ఆరాధన వర్తమానము
ఈ దినమున మన అందరినీ తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే సమస్త ఘనత, మహిమ కలుగును గాక. గడచిన దినములు అన్నీ ప్రభువు యొక్క కృపయే సంతోషింపచేసింది. ఆ దేవుని కృపను బట్టే మనము ఈరోజున ఆయనను స్తుతించవలసి ఉంది. మన స్తుతికి కారణభూతుడు మన దేవుడే, అనగా మనము స్తుతించగలడానికి కారణము ఆయనే.
దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏ విధముగా మనము దేవుని సన్నిధికి వచ్చాము అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన సత్యము ఏమిటి అంటే – దేవుడు మనకు దేవుడు అయి ఉన్నాడు, మనము ఆయన బిడ్డలము అయి ఉన్నాము.
ఆయనను మనము దేవుడిగా స్వీకరించినపుడు, మనము ఆయనా యెడల సంపూర్ణమైన విశ్వాసమును కనపరచాలి. షద్రకు, మేషాకు అబెద్నగోల జీవితము ద్వారా సంపూర్ణమైన విశ్వాసము అనగా ఏమిటో మనము తెలుసుకోగలము. మా దేవుడు మమ్మలను రక్షించ సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా ఆయనే మాదేవుడు అనే సత్యముపై వారు నిలబడి సంపూర్ణ విశ్వాసమును కనపరచారు. వారి పరిస్థితి చంపివేయబడే పరిస్థితి. ఈ దినమున దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము అదే విశ్వాసమును కనపరచాలి.
మన వ్యక్తిగతమైన పరిస్థితులు ఆయనను ఆరాధించకుండా అడ్డుకుంటాయి. అయితే షద్రకు, మేషాకు అబెద్నగోలు మా దేవుని మాత్రమే మొక్కుతాము అని ఏ పరిస్థితినీ వారికి వారి దేవుడికీ మధ్య రానివ్వలేదు. మన జీవితములో దేవునికంటే మన పరిస్థితికో మరేదానికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అయితే మనము విశ్వాసములో వృద్ధికలిగి సత్యముపై నిలబడినపుడు అద్భుతము చూస్తాము.
మన ఆలోచన చూస్తే, అగ్నిగుండములో వేయబడకుండా ఉండే అద్భుతము కొరకు ఎదురుచూస్తాము, ఆశిస్తాము. అయితే మన దేవుడు తన నామమును మహిమపరచుకునేవాడుగా ఉన్నాడు. అగ్నిగుండములోనుండి సహితము రక్షించగల సమర్థుడు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించేసమయములో కత్తి పైకెత్తేవరకు దేవుడు మాట్లాడలేదు గానీ చివరి క్షణములో దేవుడు అబ్రహామా అని పిలిచి తన నమ్మకత్వమును కనపరిచాడు.
దేవుడు మన అందరి గురించి మాట్లాడేవాడిగా ఉంటాడు. దేవుని ఆత్మ ద్వారా దేవుడే మనకు బయలుపరచేవాడుగా ఉంటాడు. ఆయన సన్నిధిలో విడుదల అయ్యే ప్రతిమాటా మనలను స్థిరపరుస్తుంది, విడుదల చేస్తుంది. దేవుని సన్నిధిలో మనము మౌనముగా ఉంటే మన ఆత్మీయ స్థితి ఏమిటో మనకు తెలిసిపోతుంది.
నీ ఆత్మ జీవింపచేయబడాలి అంటే వాక్యమే ఆధారము, ఆహారము అయి ఉన్నది గనుక నిర్లక్ష్యము చేయవద్దు. జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ దేవుని రేమా వాక్యముతోనే నడిపించబడుతుంది గనుక వాక్యము ఎంతో ప్రాముఖ్యము.
పేతురూ నీవు వీరికంటే నన్ను ప్రేమిస్తున్నావా? అని యేసయ్య అడిగాడు. అనగా ఖచ్చితముగా ఎంతగా ఆత్మీయముగా మనము ఎదిగామో దేవుడు పరీక్షిస్తాడు. అలాగే ఫిలిప్పును కూడా 5000మందికి భోజనము పెట్టవలసిన సమయములో పరీక్షించాడు. అలాగే మనము కూడా ఎంతవరకు మనము ఎదిగామో ఖచ్చితముగా పరీక్షిస్తాడు.
ఆత్మీయముగా ఎదిగిన మనము శ్రమలనుబట్టి ఆరాధించకుండా ఉన్నపుడు, ఆత్మీయముగా ఎదగని స్థితిలో ఉన్న వారితో ఇంక మనకు తేడా ఏమీ ఉండదు. పేతురు అందరి శిష్యులకంటే ముందుగా ప్రభువుకు స్పందించేవాడుగా ఉన్నాడు. ఆత్మీయముగా మనము ఎదిగితే మనము క్రియలలో కనబడాలి. హాజరు కోసము కాదు గానీ, ఆరాధించడానికి ఆయన సన్నిధిలోనికి నేను వచ్చాను అనే సత్యము పై మనము నిలబడాలి. మన జీవితములో ప్రతి దానికీ ప్రభువు ఒక లెక్క రాస్తున్నాడు. నీ కన్నీటి బొట్టు సహితము ఒక బుడ్డిలో దాచబడుతుంది.
ఆత్మసంబంధమైన వారిగా కొనసాగించబడాలి అంటే మనకు వాక్యమే ఆధారము. దేవునిని ఆరాధించకుండా, ఆయనను వెంబడించకుండా అపవాది ఎలాగోలా తప్పించాలి అనే ఆలోచననే కలిగిఉంటాడు. గనుక ఈ సత్యము గ్రహించి, బుద్ధిపూర్వకముగా దేవునికొరకు నిలబడి, ఆయన సన్నిధిలో మౌనముగా ఉండకూడదు.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు – యెషయా 12:6
నీ మధ్య ఉన్న నీ దేవుడు ఘనుడై ఉన్నాడు. అంటే ఏ విధముగా ఆయన ఘనుడై ఉన్నాడు? నీ జీవితములో ఆయన ఘనుడై ఉన్నాడు. ఈ సత్యము నీవు గ్రహించగలిగితే అప్పుడు నీవు స్తుతించగలుగుతావు. ఇప్పుడు కొంచెములోనే ఉన్నా, కోల్పోయిన స్థితిలో ఉనా, నష్టములో ఉనా, నా జీవితములో నా దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన ఘనుడు గనుక నా జీవితము ఖచ్చితముగా మార్చబడుతుంది.
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా – యెషయా 45:18
భూమి నిరాకారముగా ఉండాలి అనేది దేవుని ఆలోచన కాదు. అయితే భూమి నిరాకారముగానే ఉన్నది. ఆ సమయములో నిరాకారముగా ఉన్న భూమిని సిద్ధపరచాడు. శూన్యముగా ఉన్న భూమిని సమస్తముతో నింపాడు. నీ జీవితమును, నా జీవితమును సృష్టించినది ఆయనే. మన జీవితము నిరాకారముగా ఉండటానికి, శూన్యముగా ఉండటానికీ ఆయన సృష్టించలేదు గానీ, మంచి ఆకారము కలిగి, సమస్త సమృద్ధిచేత నింపబడటానికి సృష్టించాడు. అయితే మనమున్న స్థితిలో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఉద్దేశ్యము ఏమిటో ఎరిగి నిలబడినపుడు, మనము మౌనముగా ఉండక, గొంతెత్తి స్తుతించేవారుగా ఉంటాము, మన స్తుతిని ఏ పరిస్థితీ అడ్డగించలేదు.
యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొంద కయునుందురు – యెషయా 45:17
ఈ మాటలు స్థిరపరచబడాలి అంటే, దేవుని కుమారునిగా, కుమార్తెగా మనము నిలబడి, కనపరచాలి. మన జీవితములో అన్నీ బాగా జరిగితే, దేవా నీవు గొప్పవాడివి అని అంటాము, ఒకవేళ మేలులు పొందకపోతే, ఏమి చేసాడు దేవుడు? అని ప్రశ్నించేవారిగా ఉంటాము. నా ప్రాణమా నాలో ఏల కృంగిఉన్నావు? నీ రక్షణ కర్త అయిన దేవునిని నమ్ముకొనుము అని దావీదు చెప్పినట్టు మనము కూడా నిలబడేవారిగా ఉండాలి.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు – యెషయా 12:2-3
ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు, ఆయన మనలను రక్షించేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము అని నమ్ముకొంటారో, వారికి ఖచ్చితముగా దేవుడు ఆధారముగా ఉంటాడు. ఆయన మనకు దేవుడై ఉండాలి, మనము ఆయనను నమ్మేవారిగా ఉండాలి అప్పుడు మనము ఆనందపడి దేవుడు చేయగల సమస్తము పొందుకోగలుగుతాము.
ఆరాధన గీతము
శుద్దుడా ఘనుడా రక్షకుడా
వారము కొరకైన వాక్యము
దేవుని వాక్కు వినబడే స్థలమున్నీ దీవించబడినవే. దేవుని వాక్కు వెలుగు అయి ఉన్నది గనుక, ఆ వాక్కును స్వీకరించినపుడు మన జీవితములో ఉన్న చీకటి పారద్రోలబడుతుంది.
ప్రభువైన యేసు ఈలోకములో ఉన్నపుడు, మనకు ఒక మాదిరిగా జీవించారు. యేసును వెంబడిస్తున్న శిష్యులను మాటిమాటికీ గమనిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఫిలిప్పును, పేతురును గూర్చి జ్ఞాపకము చేసుకున్నాము. అలాగే మనము కూడా ఆయనను వెంబడిస్తున్నాము గనుక ఆయన మన ఆత్మీయమైన జీవితము గూర్చిన విషయమును గమనించి పరీక్షించేవాడిగా ఉంటాడు.
ప్రభువు శిష్యులను అనేకసార్లు ప్రశ్నలు అడిగాడు, ఆ ప్రశ్నలే మనలను అడిగితే మన జవాబు ఏమిటి అనేది మనము తెలుసుకొని సిద్ధపడదాము.
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. – మత్తయి – 16:13-16
యేసయ్యను గూర్చి ప్రజలు ఏమి అనుకుంటున్నారు అని శిష్యులను అడిగినపుడు, వారు విన్నదానిని బట్టి రకరకములుగా జవాబు ఇచ్చారు. అప్పుడు మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. ఈరోజు అదే ప్రశ్న, అనేక సంవత్సరములుగా వెంబడిస్తున్న మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? పేతురైతే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాడు. ఈ సమాధానమును ప్రభువు అంగీకరించాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను – కొలస్సీ 1:16
యేసయ్యలో సర్వము దాచబడి ఉన్నవి. బుద్ధిజ్ఞాన సర్వసంపదలు ఆయన యందే ఉన్నవు. కొంతమంది బాప్తీస్మమిచ్చు యోహాను అనుకున్నారు. ఎందుకంటే, బాప్తీస్మమిచ్చు యోహాను ఏ సువార్త ప్రకటించాడో, అదే సువార్త ప్రకటించాడు. మరికొంతమంది ఏలియా అనుకున్నారు. ఎందుకంటే, సారెఫతు విధవరాలి ఇంటి వద్ద పిండి దినదినము పెరుగుతూ వచ్చింది. అలాగే యేసయ్య కూడా 5000 మందికి రొట్టెలు పంచిపెట్టాడు. మరికొంతమది హెచ్చరికలు చేసినదానిని బట్టి యిర్మీయాగా అనుకున్నారు.
అయితే పేతురు మాత్రము సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు చెప్పాడు. అనగా ఎదో ఒకటి కాదు గానీ, పాపములను క్షమించడానికి, బోధించడానికి, సృష్టించడానికీ, సమస్తమునకు ఆధికారము కలిగినవాడు అని గుర్తించాడు గనుక యేసయ్య ఆ సమాధానమును అంగీకరించాడు, పేతురుని ఆశీర్వదించాడు.
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను – గలతీయులకు 2:20
ప్రభువు పరిపూర్ణుడు అయి ఉన్నాడు. ఆ పరిపూర్ణుడైన వ్యక్తిని నీవు సంపూర్ణముగా తెలుసుకోవాలి. ఈ దినమున నీవు ఆ ప్రభువును ఎలా స్వీకరిస్తున్నావు? సంపూర్ణముగా స్వీకరిస్తున్నావా? లేక ఏదో ఒక విషయములోనే స్వీకరిస్తున్నావా?
మీరింకను గ్రహింపలేదా? – మత్తయి 16:9
ఈ ప్రశ్నను యేసయ్య శిష్యులను అడిగాడు. అదే ప్రశ్న మనలను అడిగితే, మన జవాబు ఏమిటి? “మీరింకను గ్రహింపలేదా?” అనే ప్రశ్నలో అర్థము ఏమిటి అంటే – ఇన్నిసార్లు అనుభవము అయినా సరే ఇంకా గ్రహించలేదా?
ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు–చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి – మత్తయి 16:5-7
వారి వద్ద రొట్టెలు లేనపుడు అనగా జీవము లేనపుడు, యేసయ్య అడిగిన ప్రశ్నకు, వారి స్థితిని మాత్రమే చూసి వారు ఆలోచించేవారిగా ఉంటున్నారు. అయితే అద్భుతము చేయగలవాడే వారి వద్ద ఉన్నపుడు జీవములేని స్థితిలో జీవము కలుగచేసేవాడుగా ఆయన ఉంటాడు అనే సత్యము వారు గ్రహించలేకపొయారు. అనుభవపూర్వకముగా అనేకమందికి యేసయ్య చేసిన అద్భుతములను చూసినవారు. అంతేకాక 5000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టిన యేసయ్య, రొట్టెలు లేని సమయములో శిష్యులకు సహితము ఇవ్వగలడు అనే సత్యము గ్రహించాలి అని యేసయ్య ఆశిస్తున్నాడు.
యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా – మత్తయి 16:8-10
దోనెలో వారు వచ్చినపుడు వారి వద్ద ఒక్క రొట్టే కూడా లేదు. ఒకవేళ వారు యేసయ్య ఏమి చేయగలడో గ్రహించి ఉంటే, శూన్యములో సమస్తము సృష్టించగల సమర్థుడు అనే అద్భుతమునకు సాక్షులుగా ఉండే అవకాశము పొందుకొనేవారు. వారు గ్రహించని కారణాన ఆ అవకాశము కోల్పోయారు. ఈ దినమున వేరేవారి జీవితములో ప్రభువు చేసిన అద్భుతమునకు సాక్ష్యము ఇచ్చిన నీవు, నీ పరిస్థితిలో సహితము ఆయన అద్భుతము చేయగల సమర్థుడు అని గ్రహించు.
అలాగే “వీరందరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని” అని పేతురును అడిగాడు. ఈ ప్రశ్న మనలను అడిగితే మన సమాధానము ఏమిటి? ఆయనను ప్రేమించేవాడు ఏమి చేస్తాడు? ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అంటే, అందరికంటే ఎక్కువగా ఆజ్ఞలను పాటించేవారిగా మనము ఉండాలి. అనగా ఆయన వాక్యము ప్రకారముగా మన జీవితమును సరిచేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అందరికంటే నిన్ను ప్రభువు ప్రేమిస్తునాడు గనుకనే ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు.
వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను – యోహాను 21:15
నీవే ఎరుగుదువు ప్రభువా అని పేతురు చెప్పుచున్నాడు. పేతురును ఎరిగినవాడు గనుక, యేసయ్య గొర్రెపిల్లలను మేపుము అని పేతురుతో చెప్పాడు. గొర్రెల మంద అనేది సంఘమును సూచిస్తుంది. గనుక దేవునినిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే, ఆయన సంఘము యొక్క విషయములలో బాధ్యత ఇస్తున్నాడు.
1. నీకు యేసయ్య ఎవరు? – ఈ జవాబుకు ఒక అధికారము ఇవ్వబడుతుంది.
2. నీవు యేసయ్యను గూర్చి గ్రహించావా? – ఈ జవాబుకు అద్భుతమును పొందుకుంటారు
3. నీవు అందరికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తునావా? – ఈ జవాబుకు దేవునికి సంబంధించిన దానిలో పాలు ఉంటుంది.