స్తుతిగీతము – 1
యేసు నామం – సుందర నామం
యేసు నామం – మధురం మధురం
జుంటి తేనెల – కంటె మధురము
అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)
సుందర సుందర నామం – యేసుని నామం (2)
పాపములను – క్షమియించు నామం
శాపములను – తొలగించు నామం
స్వస్థపరచును – యేసు నామము
అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)
సుందర సుందర నామం – యేసుని నామం (2)
||యేసు నామం||
అద్వితీయ నామం – అతిశయ నామం
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)
సుందర సుందర నామం – యేసుని నామం (4)
స్తుతిగీతము – 2
ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా
1.పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా “2”
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
2.కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా “2”
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
3.పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా “2”
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
స్తుతిగీతము – 3
నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము
ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా
దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము
||నీతో||
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం
దేవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
||నీతో||
ఆరాధన వర్తమానము
నీతో నడుతును, నిన్నే కొలుతును, నీ సహవాసమే నాకు క్షేమము అనే ఆలోచన ప్రకారము జీవించుట ఎంతో ధన్య కరము. ఆత్మీయమైన మాటలు మన జీవితమునకు క్షేమమును కలుగజేస్తాయి. మనము దేవుని ఆరాధించడానికి వచ్చాము.”నా దేవునిని నేను ఘనపరచాలి, నా సృష్టికర్తను నేను ఆరాధించాలి” అనే మనసు కలిగి మనము ఉండాలి. దేవుని మాట అది ఏదైనా సరే దానిలో జీవము ఉంది. ఆ జీవము మన జీవితమునకు క్షేమము కలుగచేస్తుంది.
మనకంటే అపవాది చాలా తెలివి కలది, కుయుక్తి కలది. అందుకే మన జ్ఞానానుసారముగా మనము ఏమి చేద్దామనుకున్నా సరే అది ఫలించదు, ప్రయోజనము ఉండదు. అదే దేవుని ఆజ్ఞానుసారముగా, చిత్తానుసారముగా నడచుకొన్నపుడు అడుగడుగునా మన జీవితములో క్షేమమే!
మనము ఆరాధించునపుడు ప్రభువు వెల్లడి పరచే మాటలను స్వీకరించుటకు మన హృదయములను సిద్ధపరస్తుంది. పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మనము మన హృదయాలను సిద్ధపరచుకుంటాము. మన తండ్రి వ్యవసాయకునివలే ఆయన వాక్యమనే విత్తనములు విత్తుటకు ముందు మన హృదయములనే పొలములను సిద్ధపరుస్తాడు, అందుకే ఈ క్రమము మనకు దయచేసాడు.
ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి అని వాక్యము తెలియచేస్తుంది. “దేవుని సహవాసము నిత్యము క్షేమము” అనేది నిజముగా సత్యమేనా! సోమవారము నుండి ఆదివారము వరకు నిజముగానే ఆయన సహవాసములో ఉండి ఉంటే మన ఆరాధన సత్యమే! అలా కాని యెడల అది నిజమైన ఆరాధన కాజాలదు.
మన జీవితములను బలవంతముగా లాక్కొని, వ్యర్థపరచుటకు అపవాది ఎంతో ప్రయత్నము చేస్తుంది గనుక మనము ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి.
నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. -కీర్తనలు 22:3
ఇశ్రాయేలు అనగా మనమే! ఈరోజు మనము చేయు స్తోత్రముల మీద మనలను సృష్టించిన దేవుడు ఆసీనుడు అగుటకు ఇష్టపడుతున్నాడు. గతవారము మనము దేవునికి ఇష్టమైన రీతిలో నడచుకొననప్పటికీ, ఈ దినము మరలా తిరిగి చేర్చుకొనుటకు ఇష్టము కలిగినవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు, ఆ తల్లి దండ్రులు గద్దిస్తారు, శిక్షిస్తారు గానీ ఆ పిల్లలను విడిచిపెట్టరు. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు క్షమించడానికి సిద్ధమనసు కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను మనము వ్యర్థపర్చకూడదు.
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు -నిర్గమకాండము 15:11
ఈరోజు నీవు చేయు స్తుతులపై ఆసీనడుగుటకు ఇష్టపడుతున్న దేవుడు ఎటువంటివాడో అనే సంగతి మనము ఎరిగి ఉండాలి. నీవు చేసిన తప్పును బట్టి నిన్ను తృణీకరించేవాడు కాదు. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా మన దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. మనము ఎవరూ చూడట్లేదు అని ఆలోచించి, పాపపు కార్యములలో పాలు కలిగి ఉంటే, నీ దేవుని ప్రేమను తృణీకరిస్తున్నావు. ఆయన ప్రేమను తృణీకరిస్తే, నీ జీవితములో సమస్తమైన మేలైనదానిని నీవు తృణీకరిస్తున్నట్టే!
ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు. -కీర్తనలు 77:14
దేవుని మార్గము పరిశుద్ధమైనది. “నీతో నడుతును” అని మనము చెప్తున్నాము అంటే మన నడక పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి సంబంధించినది కాని ప్రతీదీ మనకు కూడా సంబంధించినది కాదు. గనుక పరిశుద్ధమైన మార్గములోనే నిలిచి ఉండుటకొరకు ప్రయాస పడుటకు సిద్ధమనసు కలిగి ఉండాలి.
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. -కీర్తనలు 1:1-2
మన ఆలోచన కాదు, మన చుట్టు ఉన్నవారి ఆలోచనలే, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యములకొరకు ప్రేరేపించే వారైతే, ఆ కార్యములను ఖచ్చితముగా మనము విడిచిపెట్టాలి. అపవాదికి ఒక్క అవకాశము ఇచ్చినట్టయితే మొత్తము నాశనము చేసి తిరిగి నీవు కోలులోలేని దెబ్బ తీస్తుంది. గనుక మనము ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున౹ మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹ -హెబ్రీయులకు 12:1-2
ఒక్క సారి అవకాశము ఇస్తే, పాపము సుళువుగా చిక్కులలో పెట్టేస్తుంది అని వాక్యము చెప్పుచున్నది. అందుకే దేవునినుండి పక్కకు వెళితే, అపవాది నిన్ను చుట్టిపడేస్తుంది. సంకెళ్ళతో బంధించబడిన స్థితిలో ఉండిపోతావు.
ఒకవేళ నీవు గతవారమంతా దేవునితో సహవాసము లేకుండా ఈరోజు నీవు ఆయన సన్నిధిలో ఉంటే, నీకు మరొక అవకాశము దేవుడు ఇస్తున్నాడు. ఆయనను స్తుతించు నీ రక్షణమార్గము సిద్ధపరచుకో.
అదే నీవు గతవారమంతా దేవునితో సహవాసము కలిగి గనుక ఈరోజు నీవు ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలోనిన్ సమృద్ధి నీవు అనుభవించగలిగే స్థితి, ఆయన సహవాసములోని క్షేమము నీవు అనుభవించగలుగుతావు. నీవు చేసే ఆరాధన యదార్థమైనదిగా ఉంటుంది.
ఈరోజు కనపరచే నీ యదార్థమైన భక్తి, రేపటి నీ జీవితమును, తరములను స్థిరపరుస్తుంది. గనుక నీ హృదయము యదార్థముగా నీవు సిద్ధపరచుకొని, నీ దేవునిని స్తుతించు ఈరోజు. నిన్ను నీడవలే వెంటే ఉండి నిన్ను కాపాడు వాడు నీ దేవుడు గనుక ఆయనతో నీవు ఈరోజు సమాధానపడు, తిరిగి ఆయనతో కలుసుకుని ఆయనను ఆరాధించు. విడిచిన దాని వైపు తిరిగి వెళ్ళవద్దు. నీవు విడిచిపెట్టినది, దేవుడు తృణీకరించినది అయి ఉంటుంది. నీవు విడిచిపెడుతున్నావు అంటే, దేవుని మాటకు లోబడి విడిచిపెట్టావు. అయితే తిరిగి వెనుకకు తిరిగి చూస్తే, దేవునిని తృణీకరించినట్టే కదా! అటువంటి జీవితము ఎంతమాత్రము మనకు వద్దు. దేవునితోనే మన సహవాసము కలిగి జీవితమును కొనసాగిద్దాము. అలా ఉన్నప్పుడు, శ్రేష్టమైన దాని వెంబడి మరి శ్రేష్టమైనదాని కొరకు మనలను నడిపిస్తాడు మన దేవుడు.
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి యున్నావు. -కీర్తనలు 21:3
మనము ఇకముందు చూడబోయే దినములు శ్రేయస్కరములు గనుక మన హృదయములను సిద్ధపరచుకొని, మన దేవునిని స్తుతిద్దాము.
ఆరాధన గీతము
నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము
ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా
దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము
||నీతో||
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం
దేవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
||నీతో||
వారము కొరకైన వాక్యము
మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని మన శ్రమలో గుర్తించగలుగుతాము. మనము మార్గము తప్పినప్పుడు కూడా ఆయన నమ్మకత్వమును మన యెడల కనపరచేవాడు. దేవుని వాక్యము హెచ్చరికగా వచ్చింది అంటే దేవుడు ఎవరినో ప్రేమిస్తూ గద్దిస్తున్నాడు, నిందా రహితునిగా నిలబెట్టుటకు అతనిని సంధిస్తున్నాడు అని అర్థము. ఆ సమయములో మన హృదయములను కఠినపరచుకోకూడదు గానీ, మనము మన స్థితిని ఒప్పుకొని, మరొకసారి అటువంటి మహిమకరము కాని విషయాలవైపు, మార్గములవైపు వెళ్ళను అనే తీర్మానము చేసుకొని తిరిగి నిలబడదాము.
అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹ మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.౹ ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.౹ వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా౹ -యాకోబు 1:21-24
అద్దములో మన సహజ ముఖము ఎలా అయితే కనబడుతుందో, వాక్యము కూడా మన జీవితమును కనపరుస్తుంది. అద్దము ముందు వున్నంతసేపు మనం ముఖము కనబడుతుంది, సరిచేసుకోనే అవకాశము ఉంటుంది. అలాగే వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము కూడా మన జీవితములను స్పష్టముగా కనపరుస్తుంది. దానిని బట్టి, ఆ లోపములను సరిచేసుకోగలిగే అవకాశము ఉంటుంది.
ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై -2 దినవృత్తాంతములు 14:2
మన ముందు ఆసా జీవితము ఒక సాక్ష్యముగా ఉంది. ఆసా యెహోవా దృష్టికి అనుకూలముగా మరియు యదార్థముగా నడిచినవాడై ఉన్నాడు. అనుకూలముగా నడచుకొనుట అంటే ఏమిటి? ఇద్దరు స్నేహితులు ఉన్నట్టయితే ఒకరి మాట ప్రకారము మరొకరు ఉండేవారుగా ఉంటారు. వ్యతిరేకముగా ఇంక ఉండదు. అయితే ఆసా దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు అని వ్రాయబడింది అంటే ఎలా ఉన్నాడు? దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుని చిత్తము ఏమై ఉందో అదే ప్రకారముగా ఆసా చేసినవాడుగా ఉంటున్నాడు.
దేవునికి ఇష్టము లేనిది ఏమిటి అని ఆలోచిస్తే, అపవాదికి సంబంధించినది మనలో ఉండుట అనేది ఆయనకు ఇష్టములేనిది. ఆశా ఈ విషయములో ఏమి చేస్తున్నాడు అని చూస్తే –
అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగుల గొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి -2 దినవృత్తాంతములు 14:3
ఆసా రాజ్యము ఏలు సమయమునకు అన్యదేవత బలిపీఠములు, ఉన్నత స్థలములు, ప్రతిమలు కట్టబడి ఉన్నాయి. బలిపీఠము అనగా అర్పణలు అర్పించే స్థలముగా చూడవచ్చు. దేవునికి ఇష్టము కాని విషయములలో మనము అర్పించినవి ఏమైనా ఉన్నాయా? అని పరీక్షించుకోవాలి. ఒకవేళ మద్యపానము అనేది మనకు బాగా ఇష్టమైన కార్యముగా ఆలోచిస్తే, అది దేవునికి ఇష్టము లేని కార్యము అయినప్పటికీ, మనకు ఒక విగ్రహముగా మారిపోతుంది. ఇలా మనలను అపవాది ప్రేరేపిస్తాడు.
మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:2
త్రాగుడు అనేది ఒక ఉదాహరణ మాత్రమే. అయితే అనేకమైన వ్యసనములు, కార్యములు దేవునికి వ్ర్యతిరేకమైన కార్యముల ద్వారా అపవాది ప్రేరేపించినపుడు దానికి లోబడిపోకుండా మనము ఉండగలుగినప్పుడు, ఆసా వలే మనము కూడా దేవునికి అనుకూలముగా జీవించేవారిగా ఉంటాము.
మన హృదయము దేవునిని, దేవునికి సంబంధించిన విషయాలను కోరుకోవాలి అయితే ఈ లోకములో ఉన్నవాటిని కోరుకొంటే గనుక అనగా లోకములో ఉన్న పద్ధతులు, రీతులు ప్రకారము మనము వెళ్ళినట్టయితే మనము వాటిని ప్రతిమగా ప్రతిష్టించుకున్నట్టే. మనము కలిగిన బలహీనత మనలను జయించి మనలను దానికి తగినట్టుగా మనము చేయునట్టుగా ప్రేరేపించి అపవాదికి సంబంధించిన బలిపీఠములు కట్టునట్టుగా మార్చివేస్తుంది. ప్రభువు వద్దు అన్నా సరే ఆ మాటలు తృణీకరించి అయినా సరే మనము ఆ కార్యము కొరకు వెళ్ళిపోయేవారముగా అయిపోతాము. అయితే ఆసా వలే ఇంతకుముందు కట్టబడిన ఈ ప్రతిమలు, బలిపీఠములు మనము నాశనము చేయవలసిన వారముగా ఉండాలి.
ఆసా రాజ్యము మన జీవితములను సూచిస్తుంది. ఎలా అయితే దేవునికి సంబంధించినది కాని దానిని ఎలా అయితే ఆశ కలిగి నిర్మూలించాడో మనము కూడా అలాగే మన జీవితములో ఉన్న సమస్తమైన కల్మషమును తొలగించుకోవలసినవారముగా ఉండాలి.
మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.౹ -2 దినవృత్తాంతములు 15:16
ఇక్కడ ఆసా తల్లి ఒక దేవతా స్తంభమును నిలబెట్టింది. అంటే మన జీవితములో మన ప్రమేయము లేకుండా మన జీవితములో మనకు సంబంధించిన వారిద్వారా ప్రేరేపించబడే పరిస్థితులు అని అర్థము చేసుకోవచ్చు. మనకు ఎంత దగ్గరివారైనా సరే, ఒకవేళ దేవునికి మహిమకరము కానిది చేయుటకు ప్రేరేపిస్తే, ఖచ్చితముగా మనము వ్యతిరేకించాల్సిందే! ఆసా కన్న తల్లి అయినా సరే ఆలోచించకుండా పట్టపుదేవిగా ఉండకుండా అనగ త్రోసిపడవేసినవాడై ఉన్నాడు. అటువంటి పట్టుదల మనము కలిగి ఉండాలి. ఆలోచన సహితము మనము త్రోసివేసేవారముగా ఉండాలి. ఖచ్చితముగా ఆలోచన వస్తుంది. అయితే, ఆ ఆలోచనను త్రోసివేసే నిశ్చయతను మనము కలిగిఉండాలి. అంతే కాక మరొకసారి అటువంటి అవకాశము అపవాదికి దొరకకుండునట్టు మనము స్పష్టమైన ఏర్పాటు చేసుకోవాలి.
ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు. -2 దినవృత్తాంతములు 15:19
అనగా దేవునికి అనుకూలముగా ఉన్నంతసేపూ ఆసా కు యుద్ధములే లేవు. మనము కూడా దేవునికి అనుకూలముగా ఉన్నంతసేపూ, మన జీవితములలో దేవుడు సిద్ధపరచిన శ్రేష్టమైన వాటినే మనము అనుభవించే స్థితిలో ఉండగలుగుతాము. 35 సంవత్సరములు ఆసా దేవునికి అనుకూలముగా జీవించాడు. అయితే 36వ సంవత్సరములో ఆసా చేసిన వ్యతిరేకమైన కార్యమును బట్టి యుద్ధములు కలిగినట్టుగా మనము చూడవచ్చు.
అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగినశ్రమయే కారణము. -కీర్తనలు 77:10
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. -యెషయా 59:1-2
ఈరోజు చెప్పబడిన వాక్యము ప్రకారము మన జీవితములను సరిచేసుకుందాము. ఎక్కడెక్కడ విగ్రహములు ఉన్నాయో, ఎక్కడెక్కడ బలిపీఠములు కట్టామో అవన్నిటిని త్రోసివేసి, చిన్నాభిన్నములుగా చేసి దేవుని కొరకు మన జీవితములను సమర్పించుకుందాము.