ఆరాధన వర్తమానము
ఈ దినము మనలను ఆయన సన్నిధిలో నిలువబెట్టిన దేవదేవునికే సమస్త మహిమ ఘనత, ప్రభావములు కలుగునుగాక! మన దేవుడు గొప్ప దేవుడు. ఊహించని కార్యములు ఎన్నో చేసిన దేవుడుగా మనదేవుడు ఉన్నాడు. ఆ దేవుని కలిగిన మన జీవితములు ధన్యకరములైన జీవితములు.
ఈరోజు మనము సంఘముగా దేవుని స్తుతించవలసిన దినము, ఆయనను మహిమ పరిచే దినము. మన జీవితము యొక్క పునాది వాక్యము మాత్రమే అయి ఉండాలి. మన ప్రభువు సిద్ధపరచే వాడుగా ఉన్నాడు. ఆయన సిద్ధపరచేది ఎంతో ఉత్తమమైనదిగా ఉంటుంది. దేవుడు మనలను ప్రేమించాడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటి అన్నింటిలోనూ గొప్పది యేసయ్య ఈ భూలోకములోనికి రావడమే.
దేవుడు మనకొరకు సిద్ధపరచినవన్నీ యేసయ్య రాకముందు బనంధించబడి ఉన్నాయి. యేసయ్య వచ్చి ఆ బంధించబడిన సమస్తమును విడిపించాడు. అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు – “నీవు ఆశీర్వాదముగా ఉందువు”. ఆయన కుమారులుగా మనమందరము ఆశీర్వాదముగానే ఉందుము. అందుకే, అబ్రహాము కుమారుడు అని దేవుడు విశ్వాసులను సంబోధిస్తున్నాడు.
తండ్రి కలిగి ఉన్నదానిని బట్టే కుమారులు సంతోషించేవారుగా ఉంటారు. మన పరలోకపు తండ్రి ఎంతో ధనవంతుడై ఉన్నాడు గనుక మన సంతోషమునకు మితి లేదు.
మందిరము విషయములో దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. నిజానికి ఇది మన వలన అయ్యే పని కాదు. అయినప్పటికీ మన పరలోకపు తండ్రి మనకొరకు సిద్ధపరచి నిర్మాణము జరుగులాగున ఆయన కృప చూపిస్తూ వస్తున్నాడు.
అబ్రహామును బట్టి కుమారులు ఆశీర్వాదముగా ఉంటున్నారు. ఈ సత్యమునకు ఆధారము అయి ఉన్న వాక్యము ఏమిటి అంటే –
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
మన మినిస్ట్రీ సూపర్నేచురల్ మరియు దీనికి అనుసంధానమై ఉన్న అందరూ కూడా సూపర్నేచురల్ మాత్రమే. ఇది దేవుని నియమమై ఉన్నది. అబ్రహామును దీవించువాడు దీవించబడతాడు అని దేవుడు చెప్పాడు. ఇది కూడా ఒక ఆత్మీయమైన నియమమే.
మన ఆలోచన చూస్తే, సూపర్నేచురల్ అంటే దాని అంతట అదే జరిగిపోతుంది అని అనుకుంటారు. ఏలియా జీవితము చూస్తే, ఒక కాకితో ఆహారము సమకూర్చబడింది. మరొక సారి సారెఫతు విధవరాలిద్వారా ఆహారము సమకూర్చబడింది. ఇదే సూపర్నేచురల్. దేవుడు నిలబెట్టకుండా మన అంతట మనము నిలబడలేము. దేవుడు వీలు కలగచేయకుండా మనము ఏమీ పొందలేము, అనుభవించలేము. అందుకే పౌలు చెప్పిన మాటల ప్రకారము “నేనేమై ఉన్నానో అది ప్రభువు కృపవలననే” అన్నట్టుగా మనం సిద్ధపరచుకోవాలి.
దేవుని కృపను వివేచించే మనసు మనము కలిగిఉండాలి. అసలు అద్భుతం అంటే ఏమిటి? చిన్నదైనా పెద్దదైనా సరే మనకు ఊహకు అందనిది, మన వలన కానిది దేవుడు మాత్రమే చేసినది అది అద్భుతమే!
ఆశీర్వాదముగా ఉందువు అంటే ఆ మాటలలో అర్థము ఏమిటి? నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు అని అర్థము. అది దేవుని చిత్తము అయి ఉన్నది. ఆ దేవుని చిత్తమును నీవు గ్రహించినపుడు, ఆ చిత్తము చాల శక్తివంతమైనది అని నీవు గ్రహించగలుగుతావు.
యోసేపు తనకు చిన్నపుడు వచ్చిన కల దేవుని చిత్తము. ఆ చిత్తమును బట్టే, తాను సింహాసము మీద కూర్చుండగలిగినాడు. దేవుని చిత్తము యోసేపును దానికొరకు సిద్ధపరచింది. అలాగే నీవు ఆశీర్వాదముగా ఉండటము అనేది దేవుని చిత్తము. ఆవిధముగా ఉండుటము నిన్ను సిద్ధపరచేది ఆయన చిత్తమే. అందుకే మీ పరిస్థితులు చూడవద్దు, ఆయన చిత్తమునే చూడండి. యోసేపు జీవితములో జైలులోనికి వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోయినప్పటికీ, అక్కడినుండి సింహాసనముపై కూర్చుడుటకు, దేవుని చిత్తము అతనిని పకి లేపింది.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28
దేవుని చిత్తము వారికి తెలుసు కాబట్టే, “సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” అని చెప్పగలగుతున్నారు. అందుకే ఎటుబోయినను శ్రమ ఉన్నది అయినను మేము ఇరికించబడము అని పౌలు చెప్పగలుగుతున్నాడు.
ఎలా అయితే పౌలు యెరుషలేములో ఎలా అయితే సాక్ష్యమిచ్చాడో, అలాగే రోమాలో కూడా సాక్ష్యము ఇవ్వాలి అనేది దేవుని చిత్తము. అందుకే ఆ ఓడ పగిలిపోయినా, పాము కరిచినా పౌలును ఆటంకపరచలేదు. దేవుని చిత్తము మనకు మేలే గానీ హాని అనేది జరగదు.
మనము అందరనీ దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలపై ఆయనకు ఒక చిత్తము, ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. ఆ చిత్తమును బట్టి మనలను నడిపిస్తాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అనగా నీ జీవితములో ఏమి జరిగించేవాడుగా ఉన్నాడు అంటే, నీకు న్యాయము జరిగించాలి అనేదే ఆయన ఉద్దేశ్యము. గనుక యదార్థమైన హృదయముతో మనము దేవునిని ఆరాధించాలి.
రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.౹ -1 దినవృత్తాంతములు 29:10
ఇక్కడ దావీదు ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, మందిరము విషయములో ప్రజలు స్పందించిన రీతిని బట్టి సంతోషిస్తున్నాడు.
తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.౹ -1 దినవృత్తాంతములు 29:1
మన మందిరము యొక్క పని కూడా దేవునికే గనుక ఈ పని బహు గొప్పది. ఈ పనిలో ఏ పని ద్వారా చేయి వేసిన ప్రతీ ఒక్కరు కూడా గొప్ప పనిలో పాలు కలిగినవారై ఉనారు.
యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.౹ -1 దినవృత్తాంతములు 29:11-13
ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన మాత్రమే కలుగును. మన దేవుడు మనకొరకు సిద్ధపరుస్తాడు. అది ఐశ్వర్యమైనా, గొప్పతనమైనా సరే అది దేవుని వలననే కలుగుతుంది. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. అయితే నీవు లేమిలో ఉండాలి అనే ఆలోచన నీ దేవుని చిత్తములో ఉండనే ఉండదు. అయితే కొన్ని సార్లు నీను పరీక్షిస్తాడు నీ దేవుడు. ఉదాహరణకు, దేవుని పని కొరకు ధనము సిద్ధపరచిన తరువాత, అది దేవుని పనికి ఇవ్వడానికి వెనుకాడేవారిమిగా ఉంటాము.
ఎందుకంటే, సిరి లేదా ధనము అనేది దేవుని స్థానమును మన జీవితములో దొంగిలించేదిగా ఉంటుంది. అయితే దేవుని సత్యమును ఎరిగిన వాడు, ఈ అవకాశమును ధనమునకు ఇవ్వడు. మన దేవుడు మన ఆలోచనలను ఎరిగినవాడు గనుక ఆయన యందు భయము మనము కలిగి ఉండాలి. మన దేవుడు సమస్తమును ఏలువాడు గనుక, మన జీవితమును కూడా ఏలేవాడిగా ఉంటాడు.
దావీదు నష్టాన్ని చూసాడు, కష్టాన్ని చూసాడు, అలాగే దేవుని కృపను కూడా చూసినవాడు అయి ఉన్నాడు. అటువంటి అనుభవముతో దావీదు చెప్పుచున్న మాటలు – “ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే”. ఈ దినము నీవు ఏమైనా ఒక తలాంతు కలిగి ఉన్నావు అంటే దానికి కారణమే నీ దేవుడు.
నా జీవితమును ఏలువాడవు, నాకు ఐశ్వర్యమును గొప్పతనమును కలుగచేయువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. నన్ను హెచ్చించు వాడవు, నాకు బలము ఇచ్చువాడవును నీవే. నేను ఏ స్థితికి ఎదిగినా దానికి దేవుని కృప మాత్రమే. ఈ హృదయము మనము కలిగి ఉండాలి.
మంచి కాపరిని కలిగిన గొర్రెలు సమృద్ధి జీవమును పొందుకుంటాయి. ఆ కాపరి యొక్క శక్తిని, జ్ఞానమును, ప్రేమను కలిగి ఉంటాయి. అందుకే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టేవాడుగా ఉంటాడు. గొర్రెల కాపరి జీతగాడు అయితే సమయము వచ్చినప్పుడు గొర్రెలను వదిలి పారిపోతాడు.మంచి కాపరిని ఎలా గుర్తించాలి అంటే – మొట్టమొదట దేవుని యందు భయము అతడు కలిగి ఉండాలి.
ఆరాధన గీతము:
నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద
వారము కొరకైన వాక్యము
వాక్యము ఎంతో శక్తివంతమైనది. ఆ వాక్యములో ఉన్న శక్తి మృతమైనదానిని కూడా సజీవముగా చేయగలుగుతుంది, లేనిది కూడా ఉన్నట్టుగా చేయగలుగుతుంది. అందుకే దేవుని వాక్కు కొరకు మనము కాచుకొనేవారుగా మనము ఉండాలి. ఒక్క మాట ఆయన పలికితే చాలు ఆ మాట మన జీవితములను నిలబెడుతుంది.
ఏలియాను కాకుల ద్వారా పోషిస్తాను అని దేవుడు చెప్పాడు. ఉదయము సాయంత్రము పోషిస్తాను అని చెప్పాడు. ఉదయమున సూపర్నేచురల్ అలాగే రాత్రి కూడా సూపర్నేచురల్.
ఉదయమున నీ కళ్ళముందు జరిగించబడేది, రాత్రి అంటే నీవు నిద్రలో ఉంటావు అనగా నీ కళ్ళముందు జరిగేది నీకు కనబడదు. నా ప్రియులు నిద్రిస్తుండగా నేను వారికిచ్చెదను అని దేవుడు చెప్పుచున్నాడు.
మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. -కీర్తనలు 127:2
ఎర్రసముద్రము ఎదురుగా ఉన్నపుడు, మోషే దేవునికి మొర్రపెట్టగా నాకేల మొరపెట్టుచున్నావు, సాగిపొమ్ము అని దేవుడు చెప్పాడు. అప్పుడు సూపర్నేచురల్ గా మోషే దేవుని శక్తిని బట్టి కార్యము చేయగలిగాడు.
ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. -మార్కు 4:35-41
ఈ వాక్యములో సముద్రమును లోకముగా చూడవచ్చు. ఆ ఓడ మన జీవితము. ఈ లోకములో మన జీవితము ప్రయాణము కొనసాగించబడుతుండగా, అనేకమైన అలలవంటి పరిస్థితులు మన జీవితమును కొట్టుచున్నాయి. లోకములో మీకు శ్రమ కలుగును అని వాక్యము చెప్పుచున్నది. మన జీవితములో కూడా చిన్న చిన్న శ్రమలు వస్తుంటాయి, మనము వాటిని దాటుతుంటాము. అయితే ఒక పెద్ద శ్రమ కలగగానే, మనము కలవరపడేవారిగా ఉంటాము. అయితే మన జీవితములో యేసయ్య ఉన్నాడు. ఆయన అడుగుతున్న ప్రశ్న – “మీరు ఎందుకు భయపడుతున్నారు?”.
మన జీవితములో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, మనము భయపడవలసిన అవసరము లేదు. ఆ సందర్భములో శిష్యులతో పాటు యేసయ్య కూడా అదే ఓడలో ఉంటున్నాడు. అయినా సరే మీరెందుకు భయపడుతున్నారు అని ఆయన అంటున్నాడు అంటే, ఈయన ఏమై ఉన్నాడు? ఆ పరిస్థితిని జయించగలిగిన శక్తిమంతుడు గనుక ఎందుకు భయపడుతున్నావు అని యేసయ్య అడుగుచున్నాడు. అలాగే నీ జీవితములో కూడా నీకున్న పరిస్థితిని బట్టి నీవెందుకు భయపడుతున్నావు అని నిన్ను అడుగుతున్నాడు.
యేసయ్య ఉన్న చోట ఎండిన స్థితిలో జీవమే వచ్చింది గానీ, మరింత ఎండిన పరిస్థితిలోనికి వెళ్ళినవారు ఎవ్వరూ లేరు. నేను జీవము కలుగునట్లుగా, సమృద్ధి అయిన జీవము కలుగునట్లు వచ్చాను అని యేసయ్య చెప్పుచున్నాడు. అంటే యేసయ్య ఉన్న ఆ ఓడ ములిగిపోదు. అలాగే ఈ లోకములో పరిస్థితుల చేత కొట్టబడిన జీవితమైనా సరే, ఆ పరిస్థితిలో ములిగిపోయి ముగిసిపోయే జీవితము నీది కాదు. నీ ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి నీవు ఖచ్చితముగా ఆ పరిస్థితి దాటుతావు. అసలు యేసయ్య వచ్చిందే నశించిపోయినదానిని వెతికి రక్షించడానికే వచ్చాడు. నీ జీవితములో ఏ నాశనమైతే నీవు కలిగి ఉన్నావో, ఆ నాశనమునుండి నిన్ను రక్షించువాడు నీ యేశయ్య.
మనము ఉన్న పరిస్థితిలో భయపడటానికి కారణము ఏమిటి అని చూస్తే, మన ఆలోచనా విధానమే.
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు -యెషయా 43:2
జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును అంటే మనము ఎలా అర్థము చేసుకోవాలి? లోకములో నీ జీవితము కొనసాగించబడుతున్నపుడు, నేను నీకు తోడై ఉంటాను. అందుకే యేసయ్య – నేను నీకు తోడై ఉన్నాను గనుక నీవు భయపడకు.
సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.౹ -యెహోషువ 3:13
నీవు జలములలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అనే వాక్యము యోర్ధాను విషయములో నెరవేర్చిన దేవుడు మన దేవుడు. అంటే, శ్రమలు రావు అని దేవుడు చెప్పలేదు గానీ, ఆ శ్రమలు నిన్ను ముగించవు అని దేవుడు చెప్పుచున్నాడు.
ఇక్కడ నీళ్ళను పాదములు తాకాయి. అంటే లోకములో ఉన్న శ్రమ నిన్ను ముట్టవచ్చుగానీ, నీ మీద ఏలుబడి మాత్రము చేయలేదు. మన జీవితములో కూడా యేసయ్య ఉన్నాడు. ఆయన తోడై ఉన్న దానిని బట్టి మన జీవితము శ్రమలను చేత నాశనము అవ్వదు.
మన ఆలోచన మార్చబడవలసిన అవసరము ఉంది అని ప్రభువు జ్ఞాపకము చేస్తున్నాడు. ఏ పరిస్థితి అయినా సరే నేను దాటగలుగుతాను అని మనము సిద్ధపరచుకోవాలి.
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;౹ తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.౹ యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మర ణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.౹ -2 కొరింథీయులకు 4:8-10
ఇక్కడ వీరి ధైర్యము ఎంతో గొప్పదిగా కనబడుతున్నది. అలాగే మనము కూడా అదే ధైర్యమును కలిగి ఉండాలి. అలాగే మరొక ప్రశ్న యేసయ్య శిష్యులను అడుగుతున్నాడు – “మీరింకను నమ్మికలేక యున్నారా?”. అయితే ఏమి నమ్మిక ఉంచాలి? ఏమి ఆధారము చేసుకుని మనము నమ్మిక ఉంచాలి?
మన విశ్వాసమునకు ఆధారము ఏమిటి అంటే – మృతమైనదానిని జీవింపచేయగలిగినవాడు, లేని దానిని ఉన్నట్టుగా చేయగలుగువాడు అయిన మన దేవుడు అనేది మన ఆధారము. రేగుతున్న గాలిని బట్టి అలలు మరింతగా దోనెలోనికి వచ్చినపుడు, రక్షించడానికి ఏమీ లేనపుడు, అక్కడ రక్షణ కలుగుతుంది. ఎలా అంటే, ఆయన మాట చేత ఆ గాలిని గద్దించి నెమ్మది పరచాడు. మన జీవితములో కూడా దేవుని మాటను బట్టే రక్షణ మనకు కూడా కలుగుతుంది.
అందుకే మన ఆలోచన విధానమును మార్చుకోవాలి. నీవు యేసయ్యను అంగీకరించినదానినిబట్టి, మన జీవితము కోల్పోవడముగాని, మన జీవితము నాశనము అవడము గానీ, అసలు అవకాశము లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. మృతమైన దానిని జీవింపచేయువాడు, లేనిదానిని ఉన్నట్టుగా చేయువాడు అయినవాడు నీ దేవుడు.
అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. -మార్కు 4:39
దీని అర్థము, అసలు నీ దోనెలో నీరు రావటానికి ఏమి కారణమో దానిని గద్దించాడు. నీ జీవితములో కూడా నీ శ్రమకు ఏది కారణమో దానిని గద్దించేవాడు నీ దేవుడు అయి ఉన్నాడు.
మీరు ఇంకనూ గ్రహింపక యున్నారా? అని పరిసయ్యుల పులిపిండిని గూర్చి చెప్పినపుడు, రొట్టెల గూర్చియేమో అనుకొని ఆలోచిస్తున్న శిష్యులను గద్దిస్తున్నాడు. అంటే ఇక్కడ జీవితపు అవసరముల విషయములో కూడా యేసయ్య మనతో ఉన్నాడు. ముంచివేసే పరిస్థితులైనా యేసయ్య మనతో ఉన్నాడు. మనతో ఉన్న వాడు సమస్తముపై అధికారము కలిగినవాడు. గనుక ఆయనపై నమ్మిక ఉంచి ధైర్యముతో మన జీవితములో సాగుదాము.