యేసే గొప్ప దేవుడు
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||
మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
నా ప్రాణమా.. నీకే వందనం
నా ప్రాణమా.. నీకే వందనం
నా స్నేహమా.. నీకే స్తోత్రము (2)
నినునే క్రీర్తింతును మనసారా థ్యానింతును (2)
హాల్లెలూయ హాల్లెలూయ హాల్లెలూయ
హాల్లెలూయ హాల్లెలూయ నా యేసయ్య || నా ప్రాణమా||
1. సర్వ భూమికి మహరాజా – నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా – నీవే పరిశుద్దుడా (2)
సమస్తభుజనుల స్తొత్రములపై ఆసీనుడా (2)
మోకరిచి ప్రణుతింతును (2)
|| హాల్లెలూయ హాల్లెలూయ ||
2. మహిమ గలిగిన లోకములో – నీవే రారాజువు
నీ మహిమతో నను నింపిన – సర్వశక్తుడవు (2)
వేవేల దుతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా (2)
మోకరిచి ప్రణుతింతును(2)
|| హాల్లెలూయ హాల్లెలూయ ||
|| నా ప్రాణమా||
పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా
పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసవయ్య
కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
1. బంగారం కోరలేదు వెండియు కోరలేదు
హృదయాన్ని కొరవయ్య ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు
హృదయాన్ని అడిగావయ్య నేవెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
2. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య.
ఆరాధన వర్తమానం
దేవుని సన్నిధిలో మనము ఉండగలుగులాగున మన దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. దేవుని ప్రేమను మనము వెల్లడిపరచాలి అంటే కేవలము ఆ ప్రేమను రుచిచూచినప్పుడే మనము వెల్లడిపరచగలము. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన స్థితులు పరిస్థితులు ఉంటాయి అయితే వారి వారి పరిస్థితులలోనుండే దేవుడు వారితో మాట్లాడే వాడుగా ఉన్నాడు. ఈ విషయము అనుభవపూర్వకముగా ఎరిగినవాడు ఖచ్చితముగా దేవుని ప్రేమనుగూర్చి ప్రకటించి, స్తుతించి ఆరాధించగలుగుతారు.
గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి – కీర్తన 24:7
గుమ్మములు అనగా ప్రవేశించడానికి ఏర్పాటుచేయబడినవి. పడిపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్నాసరే ఇప్పుడు మహిమ గల రాజు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు గనుక చేర్చుకోవడనికి సిద్ధపడండి అని అర్థము.
మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు. – కీర్తన 24:8-10
ఈ మహిమ గల రాజు ఎవరు అంటే,
1. బలశౌర్యములు కల యెహోవా
2. యుద్ధశూరుడూఇన యెహోవా
3. సైన్యములకు అధిపతి అయిన యెహోవా
మన ప్రభువు ఎక్కడ నివసిస్తాడు అని ఆలోచిస్తే నీ హృదయములోనే. అయితే నీ జీవితములోనికి దేవుడు ప్రవేశించగలుగునట్లు ఏర్పరిచిన గుమ్మము నీ హృదయమే. అయితే ఈరోజు నీ హృదయము పడిపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు సిద్ధపరుచుకో. ఆ మహిమగల రాజు యుద్ధశూరుడుగా ప్రవేశిస్తున్నాడు. యెందుకు అంటే, ఏ పరిస్థితి చేత నీ హృదయము పడిపోయిన స్థితిలో ఉందో ఆ స్థితిమీద నీకు విజయము దయచేయడానికి. బలశౌర్యములు కలవాడుగా వస్తున్నాడు ఎందుకంటే నీ స్థితిలో నీకు బలము దయచేయడానికి.
వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయం కాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను – సంఖ్యాకాండము 9:15
మన పితరుల దినాలలో చూస్తే ప్రత్యక్షగుడారము దేవుని మందిరముగా ఉన్నది. వారి అరణ్యప్రయాణములో దేవుని సన్నిధిని వారితో ఉంచుటకు ప్రభువు ఏర్పాటు చేసిన మందిరము. ఆ మందిరముపై ఒక మేఘము కమ్ముకొనగా దేవుడు వారితో మాట్లాడేవాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూడలేదుగానీ, ఎప్పుడైతే ప్రత్యక్షగుడారముపై మేఘము కమ్ముకొన్నదో దేవుని సన్నిధిని గ్రహించగలిగేవారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తుండగా దేవుని సన్నిధిని గ్రహించగలుగునట్లుగా మనకు కూడా అవకాశము ఉన్నది. వాక్య ప్రకారము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడుకుంటారో వారి మధ్య ప్రభువు ఉంటారు అని మనకు తెలుసు. అయితే ఆ ప్రత్యక్షత మరియు ప్రసన్నత అనుభవము సంఘమంతా కలిగిఉండాలి.
ఇప్పుడు మన హృదయమే దేవుని మందిరము అని తెలుసుకొన్నాము. మన పితరుల దినములలో మందిరముమీద అగ్ని వంటి ఆకారము సాయంకాలము మొదలుకొను ఉదయము వరకు ఉండెను అని వ్రాయబడి ఉన్నది. మన హృదయములో కూడా దేవుని ఆత్మచేత నింపబడిన పరిస్థితులలో మనము ఉండాలి. ఎప్పుడైతే చేతులెత్తి మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆత్మానుభవములు మనము పొందగలుగుతాము. నీవు గుర్తించగలుగులాగున దేవుడు తనను ప్రత్యక్షపరచుకుంటాడు.
నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి, యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. – సంఖ్యాకాండము 9:16-18
దేవుని యొక్క నోటి మాటవలన ఇశ్రాయేలీయుల ప్రయాణము సాగింది అని మనము గ్రహించగలము. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటావో, దేవుని వాక్కు నీకు విడుదల అవుతుంది. ఆ వాక్కు నీ జీవిత ప్రయాణము కొరకైనదిగా ఉంటుంది. ఆ విడుదలైన దేవుని నోటి మాట ప్రకారము నీ జీవితాన్ని ప్రయాణము సాగించేవారిగా మనము ఉండాలి. ఆ మహిమగల రాజు నీ జీవితములో ప్రవేశించినట్టయితే నీ జీవితమంతా సంతోషముతో, ఆనందముతో మరియు సమాధానముతో నింపబడి ఉంటుంది. ఆయన ఉన్నచోట ఆయన స్తుతింపబడులాగున ఆ స్థలము మార్చబడుతుంది. ఇటువంటి అనుభవములోనికి మనమందరము రావాలి. ఆ అనుభవముతో దేవుని స్తుతించులాగున దేవుడు మనకు సహాయము చేయును గాక.
ఆరాధన గీతము
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2) ||మహిమా||
కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో (2) ||మహిమా||
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా||
Main Message | మెయిన్ మెసేజ్
దేవుడు ఎవరితో ఉంటాడో వారి జీవితములు జయకరమైన జీవితములుగా ఉంటాయి. మరి మనము ఏమి చేస్తే మన జీవితములు జయకరముగా ఉంటాయో ఈరోజు మనము తెలుసుకుందాము.
ద్వితీయోపదేశకాండములో గనుక చూస్తే, దేవుడు ఇలా అంటున్నాడు, “నా ఆజ్ఞల ప్రకారము నడుచుకోండి. ఇదే కదా నిన్ను అడుగుతున్నాను”. మనము పెద్ద పెద్ద బరువులు మోయనక్కరలేదు కానీ ప్రభువు ఆజ్ఞలప్రకారము నడుచుకొనుటమాత్రమే చాలు. ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడము కొరకే మనము సృష్టించబడ్డాము.
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము – ఎఫెసీ 2:10.
ఏది సత్క్రియ అని మనకు ఎలా తెలుస్తుంది? కేవలము దేవుని వాక్యమే తెలియచేస్తుంది. మనము మంచి అనుకునే మన జ్ఞానానుసారమైన క్రియలు మురికి గుడ్డలు అని వాక్యము చెప్పుచున్నది. దేవుని లేఖనములద్వారానే మనకు ఏది మంచి అని తెలుస్తుంది కనుక దేవుని వాక్యము ప్రకారము చెయ్యడమే సత్క్రియలు చెయ్యడము. అలా కాని యెడల మనము విడిచిపెట్టబడేవారముగా అయిపోతాము.
ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను – తీతు 2:14.
ఆ కలువరి సిలువలో యేసయ్య చేసిన త్యాగము ఫలించాలి అంటే, ఖచ్చితముగా నీవు చెయ్యవలసినది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, సత్క్రియలయందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువు వాక్య ప్రకారము నా జీవితాన్ని కట్టుకోవాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమంది ఈ ఆసక్తిని సంఘములో ఇతరులు చూసేలాగున ప్రదర్శిస్తారు. అయితే ఇతరులు చూచులాగున కాదుగాని, నీకొరకు ప్రాణము పెట్టిన యేసయ్య కొరకు నీ జీవితము జీవించాలి. దేవుడు నీ కొరకు ఇచ్చిన వాక్యము ప్రకారము నీవు నడుచుకోవడానికి సిద్ధపడటమే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండటము.
కొంతమందిని గమనించినప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నప్పటికీ పాపము వారి జీవితాలను ఏలేదిగా ఉంటుంది. అలా ఎందుకు అంటే వారికి ఆసక్తి లేకపోవడం బట్టి. అయితే నీవు గనుక దేవుని వాక్కు నేను నెరవేర్చాలి అనే ఆసక్తి కలిగి ఉంటే, నీవు జయించలేని పాపమైనాకూడా దేవుడు నీ ఆసక్తిని బట్టి నీకు జయము అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎప్పటికప్పుడు నీ ఓటమిలలో నీ ప్రభువు దేనికొరకు ప్రాణము పెట్టాడో జ్ఞాపకము చేసుకోవటము ద్వారా తిరిగి సమకూర్చుకోగలుగుతావు. పౌలు కూడా అందుకే “నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని చెప్పగలుగుతున్నాడు. దేవుని కృప నీ కొరకే ఉంది అనే సత్యము ఎరిగి జీవించు. ఆరిపోయిన దీపము వలె మన జీవితము ఉండకూడదు. ఎక్కడైనా మనము ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? మనము ఆరిపోయిన స్థితిలో ఉండటానికి కాదు కానీ, వెలిగించబడి అనేకమైన వారికి వెలుగుగా ఉండుటకై నిన్ను ప్రభువు రక్షించుకున్నాడు. మన ప్రభువు సత్యవంతుడు, నిజమైనవాడు. నీకు గనుక ఆసక్తి ఉంటే ఆయన వాక్యము ప్రకారము చేసి అనుభవించు.
ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి – తీతు 3:8
ఏ సత్క్రియలైతే నీవు చేస్తున్నావో, అవి నీకు ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి అని వాక్యము చెప్పుచున్నది.
మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. ఆ దినములయందామె కాయిలాపడి చని పోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. – అపొస్తలుల కార్యములు 9:36-37.
తబిత సత్క్రియలు చేస్తూ తన జీవితము కొనసాగించుచున్నది. అయితే తాను రోగముచేత చనిపోయినది. తన శరీరమును భూస్థాపన చేయుటకొరకై సిద్ధపరచినారు. అయితే దేవుని కార్యమును చూద్దాము –
లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగితబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. – అపొస్తలుల కార్యములు 9:38-40.
నీ క్రియలు నీ వెంట వచ్చును. నీవు సత్క్రియలు గనుక చేస్తే అవే నీ వెంట వచ్చి నీకు ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. తబిత ఇంటికి పేతురు ఏ ఉద్దేశ్యముతో వెళ్ళాడో మనకు తెలియదు గానీ, తబిత చేసిన సత్క్రియలు ప్రకటించబడుతున్నప్పుడు పేతురు ద్వారా తబిత జీవము తిరిగి పొందుకొనులాగున పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా కార్యము జరిగించాడు. వాక్యము మనకు నేర్పిస్తున్న సందర్భములో మనము లోబడాలి.
శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. – లూకా 7: 3-5.
ఈ శతాధిపతి దేవుని ప్రజలను ప్రేమించి వారికొరకై ఒక సమాజమందిరమును కట్టించాడు. ఆయన చేసిన ఆ మంచి కార్యమును బట్టి మేలు పొందుటకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ఈ మేలు ఏమిటి అని చూస్తే, తన దాసుని జీవితములో జరిగిన అద్భుతము.
పాత నిబంధనలో మనము చూస్తే,
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను. – 2 రాజులు 4: 8-10.
అప్పుడు ఎలీషా ఎమంటున్నాడు అంటే,
అతడునీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామెనేను నా స్వజనులలో కాపురమున్నాననెను – 2 రాజులు 4:13.
ఆమె దేవుని మాటప్రకారము తాను జీవించడానికి సిద్ధపడింది. అందుకే దైవజనుడు అని తెలిసికొన్నది కనుక ఆయనను ఘనపరచింది. ఆమె చేసిన సత్క్రియలు ఆమెకు ప్రయోజనకరమైనవిగా మారి మూయబడిన తన గర్భము తెరువబడింది. నీవు చేసిన సత్క్రియల ఫలము నీవు పొందటానికి ఒక సమయము ఉంది. ఆ సమయము వచ్చినప్పుడు అద్భుతముగా నీ జీవితంలో మేలు ఖచ్చితముగా జరిగించబడుతుంది. తబిత జీవితములో చూస్తే తన ప్రాణము పోగొట్టుకుంది. ఈ షూనేమీయురాలు కొదువ కలిగి ఉన్నది. ఈ ఇద్దరి పరిస్థితులలో జీవము పొందుకున్నారు, కొదువ తీర్చబడింది. మనముకూడా వాక్య ప్రకారము మనము చెయ్యడానికి సిద్ధపడితే ఆ సత్క్రియలను బట్టి నీవు ప్రయోజనకరమైన మేలులను మనము పొందుకోగలుగుతాము.