యములు జరిగాయి. మొదటిది, ఆ కుటుంబము సిగ్గుపడకుండా కాపాడబడింది, దేవుని శక్తి ప్రకటించబడింది. అలాగే మన జీవితములో కూడా, మొదటిగా మన కోరిక తీర్చడము, రెండవదిగా మన జీవితములో ఆయన మహిమ పరచబడాలి అనే దేవుని కోరిక కూడా తీర్చుకోవడము.
ఈ సమయము ప్రవచనము నెరవేర్చబడు సమయముగా ప్రభువు నిర్ణయించాడు. యేసయ్య కొరకైన ప్రవచనము యెషయా ప్రవచించాడు. అయితే యేసయ్య పుట్టి ముప్పైమూడున్నర సంవత్సరములు అయిన తరువాత ఆ ప్రవచనము నెరవేరింది. అలాగే, మన జీవితములో కూడా, ప్రవచనము వచ్చి ఉండవచ్చు. అయితే దాని నెరవేర్పు ఇంతవరకు లేదు, అయితే ఇప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు సమయముగా ప్రారంభించబడుతుంది.
యేసయ్య అద్భుతకరుడు అనే పేరుతో పిలవబడవలసినది. అలా ఆ పేరుతో పిలువబడవలసిన సమయము ఆ కానాలో జరిగిన అద్భుతముతో ప్రారంభమయింది. అలాగే మన జీవితములో దేవుడుగా పిలవబడటానికి, జరగవలసిన అద్భుతము జరిగించే సమయము ప్రారంభమయింది.
యేసయ్య పనివారితో నీళ్ళు మాత్రమే అక్కడ ఉన్న బానలో నింపమని చెప్పాడు. అయితే, వాటిని ద్రాక్షరసము కొరకు అని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఒకవేళ ద్రాక్షారసము చెయ్యాలి అంటే, ద్రాక్షలను తెమ్మనాలి. పోనీ, ద్రాక్షారసము కొరకు నీళ్ళు అని చెప్పి ఉంటే, త్రాగే మంచినీళ్ళి సిద్ధపరచేవారు, అయితే అక్కడ కాళ్ళు కడుక్కునే బానలో నీళ్ళు పొయ్యమనిచెప్పారు. అనగా ప్రభువు అద్భుతము చేస్తున్నాడు అనే ఆలోచన ఎవ్వరికీ లేదు, ఊహకు కూడా అందని పరిస్థితి.
వారితో ఆ నీళ్ళు ముంచి, విందు ప్రధాని వద్దకు తీసుకువెళ్ళమని యేసయ్య చెప్పాడు. అయితే ఎప్పుడైతే వారు ఆ నీళ్ళు ఆ ప్రధానికి పొయ్యగానే అది ద్రాక్షరసముగా మారింది. అనగా చివరికి అక్కడ జరిగినది అద్భుతమే అని ఖచ్చితముగా తెలియచేయబడుతుంది. నీ జీవితములో అద్భుతము జరుగునట్లుగా ఈ సమయమును ప్రభువు ముద్రించాడు.
అక్కడ అద్భుతము జరిగిన తరువాత విందు ప్రధాని వద్దనుండి ఒక సాక్ష్యము వచ్చింది. అలాగే, మన జీవితములో కూడా మంచి సాక్ష్యము జరిగే అద్భుతము ద్వారా ప్రకటించబడుతుంది. మన సాక్ష్యము నిత్యమూ జీవముతో కూడిన సాక్ష్యమే. నీ జీవితము అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ సూపర్నేచురల్
అక్కడ జరిగింది, పెండ్లి విందు. ఎంతో సంతోషముగా ప్రారంభమయింది. అక్కడ ద్రాక్షారసము అయిపోయిన కారణాన, అక్కడ దుఃఖముతో కూడినదిగా మారవలసిన స్థితి అయితే, ప్రభువు చేసిన అద్భుతమును బట్టి, సంతోషముతో ప్రారంభమయినది, సంతోషముగానే ముగించబడింది.
నీళ్ళు ద్రాక్షారసముగా మార్చబడింది అంటే ఆ నీళ్ళకు ఏదో ఒకటి చేర్చబడాలి. అలా ఏది చేర్చబడాలో అది సూపర్నేచురల్ గా అక్కడ జతపరచబడింది గనుకనే అక్కడ ద్రాక్షారసము వచ్చింది. అలాగే మన జీవితములో ఏది అద్భుతము జరుగులాగున అవసరము అవుతాయో, అవన్నీ సూపర్నేచురల్ గా సిద్ధపరచబడుతుంది.
ఈరోజు మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడానికి వచ్చాము. మన జీవితములో అడ్డుగా ఉన్న సమస్తము అద్భుతముగా తొలగిపోవులాగున ఈరోజు మన ప్రభువును స్తుతిద్దాము.
ఆరాధన గీతము
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
వారము కొరకైన వాక్యము
మన ప్రభువు ఎంతో మంచివాడు. మన జీవితము గురించి మనకు ఆలోచన ఉన్నా లేకపోయినా మన ప్రభువైతే ఖచ్చితముగా ఆలోచన కలిగి ఉన్నాడు.
ఈలోకములో ఈరోజున ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. తండ్రి చూపిన ప్రేమను గమనించి, గుర్తించినవారు తమ తండ్రిని సంతోషింపచేస్తారు. అలాగే పరలోకములో ఉన్న మన తండ్రి చూపిన ప్రేమను గమనించి గుర్తించినవారు, ఆయనను సంతోషింపచేయాలి అనే ఆశ కలిగి ఉంటారు.
పరలోకములో ఉన్న మన తండ్రి పరిపూర్ణుడు గనుక, మనము కూడా పరిపూర్ణులుగా ఉండెదము. అలాగే పరలోకములో ఉన్న మన తండ్రి కనికరము కలిగినవాడు గనుక, మనము ఏ స్థితిలో ఉండవలసినవారమో, ఆ స్థితిలో ఉండులాగున మన స్థితి మార్చబడుతుంది. పోగొట్టుకున్న స్థితి మరలా ఇవ్వబడుతుంది.
అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.౹ -యోహాను 5:17
మన తండ్రి పనిచేసేవాడుగా ఉన్నాడు. ఏమి పని అని ఆలోచిస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అని యేసయ్య చెప్పారు. మన జీవితములో తండ్రి వ్యవసాయకుని పని జరిగిస్తున్నాడు. అనగా పనికిరాని తీగెలను తీసి పారవేస్తున్నారు. అనేకమైన సందర్భముల గుండా మనము వెళుతున్నపుడు, పనికి మాలిన అనేకమైనవి మన జీవితములో వచ్చేవ్విగా ఉంటాయి. అయితే మన పరలోకపు తండ్రి వాటిని తీసి పారవేసేవాడుగా ఉన్నాడు. సర్వోన్నతుడే నీ జీవితమును గూర్చి పనిచేస్తున్నాడు అంటే, అది ఎంత భాగ్యము? అసలు మన జీవితము ఎలా కోల్పోగలుగుతాము? ఆయన పనిచేయగా, ఎవరు ఆయనకు వ్యతిరేకముగా నిలబడగలరు?
నీవు ఉండవలసిన స్థితి కొరకు అనేకులు పోటీ పడినా సరే, నీ తండ్రి నీ పట్ల పనిచేసేవాడు గనుక, నీ స్థితి లేదా స్థానము మరొకరు తీసుకోలేరు. అలాగే మన జీవితములో ప్రభువు చిత్తమే జరుగుతుంది. మన చిత్త ప్రకారము చేసిన యెడల, అది నష్టము కలిగిస్తుంది. అయితే తండ్రి చిత్తమైతే, అది క్షేమము.
తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.౹ -యోహాను 5:21
అలాగే తండ్రి పనిచేసే మరొక విషయము ఏమిటి అంటే, మృతమైనదానిని తిరిగి జీవింపచేసేవాడు. అనగా నీ జీవితములో మృతమైనదానిని తిరిగి జీవింపచేస్తాడు. ఉదాహరణకు, ప్రమోషన్ రావాలి, ఎదో ఒక కారణము చేత, ఆ ప్రమోషన్ రాలేదు అనగా ఆ స్థానము మృతమైనది. అయితే మన తండ్రి, మృతమైన దానిని తిరిగి జీవింపచేసేవాడుగా ఉన్నాడు.
అబ్రహాము ముసలివాడు అయిపోయాడు, మరియు శారా గర్భము మృతతుల్యమైపోయినది. అబ్రహామునకు దేవుడు వాగ్దానము ఇచ్చేసరికి వారి స్థితి బాగానే ఉంది. అయితే అబ్రహాము చేసిన కార్యమును బట్టి, వాగ్దాన నెరవేర్పు ఆలస్యము అయింది అప్పటికే భౌతికముగా మృతతుల్యమైన పరిస్థితికి చేరుకున్నారు. అయితే పరలోకపు తండ్రి, ఆ మృతతుల్యమైన స్థితిని మార్చి జీవముగా మార్చి ఆ వాగ్దానమును నెరవేర్చాడు.
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ -యోహాను 10:29
తండ్రి వద్దనుండి మనము పొందుకున్నది ఎవడూ మన వద్దనుండి దొంగిలించలేడు. ఎంత గొప్ప భాగ్యము మనది?
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. -1 పేతురు 2:10
ఇప్పుడైతే మనకు ఆయన తండ్రిగా ఉంటున్నాడు గనుక, ఆయన ఇచ్చినది ఇంకెప్పుడు మన జీవితములో పోగొట్టబడదు. దేవునిని ఎరగనప్పుడు, ఆయన ప్రజగా మనము లేము కాబట్టి, కనికరము పోగొట్టుకున్నాము. అయితే ఇప్పుడు ఆయన బిడ్డలము గనుక, తండ్రి కనికరము మనపై ఉంటుంది.
తండ్రి మనకు ఏమి ఇచ్చాడు? ఏది మనము పోగొట్టుకొనము? తండ్రి మనకు సమృద్ధి అయిన జీవితము, అధికారము కలిగిన జీవితము ఇచ్చాడు. దేవుడు మనకు దేనిని పరిపాలించే అధికారము మనకు ఇచ్చాడు? నీ ముందు నీ వ్యతిరేకముగా ఏది నిలబడుతుందో, దానిపై అధికారము నీకివ్వబడింది. తండ్రి ఆ అధికారము ఇచ్చాడు గనుక, ఆ అధికారము ఎవరూ అపహరింపలేరు. మన తండ్రి ఎల్లప్పుడు మేలైనదే సిద్ధపరుస్తారు. అలా సిద్ధపరచినదానిని ఎవరూ అపహరింపలేరు. నీ తండ్రి గొప్పతనము, నీవు పొందుకునే ఆశీర్వాదములో ఉంటుంది.
కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.౹ -యోహాను 6:32
ఆహారము అనగా మనము జీవింపచేయబడుటకు ఆధారమైనది. అనగా మనము జీవింపచేయబడుటకు ఆధారము, మనుష్యుల వలన కాదు గానీ, పరలోకములో ఉన్న తండ్రి వలననే సిద్ధపరచబడుతుంది. అందుకే నీ తండ్రి గొప్పతనము, నీవు పొందుకునే ఆశీర్వాదములో కనపరచబడుతుంది.
కాలాలు సమయాలు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. అబ్రహామునకు కుమారుని ఇస్తాను అని వాగ్దానము తండ్రి ఇచ్చారు. అనగా అప్పుడు అది కుమారుని పొందే సమయముగా నిర్ణయించబడింది. అనగా 75వ సంవత్సరములో కుమారుడు పుట్టులాగున సమయము నిర్ణయించబడింది. అయితే, నిందారహితుడిగా లేని కారణాన, ఆ సమయము దాటి, నూరేండ్లకు నిందారహితుడుగా మారిన తరువాత, మరలా సమయము సిద్ధపరచబడింది.
అనగా పోగొట్టుకున్న సమయము తండ్రి స్వాధీనములో ఉంది. ఆ పోగొట్టుకున్న ఆ సమయమును నీ పరలోకపు తండ్రి మాత్రమే ఇవ్వగలడు. అబ్రహాము ముసలివాడు అయిపోయాడు కాబట్టి, పుట్టిన కుమారుడు అనారోగ్యముతో పుట్టలేదు గానీ, సంపూర్ణమైన ఆరోగ్యముతోనే పుట్టాడు. అనగా, నీవు పోగొట్టుకున్న సమయములో ఎలా అయితే నీవు ఉండవలసిన వాడవో, తండ్రి మరలా నీకు సమయము ఇచ్చిన తరువాత, అదే రీతిలో ఉంటావు.
సమయము తండ్రి స్వాధీనములో ఉంది అంటే, గడిచిన సమయము, రాబోయే సమయము కూడా నీ తండ్రి స్వాధీనములో ఉంది. నీ తండ్రి గొప్పవాడు. నీ తండ్రి గురించి నీవు నిజముగా తెలుసుకుంటే నీ తండ్రిని సంతోషింపచేసేవాడవుగా ఉంటావు. ఎలా అంటే –
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. -మత్తయి 5:16
వెలుగులో చీకటి లేదు. అనగా మన జీవితములో అపవాదికి సంబంధించినది ఏమీ లేకుండా మనము సిద్ధపరచుకున్నపుడు నీ పరలోకపు తండ్రి సంతోషిస్తాడు.