15-01-2023 ఆదివారం మొదటి ఆరాధన – నన్ను వెంబడించుము

రాజుల రాజా రానైయున్నవాడా

రాజుల రాజా రానైయున్నవాడా (2)
నీకే ఆరాధన
నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)

కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల||

రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||

అబ్రాహము దేవుడవు ఇస్సాకు దేవుడవు

అబ్రాహము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు రాజుల రాజా
యావే నిన్ను స్తుతియింతును
యావే నిన్ను ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా

నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ
నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము
నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము

నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము
నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము
నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం
నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద

యేసయ్యా వందనాలయ్యా

ప. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
అ.ప. వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా “2”

యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

1. “నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”

యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

2. “జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”

యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

ఆరాధన వర్తమానం

మనమందరము దేవుని సన్నిధిలో వున్నాము. ఆచారయుక్తముగా దేవుని సన్నిధిలోనికి మనము రాకూడదు. అనుభవము లేకుండా మన దేవుని యదార్థముగా వెంబడించలేము. ఒకవేళ నీవు అనుభవించినవాడివి అయితే దేవుని సన్నిధిని నీవు విడిచిపెట్టవు. దేవుని సన్నిధియొక్క విలువ తెలియనప్పుడు మనము నామకార్థముగా ఉంటాము. అయితే ఎప్పుడైతే ఆయన సన్నిధివిలువ తెలిసినట్టయితే ఆ సంతోషము, ఉత్సాహము బయటకు ప్రత్యక్షపరచబడుతుంది.

మనము మౌనముగా ఉండే సమయము ఉంది, ఉత్సాహముగా ఉండే సమయము కూడా ఉంది. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము మౌనముగా ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో మనము ఉత్సాహముతో స్తుతించాలి. దేవుని మాట విడుదల అయినప్పుడు, మీరు దానిని స్వీకరించే విధానముమీద మీ సంతోషము ఆధారపడి ఉంటుంది.

దేవుని వాక్యము చీకటిలో వెలుగై ఉంది. మన శరీరము మరణములకులోనై ఉంటుంది. ఈ శరీరము ఎప్పుడూ కూడా మరణకరమైన సంగతులవైపే మనలను లాగుతుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు కలిగినప్పుడు, శరీరము ఎంత ప్రయత్నించినా వెలుగుపైపునకు, జీవము వైపునకు, నీవు స్వీకరించిన వాక్యము నిన్ను తిరిగి తీసుకువస్తుంది.

ఈ సంవత్సరము మీరు వెలిగించబడి ప్రకాశించుదురు గాక! ఆమేన్.

దీనికొరకు మనము చెయ్యవలసినది కూడా ఉంది. ఆయన సన్నిధిలో ఎముందో మనము అది అనుభవించాలి అనే ఆశ కలిగి ఉండాలి. మనలో ప్రతి వాని జీవితము ఆయనకు మహిమకరముగా ఉండటానికే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. దానికొరకు మనము సిద్ధపడి ఉండాలి.

మన జీవితములను స్థిరపరచడానికి దేవుని వాక్కు మనకంటే ముందుగా వెళ్ళి మార్గము సిద్ధపరుస్తుంది.

నీ శరీరము కళ్ళముందు ఉన్నదానిని చూసి నీ శరీరము భయపడుతుంది. అయితే నీ మనస్సు దేవుని వాక్యము మీద ఉన్నప్పుడు ఆ భయము తొలగించబడుతుంది. అయితే మన జీవితములో ఆయన తన కార్యము చేసి ముగించేవాడు గనుక మనము భయపడనవసరము లేదు. ఒకవేళ నీ జీవితములో అనారోగ్యముతో బాధపడుతుంటే, ఆ అనారోగ్యముకంటే ముందుగా దేవుని వాక్యము ముందుగా వెళుతుంది. దేవుని వాక్యము లోని వెలుగును బట్టి కలిగే జీవము, ఆ వ్యాధి యొక్క మరణమును తొలగిస్తుంది. అందుకే నీ మనస్సు నీ పరిస్థితిమీద నిలపవద్దు, అయితే నీ మనస్సును దేవుడి నీకిచ్చిన వాగ్దానము మీదనే ఉంచు. నీ జీవితమును బాగుచేయుట కొరకు, అది భయంకరమైన సందర్భములోనికి వెళ్ళిపోయినప్పుడుకూడా ఆయన నిన్ను సమకూర్చినవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడే గనుక నిన్ను పట్టుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? ఒకవేళ ఇప్పుడు కొద్దిగానే ఉన్నావేమో, అయితే ఆయన నిన్ను పట్టుకోకపోతే ఈ కొద్దిలో కూడా నీవు ఉండకపోయేవాడవు. ఈ సత్యమును నీవు గ్రహించినప్పుడు, నీవు దేవుని స్తుతించగలుగుతావు.

నెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును – కీర్తన 34:1

మన జీవితములో ఆశించినది దొరకనప్పుడు, కోరుకొన్నది దొరకనప్పుడు మనము కృంగిపోయేవారముగా ఉంటాము. ఈ స్వభావము మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుంచి మనలో ఉంటుంది, ఇది మార్చబడాలి. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడూ ఆయనను కీర్తించగలము. అనగా సంతోషమైనా, దుఃఖమైనా ఏ సమయమైనా మనము ఆయనను కీర్తించగలుగుతాము. అయితే నీవు అలా ఉండకుండునట్లు అపవాది ఎంతో ప్రయత్నిస్తుంది. నిన్ను చిన్నబుచ్చుకునేలాచేసి దేవుని సన్నిధిలో నీవు ఉండకుండా, ఒకవేళ ఉన్నప్పటికీ ఆయనయందు సంతోషించకుండా ఉచ్చులు పన్నుతుంది. అయితే ఈ సత్యము నీవు ఎరిగినవాడవైతే, అపవాదికి అవకాశము ఇవ్వవు. దేవుని సన్నిధిలో, ఆయనను కీర్తించి నీ జీవితములో ఆయన వెలుగు ప్రత్యక్షపరచబడేలాగా నీవు సిద్ధపరచుకుంటావు.

నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను – కీర్తన 34:4.

కీర్తనాకారుడి అనుభవము ఈ వాక్యము. ఆయనకు ఉన్న పరిస్థితులలో దేవునికి మొర్రపెట్టగా దేవుడు ఆయనకు జవాబు ఇచ్చినవాడుగా ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్న వ్యక్తి ఎటువంటివాడు అని నీవు గ్రహించాలి. అడిగినదానికి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవితములో కూడా అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. అయితే మన దేవుడు
జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన జవాబు క్రియలతో కూడినదై ఉన్నది. భూమి అంతా కూడా శూన్యముగా ఉంది, నిరాకారముగా ఉంది, చీకటి ఉంది. అప్పుడు ఆయన వెలుగు కలుగును గాక అని పలుకగా, వెలుగు కలిగెను. అనగా ఆయన మాట క్రియా జరిగించేదిగా ఉంటుంది. నీవు దేవుని ఎలా తీసుకుని ఆరాధిస్తావో అలాగే ఆయన నీ జీవితములో స్థిరపరచబడతాడు.

నీవు సిద్ధపడినట్టయితే నీకొరకు దేవుని మహిమ నీకొరకు సిద్ధపడుతుంది. నీ బంధకములనుండి నీవు విడుదల పొందాలి. ఆ బంధకములోనే ఉండిపోతే నీవు నూతనమైనది పొందలేవు. మనము “నా దేవుడు” స్తుతించబడాలి అనే మనసుతో ఆయనను స్తుతిద్దాము.

ఆరాధన గీతము

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడునో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

పల్లవి:
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము యెదుట
శాపము తలవంగును నీ నామము యెదుట
సాటిలేని నామము – స్వస్థపరచే నామము
ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము
భ్రిద్గె:

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య
కొనియాడబడును గాక నీ నామము యేసయ్య
అన్ని నామములకు పై నామముగ

Main message| మెయిన్ మెసేజ్

దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని శక్తితోను, ఆయన ప్రభావముతోను నిండినవారుగా ఉన్నారు. అయితే దేవుని మాట, బలము మరియు ప్రభావము క్రియలతో కూడినదై ఉంటుంది. ఆయన సన్నిధిలోని బలము, ప్రభావము మన శరీరములోనికి మరియు ఆత్మలోనికి వెళుతుంది. ఆయన ప్రభావము ఖచ్చితముగా కార్యము చేసేదిగా ఉంటుంది. నీ ఆత్మలో ఏమి కృంగుదల ఉంటుందో దానినుండి విడుదల పొందుకుంటుంది. ఇది నీ కంటి యెదుట కనబడదు గానీ ఆ కార్యము స్థిరపరచబడుతుంది. అదే విధముగా నీ శరీరములో ఏమి సమస్య ఉందో ఆ సమస్య కూడా ఆయన ప్రభావమును బట్టి బాగుచేయబడుతుంది.

మనము, యేసు ప్రభువు మరియు తండ్రి ఉన్నారు. తండ్రిలోని ప్రభావము యేసు క్రీస్తులోనికి వెళుతుంది. మరి యేసు క్రీస్తులోని ప్రభావము ఎవరి లోనికి వెళుతుంది? మనలోనికి వెళుతుంది. అయితే మనలోని ప్రభావము అది వెల్లడిపరచబడుతుంది.

నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది – యోహాను 1:9

నీవున్న పరిస్థితులలో నీలో ఉన్న ప్రభావము కార్యము చేస్తుంది అని నీవు నమ్మి, ఆ ప్రభావము ప్రకారము ప్రకటించి ప్రయత్నించండి. మీరు అనుభవపూర్వకముగా ఈ సత్యమును తెలుసుకోండి.

ఈ సంవత్సరము నీవు వెలిగించబడి ప్రకాశించబడే సంవత్సరము. అపవాది ఉచ్చులకు లోబడకండి. నీలో ఉన్నవాని ప్రభావము, బలము, జ్ఞానము గ్రహించండి. ఈ సంవత్సరము ఇలా ప్రాక్టికల్ గా ప్రయత్నించండి. ఇది రాదు, అని మీకు మీరే అనుకోకండి, మీలో ఉన్నవాని శక్తిమీద ఆధారపడి ముందుకు వెళ్ళండి.

నేను దేవుని శక్తిచేత నింపబడినవాడను, దేవుని జ్ఞానము చేత నింపబడినవాడను – ఆమేన్! ఏ సమస్య నాకు వ్యతిరేకముగా నిలబడలేదు! ఆయన నామమునే ధ్వజముగా ఎత్తి నిలబడినవాడను నేను అని నిన్ను నీవు బలపరచుకో!

ఈ రోజు మన ధ్యానాంశము – “నన్ను వెంబడించుము”. ఈ మాట ఒక ఆహ్వానము వలే ఉంది కదా!

యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులనుపట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను – మార్కు 1:17.

ఈరోజు ప్రభువు ఒక ఆహ్వానము ఇస్తున్నాడు, “నా వెంబడి రండి”. అయితే పిలిచినవాడు ఎవడు ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినట్టయితే అప్పుడు వెంబడించడానికి సిద్ధపడతావు.

సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. లూకా 5:5-7.

వచ్చిన ఆహ్వానము ఎటువంటి పరిస్థితిలో అని మనము గమనించాలి. పేతురుకు ఉన్న నెగటివ్ సందర్భములో అనగా ఏమి దొరకని, ప్రయత్నము ఫలించని స్థితిలో ఆయనకు ఆహ్వానము వచ్చింది. వారు వరి వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అయితే ఎందుకు వెంబడించారు? పిలిచినవ్యక్తి ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినవాడు. “ఏమీలేని స్థితిలో సమృద్ధి కలుగచేసినవాడు” వారిని పిలిచినవాడు అనే విషయము వారు గ్రహించారు.

ప్రభువు వారిని పిలిచినప్పుడు వారు వలలు విడిచిపెట్టి వెంబడించారు. అయితే నీవు నేను మనకు వచ్చిన పిలుపుకు ఎలా వెంబడిస్తున్నాము? వారి పరిస్థితులలో వారు పట్టిన చేపలు ఎంతో విలువైనవి. అయితే ఆ సమయములో వారిని వెంబడించమని చెప్పినప్పుడు, వారికి ఎంతో విలువైనవి విడిచిపెట్టి వెంబడించారు. నీ జీవితములో కూడా ఏదీ ప్రభువుకంటే విలువైనది ఉండకూడదు. ఎప్పుడైతే నీవు ప్రభువును విలువైనవాడుగా చూడకపోతే ఆయన సన్నిధికి ఆశతో రాలేవు.

ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. – మత్తయి 6:24

ఎంతకాలము ఈ రెండు తలంపులు? ఎంతకాలము ఈ విధముగా ఉంటావు? ఏది నీకు విలువైనదిగా నీవు ఎంచుకుంటున్నావు? యేసు ప్రభువునే విలువైన వాడుగా ఎంచి వెంబడించు. ఒకసారి మనలను పరీక్షించుకోవాలి – ఏది మనకు విలువైనది? లోకమా? ధనమా? పదవా? లేకా నీకోసము ప్రాణము పెట్టిన నీ ప్రభువా?

నీకు ఉన్నది విడిచి పెట్టుకోమని కాదు గానీ, నీవు ప్రభువును అన్నిటికంటే విలువైనవాడి గా ఎంచుకుని ఆయను వెంబడించుమని ప్రభువు ఆహ్వానము ఇస్తున్నాడు.

యేసయ్య పరలోకములోనుండి వచ్చినవాడు. చేపలు భూమి మీద ఉన్నాయి. లోకము శరీరమునకు సంబంధించింది. యేసయ్య ఆత్మకు సంబంధించినవాడు. వారైతే వలలు విడిచి, శరీరమునకు విలువైనది విడిచిపెట్టి ఆత్మకు విలువైనది కావాలనుకున్నారు, ఆయనను విడిచిపెట్టారు. మనము కూడా “శరీరమునకు విలువైనది అనుకున్నది విడిచిపెట్టి, ఆత్మకు విలువైనది మరి ముఖ్యమని ఎంచుకునే మార్పు” మనలో రావాలి అని ప్రభువు కోరుకుంటున్నారు.

నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును – యోహాను 10:27.

“నా గొర్రెలు” అనగా ప్రభువు ఆయనవిగా ఆయన ఎంచుకున్న గొర్రెలు. ఎంత భాగ్యము? ఎంత ఆధిక్యత? అయితే ఈ సత్యము నీవు ఎరిగి ఉన్నావా?

దేవుని మాట ప్రకారము నీవు చేసినప్పుడు ఖచ్చితముగా ఆ మాట నెరవేర్పు నీ జీవితములో చూస్తావు. ఆయనను వెంబడించే నీవు ఆయన మాటల ప్రకారము నీవు సిద్ధపడుతున్నావా?

నీకు ఆహ్వానము ఇచ్చినవాడు వట్టిగానే ఇచ్చాడా? కష్టములో ఉన్నవారికి విస్తారముగా ఇచ్చాడు. విస్తారములో ఉన్నవారిని వెంబడించమన్నారు. దేనికొరకు? ఇంకా అధికముగా ఆశీర్వదించడానికి. వారు విడిచిపెట్టిన తరువాత, వారు మరి ఎక్కువగా ఆశీర్వదించబడ్డారు.

ఆత్మీయమైనదే విలువైనది
దేవునికి దాసుడుగా ఉండటానికి సిద్ధపడు
దేవుని స్వరము వినడానికి సిద్ధపడు.