స్తోత్రగీతము – 1
ఎంత మంచి దేవుడవేసయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా – 2
1. ఘోర పాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ – నను హత్తుకున్నావయ్యా – 2
2. నాకున్న వారందరూ – నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ – నను నీవు విడువలేదయ్యా – 2
3. నువ్వు లేకుండా నేను – ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి – పరలోకం చేరెదనేసయ్యా – 2
స్తోత్రగీతము – 2
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా } 2
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై|| ఆనందం ||
పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా } 2
కలవరాల కోటలో – కన్నీటి బాటలో } 2
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా|| ఆనందం ||
నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని } 2
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా } 2
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే|| ఆనందం ||
సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై } 2
లోకమహిమ చూడక – నీజాడను వీడక } 2
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం
స్తోత్రగీతము – 3
యెహోవా నీదు మేలులను
ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను
దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
||యెహోవా||
ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
||యెహోవా||
ఆరాధన వర్తమానము
ప్రభువు మనకు ఇచ్చిన ఈ దినము మనకు ఎంతో శ్రేష్టకరమైన దినము ఎందుకంటే, గడిచిన ఆరు రోజులు మన వ్యక్తిగతమైన జీవితములను గూర్చినవి. అయితే ఈ దినము మన సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించుటకొరకైనది. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న తన సంఘముగా కలిసి ఆరాధించే దినము. ఒకవేళ మన ముఖము అందముగా ఉన్నప్పటికీ, మిగతా శరీరము లేకుండా దాని అందము పరిపూర్ణము కాదు. అలాగే ఈ దినము మనము కలిసి ఆరాధించుట చేత సంఘ సౌందర్యము ప్రత్యక్షపరచబడుతుంది.
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. -1 సమూయేలు 2:2
పరిశుద్ధమైన వాడు ఒక్కడునూ లేడు. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను స్తుతించవలసిన వారము మనము. ఎందుకంటే అదే పరిశుద్ధమైన జీవితాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. ఆయన కలిగిన ఆత్మలోనే మనకు పాలు దయచేయబడింది. ఈ సత్యమును మనము ఎరిగిన వారమైతే మనము నిజముగా ఆయనను స్తుతించగలుగుతాము. వాక్యము మనము ధ్యానించునప్పుడు అనేకసార్లు నేనే మీ దేవుడను అని మాటి మాటికీ వారికి జ్ఞాపకము చేయవలసిన సందర్భాలు అనేకమైనవి మనము చూడగలము. ఎంత భయంకరమైన పరిస్థితి అది? అయితే ఈరోజు మనకు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనము ప్రకటించగలుగుతున్నాము అంటే, అది మనకు దేవుడిచ్చిన ధన్యత. ఎందుకంటే, ఆయన మనలను వెదకి రక్షించాడు.
ఐగుప్తు నుండి విడిపించినది యెహోవా అయినప్పటికీ, వారొక దూడను చేసుకుని అదే వారిని ఐగుప్తునుండి విడిపించిందని, దానికి సాగిలపడిపోయారు. అయితే మనము వారివలే రక్షించబడక మునుపు ఉన్నాము గానీ, ఇప్పుడైతే, ఆయనే మనకు దేవుడు. అంతేకాక, “రక్షించినా రక్షించకపోయినా…” ఆయనే నాకు దేవుడు అనే రోషము మనము కనపరచాలి. అటువంటివారు దేవుని సన్నిధిని ప్రేమించి త్వరపడి ఆయన సన్నిధికి పరుగిడి వస్తారు.
మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. -యెషయా 57:15
నీవు ఆరాధించడానికి వచ్చిన దేవుడు మహాఘనుడై ఉన్నాడు, మహోన్నతుడై ఉన్నాడు, పరిశుద్ధుడైనవాడు అంతే కాక నిత్య నివాసి అయిన వాడు. నిత్య నివాసి అయినవాడు అనగా నీవున్న శ్రమలో రక్షించగలిగిన వాడుగా నీతోనే ఉన్నవాడు. నీ విశ్వాస పరీక్షా సమయములో నీతోనే ఉన్నవాడు.
నిత్యము నీతోనే వున్నవాడు. నీతో ఉన్నవాడు ఏమి చేస్తాడు? “నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను”. అనేక సందర్భాలలో ఫలాన కార్యము చేస్తేనే దేవుడు అనే ధోరణి కనపరుస్తాము, అయితే అది సరియైన పద్దతి కాదు. వినయము అనే స్వభాము మనము కలిగి ఉండాలి అలాగే సత్యము ఎరిగిన వారముగా కూడా ఉండాలి. మన స్వభావము, మన హృదయము ఈ రెండు కూడా మనము దేవుని సహవాసములో ఎంతో ప్రాముఖ్యము అయినవి.
నీతో ఉన్నవాడైన నీదేవుడు నీ స్వభావము మార్చబడటానికి నిన్ను వాక్యము ద్వారా సిద్ధపరుస్తాడు. మన స్వభావము దేవునికి అనుకూలముగా మారనంతవరకు దేవుని కార్యములు మనము చూడలేము. అందుకే హృదయము ఎంతో ప్రాముఖ్యమైనది.
పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడైనప్పటికీ నిన్ను సంతోషింపచేయుటకు, నిన్ను వృద్ధికలిగించుటకు నీతో ఉండుటకు ఇష్టపడుతున్నాడు, ఆయనను మనస్పూర్తిగా ఆరాధిస్తావా!
ఆరాధన గీతము
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా (2)
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల || నీవు ||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు… (2)
తట్టిన వారికి.. తలుపులు తెరిచే దేవుడవు.. (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు ||
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా.. (2)
నేనే జీవము.. అని పలికిన దేవా… (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు ||
ఈరోజు ఆరాధనలో తెలియచేయబడిన సత్యము – నీవు తడుతున్నది తీయబడుతుంది. మందిరము కొరకై దైవజనుడు తట్టిన తలుపులు తీయబడుతున్నాయి.
నీకొరకైన దేవుని వాక్కు – ఈరోజు నీవు అడుగుచున్నది నీకు ఇవ్వబడుతుంది, నీవు వెదకుచున్నది నీకు దొరుకుతుంది నీవు తట్టుచున్నది తెరువబడుతుంది, ఆమేన్ – నమ్మి పొందుకో!
మెయిన్ మెసేజ్
శ్రమ అనుభవించుట వాస్తవము, నీతో ఉన్నవాడు ఆ శ్రమను చూస్తున్నాడు. చూసే వాడు ఖచ్చితముగా కార్యము జరిగిస్తాడు. గనుక నీ “నిశ్చయతతో కూడిన ప్రకటన” ఎంతో అవసరము.
ఆయనను వెంబడించుము అనే విషయము గూర్చి మనము తెలుసుకుందాము.
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27
ఇది దేవుడు చేసిన ప్రకటన. ఇది ఒక నియమము లాగా కూడా కనబడుతుంది. అయితే ఈ ప్రకటనలో దేవుని ఉద్దేశ్యము గూర్చి ధ్యానము చేస్తే, “నా గొర్రెలు” అనే మాట ద్వారా మన జీవితాన్ని వెతుకుకుందాము.
“నా గొర్రెలు” అనే గుంపులో నీవు నేను ఉన్నామా? ఇది మొదట మనము పరీక్షించుకోవలసినది.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
“ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను” అనగా దేవుడు ఆయన గొర్రెలను పిలుచుచున్నాడు. ఎవరు ఆయన గొర్రెలు అంటే, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారు ఆయన గొర్రెలు.
అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవియను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. -లూకా 5:27-28
ఇక్కడ ఈ లేవి కూడా ముందుగా నిర్ణయించబడినవాడు. అందుకే యేసయ్య పిలిచినప్పుడు ఆయ్న స్వరము విని సమస్తము విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినాడు. మనము కూడా ముందుగా నిర్ణయించబడినవారము. అయితే అసలు ఎందుకు వెంబడించమన్నాడు? అనే సత్యము గ్రహిస్తే మనము యదార్థముగా వెంబడించగలుగుతాము. దీనిని తెలుసుకొనుట కొరకు, పేతురు ఎలా వెంబడించాడో చూద్దాము.
సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. -లూకా 5:8
అక్కడ ఒక అద్భుతము జరిగింది, ఆ అద్భుతము చూడగానే, పేతురు యేసయ్య పరిశుద్ధుడు అని గ్రహించి, పాపాత్ముడనని ఒప్పుకొని యేసయ్య పిలిచినప్పుడు వెంటనే వెంబడించాడు.
దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటి అంటే, నీ జీవితమును మార్చి ఆయన పనికొరకు వాడుకుంటాడు. అనగా నీ స్వభావము మారకుండా దేవుని పనిలో నీవు వాడబడలేవు.
లేవు కూడా ఒక సుంకరి కనుక ప్రజలను అన్యాయముగా పీడించే పరిస్థితిలో ఉన్నాడు.
జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. -లూకా 19:8
ఇప్పుడు ఆ పాపపు జీవితములో ఉన్న లేవిని పిలిచి నీతిమంతునిగా మార్చడానికి వెంబడించమని చెప్పుచున్నాడు. మనలను కూడా మనము చేసే అసహ్యకరమైన క్రియలను బట్టి మనమే సిగ్గుపడే పరిస్థితులలో, మన జీవితమును మార్చడానికి, మన జీవితము సాక్ష్యమును మార్చడానికి ఆయన వెంబడించమని చెప్పుచున్నాడు. మన జీవితము మార్చబడకుండా దేవుని పనికొరకు వాడబడలేము.
ప్రాముఖ్యమైన మాట: మన జీవితము మార్చబడకుండా దేవుని పనికొరకు వాడబడలేము.
ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. ఈరోజు నన్ను వెంబడించుము అనే స్వరము వినిపిస్తున్నాడు. వెంబడించినవారి జీవిత సాక్ష్యము మార్చడానికి ఆ పిలుపు ఇవ్వబడింది. లేవిని పిలిచినప్పుడు మొదటిగా వదిలేసింది “తనలో ఉన్న పాపము” ఆ తరువాత సంపూర్ణ సేవకు తనను ప్రభువు వాడుకున్నాడు. అదేవిధముగా మనము కూడా మనలో ఉన్న “పాపము” వదిలివేసి వెంబడించాలి.
“నేను వాటిని ఎరుగుదును” అని అంటున్నాడు. అనగా వారి స్థితి అనగా పాపపు స్థితి, వారి మనసు సమస్తము ఎరిగినవాడు. యోహానులో నతనయేలు విషయములో ధ్యానిస్తే,
యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.౹ –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.౹ -యోహాను 1:43-48
నతనయేలు ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఎరిగినవాడు, మత్తయిని ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఎరిగినవాడు, అలాగే నీవు నేను ఎటువంటి స్థితిలో ఉన్నామో కూడా ఎరిగినవాడు. అందుకే నీ, నా జీవిత సాక్ష్యము మార్చి దేవుని చిత్తము నీ నా జీవితములో నెరవేర్చడానికి మనలను పిలిచాడు.
మత్తయి “సమస్తము” విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. అయితే యేసయ్య ఎవరో గ్రహించకుండా సమస్తము విడిచిపెడతాడా? మరొక సందర్భము చూస్తే, పాపములో పట్టబడ్డ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపడానికి తీసుకువచ్చినప్పుడు, యేసయ్య నేలమీద ఎదో వ్రాస్తున్నాడు. అందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు గానీ, ఎప్పుడైతే యేసయ్య “పాపము లేని వారు మొదటి రాయి వెయ్యమని” చెప్పగా ఎవరూ వెయ్యలేకపోయారు. ఎందుకనగా సమస్తము ఎరిగిన యేసయ్య నేల మీద ఎదో వ్రాస్తున్నాడు. అలాగే సమరయ స్త్రీతో కూడా, “నీతో మాట్లాడేవాడు ఎవరు అని గ్రహిస్తే” అని చెప్పుచున్నాడు అంతే కాక, తాను గ్రహించునట్లుగా ఆమెకు వెల్లడిపరిచాడు. అలాగే మత్తయికి కూడా తాను గ్రహించునట్లుగా వెల్లడిపరిచాడు. ఏమని వెల్లడిపరచాడు అని చూస్తే, మారుమనసు కొరకైన సువార్తను మహత్కార్యములతో ప్రకటించినపుడు, యేసయ్య ఎవరో గ్రహించినవాడుగా మారి వెంబడించాడు. తనలో ఉన్న సమస్త పాపమును విడిచిపెట్టి మత్తయి పరిశుద్ధమైన జీవితమును వెంబడించాడు.
ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. -మత్తయి 4:19
ఎటువంటి స్థితిలో వారికి పిలిచాడు అని ఆలోచిస్తే, “యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు… ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి -మత్తయి 4:18,21,22”.
యేసయ్య వారిని పిలిచినప్పుడు వారు జాలరులు గనుక వలలు కడుక్కొంటున్నారు. వారి శరీర సంబంధమైన వృత్తిలో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నవారిని ఇప్పుడు యేసయ్య పిలుస్తున్నారు. అనగా వారి శరీర వృత్తిలోనుండి ఆత్మ సంబంధమైన వృత్తిలోనికి పిలుస్తున్నాడు. “మనుష్యులు” అనగా రక్షణకొరకైన ఆత్మలుగా మనము చూడగలము. మనుష్యులను పట్టే జాలరులుగా అంటే, ఆత్మాల్ను రక్షించువారిగా అనే అర్థము.
ఈరోజు మనలను కూడా శరీర సంబంధమైన విషయములను విడిచి ఆత్మీయ సంబంధమైన ప్రతీ విషయమును స్వతంత్రించుకొనుటకు వెంబడించమని పిలుస్తున్నాడు.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹ -3 యోహాను 1:2
దేవుని మాట ప్రకారము నీవు వెంబడిస్తున్న ప్రతి సారీ, నీవు ఆత్మలో వర్థిల్లేవాడవుగా ఉంటావు. పేతురు మరియు శిష్యులు వేరు వేరు ప్రదేశాలలో వారు పరిచర్యచేసారు. మనము కూడా అరోగ్యము, ఐశ్వర్యము వంటి అనేకమైన పరిస్థితులలో దేవుని వాక్యము ప్రకారము చేయుటయే మనము ఆయనను వెంబడించుట. అయన అనగా ఆయన వాక్యమే. ఆయనను వాక్యము ప్రకారము ఏ విషయములు మార్చుకొమ్మని నీతో చెప్పుచున్నాడో ఆ విషయములు మార్చుకోవాలి. అసలు ఆయన స్వరము నీ దగ్గరకు వస్తుంది అంటేనే నీ స్థితిని మార్చుటకు.
ఈరోజు మనము నేర్చుకున్న విషయాలు.
1. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన ఉద్దేశ్యము నీ జీవిత సాక్ష్యము మార్చడానికి
2. పాపపు స్థితిని విడిచి పరిశుద్ధమైన జీవితమును వెంబడించుటకు పిలిచారు.
3. శరీర సంబంధమైన వాటిని విడిచి ఆత్మ సంబంధమైన విషయాలు వెంబడించాలి అని పిలిచారు.