15-06-2025 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మన మనసు ఎల్లప్పుడూ వాక్యమునందే ఉండాలి. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనుక మనకు సిద్ధపరచినది మనము కొల్పోము. అయితే ఈ ప్రకటించబడిన సత్యములో మనము నిలిచి ఉండాలి. ఇస్సాకు విషయములో ఆలోచిస్తే, అబ్రహాముకు 75 సంవత్సరముల వయసులో ఇస్సాకే వాగ్దానము చేయబడ్డాడు, అది ఆలస్యమైనా ఇస్సాకే అనుగ్రహించబడ్డాడు. మన అర్హత యేసుక్రీస్తు ప్రభువే.

దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు, మన కుటుంబములకు యజమానుడుగా, కుటుంబమునకు అవసరమైన సమస్తము సమకూర్చేవాడుగా ఉన్నాడు. అది తన బిడ్డలు సంతోషముగా అనుభవించడానికే సమకూర్చేవాడుగా ఉన్నాడు.

తండ్రి కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు కలవారియందు జాలిపడును – కీర్తన 103:13

తండ్రి స్వాస్థ్యమును చిన్న కుమారుడు తీసుకొనిపోయి వ్యర్థపరచి తిరిగి ఓడిపోయిన స్థితిలో తండ్రి వద్దకు వచ్చినపుడు, తండ్రి జాలిని కనపరచినవాడుగా ఉన్నాడు. తండ్రి తన కుమారులను అలంకరించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు గనుకనే, తన కుమారుల యెడల జాలి కలిగి ఉన్నాడు.

తండ్రి నీలోనే నివాసముంటున్నాడు గనుక ఆయన లక్షణములు నీలోనుండే కనపరచబడాలి. పౌలు చెప్పినట్లు ఇక జీవించువాడను నేను కాదు, నాలోని క్రీస్తే అని మనము కూడా చెప్పగలగాలి. ఆయన ఎమై ఉన్నాడో, అవన్నీ మనకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆయన మనలో ఉంటే, ఆయనను బట్టి సమస్తము మనలనే వెంబడిస్తాయి.

దేవుడు నీ యెడల గొప్ప తలంపులు ఉన్నాయి అయితే ఆ తలంపులు నెరవేరకుండా వ్యర్థమైపోతున్నాయి. ఎందుకు అంటే, నీకు నీ తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోతున్నావు గనుకనే! అయితే నీ తండ్రి జాలి కలిగినవాడు గనుక, నీవు ఈ సత్యము గ్రహించి తిరిగి ఆయన వద్దకు తిగిరి రావాలి.

ఈ దినము ఈ సత్యమును గ్రహించిన వారిగా ఆయనను ఆరాధిద్దాము. మరలా పాత స్థితిలోనికి వెళ్ళకుండా తీర్మానము తీసుకుందాము.

ఆరాధన గీతము

 

వారము కొరకైన వాక్యము

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి – 1 పేతురు 5:7

నీ దేవుడు మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు. అనగా నా కుమారుడు ఎలా ఉన్నాడు? అనే వేదనతో కూడిన హృదయముతో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతే కాక తన కుమారుల కొరకు సిద్ధపరచినవాడై ఉన్నాడు. మరొక విధముగా చూస్తే, నీ దేవుడు నిన్ను మోసేవాడుగా ఉన్నాడు. ఒక తల్లి తన గర్భములో తన బిడ్డను మోసినట్టుగా మోసేవాడు. నీపై లక్ష్యము కలిగినవాడు.

మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల? – యోబు 7:17

మనుష్యుల యెడల లక్ష్యము కలిగి ఉండటానికి, వాడు ఏపాటి వాడు? ఉదయాన మొలిచి, సాయంకాలమున వాడిపోయే గడ్డి పువ్వు వంటివాడు మనుష్యుడు. అయితే, అటువంటి మనుష్యుల గురించి, ఆయన లక్ష్యము కలిగి ఉన్నాడు.

నిన్ను లక్ష్యము పెట్టే దేవుడు నీకుండగా నీవు దేని గురించి కలత చెందుతున్నావు? నీవు కలత చెందవలసిన అవసరమే లేదు.

దేవుడు తన పని కొరకు మిమ్మలను ఎన్నుకొన్నాడు. ఎలీషాను అభిషేకించమని ఏలియాతో దేవుడు చెప్పాడు. అలాగే మిమ్ములను దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకొన్నాడు. అయితే ఎలీషా తన సమస్తము బలిపీఠముపై అర్పించి పరిచర్యకు వచ్చేసాడు. అయితే పేతురును గమనిస్తే, యేసయ్య చనిపోయినతరువాత మరలా తన పాత ఉద్యోగమునకు వెళ్ళిపోయాడు.

అయితే యేసయ్య పేతురును వదిలిపెట్టక వెతుక్కుంటూ గలిలయ సముద్రమువైపు వెళ్ళినవాడుగా ఉన్నాడు. ఆయన మనలను వదలక వెతికే దేవుడు. నీవు వెనుకడుగు వేసి దూరముగా వెళ్ళినప్పటికీ, నా కుమారుడా అని వెతికి, పిలిచేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

నీవు ఆయనతో ఉన్నపుడే కాదు, ఆయనను విడిచి వెనకడుగు వేసినప్పటికీ నిన్ను విడిచిపెట్టక నీ యెడల లక్ష్యము కలిగి నిన్ను వెతికి, నిన్ను ప్రేమించేవాడు నీ దేవుడు. నీవు దేవుని రాయబారివి, నీ వస్త్రము, వేషధారణ నీ దేవునిని ప్రతిబింబించాలి.