12-05-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె

స్తోత్ర గీతము 2

ప్రేమ యేసయ్య ప్రేమా
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది

తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా

నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా

నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా

స్తోత్ర గీతము 3

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

సిలువలో నాకై – మరణించి
నా పై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యఆకాశములో
నన్ను కొనిపోవా రానైయున్న

యేషూవ

నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న

యేషూవ యేషూవ

ఆరాధన వర్తమానము

దేవుని స్తుతించుటకంటే గొప్పది, ప్రాముఖ్యమైనది మరేదీ మన జీవితములో లేదు. లోకములో ధనికుడు ఎవరు? అని ఆలోచిస్తే, సాధారణముగా ఎక్కువగా డబ్బు కలిగి, సౌకర్యములు కలిగి ఉన్నవారు ధనికుడుగా మనం భావిస్తాము. అయితే దేవుని కృప కలిగిన వారు నిజమైన ధనికుడుగా వాక్యము చెప్పుచున్నది.

లోకములో ఎంత శ్రేష్టమైనది కలిగి ఉన్నా దేవుని కృప లేనిదే ఏ మాత్రము ఉపయోగములేదు.

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. -కీర్తనలు 117:1

కృపద్వారా నూతమైన జన్మ మనము పొందియున్నాము. గనుక మన ఆరంభము కృపద్వారానే జరిగింది. గనుక మన జీవితము అంతా కూడా దేవుని కృపచేతనే నడిపించబడాలి.

అటువంటి కృప హెచ్చుగా ఉన్నది అని వాక్యము చెప్పుచున్నది. అప్పుడు ఏమి జరుగుతుంది.

యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. -విలాపవాక్యములు 3:22-23
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2

కృప మన యెడల హెచ్చుగా ఉంది. కృపను బట్టి మనము నిర్మూలము కాలేదు. కృప ప్రతీ ఉదయమును మనలను నడిపిస్తుంది.

మనము స్పృహలో ఉన్నపుడు, అనగా ఏమి జరుగుతుందో ఎరిగి ఉన్నపుడు ఉన్న స్థితిని ఉదయముగా పగలుగా మనము చూడవచ్చు.

ఉదాహరణకు ఒక అవసరత ఉంది అనే విషయము నీకు తెలుసు. అయితే ఆ అవసరత తీర్చబడుటకు నీ వద్ద వనరులు లేవు. అయితే కృప ఆ అవసరము తీర్చబడులాగున మార్గము తెరుస్తుంది.

అదే మనము సృహలో లేనపుడు, అంటే మనకు ఏమి జరుగుతుందో తెలియని స్థితిని మనము రాత్రిగా మనము చూడవచ్చు. అటువంటి స్థితిలో ఖచ్చితముగా దేవుని కృప నిలిచేదిగా ఉంటుంది.

ఆయన కృప ఉంది కాబట్టి నీవు నిర్మూలము కాదు, ఆయన విశ్వాస్యత ఉంది కాబట్టే మనము కొనసాగించబడుతున్నాము. పౌలు కూడా తన జీవితములో దేవుని కృపయే గొప్పది అని తాను తెలుసుకుని ప్రకటించాడు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో, అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు.

మనము కూడా వాక్యములోని లోతును ఆశతో కనుగొని, సారమును అనుభవించాలి. అప్పుడు మనము కూడా దేవుని కృపను అనుభవించి అదే సాక్ష్యము మనము కూడా ఇవ్వగలుగుతాము.

అలా ఉండాలి అంటే, మనము చదివిన వాక్యము మనము లోతుగా అర్థము చేసుకొనులాగున, దానిని అనుభవించులాగున మనము ప్రభువును మాటి మాటికీ మనము అడగాలి. అప్పుడు ఆ వాక్యము ప్రకారము మనము చేసి, ఆ కృపను అనుభవించగలుగుతాము.

కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 117:2

మన వ్యక్తిగతమైన జీవితములలో అన్యజనులవలే మనము కూడా ప్రవర్తిస్తాము. దేవుని గూర్చిన అనగా ఆయన ఏమి చేయగలడో, ఏమి జరిగించగలడో అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉంటాము. అయినా సరే అసలు జరగడానికి అవకాశమే లేని పరిస్థితులలో సహితము, దేవునిని స్తుతించాలి.

సర్వజనులారా అనే మాట చూస్తే, ఏమి జరుతుందో తెలిసినా తెలియకపోయినా, సాధ్యమైనా అసాధ్యమైనా ఏ పరిస్థితి అయినా సరే, ఆయనను కొనియాడమని వాక్యము సెలవిస్తుంది.

దైవజనుడి ప్రార్థనలో దేవుడు ఇచ్చిన పాఠము – నిర్మాణము జరుగుతున్న ప్రదేశములో ఉన్న విలువైన సామగ్రిని కప్పడానికి పెద్ద టార్పాలిన్ తో కప్పినప్పటికీ ఎదో ఒకటి సరిగా కప్పబడటం లేదు. దానికొరకు చింతపడుతున్న సమయములో దేవుడు చెప్పిన మాట, నీవు కృపను కప్పు అని ప్రభువు చెప్పడము జరిగింది. ఇలా ప్రభువు మాట ప్రకారము చేసినపుడు ఆయన విశ్వాస్యత అనుభవించడము జరిగింది.

ఒబెదేదోము ఇంటిలో మందసము ఉన్నపుడు ఆ ఇంటివారు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్న సమస్తము ఆశీర్వదించబడ్డాయి

ఆరాధన గీతము

నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో
నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును

మరణ స్థితిలో నే సంచరించగా
నీదు కృపతో జీవింపచేసావు
బలహీనుడనై నేనుండగా
నా బలమంతా నీవైతివే
నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును

 

వారము కొరకైన వాక్యము

స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.౹ -యోహాను 16:21

తల్లి యొక్క ప్రేమ ఎందుకు గొప్పది అంటే, ప్రసవ వేదన ఎంతో ఎక్కువ. దానికొరకు తన శక్తినంతా కూడగట్టుకొని ఆ నొప్పి భరించి తన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ సమయములో ప్రాణము కూడా పోయేంతగా శ్రమపడి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ పుట్టిన బిడ్డను చూడగానే పడినవేదన అంతా మర్చిపోతుంది.

అయితే అంతకంటే ఎక్కువైన ప్రేమ యేసయ్యది. తల్లి ప్రాణము పోయేంతగా శ్రమ అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే, యేసయ్య ప్రాణము పెట్టి మరీ మనలను తిరిగి జన్మించింపచేసిన ప్రేమ కలవాడు.

ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. -యెషయా 66:13

అనగా తల్లి ఖచ్చితముగా ఆదరిస్తుంది. యేసయ్య కూడా మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు. మనము ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ, తల్లి వద్ద ఉన్నప్పుడు మనము ఎంతో ఆదరణ కలిగి ఉంటాము. ఒక తల్లి మనసు ఎప్పూడూ తన పిల్లల మీదే ఉంటుంది. అలాగే యేసయ్య కూడా మనలను అలాగే ఆదరించేవాడిగా ఉంటాడు.

దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.౹ -2 కొరింథీయులకు 1:4

ఈ మాటలు నిజమా కాదా అని చూస్తే –

సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.౹ మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.౹ ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.౹ -2 కొరింథీయులకు 1:8-10

ఇక్కడ చూస్తే, మరణకరమైన స్థితిలో దేవుడు వారిని ఆదరించినవాడుగా ఉన్నాడు. వారి పరిస్థితి చూస్తే, ఇంక మరణము తప్పని పరిస్థితి. అయినప్పటికీ దేవుని ఆదరణ బట్టి, వారు తప్పించబడ్డారు.

ఉదాహరణకు పిల్లవాడికి దెబ్బ తగిలితే, ఆ తల్లి ఏమి చెప్తుంది అని చూస్తే, ఏమీ కాదురా అని దగ్గరకు తీసుకుంటే వాడు ఏడుపు ఆపివేసేవాడిగా ఉంటాడు. అయితే యేసయ్య ప్రేమ, ఆదరణ క్రియల ద్వారా కనపరచబడుతుంది.

తల్లి తన బిడ్డను చేర్చుకొనేది గా ఉంది. కోడిని చూస్తే, తన పిల్లలను కాపాడవలనెననే నిశ్చయతతో తన రెక్కలు చాపి తన పిల్లలను కాపాడుతుంది. అంతకు ముందువరకు ఒకవేళ కోపముగా ఉన్నప్పటికీ, తన పిల్లలు అపాయములో ఉన్నారు అని తెలిస్తే వెంటనే వారిని రక్షించుకోవడానికి సమస్తము చేసేదిగా ఉంటుంది.

యేసయ్య పృఎమను చూస్తే, ఆయన రక్తము మన కొరకు మొరపెడుతుంది. కాబట్టే మనము ఇంకా సజీవుల లెక్కలో ఉంటున్నాము. ఆయన ప్రేమ, నీ కష్టములో, నష్టములో విస్తరిస్తుంది.

అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి.౹ -1 థెస్సలొనీకయులకు 2:7
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును.౹ -ఫిలిప్పీయులకు 4:19

తల్లి తన బిడ్డలకు పాలిచ్చినపుడు తన బిడ్డను ముద్దుచేస్తుంది, వాడికి కంఫర్ట్ ఇస్తుంది. ఉదాహరణకు మనము మూడుపూటల వేర్వేరు ఆహారముల ద్వారా బలపరచబడతాము. అయితే చిన్న బిడ్డలకు అవసరమైన ప్రతీదీ తల్లి పాలనుండే వస్తుంది. అలాగే మనకు అవసరమైన సమస్తము కూడా యేసయ్యలోనే మనకు ఇవ్వబడుతుంది.

చిన్న పిల్లలను చూస్తే, వాడికి తల్లి పాలు తాగాలి అనే విషయము ఎవరూ నేర్పించక్కరలేదు. కానీ మరుజన పొందిన మనము యేసయ్యలోనే సమస్తము మనము ఉన్నవనే సత్యము గ్రహించలేనివారముగ ఉంటున్నాము.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. -యెషయా 49:15

అంటే స్త్రీ తాను జన్మనిచ్చిన బిడ్డను మర్చిపోనే మర్చిపోదు. ఒకవేళ వారైనా మర్చిపోతారేమో గానీ, నీ దేవుడు మాత్రము మర్చిపోనే మర్చిపోడు. తల్లిదండ్రులు పరిస్థితులను బట్టి మారతారేమో గానీ, యేసయ్య మాత్రం మారనివాడిగా ఉంటున్నాడు.

యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి మనకు నూతన జీవితమును ఇచ్చారు. అనగా ప్రాణమును పెట్టే సమయము లో ఏ బాధ ఉంటుందో ఎరిగినవాడుగా ఉన్నాడు. గనుకనే నీ ప్రాణము పోయే సమయములో ఆయన నిన్ను విడిచిపెట్టి ఉండలేదు.

అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. -యెషయా 49:14

కొన్ని సార్లు దేవుడు మనలను విడిచిపెట్టాడు అని అనుకుంటాము. అయితే ఈ వాక్యము అలా ఎన్నడు విడిచిపెట్టడు అనే సత్యమును జ్ఞాపకము చేస్తుంది.

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును -యెషయా 51:3

మన దేవుడు మనలను విడిచిపెట్టే వాడు కాదు. పాడైన స్థితిలో ఉన్న బాధనుండి విడిచిపెట్టడానికే ఇష్టము కలిగినవాడుగా నీ దేవుడూ ఉంటాడు.

చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి -యెషయా 49:16

అనగా దేవుని కళ్ళ యెదుటనే నీవు నీ జీవితము ఎల్లప్పుడు ఉన్నాయి, ఆయన నిన్ను మర్చిపోయేది లేనే లేదు. నీవున్న స్థితి నిరాశగా ఉంటే, నిన్ను ఆ స్థితిలోనే విడిచిపెట్టడు. పాడైన సీయోను స్థలములన్నీ ఎలా అయితే ఆదరించాడో, అలాగే మనలను కూడా విడిచిపెట్టక పాడైన పరిస్థితులను సరిచేసి, సకలము సమృద్ధిగా చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు.