13-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీవు ప్రభువునకు కావలెను

స్తోత్ర గీతములు 

రాజుల రాజుల రాజు

హోసన్నా హోసన్నా

నజరేతువాడా యూదుల రాజా నీకే స్తోత్రం

ఆరాధన వర్తమానము

ఈ దినము యూదులకు ప్రత్యేకమైన పండుగ దినము. మనకు మాత్రము యేసయ్య మాత్రమే ప్రత్యేకమై ఉన్నాడు, ఆయన గూర్చిన సత్యమే మనకు ప్రత్యేకము.

మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి -యోహాను 12:12-13

ఇక్కడ జనులు యేసు ప్రభువును ఎదుర్కోవడానికి యెరుషలేముకు వెళ్ళారు, జయము జయము అని కేకలు వేస్తూ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకు వారు అలా వెళుతున్నారు అని ఆలోచిస్తే, అంతకు ముందే లాజరును మృతులలోనుండి సజీవుడుగా లేపిన యేసయ్యను చూడాలి అనే కోరిక వలనే.

ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన పేరట కూడుకుంటారో, వారి మధ్యలో ఉంటాను అని ఆయనే చెప్పాడు గనుక, ఇప్పుడు మనము కూడా ఆయనను ఎదుర్కోగలుగుతాము. మరణాన్ని లాజరు జీవితములో ఎదిరించిన వాడుగా ఉన్నాడు, అంతే కాక తానే మృతిపొంది తిరిగి లేచినవాడుగా యేసయ్య ఉన్నాడు. లాజరును మృతులలోనిండి లేపుట అనేది ఆయన మరణమునుండి తిరిగిలేచుటకు సాదృశ్యముగా మనము చూడవచ్చు.

–సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹ -యోహాను 12:14

ఇక్కడ యేసయ్య “నీ రాజు” అని గ్రహించడము ఎంతో ప్రాముఖ్యము. నీ రాజైన యేసయ్య మరణమునకు లోనైన లాజరును తన మహత్తు గల మాట, సజీవముగా చేసినవాడు. “రాజు” అంటే పరిపాల చేసేవాడు, అధికారము కలిగినవాడు, ఏలుబడి చేసేవాడు. యేసయ్య “నీ రాజు” గనుక, నీ జీవితమును పరిపాలించేవాడు, నీ జీవితములో అధికారము కలిగినవాడు, నీ జీవితమును ఏలేవాడు.

ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. -మత్తయి 1:21

లాజరును మరణమునుండి లేపుటలో మార్తగానీ, మరియగానీ విశ్వాసమును కనుపరచలేకపోయారు. అయినప్పటికీ యేసయ్య తనకు తానే లాజరును మరణమునుండి లేపినవాడుగా ఉన్నాడు.

యేసయ్య చనిపోకముందు ఆరురోజుల ముందు జనులు యెరూషలేములో ప్రభువును స్తుతించారు. అలాగే ఆయన పుట్టినప్పుడు కూడా దేవునికి స్తోత్రము చేసిన సత్యము మనము గ్రహించగలము. ఆయనను ఎదుర్కొన్న ప్రతీ ఒక్కరూ ఆయనను స్తుతించారు. గొర్రెల కాపరులు, జ్ఞానులు, యెరూషలేములో జనులు మరియు పరలోక సైన్యము అందరూ ఆయనను స్తుతించారు.

దేవుని ఆరాధించాలి అంటే సత్యము ఖచ్చితముగా మనము గ్రహించాలి. సత్యము గ్రహించకుండా మనము యదార్థముగా ఆరాధించలేము. లాజరు ఎలాగైతే సాక్షిగా ఉన్నాడో, మనము కూడా అలాగే మన రాజైన యేసయ్యకు సాక్షులుగా ఉందాము. ఈ దినము మనము నేర్చుకున్న సత్యము ఏమిటి అంటే, మన రాజైన యేసయ్య మనలను కూడా సాక్షులుగా నిలబెట్టడానికి మన మధ్యలో ఉన్నాడు.

గొర్రెల కాపరులకు దూత “మీ కొరకు రక్షకుడు పుట్టాడు” అని చెప్పినదానిని బట్టి, వారు విన్నదానిని బట్టి దేవునిని మహిమపరచిరి.

అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. -లూకా 2:20

ఇప్పుడు మన మధ్యలో ఉన్న “రాజు” గూర్చి చెప్పబడిన దానిని బట్టి ఆయనను ఎదుర్కోవాలి.

నీ జీవితములో మృతమైనదానిని సజీవముగా చేయగలిగినవాడు నీ రాజు. అయితే నీ ఆలోచనలు అనేకమైన అనుమానాలతో నిండి ఉన్నదేమో, అయితే నీవు విన్న సత్యమును నమ్మి ఈ దినము నీ రాజును ఎదుర్కొంటే, ఖచ్చితముగా నీవు విన్నదానినే చూసేవాడిగా నీవు ఉంటావు.

నీ జీవితములో మృతమైన దానిని సజీవముగా చేయగలవాడు నీ రాజైన యేసు ప్రభువు. ఆయన గూర్చిన నీవు విన్న సత్యమును బట్టి ఎదుర్కొని మహిమపరచినపుడు, నీవు ఆ సత్యమునకు సాక్షిగా ఉంటావు.

నీ రాజు నీకున్న అనుమానములన్నీ తీర్చేవాడిగా ఉన్నాడు. యెరూషలేములో కూడుకున్న జన సమూహములలో అనేకమైన రకములైన ఆలోచనలతో వచ్చినవారుగా ఉన్నారు. ఆయన లేపిన లాజరు ఎలా ఉన్నాడు? మరణమైన వాడిని లేపిన యేసయ్య ఎలా ఉన్నాడో, అసలు ఈ యేసయ్య ఎవరు? ఇది నిజమేనా? ఇలా అనేకమైన ఆలోచనలు. అయితే ఆయనను చూడగానే వారు హోసన్నా జయము అని స్తుతించారు.

ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹ -యోహాను 12:13-14

ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని చెప్పి, “సీయోను కుమారీ, భయపడకుము” అని చెప్పుచున్నారు. దాని అర్థము ఏమిటి అంటే, సీయోను దేవుని పట్టణము అయి ఉంది. ఇశ్రాయేలు అంటే దేవుని చేత ఏర్పరచుకోబడిన వారు లేదా దేవునికి సంబంధిన వారు. మానవ జీవితములో మరణ భయము కంటే మరే భయము లేదు. అటువంటి మరణమునే జయించినవాడుగా నీ రాజు ఉన్నాడు.

ఆరాధన గీతము

నీవే నన్నేలు రాజువు
నాకొరకు భూమి పైకి వచ్చావు
మరణమునే ఓడించిన నారాజువు
నిన్నే ఆరాధింతును

హోసన్నా హోసన్నా

వారము కొరకైన వాక్యము

తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. -మత్తయి 21:1-3

“ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను”, ఇది మనకు ముఖ్యమైన మాట.

ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. -మత్తయి 21:4-5

గాడిదను గూర్చి ఆలోచిస్తే, సమాజములో విలువలేని పశువు. ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. ఆ గాడిదను విప్పమని ప్రభువు చెప్పాడు. అలా విప్పుతున్న సమయములో, ఎవడైనా ఏమైనా అడ్డు చెప్తే, ఇది ప్రభువునకు కావలెను అని చెప్పమని ఆయన చెప్పాడు.

–మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.-లూకా 19:31

అంతే కాక, ఆ గాడిద మీద ఇంతవరకు ఎవరూ కూర్చోలేదు. ఇక్కడ చూస్తే, ప్రభువుకు కావాలి అని ప్రభువే చెప్పుచున్నాడు. అనగా విలువేలేని గాడిద ప్రభువుకు కావాలి అని ఎలా చెప్పాడో, అలాగే విలువ లేని మన జీవితములు ప్రభువుకు కావాలి అనే సత్యము మనము గ్రహించాలి.

గాడిద అనేది బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ గాడిద ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు, అయితే ఆ గాడిదను ప్రభువు ఎన్నిక చేసుకొన్నాడు. అలాగే నిన్నూ నన్నూ కూడా మనకున్న అర్హతను బట్టి ఎన్నుకోలేదు గానీ, తన అనాది కాల సంకల్పము చొప్పున జరిగింది.

ఒక గాడిగను గూర్చి ఆలోచిస్తే, దానిని ఎవరూ తలచుకోరు, అది కూడా ప్రత్యేకమైన శుభసందర్భములో అస్సలు జ్ఞాపకము చేసుకోరు. గానీ ఈ దినము వేల సంవత్సరములు గడిచినా సరే ఆ గాడిదను ప్రతీ మట్టల ఆదివారము జ్ఞాపకము చేసుకొంటున్నాము అంటే, అది కేవలము అది ప్రభువును బట్టియే!

ఈ దినము ప్రభువు నీతో చెప్పుచున్నాడు – “నీవు నాకు కావాలి”. ఈ సత్యము నీవు గ్రహిస్తే, ఒకప్పుడు నీవు ఎలా ఉన్నా సరే, ఇప్పుడు ప్రభువుకు ప్రయోజనకరము అయినవాడవు. పౌలు ఒనేసిము గూర్చి కూడా ఇటువంటి సాక్ష్యము చెప్పాడు.

నీ జీవితము నిష్ప్రయోజనమైనది కాదు గానీ, ప్రభువు నిన్ను ఎన్నుకొన్న సత్యము కారణము చేత, నీవు ఎంతో ప్రయోజనకరమైనవాడవు.

అక్కడ కట్టబడిన గాడిదను చూస్తే, అది కట్టబడే ఉన్నది. అది పుట్టీనప్పటినుండి, ప్రభువు పలికేవరకు బంధించబడే ఉంది. అనగా దానికి విడుదల కలుగునట్లుగా ఒక దినము నిర్ణయించబడింది. అలాగే మనము కూడా ఎన్నిక చేయబడినవారమే గనుక మన జీవితములో విడుదల పొందుకోవడానికి ప్రభువు ఒక దినము నిర్ణయించాడు.

అపవాది మనకు యజమానిగా ఉండునట్లుగా మనమే అనేకమైన విషయాలలో లొంగిపోయి బంధించబడి ఉన్నాము. గనుక ఆ అపవాది అధికారము మన జీవితములో కనపరచబడుతుంది. మరలా ఆ కట్టబడిన గాడిదను జ్ఞాపకము చేసుకొంటే, ఇద్దరు శిష్యులు వెళ్ళి ఆ గాడిదను విప్పుచుండగా ఎవరైనా ఏమైనా అడిగితే, ప్రభువునకు కావాలి అని చెప్పితే చాలు, వారే ప్రభువు కొరకు తోలిపెడతారు. దాని అర్థము ఏమిటి అంటే, నీవు ప్రభువునకు కావాలి గనుక, నిన్ను అడ్డగించే ఏ పరిస్థితి వచ్చినా, ఏ మనుష్యుడు వచ్చినా, నీవు ప్రభువునకు కావాలి అనే సత్యము ప్రకటించి నిలబడితే, ఖచ్చితముగా నీ బంధకములు విడిపించబడతాయి, అడ్డులు తొలగిపోతాయి.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30

నీవు ప్రభువు పని కొరకు నిర్ణయించబడ్డావు, గనుక నీ జీవితములో విడుదల జరగవలసినదే! నీవు ఎంత భయంకరమైన తాళ్ళ చేత బంధించబడినా సరే, నీ విడుదల ఆగదు. ఈ దినము నీవు గ్రహించవలసిన సత్యము ఒకటే – “నీవు ప్రభువునకు కావాలి”.

శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి. -మత్తయి 21:6-8

ఇక్కడ కట్టబడిన గాడిదను విడిపించి ప్రభువు వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ప్రభువు ఆ గాడిద పై కూర్చుండగా, ఆ గాడిద నడుస్తుంది. అలాగే ప్రభువు చేత ఏర్పరచుకోబడ్డాము అనే సత్యము మనము ఎరిగితే విడుదల చేయబడతాము. అప్పుడు ప్రభువు మనలో నివసించేవాడుగా ఉంటాడు. అప్పుడు ఆయన శక్తి మనలో కనపరచబడుతుంది.

గాడిదపై యేసయ్య కూర్చుని నడుస్తుండగా, జనులు దారి పొడుగునా వారి వారి బట్టలు పరిచారు. దాని అర్థము ఏమిటి అంటే ఆ బట్టలు శ్రమలకు సూచనగా ఉన్నాయి. వారు దారి పొడుగునా పరుస్తున్నారు అంతే, వారి జీవితములోని శ్రమ నీలో ఉన్న ప్రభువును బట్టి విడుదల అయేదిగా ఉంటుంది. నీవు నమ్మి నిలబడిన సత్యము విషయములో, నిన్ను ప్రభువే నిరూపిస్తాడు, సాక్షిగా నిలబెడతాడు.