స్తోత్రగీతము – 1
స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము
||యేసయ్య||
పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ
||యేసయ్య||
స్తోత్రగీతము – 2
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2)
||ఆరాధించెదము||
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు యేసయ్య
అద్వితీయ సత్య దేవుడు (2)
||ఆరాధన||
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య
మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2)
||ఆరాధన||
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య
ధరణిలోన గొప్ప దేవుడు (2)
||ఆరాధన||
ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషము ఉంటుంది అని లేఖనాలు మనకు తెలియ చేస్తున్నాయి.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. -కీర్తనలు 91:1
మహోన్నతుని చాటున నివసించేవారు విశ్రాంతి కలిగినవారుగా ఉంటారు. అందుకే ఆయన సన్నిధిలోనే ఎల్లప్పుడు ఉండటానికి సిద్ధపడి ఉండాలి.
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. -కీర్తనలు 91:2
ఇక్కడ కీర్తనాకారుని అనుభవము చూడగలము. మనము అందరమూ ఆయన సన్నిధిలో ఉంటున్నాము. ఆయన సన్నిధే మన ఆశ్రయము, మన కోటగా ఉంది. ఆయనను ఆశ్రయముగా గలిగినవారికి ఏ మేలు కొదువ కాదు. దేవుడు సిద్ధపరచిన ప్రతిమేలు పొందుకొని, మందిరపు సమృద్ధి వలన తృప్తి పరచబడతారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు వారిని ఆశీర్వదించునపుడు తన సన్నిధి యొక్క కాంతి వారికి కలుగులాగున ఆశీర్వదించమని దేవుడు లేవీయులకు నేర్పించారు.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;౹ యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;౹ యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లువారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను. -సంఖ్యాకాండము 6:24-26
అంతే కాక విశ్రాంతి కలుగులాగున నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. -మత్తయి 11:28
ఆయన సన్నిధిలో ఉండిన అనుభవము కలిగినవారు ఎంతో ధన్యులు.
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:4-5
మనము ఈ లోకములో దేవునికి వ్యతిరేకముగా తిరిగినప్పటికీ మనలను క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు.
దేవుడు ఏమై ఉన్నాడో అని మనము జ్ఞాపకము చేసుకుంటే
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. -కీర్తనలు 103:8-10
దేవుని ప్రేమ మనపై నిత్యము కోపించేది కాదు గానీ, దీర్ఘ శాంతము కలిగిన ప్రేమ. ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు కాబట్టే మనము కొనసాగించబడుతున్నాము.
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.౹ -యోవేలు 2:13
మన జీవితాలలో దేవుని ప్రేమ వెల్లడి పరచబడుతుంది. మనము ఆయనకు వ్యతిరేకముగా నడిచిన సందర్భములో మన జీవితములో కీడు సంభవించవలసినది. అయితే ఆ కీడు సంభవించకుండా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. అందుకే మన పెదాలతో కాక హృదయముతో మనము ఆయనను ఆరాధించాలి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. -కీర్తనలు 103:1-3
దేవుడు మనకు చేసిన గొప్ప ఉపకారము, మనము చేసిన పాపములను బట్టి, ఆయనను విడిచి తిరిగిన దానిబట్టి కలగవలసిన కీడు నుండి తప్పించడమే. మిగతా మేలులన్నీ దాని తరువాత మనకు కలిగేవి.
కృంగినవేళలో మన మనసులో కలిగే అనేకమైన ఆలోచనలన్నిటిలో కూడా మన దేవుని స్తుతించాలి అని కీర్తనా కారుడు తనకు తానే చెప్పుకుంటున్నాడు. అలాగే మనము కూడా మనమె వెళ్ళే ప్రతి నెగటివ్ పరిస్థితిలో సహితము దేవుని సన్నుతించే స్వభావము కలిగి ఉండాలి.
ఆరాధన గీతము
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||
మెయిన్ మెసేజ్
ఎమ్మాయి గ్రామములోనికి వెళుతున్న శిష్యులు యేసయ్య మాటలు వినబడుతున్నప్పుడు “హృదయము మండలేదా” అని అనుకున్నారు. దేవుని మాటలలోని శక్తిని మనము స్వీకరించినప్పుడు మన హృదయములు ఉత్తేజపరచబడతాము.
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. -యెషయా 66:13
మనము వెంబడించే దేవుడియొక్క లక్షణము, “ఆదరించుట”. గనుకనే మనలను ఆయన అనేక సందర్భాలలో ఆదరించేవాడుగా ఉన్నాడు. మరిన్ని లక్షణములు గమనిస్తే, ఆయన క్షమించే హృదయము కలిగినవాడు, శక్తి కలిగినవాడు. ఆయన కలిగిన ఈ లక్షణములు మన జీవితములో నెరవేర్చబడి స్థిరపరచబడతాయి.
మనము వెళ్ళే కష్ట సందర్భములలో అనేకసార్లు మనుష్యుల దయ కోసము ఎదురుచూసేవారిగా ఉంటాము గానీ దేవుని దయ కొరకు కనిపెట్టేవారే ధన్యులు, వారు ఆదరించబడతారు.
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.౹ -2 కొరింథీయులకు 1:3
“సమస్తమైన ఆదరణ” అంటే నీవున్న కృంగిన పరిస్థితి ఎటువంటిది అయినా, ఆ ప్రతీ పరిస్థితిలో నిన్ను ఆదరించేవాడు. బాధ పంచుకుంటే ఆ బాధ భారము తీరుతుంది అని లోకములో అంటారు. అయితే అది దేవునితో పంచుకున్నవాడికే నిజమైన ఆదరణ కలుగుతుంది. హన్నా జీవితమును జ్ఞాపకము చేసుకుంటే, ఆమె వెళుతున్న అవమానకరమైన పరిస్థితిలో, తాను దేవుని సన్నిధిలోనే తన హృదయాన్ని కుమ్మరించింది, అనగా తన బాధను పంచుకుంది.
–సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,౹ ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.౹ ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని –ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.౹ -1 సమూయేలు 1:11-15
తాను దుఃఖపడటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో, తన శ్రమ ఎలా ఉందో అన్ని విషయాలు అన్నీ దేవుని సన్నిధిలో దేవునితో పంచుకుంది. అలాగే మనము కూడా మన ప్రతి పరిస్థితిలో ఆదరించగల దేవుని సన్నిధిలో మన హృదయము కుమ్మరించుకొనినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆదరిస్తాడు.
తల్లిలా ఆదరించేవాడు అని మనము చూసాము. తల్లి ప్రేమను గమనిస్తే, చిన్న పిల్లాడిని ఎత్తుకుని అన్నము తినిపిస్తూ ఉన్నప్పుడు వాడు ఏడుస్తూ ఉన్నప్పుడు, తల్లి ఏమి చెప్తుంది? దూరముగా ఉన్న చందమామ చూపించి వాడికి అన్నము తినిపిస్తుంది. మరొక సందర్భములో పిల్లవాడు పడిపోయాడు వాడికి గాయము అయింది. ఆ సందర్భములో వాడు ఏడుస్తున్నప్పుడు, వాడి గాయమును కట్టి, ఆ నొప్పి వాడు మరిచిపోయేలాగా, వాడిని నిద్రపుచ్చుతుంది. దేవుని ప్రేమ ఎలా ఉందో చూద్దాము.
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును -యెషయా 51:3
ఎలా అయితే పిల్లవాడు తల్లికి చెందినవాడో, సీయోను కూడా దేవుని పట్టణము అనగా దేవుడు నివసించు స్థలము. మనము కూడా, దేవుడు నివసించే స్థలమే కదా! అందుకే మన జీవితములో పాడైన స్థలములను అనగా ఎక్కడైతే మనము పాడైన పరిస్థితులలో ఉన్నామో ఆ ప్రతి పరిస్థితిలో మనలన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించువాడు. అరణ్యము అనగా ఏమి లేని స్థితి, అనగా సమస్తము పోగొట్టుకున్న స్థితి. మన జీవితములో అన్నీ పోగొట్టుకున్న స్థితినుండి సమస్తము కలిగిన స్థితిలోనికి మార్చి ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకే మనము దేవుడు మనలో నివసించులాగున మన జీవితములను సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే, నీలో నివసించే దేవుడు ఆదరించువాడు, శక్తిమంతుడు. కార్యము జరగమునుపు మనలను ఆదరిస్తాడు. అప్పుడు నీవున్న స్థితిలో ఆదరణపొంది, దేవుని కార్యము కొరకైన నిరీక్షణ కలిగి ఉండగలుగుతావు. అప్పుడు నీ జీవితములో ఖచ్చితముగా దేవుడు కార్యము చేస్తాడు.
మనము గమనించవలసిన ముఖ్యమైన విషయము. దేవుడు మనలో నివసించులాగున మనలను సిద్ధపరచుకోవాలి. ఏదైతే ఆయన నివాసము ఉండకుండా అడ్డుగా ఉన్నాయో, అవన్నీ వదిలిపెట్టి సిద్ధపరచుకోవాలి.
దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.౹ -2 కొరింథీయులకు 1:4
ఎటువంటి శ్రమ వచ్చినా సరే దేవుడు ఆదరిస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు ఆదరిస్తున్నాడు అని చూస్తే, దేవుని కలిగి జీవించే ఆయన విధానమును బట్టి.
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20
మనము కూడా ఆయన నివసించేవిధముగా మన జీవితమును సిద్దపరచుకుంటే, ఆయన మనలను ఆదరించేవాడుగా ఉంటాడు.
సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.౹ మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.౹ ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.౹ -2 కొరింథీయులకు 1:8-10
పౌలు మరియు శిష్యులు వెళ్ళిన సందర్భములో వారు చనిపోయే పరిస్థితి వచ్చింది. అనగా వారి జ్ఞానమును బట్టి చూస్తే వారు చనిపోవాల్సిందే. అయితే మృతులను సహితము లేపగలిగిన దేవుని యందే వారు నమ్మిక ఉంచారు. అనగా వారి జ్ఞానమును బట్టి కాక, వారిలో ఉన్న దేవుని జ్ఞానము బట్టి వారు నిరీక్షణ కలిగి వెళ్ళగలిగారు. వారి జీవితములో దేవుని కార్యము స్థిరపరచబడింది. వారే కాదు గానీ మన జీవితములో కూడా అటువంటి సాక్ష్యము దేవుని కొరకు ఇవ్వగలగాలి. దానికి మనము దేవుడు నివసించే స్థలముగా సిద్ధపరచుకోవాలి.