15-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

తన సన్నిధిలో నిలబడే భాగ్యము మనకు దయచేసిన దేవునికే ఘనత, మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ దినము దేవునిని స్తుతించవలసిన, మహిమ పరచవలసిన దినము.

దేవుడు మనకొరకు సిద్ధపరచిన సమయము ఎందుకంటే, తండ్రి ఆకర్షిస్తేనే గాని మనము ఆయన సన్నిధిలోనికి రాలేము. నీ ప్రేమ మాధుర్యము నేను ఏమని వర్ణింతును అనే పాట మనము పాడుకున్నాము. దేవుని ప్రేమను అనుభవించి అర్థము చేసుకున్నవారు మాత్రమే ఆయన ప్రేమ మాధుర్యమును వర్ణించాలి అనే ఆశ కలిగి ఉండగలుగుతారు. దీనికొరకు దేవుడు ఎలా నీపై ప్రేమ కనపరుస్తున్నాడు, తన కృప కురిపిస్తున్నాడు అని నీవు యెరిగి ఉండాలి.

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.౹ -అపొస్తలుల కార్యములు 17:24

మనము భూమి మీద ఉన్నాము గనుక, మనకు కూడా ఆయనే ప్రభువు అనేది సత్యము. ఆయన మనకు ప్రభువు అయి ఉన్నాడు, మనము ఆయనకు చెందినవారముగా ఉంటున్నాము. లోకములో మనము గమనిస్తే, ఇద్దరికి గొడవ జరిగినపుడు, ఒక వ్యక్తి వెనుక ఒక గొప్ప వ్యక్తి ఉన్నట్టయితే, ఆ వ్యక్తిని బట్టి, అతనికి ఉన్న సామర్థ్యమును బట్టి అతనికి ఒక ఆధిక్యత ఉంటుంది. అలాగే మన వెనుక సర్వాధికారి, సర్వ శక్తిమంతుడు అయిన ప్రభువు ఉన్నాడు. మనుష్యులను ఆధారము చేసుకొనే వారికి వారి వెనుక ఉన్న మనుష్యులకు కలిగిన పరిమితమైన శక్తి మాత్రమే అందుతుంది. వారికంటే బలమైనవారు వచ్చిన యెడల, వారి పరిస్థితి మారిపోతుంది. అయితే మన ప్రభువు కంటే బలమైనవారు ఇంకెవరూ లేరు. అటువంటి మన ప్రభువే మన వెనుక ఉన్నట్టయితే, ఇంక మనకు ఎవరు ఆటంకము కాగలరు? శూన్యమునుండి సమస్తము జరిగించువాడు మన దేవుడు.

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?౹ -రోమా 8:35

ఈ దినము ఎటువంటి శ్రమ ఉన్నప్పటికీ నీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే, నీవు ఆ శ్రమను జయించగలుగుతావు. పై వాక్యములో ఉదహరించబడిన పరిస్థితులు మన జీవితాన్ని ఎంతో ప్రభావితము చేయగలిగినవి. అయితే, వాటి ప్రభావము సహితము మనలను క్రీస్తు ప్రేమనుండి యెడబాపలేదు. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి మనము కాపాడబడుతున్నాము.

మనలో కొంతమంది పైన పేర్కొన్న పరిస్థితులలో ప్రస్తుతము ఉంటున్న వారు ఏమి అర్థము చేసుకోవాలి అంటే, ఈ దినము ప్రభువు చెప్పుచున్న మాటలు – “ఏ శ్రమ అయినా సరే అది నిన్ను ఏమీ చెయ్యలేదు”.

అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను -కీర్తనలు 91:14

నీవున్న శ్రమకరమైన పరిస్థితిలో దేవుని యొక్క ప్రేమ, నీ పై నిలిచియుంటుంది. ఈ సత్యమును నీవు గుర్తించి, తిరిగి దేవుని నీవు ప్రేమించిన యెడల, నీవున్న ఆ శ్రమనుండి నిన్ను తప్పించేవాడుగా దేవుడు ఉన్నాడు. అయితే ఎలా మనము దేవునిని ప్రేమించగలుగుతాము?

యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును -యోహాను 14:23

అయితే ఏమి మాట మనము గైకొనాలి? ఇప్పుడు మనము ఆయనను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము గనుక, ఆయన మాట మనము ఆ స్తుతించుటలో మనము గైకొనాలి.

దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹ -యోహాను 4:24

మోషే విషయములో మనము జ్ఞాపకము చేసుకుంటే, నత్తివాడనను అని వెనుకంజవేసినపుడు అతనికి సామర్థ్యము కలుగచేసాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను చూస్తే, వారు ఐగుప్తులో బానిసత్వములో ఉన్నపుడు, వారి మూలుగులు విన్న దేవుడు మోషేను వారిని విడిపించడానికి మొషేను పంపించి ఆయన ప్రణాళిక నెరవేర్చాడు.

అందుకే దేవుని మాటల ప్రకారము మనము నిలబడటానికి సిద్ధపాటు కలిగే ఉండాలి. మన దేవుడు మనకు ప్రభువు అయి ఉన్నాడు మరియు మనలను ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ మనపై నిలిచేదిగా ఉంది. గనుక హృదయపూర్వకముగా దేవునిని మహిమ పరుద్దాము.

 

ఆరాధన గీతము

నేను నమ్ముకున్న నమ్మదగిన నా దేవుడు

వారము కొరకైన వాక్యము

మన దేవుడు నమ్మదగినవాడు, ఆయనను నమ్ముకున్నవారిని ఎన్నడూ, ఏ విషయములోనూ సిగ్గుపడనీయడు. మనము ఆయన సొత్తు అయి ఉన్నాము, మన జీవితము ఆయనదే! అయితే మనము యదార్థముగా వెంబడించేవిగా ఉండాలి. అనగా మనము ఏమి చెప్పుచున్నామో, అదే మన జీవితములో క్రియలు కూడా అయి ఉండాలి. ఆయనకు మహిమకరమైన జీవితమును మనము సిద్ధపరచుకోవాలి. దానికొరకు అవసరమైన ప్రతీ విషయము గూర్చి దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆ ప్రకారముగా మనము సిద్ధపడినపుడు, మనము దేవునికి సాక్ష్యము గా ఉండగలుగుతాము.

మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.౹ అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా౹ యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?౹ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.౹ -యోహాను 14:7-11

ఈ వాక్య భాగములో యేసయ్య ఫిలిప్పును అడిగిన ప్రశ్న మనకు కూడా వేస్తున్నాడు. ఇంతకాలము క్రీస్తును వెంబడిస్తూ, ఆయనను ఎరగని పరిస్థితిలో ఉంటున్నావా? ఆయన యొక్క అనుభవము లేని వాడవుగా ఉంటున్నావా? మనలను మనము ప్రశ్నించుకుందాము, ఒకవేళ అటువంటి పరిస్థితి కనబడితే, మనము సరిచేసుకుందాము.

నీవు క్రీస్తు అనుభవము కలిగి ఉండాలి అని కోరుకొనే నీ ప్రభువు, నీవు ఆ అనుభవమును పొందుకొనులాగా అనేక ప్రయత్నములు చేస్తున్నాడు. వాక్యప్రకారముగా మనము చూస్తే –

మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను.౹ అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.౹ -నిర్గమకాండము 3:13-14

ఇక్కడ దేవుడు తన పేరు చెప్పకుండా, నేను ఉన్నవాడను అనువాడు అని ఎందుకు చెప్పుచున్నాడు? ఐగుప్తులో ఫరో కఠిన శ్రమల గుండా ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నపుడు, మూలుగుతో నిండిన అనుభవములో, దేవుడా నీవు ఉన్నావా? నీవు ఉంటే మాకు ఎందుకు ఈ శ్రమ? అనే విధానములో ఉన్నప్పుడు, “నేను ఉన్నవాడను” అని చెప్పుచున్నాడు.

అయితే వారి పితరుల దేవుడు ఎవరు అని అలోచిస్తే – అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు. వారి జీవితములలో అనేకమైన అద్భుతములు చేసినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అయితే వారి శ్రమ అనుభవములో ఏమీ అద్భుతములు జరగని స్థితిలో, దేవా మేము విన్న మా పితరుల దేవుడైవైన నీవున్నావా? అని అడిగిన పరిస్థితి.

అలాగే ఇశ్రాయేలు ప్రజలు కానాను ప్రయాణము నలభై రోజులలో ముగించబడవలసినది నలభై సంవత్సరములు పొడిగించి, దేవుడు ఏమి చేయగలడో అనే అభుభవమును వారికి అనేకమైన అద్భుతముల ద్వారా నేర్పించాడు. ఆ అనుభవజ్ఞానము వారు కలిగి ఉండగా వారిని కనానులో ప్రవేశపెట్టాడు.

తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.౹ -యోహాను 4:12

ఇక్కడ సమరయ స్త్రీకి యేసయ్య గూర్చిన అనుభవము లేడు. అందుకే యేసయ్యను ప్రశ్నిస్తుంది. అయితే ఆమె జీవితమును రక్షించడానికి, ఆమెను ఆ అనుభవములోనికి తీసుకురావడానికి తనతో సంభాషణ చేసినవాడుగా ఉన్నాడు.

అలాగే, పితరులకంటే నీవు గొప్పవాడవా అని ఆమె అడిగినపుడు, ఆయన ఆమె జీవితమును ఆమెకి చూపించి అనుభవపూర్వకముగా ఆయనను తెలుసులోవడానికి సహాయము చేసాడు.

యాకోబు తవ్విన బావి తనకు ఉపయోగపడింది, తరువాత ఆయన పిల్లలకి ఉపయోగపడింది, ఇప్పుడు తన తరములకుకూడా ఉపయోగపడుతుంది. గనుక యాకోబు గొప్పవాడు అని ఆమె నమ్మింది. ఎప్పుడైతే యేసయ్య తన జీవితములోని రహస్యములని బయటకు తీసుకుని వచ్చినపుడు, యాకోబు కంటే యేసయ్య గొప్పవాడు అని గ్రహించిది.

ఇప్పుడు మన జీవితములో కూడా మనము అనుభవపూర్వకముగా ముందుకు వెళ్ళడానికి ఆయన తన ప్రయత్నములు చేస్తున్నాడు అని మనము గ్రహించాలి. ఆ స్త్రీ విషయములో తన పరిస్థితి గూర్చిన విషయములో ప్రయత్నము చేసాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మేమున్న పరిస్థితిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న కలిగినపుడు ఆ ప్రశ్నకు సమాధానముగా ఉన్నవాడను అని కనపరచుకున్నాడు. మన జీవితములో కూడా ఏ పరిస్థితి మనకు ప్రశ్నార్థకముగా పరిణమించిందో ఆ పరిస్థితిని దేవుని వద్దకు తీసుకొచ్చినపుడు ఖచ్చితముగా నీవున్న పరిస్థితిలో నీకు అవసరమైన అనుభవము నీకు కలిగించి, నిన్ను విడిపిస్తాడు. అది ఎంత అసాధ్యముగా కనపడే పరిస్థితి అయినప్పటికీ, సమస్తము సాధ్యపరిచే మన ప్రభువు మనతో ఉండగా మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఈరోజు మనతో ప్రభువు చెప్పుచున్న ముఖ్యమైన విషయము నీవు నీ ప్రభువును రుచి చూసి, అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి.

సమరయ స్త్రీని చూస్తే, మొదట ప్రశ్నించింది, తరువాత ఒప్పుకుంది అటుతరవాత ప్రకటించింది.

–మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా౹ -యోహాను 4:29

యాకోబు గొప్పవాడు, అయితే యాకోబు కంటే గొప్పవాడు అయిన ప్రభువును ప్రకటించింది. అనగా నీవు అనుభవము పొందుకున్న తరువాత, నీ ద్వారా అనేకమంది దేవునిని అనుభవించడానికి ఉపయోగించుకుంటాడు. నీ శక్తికి మించినదాని విషయములో ఖచ్చితముగా నీవు దేవుని గూర్చిన అనుభవము పొందుకోవడానికి ఖచ్చితముగా ఆయన కార్యము చేస్తాడు.

ఆ విధముగా మనము మనలను సిద్ధపరచుకొని ప్రభువుకు సాక్ష్యముగా సిద్ధపరచుకుందాము.