12-03-2023 ఆదివారం మొదటి ఆరాధన

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/

1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/
కలవరాల కోటలో – కన్నీటి బాటలో /2/
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా /ఆనందం/

2. నిరంతరం నీవే వెలుగని – నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా /2/
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే /ఆనందం/

3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై /2/
లోకమహిమ చూడక – నీజాడను వీడక /2/
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం /ఆనందం

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||

కనుమరుగు చేయుదుననె వారెదుట

కనుమరుగు చేయుదుననె వారెదుట
ఎనలేని వృద్ధిచేయు దేవా
నిన్ను కనుమరుగు చేయుదుననె వారెదుట
ఎనలేని వృద్ధిచేయు దేవా
సరిచేయ జాలని నీ బ్రతుకు
సరిపరచ తానే వచ్చుచున్నాడు

ఓ.. ఓ.. సరిచేయును – స్థిర పరచును –
బలపరచి – పూర్ణుని చేయున్
నిన్ను సరిచేయును – స్థిర పరచును
బలపరచి – పూర్ణుని చేయున్
నిన్ను బలపరచి పూర్ణుని చేయున్

సరి సగ రిస , సరి సగ రిస , సపమ పమ నిదప,
గరి సరి సగ రిస , సరి సగ రిస , సపమ గరి సస,

1.అల్ప కాలం పాటు పొందిన శ్రమలన్ని –
మంచు వలె నీ యెదుట కరిగిపోవున్ (2)
నీ కష్టము నష్టము అన్నియును తీరున్ (2)
క్షేమములే నీ దరి చేరున్ ||ఓ.. ఓ.. సరి||

2.ఖ్యాతిని అణచివేయు కూటములు
అన్నియును యేసు నీ తోడని తలలు వంచున్ (2)
విరోధులు చేసిన గాయములు మానున్ (2)
నీ ఖ్యాతి నీ దరి చేరున్ ||ఓ.. ఓ.. సరి||

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచివాడై ఉన్నాడు! ఆ మంచి వానిని కలిగిన మనము ధన్యులము! సజీవుడైనవాడు మనలో నివాసముంటున్నాడు. మన వ్యక్తిగతమైన జీవితాలను మనము పరీక్షించుకున్నప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యము మన జీవితాలను స్వతంత్రులుగా చేస్తుంది.

మనకు ఇవ్వబడిన జీవితము మనది కాదు! మన ఇష్టములను నెరవేర్చుకోవడానికి, మన ఇష్టానుసారముగా జీవించడానికి ఈ జీవితము మనది కాదు. మనము చాలా సార్లు “నాది నా ఇష్టము” అని అంటాము. అయితే ఈ జీవితము ప్రభువుది అనే సత్యములో ఎవరు ఉంటారో వారి జీవితాలు మహిమకరముగా ఉంటాయి. అందుకే ప్రభువు చిత్తమే నాలో నెరవేర్చబడాలి, ప్రభువు ఇష్టమే నాలో నెరవేర్చబడాలి అనే ఆలోచన మనలో ఉండాలి. అప్పుడు మనలో “అహం” అనేది పనిచేయదు.

మనము దేవునిని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాము. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఉండాలి.

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ -రోమా 8:29

క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో, అదేవిధముగా నీవు ఉండునట్లు దేవుడు నిన్ను, నన్ను నిర్ణయించి ఏర్పరచుకున్నాడు. అలాగే ఈరోజు దేవుడిని ఆరాధించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన పనిలో పనివాడిగా ఉన్నాసరే అది మహా భాగ్యమే! ఆయన రాజ్యములో నిత్యము ఉండులాగున మనము ఎన్నికచేయబడ్డాము.

క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,౹ క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.౹ -ఎఫెసీయులకు 2:6-7

“కూర్చుండబెట్టెను” అనగా జరిగిపోయిన సంగతిని సూచిస్తుంది. పరలోకములో పరిశుద్ధులు మాత్రమే ఉండే చోటు. అటువంటి ప్రదేశములో నీకు నాకు చోటు దొరికింది. అందుకే మనము పరిశుద్ధముగా ఉండటానికి పిలువబడ్డాము. అయితే అపవాది కూడా మన పరిశుద్ధతను దెబ్బకొట్టడానికి యుక్తిగా ఉచ్చులు పన్నుతుంది.

“ఆయనతోకూడ లేపి” అనగా మనము బాప్తీస్మము తీసుకున్నప్పుడు అది “పుట్టుక”ను సూచిస్తుంది. అయితే మనము పరలోకములోనికి వెళ్ళేది “మనము చనిపోయిన తరువాత”. “రాబోవు యుగములలో” అనే వాక్యమును లోతుగా ఆలోచిస్తే బాల్య దశ, యవ్వన దశ, మధ్యవయస్సులో ఉన్న దశ, వృద్ధాప్య దశ అనే వాటిగా మనము చూడగలము.

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹ -ఎఫెసీయులకు 2:8

మనము ఆరాధించడానికి ఈ సత్యము చాలు. ఆయన నిన్ను నీవు పుట్టకముందే ఎన్నుకున్నాడు గనుకనే ఆయన కృప నిన్ను వెంబడించింది.

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ -యోహాను 1:16

దేవుడు పరిపూర్ణుడు అయిఉన్నాడు. ఆయన పరిపూర్ణత లోనుండి కృపద్వారా మనకు సమస్తము అనుగ్రహించబడుతుంది అని వ్రాయబడి ఉన్నది. ఆ కృప ఆయనలోనుండి “పరిపూర్ణతను” తీసుకువచ్చి మన జీవితములో స్థిరపరుస్తుంది.

ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. -కీర్తనలు 90:14

ఈ కృప ఎవరు ఎక్కువగా పొందుకుంటారు?

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2

దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము కలవారు ఈ కృపను ఎక్కువగా పొందుకుంటారు. కృప విస్తరిస్తుంది అంటే నా సంతోషము కూడా విస్తరిస్తుంది. అయితే దేవుని జ్ఞానమును అనుభవపూర్వకముగా యెరిగి ఉన్నావారు ఈ కృపను విస్తారముగా చూడగలుగుతారు. ఆత్మీయముగా బలముగా ఉన్నవాడు గొప్ప కార్యములు చూడగలుగుతాడు. శారీరకమైన సాధన కొంతమట్టుకే ప్రయోజనము కానీ ఆత్మీయమైన సాధన రాబోయే యుగమునకు కూడా ప్రయోజనము కలిగిస్తుంది.

అందుకే మన “క్యారెక్టర్” లో మార్పు రాకుండా ఎన్ని వాగ్దానములు ఉన్నాసరే అవన్నీ వ్యర్థమే! అయితే ఎప్పుడైతే నీవు అంగీకరించిన “సత్యము” బట్టి నీవు నీ “క్యారెక్టర్” ను సరిచేసుకుంటావో అప్పుడు నీ వాగ్దానములను నీవు సంపూర్ణముగా పొందుకుని, దినదినము అనుభవజ్ఞానములో వర్థిల్లుతావు. అందుకే దినదినమూ వాక్యములో నీవు ఎదగాలి. ఇంకా నీవు బలహీనతతోనే ఇంకా కొనసాగుతుంటే, దేవుని చిత్తము నీలో జరగకుండా నీవు ఆపేసుకుంటున్నావు. నీవు నిలబడి, ప్రయత్నము చేసి అప్పుడు సత్యము తెలుసుకో! దేవుని కృప నిన్ను నీ బలహీనతను జయింపచేయగలుగుతుంది. నీ జీవితము యొక్క విలువ నీకు ఎరిగితే దానిని జాగ్రత్తగా కాపాడుకుంటావు. మన జీవితము దేవుడు ఇచ్చిన బహుమానము. ఆ బహుమానము విలువ నీవు ఎరిగితే దానిని జాగ్రత్తగా కాపాడుకుంటావు. మనలను పరిమళవాసనగా ఉండుటకై ఎన్నుకున్నాడు.

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. -ఎఫెసీయులకు 2:10

“సత్‌క్రియలు” అనగా ఏమిటి? దేవుని వాక్య ప్రకారముగా చేయటమే! అందుకే మీ జీవితాన్ని దేవుని వాక్యము ద్వారా భద్రపరచుకోవాలి. అలాకాని యెడల మీ జీవితములు ప్రమాదములో పడతాము. అందుకే ఆయన కృపలో మన జీవితాలను కట్టుకుందాము.

ఆరాధన గీతము

నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును

శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)

ప్రేమతో ఇచ్చిన నా జీవితములో (2)

సిద్ధపరచి ఇచ్చిన నా జీవితములో (2)

సంపూర్ణ జీవము కలిగిన నాథా
నీవే నా నా ఆధారము
ఈ భువి లో నీవే నా ఆదరణ

నీవు కృపను మాత్రమే ఆధారము చేసుకుంటాను అని తీర్మానము తీసుకోగలిగితే, నీ జీవితములో అసంపూర్ణముగా ఉన్నది సంపూర్ణముగా చేయబడుతుంది అనే దేవుని వాక్కు నమ్మి స్వీకరిరించు

నమ్మి పలికి ఆరాధించు

వాక్యము ప్రకటించబడిన తరువాత వెనువెంటనే ప్రభువు తన కార్యములచేత ఆ వాక్యము స్థిరపరచబడుతుంది – ఇది సంఘముకొరకై దేవుని వాగ్దాన పూర్వక ఆశీర్వాదము

మెయిన్ మెసేజ్

దేవుడు ఇచ్చిన కృపను బట్టి 50 దినముల ఉపవాసము ముగించబడినది. ఖచ్చితముగా ప్రతీ ఉపవాసము తరువాత మార్పు అనేది ఉంటుంది.

వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. -మార్కు 16:20

శిష్యులు వాక్యమును ప్రకటించిన తరువాత, ప్రకటించబడిన వాక్యమును ప్రభువు స్థిరపరచుచూ ఉన్నాడు అని వాక్యము చెప్పుచున్నది.

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ -రోమా 8:29

నీ ధన్యత క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనను బట్టియే మీ జీవితములు ధన్యములుగా అవుతాయి.

మన శరీరము అనేది ఆత్మ నివసించడానికి ఇవ్వబడింది. ఆత్మ తృప్తి పరచబడాలి అంటే శరీరము సహకరించాలి. ఉదాహరణకు నీ కడుపు తృప్తి చెందాలి అంటే నీ చేతులు సహకరించాలి కదా! దీనిని బట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనే వాక్యము యొక్క అర్థము తెలుస్తుంది. అందుకే నీవు విన్న వాక్యమును “ఆమేన్” అనే మాట పలుకునట్లు “నోరు” సహకరిస్తే ఆ వాక్యము స్థిరపరచబడుతుంది.

“దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు” అనగా మనము మృతమైపోయాము కానీ క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అని అర్థము.

క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?౹ కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.౹ -రోమా 6:3-4

“మీరెరుగరా?” అంటే, ఏమి యెరిగి ఉండాలి? “క్రీస్తు పాపము నిమిత్తమై మరణములో పాతిపెట్టబడ్డాడు” గనుక ఆయన సారూప్యమును ధరించుకున్న మనము “ఆ పాపము విషయములో పాతిపెట్టబడాలి అనగా మరణించాలి”. అప్పుడు “జీవము కొరకై” తిరిగి జీవిస్తాము. అందుకే పౌలు చెప్తున్నాడు, “నేను కూడా సిలువ వేయబడ్డాను – లోకానికి, పాపానికి” అని.

నీవు నేను పాపము విషయములో మరణించవలసినదే, సిలువవేయబడవలసినదే. లోకమంతా అందముగా కనబడుతుంది గానీ అది మరణకరమైనది. ఆదాము తినవద్దన్న ఫలమును రోజూ చూసినప్పుడు అది రమ్యమైనదిగా కనబడలేదు అయితే ఎప్పుడైతే అపవాది ప్రేరేపించిందో అప్పుడు అది రమ్యముగా కనబడింది. అందుకే లోకమువైపు చూసి ఏ విషయముపై దృష్టి పెడతారో ఆ విషయముబట్టి దేవుని మహిమను కోల్పోయేవారిగా అయిపోతాము.

మరొక క్రీస్తు సారూప్యము, “విధేయత”. దేవుని మాటకు లోబడుట. పాపము విషయములో మన హృదయము మండాలి. యేసయ్య మాటలు విన్నప్పటికీ నేను ఎందుకు మారలేదు అనే కసి నీలో పెరగాలి. పౌరుషము కలిగి నిలబడటానికి ఇది చాల అవసరము. ని జీవితమును నీవే సిద్ధపరచుకోవాలి.

“నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు” అనగా ఏమిటి? కేవలము పొందుకోవడము మాత్రమే కాదు కానీ, దినదినమూ ఆ జీవములో నిలిచి కొనసాగునట్లు అని అర్థము. పాపము అనుమతిస్తే, జీవము పోగొట్టుకుంటాము. అయితే ఆ జీవములో నిలిచి ఉన్నప్పుడు ఆ జీవములోనూ వృద్ధి కలుగుతుంది. ఉదాహరణకు చిన్నపిల్లవాడిని చూస్తే, మొదట వాడు బలహీనముగా ఉంటాడు, ఆధారపడి ఉంటాడు అయితే ఎదిగే కొద్దీ, వాడిలో మార్పు వస్తుంది. అలాగే మనము కూడా, ఆ జీవములో నిలిచి ఉంటే, మన క్రియలలో మార్పు కనబడుతుంది.

యేసయ్య జీవితములో పాపమునకు ఎక్కడా కూడా లోబడలేదు. మరి ఆయన సారూప్యతను ధరించుకొనిన మనము కూడా అదే విధముగా నిలిచి ఉండాలి.

మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.౹ -రోమా 6:5

దీని అర్థము “క్రీస్తు నాలో జీవించుచున్నాడు” ఆయన జీవించిన విధానము నాలో కనబడుతుంది అని అర్థము.

ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.౹ చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.౹ మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.౹ -రోమా 6:6-8
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. -కొలొస్సయులకు 2:13

పాపవిముక్తి కొరకు వెల చెల్లించబడింది. అందుకే నీవు “ప్రాచీన స్వభావమును” సిలువ వేసిన జీవితమును జీవిస్తే, “పాపవిముక్తుడవు” అనే తీర్పు పొందుతావు.

మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:2

అవిధేయులు అనగా “మాట” విననివారు. అపవాది అధికారములో అనేకమైన దురాత్మలు పనిచేస్తాయి. మనలో ఉన్న “ప్రాచీన స్వభావము”, “అవిధేయత” ను బట్టి మనను పట్టి లోబరుచుకుంటాయి. అయితే, ఎప్పుడైతే మనము “ప్రాచీన స్వాభావము” విషయములో సిలువ వేలిసిన జీవితము జీవిస్తామో, అప్పుడు “ప్రాచీన స్వభావము” బట్టి నిన్ను లోబరుచునే అపవాదికి అవకాశము ఇవ్వవు. ప్రభువైన యేసు మనలను తిరిగి జన్మింపచేయబడటానికి ఆయన ప్రసవ వేదన పడ్డాడు.

మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.౹ -రోమా 6:8

చనిపోయినవాడి మీద మరణము ఇంక ఏలుబడి ఎలా చేయగలదు? పాపము విషయములో చనిపోయిన మనపై అధికారము ఇంక అపవాది ఇంక ఏలుబడి చేయలేదు.

అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. -రోమా 6:11

మనకు మనమే ఈ విధముగా సిద్ధపరచబడాలి. పాపము విషయములో మనము చనిపోయి, క్రీస్తు విషయమై జీవించాలి అనే తీర్మానము కలిగి జీవిచాలి.

నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹ నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹ -యోహాను 15:1-2

మన జీవితాలను ఫలించనియ్యకుండా పాపము అడ్డుగా వచ్చింది. ఇప్పుడు పాపము విషయములో చనిపోయినట్టయితే మనము మరి ఎక్కువగా ఫలించేవారిమి గా అవుతాము.