16-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్రగీతము – 1

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥
॥ ప్రేమిస్తా॥

నను ప్రేమించీ భువికొచ్చినదీ నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ఆ ప్రేమా ॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు 
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమా ॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమా
నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా ॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

స్తోత్రగీతము – 2

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

ఆరాధన వర్తమానము

ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే, మన ఆత్మ బలపరచబడుతుంది. ఉదాహరణకు మనము భోజనము చేస్తున్నాము. ఆ భోజనము లోపలకి వెళ్ళినతరువాత ఏమి జరుగుతుందో నీకు తెలియదు కానీ దాని ప్రభావమును నీ జీవితములో ఖచ్చితముగా చూస్తావు. శ్రేష్టమైన ఆహారము తీసుకునేవారు శరీర సంబంధమైన జీవితములో బలమైన కార్యములు చేయగలుగుతారు. మరి మనము వాక్యము అనే ఆత్మీయ ఆహారము తీసుకుంటున్నాము. ఆ ఆత్మీయ ఆహారము నీ లోపలకు వెళుతుంది. అలా వెళ్ళిన ఆహారము ఏమవుతుందో నీకు తెలియదు కానీ, నీ ఆత్మ బలము పొందుకుంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మ బలపడుతుందో, అప్పుడు ఆ ఆత్మ ద్వారా కూడా మనము కార్యములు చేసేవారిగా ఉంటాము. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమును బట్టే మనము కార్యములు చేయుటకు సిద్ధపడగలుగుతాము. ఈ వాక్యము మనలోనికి వెళ్ళకపోతే మనము విశ్వాసము లేనివారమై ఏ కార్యములూ చెయ్యలేము. అంతే కాక, వాక్యములో కట్టబడినప్పుడు మాత్రమే మనము స్థిరముగా నిలబడి ఉండగలుగుతారు.

కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. -మత్తయి 7:24-25

ఎప్పుడైతే వాక్యములో కట్టబడి నిలబడతావో, అప్పుడు భూసంబంధమైనది గానీ, వాయుమండల సంబంధమైనది కానీ ఏది నీ దగ్గరకు వచ్చినాసరే, నీవు కదలక నిత్యముండు సీయోను కొండవలే ఉందువు.

శరీరసంబంధమైన ఆహారముతో ఎలా అయితే శక్తి వస్తుందో, అలాగే ఆత్మీయ ఆహారముతో కూడా శక్తి వస్తుంది. అయితే ఈ శక్తి దేవునినుండి వస్తుంది. దేవుని శక్తి ముందు నిలువగలిగింది ఏమీ లేదు. గనుక నీకు వాక్యమే ఆధారము అయి ఉండాలి. అప్పుడు నీవు స్థిరుడవు.

ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించవలెను.

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి -కీర్తనలు 105:1-2

దేవుని గూర్చి నీవు పాడాలి అంటే, ఆయన ఏమి చేసాడో మనము ఎరిగి ఉండాలి. అలాకాకపోతే మనము సరిగా ఆరాధించలేము. రెండు విధాలుగా ఉండే గుంపులు ఉంటారు ఒకటి సత్యము ఎరిగి ఆరాధించేవారు రెండవది సత్యము ఎరిగినవారిని అనుకరించి ఆరాధించిట. మనము మొదటి గుంపులో ఉండాలి అనేది దేవుని ఆశ. సత్యము ఎరిగి ఆరాధించువారు ఆరాధించుచుండగానే వారు దేవుని కృపను పొందుకుంటారు. ఏ సత్యమును నమ్మావో, ఆ సత్యము నెరవేరుటకు కృప తోడవుతుంది. ఇది ఆత్మీయ నియమము. దేవుని గూర్చి చెప్పాలి అంటే మన జీవిత కాలము సరిపోదు. అయితే ప్రతీ వారము పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కో సత్యమును నేర్పుతున్నారు. ఈరోజు కూడా ఒక సత్యమును చూద్దాము.

తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును– నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. -కీర్తనలు 105:8-9

నిబంధన అంటే దేవుడు ఖచ్చితముగా జరిగించును అని ఇచ్చిన మాట. ఆయన మాట ముందు విడుదలచేసి ఆ మాట ప్రకారము కార్యము జరిగించేవాడు. అందుకే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏమి మాట విడుదల అవుతుంది అని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి.

అయితే “తరతరములు జ్ఞాపకము చేసుకుంటాడు” అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరములన్నిటిలో దేవుడు తన మాటను జ్ఞాపకము చేసుకున్నాడు. అబ్రహాము దేవుని యందు విధేయత కలిగి వెంబడించాడు గనుక దేవుడు తన వాగ్దానము ఇచ్చాడు. ఎప్పుడైతే ఇస్సాకు కష్టములో ఉన్నాడో, అప్పుడు తన మాటను జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే మన జీవితములో చూస్తే, ఒక తరము అనగా ఒక పిరియడ్ అనగా సమయము. మంచి సమయములు ఉన్నాయి, చెడు సమయములు ఉన్నాయి. ఎటువంటి సమయములోనైనా దేవుడు తన మాటను జ్ఞాపకము చేసుకుంటాడు అని అర్థము చేసుకోవచ్చు.

మరి అబ్రహాము జీవితములో శ్రమలు రాలేదా? ఖచ్చితముగా వచ్చాయి అలాగే మన జీవితములో కూడా శ్రమలు ఖచ్చితముగా వస్తాయి. అయితే ఎటువంటి పరిస్థితులలోనైనా సరే దేవుడు తన మాటను జ్ఞాపకము చేసుకునే వాడుగా ఉన్నాడు. ఈ సత్యము ఎరిగినవారమై మనము ఉండాలి. అప్పుడు లోకములో మనము వెర్రివారము గా ఉన్నప్పటికీ, మనకు మాత్రము దేవుని శక్తి అయి ఉన్నది.

అందుకే మనము దేవుడి మనకు ఇచ్చిన మాటను బట్టి కనిపెట్టుకుని ఉండాలి. ఆయ్నా ఇచ్చిన మాట నెరవేర్చేవరకు ఆయన విశ్రమించడు.

వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను –కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను -కీర్తనలు 105:10-11

ఇశ్రాయేలీయుల జీవితములో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను గూర్చి ఆలోచిస్తే, వారు ఐగుప్తులో కొద్దిమందిగా ఉన్నప్పుడే కానాను దేశములో కొలవబడిన స్వాస్థ్యము వారికి నిర్ణయించి నడిపించాడు. వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, “కొద్దివారిగా ఉన్నారు” అనగా వారికి స్వతంత్రించుకునే బలము తక్కువగా ఉంది. “పరదేశులుగా ఉన్నారు” అంటే వారికి స్వతంత్రించుకునే అనుకూలత లేదు, అయినప్పటికీ “కొలవబడిన” అనగా నిర్ణయించబడిన స్వాస్థ్యము ఇవ్వబడింది. “కానాను” దేశము గూర్చి చూస్తే, “పాలు తేనెలు ప్రవహించే దేశము” అని వ్రాయబడింది. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి శ్రమలో వారికి సరైన ఆహారము గానీ, నివసించుటకు సౌకర్యము గానీ, స్వాతంత్ర్యము గానీ లేదు. అయితే కనానులో ఐగుప్తులో లేనిది వారికి సమృద్ధిగా ఇవ్వబడింది.

తరము వెంబడి తరము అంటే దినము వెంబడి దినము అనేవిధముగా కూడా చూడవచ్చు. మనము ఎలా స్వీకరిస్తామో అదే విధముగా దేవుడు క్రియ జరిగిస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును ఖచ్చితముగా తృప్తిపరుస్తాడు.

అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారిరోదనము తనకు వినబడగావారికి కలిగినశ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను. -కీర్తనలు 106:43-46

ఇది ఇశ్రాయేలీయుల జీవితము కాదు కానీ, నీ యొక్క నా యొక్క జీవితమే. మన జీవితములో కూడా దేవుడు చేసిన వాగ్దానము తాను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనము తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన తన మాటను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దాని కారణము చేతనే, అపవాదికి దొరకకుండా నేను తప్పించుకునేవారముగా ఉంటున్నాము. ఈ సత్యమును గ్రహించి ఆయనను ఆత్మతో ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా{2}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2}
{నీ మాట}

1. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2}
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2}
{నీ మాట}

2. సింహాల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట{2}
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2}
{నీ మాట}

 

మెయిన్ మెసేజ్

ఈరోజు దేవుని యొక్క సన్నిధి గూర్చి మనము తెలుసుకుందాము. మనము దేవుని సన్నిధిలో ఉండవలసినది ఉంది. అయితే అపవాది మనలను ఏదో ఒకపనిలో బిజీ చేసేస్తున్నాడు. అయితే ప్రభువు ఈ మాటలు జ్ఞాపకము చేస్తున్నాడు. బహుశా దేవుని సన్నిధియొక్క ప్రాముఖ్యత తెలియక ఆయన సన్నిధిలో గడపటానికి ఇష్టము లేనివారిగా ఉంటున్నామేమో. జ్ఞానము లేకనే నా జనులు నశించిపోతున్నారు అని వాక్యములో చెప్పబడింది.

అయితే ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుంది? దేవుని స్వరము ఎక్కడైతే వినపడుతుండో అక్కడ దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది. మోషే దేవుని స్వరము అరణ్యములోని పొదలో విన్నాడు, ఆ స్వరము వినబడే ప్రదేశము అంతా పరిశుద్ధ స్థలముగా మార్చబడిపోయింది. దానిని బట్టి దేవుని మాటలు, స్వరము ఎక్కడ వినపరచబడతాయో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది.

దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రార్థన అనేది ఒక మార్గము. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఆయన సన్నిధి మనము ఎక్కడికి వెళ్ళినా మనతో కూడా వస్తుంది.

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.౹ -1 రాజులు 17:1

ఏలియా ఆహాబు రాజు ముందు ఉన్నాడు, అయితే “యెహోవా సన్నిధిలో” నిలబడి ఉన్నాను అని చెప్తున్నాడు. అనగా దేవుని సన్నిధి ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి దేవుని సన్నిధి వెళుతుంది. ఏలియా వలే మనము కూడా రోషము కలిగి సిద్ధపడాలి. ఎందుకంటే ఏలియాకి ఇచ్చిన అవకాశము మనకు కూడా ఇచ్చాడు. అయితే మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడే మనము దేవుని సన్నిధిలో ఉంటాము. అయితే శ్రమ ముగించబడగానే మనము దేవుని సన్నిధిలో గడిపే సమయము తగ్గిపోతుంది.

అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. -కీర్తనలు 42:8

దేవుని సన్నిధిలో ఉండి ఆయనగూర్చి ఏమి మాటలాడుతున్నావో, ఏమి కీర్తిస్తున్నావో అవి నీకు తోడుగా వస్తున్నాయి అంటే, ఎక్కడ ఎప్పుడు మీకు తోడు వస్తాయి అని ఆలోచిస్తే, “నీకు ఎప్పుడు తోడు అవసరమో, నీవు ఎప్పుడు ఒంటరిగా ఉంటావో” అప్పుడు నీవు పలికినది స్థిరపరచడానికి ఆయన కార్యము జరిగిస్తాడు. ఎందుకంటే, నీవు ఆయన గూర్చి పాడిన పాటలు, నీవు చేసిన ప్రార్థనలు లిఖించబడుతున్నాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీవు పలికిన మాటలను బట్టి, దేవుడు తన కార్యము జరిగిస్తున్నాడు. మనలో అనేకులు ఇతరవిషయాలలో బిజీ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయము పోగొట్టుకొంటున్నాము. అయితే మనము ఎంత బిజీగా ఉన్నాసరే మనము ఖచ్చితముగా దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగని అలవాటు ప్రకారముగా చెయ్యడము కాదు, మరి ఎలా ఉండాలి అంటే?

దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. -కీర్తనలు 42:1

దుప్పికి నీటివాగులు తప్ప వేరే అవకాశము లేనట్టుగా అది ఆశపడుతుంది. అలాగే మనము కూడా దేవుని సన్నిధి తప్ప మనకు వేరే ఆధారము లేదు అనే ఆశతో ఆసక్తితో ఆయన సన్నిధిలో గడపాలి. అపవాది కూడా మనలను ఎప్పుడు మింగుదునా అని తరుముతూనే ఉంది. అయితే మన క్షేమము దేవుని సన్నిధి మాత్రమే.

–నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును -కీర్తనలు 16:2

దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవునిని మనము క్షేమాధారముగా చేసుకుని వెళ్ళగలుగుతాము. అలాకాకపోతే, అపవాది పన్నిన ఉచ్చులలో ఏదో ఒకరోజు చిక్కుబడతాము.

ఏలియాను చూస్తే, ఆహాబు రాజైనప్పటికీ, ఏ మాత్రము భయపడక ధైర్యము కలిగి దేవుని మాటలు ప్రకటించాడు. మనముకూడా దేవుని సన్నిధిలో ఆశకలిగి ఉన్నప్పుడు, మన జీవితాలలో ఎంత అధికారము కలిగినది అయిన సరే మన ముందుకు వచ్చినప్పుడు, మనము పలికే మాట ప్రకారము జరిగించబడవలసినదే.

ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు.౹ అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. -యాకోబు 5:17-18

ఏలియా ఎల్లప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉండి చేసిన ప్రార్థన, పలికిన మాటల యొక్క ప్రభావము కనపడుతుంది. ఏలియా తెరువుము అంటే పరలోకము కూడా తెరుస్తుంది. ఆయన మూయుము అంటే పరలోకము కూడా మూసివేస్తుంది. ఈ ఆధిక్యత ఏలియాకే కాదు కానీ మనకు కూడా ఇవ్వబడింది.

భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. -మత్తయి 18:18
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. -మత్తయి 7:7-8

ఎక్కడ అడగాలి? దేవుని సన్నిధిలో ఉండి నీవు అడిగినప్పుడు పరలోకములోనుండి అది నీకు ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో ఉండి నీవు వెదకినప్పుడు పరలోకములోనుండి నీకు దొరకుతుంది. దేవుని సన్నిధిలో ఉండి నీవు తట్టినప్పుడు పరలోకములోనుండి నీకు తీయబడుతుంది. ఎందుకంటే, నీవు పరలోకసంబంధివి. నీ పౌరసత్వము పరలోకములో ఉంది గనుక. పర సంబంధమైనది సిద్ధపరచి నిముందు పెట్టేదిగా ఉంటుంది. 

యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. -కీర్తనలు 18:2

ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు ఆయన సన్నిధి నీ శైలముగానూ, కోటగానూ, దుర్గముగానూ ఉంటుంది అని అర్థము. శత్రువు ప్రవేశించకుండా ఆ కోటలో మీరు భద్రపరచబడతారు.

శ్రమ వచ్చేవరకు వేచిఉండకు, ముందుగానే దేవుని సన్నిధిలో నీ సమయము గడుపు. ఎలా అంటే, ఆయన తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ఆయన సన్నిధిలో గడుపు. ఏ శ్రమ కూడా నిన్ను లోబరచుకోలేదు.