12-03-2023 ఆదివారం రెండవ ఆరాధన – దేవుడు మనకు తోడై ఉన్నాడు

ఆయనే నా సంగీతము బలమైన కోటయును

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
ప్రభురాకడలో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||

ఆరాధన వర్తమానము

మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, ఆమెన్! మన దేవుడు వంటి ఈ భూలోకములో లేరు. అటువంటి దేవునిని కలిగి ఉన్న మనము ధన్యులము.

యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. -కీర్తనలు 113:1-2

ఎందుకు ఆయనను స్తుతించాలి అని గమనిస్తే,

యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? -కీర్తనలు 113:4-5

దేవునితో సమానముగా దేనినీ చెయ్యలేదు. ఆయన స్థానమును ఎవరితోనూ దేనితోనూ పోల్చలేము. అందుకే ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించాలి. దానికొరకు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి.

ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 113:7-9

మన జీవితాలలో చూస్తే, మనలను పరిపాలించే రాజు మంచివాడైతే, ప్రజలకు అంతా మంచే జరిగుతుంది. అప్పుడు ఉన్న ప్రజలు ఎవరిని బట్టి ధైర్యము కలిగి ఉంటారు? వారికి ఉన్న రాజును బట్టే కదా? మరి మన దేవుడు మన జీవితాలను పరిపాలించేవాడు. ఆయన మంచివాడు మరియు సమస్తము కలిగి ఉన్నవాడు. ఈ భూలోకములో చూస్తే మంచి మనసు కలిగి ఉండీ, ఏమీ లేని వాడైతే, ఏమీ ప్రయోజనము చేకూర్చలేడు. అయితే నీ దేవుడిని చూస్తే, సమస్తము కలిగినవాడు. మరి నీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? “ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై”. అనగా దేవుని చిత్తములో మన స్థానము ఉన్నతమైన స్థానము. అయితే దానికొరకు “పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు”. యేసయ్యను అంగీకరించక మునుపు ఎందుకూ పనికి రానివే. పౌలు కూడా ఒనేసిము గూర్చి “మునుపు వీడు నిష్ప్రయోజనమైవాడే, అయితే ఇప్పుడు ప్రయోజకుడు” అని చెప్తున్నాడు.

తక్కువ స్థితిలో ఉన్నవాడు, పై స్థితికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉంటాడు. తక్కువ స్థితిలో ఉన్నవాడు, వాడి ఉద్యోగములో అత్యంత ఉన్నత స్థితికి వెళితే, వాడు పరిపూర్ణత సంపాదించాడు అని అనుకోవచ్చు!

నీ జీవితములో అన్నీ కలిగి ఉన్నావు కానీ ఒక్కటే లేదు. అప్పుడు నీవు అసంపూర్ణుడవే కదా!అయితే నీ దేవుడు పరిపూర్ణుడు కనుక నీవు సమస్తములోనూ పరిపూర్ణుడుగా ఉండాలి అనేది ఆయన చిత్తము. ఒక వ్యక్తి ప్రమోషన్ కొరకు ఒక మేనేజర్ తెలుసు, ఆయనను బట్టి నాకు ప్రమోషన్ వస్తుంది అని అనుకొంటే, అది వ్యర్థము. నీ జీవితములో ఎవరికి దేవుని మహిమ దొంగిలించబడే అవకాశము ఇవ్వడు.

తప్పిపోయిన కుమారుడు తండ్రికి నష్టము చేసాడు, వాడు నష్టపోయాడు. మనము కూడా అదే విధముగా ఉంటున్నాము అనేకమైన విషయాలలో. అయితే తండ్రి వదిలేసాడా? “తప్పిపోయిన ఈ నా కుమారుడు” అని కుమారుని స్థానమును కుమారునికే ఇస్తున్నాడు. ఈ లోకములో గొప్పవారిని కలవడానికి వెళుతున్నప్పుడు, మనకు కలిగినదానిలో మంచివాటిని ధరించి వెళతాము. ఎందుకంటే ఆయన స్థితి బట్టి నీవు సిద్ధపరచుకొంటావు. అలాగే రాజైన నీ ప్రభువు కొరకు నీ జీవితము కూడా ఆయన మహిమపరచే విధానములో సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే, నీ గుర్పింపు, “దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తే”.

క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,౹ క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.౹ -ఎఫెసీయులకు 2:6-7

క్రీస్తు పరలోకములో తండ్రి కుడిపార్శమున సింహాసనమందు కూర్చున్నాడు. ఆయనతోపాటు మనలను కూడా సింహాసనమందు కూర్చుండబెట్టడము ఆయన చిత్తము అయి ఉన్నది. నీ స్థితి నీవు ఎరిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన విషయములలో నీవు తగ్గించుకోవడము కాదు కానీ, దేవుని ఎదుట నీవు గర్వము లేక తగ్గించుకోవాలి.

యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాకవారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి -కీర్తనలు 149:4-6

నీ దీన స్థితిలో, దుఃఖపు స్థితిలో నీ దేవుడు ఎలా ఉంటాడో నీవు ఎరిగి ఉండాలి. ఎందుకంటే, ఆయన నిన్ను ప్రేమించేవాడు. అన్నీ మేలుకరముగానే జరగవు, కొన్ని నష్టములు కూడా జరుగుతాయి అయితే “ఆయ్న నిన్ను ప్రేమిస్తున్నాడు” అనే సంగతి నీవు ఎరిగి ఉండాలి. అప్పుడు ఏ పరిస్థితి అయినా కూడా నీవు దాటగలుగుతావు. పరలోకమునుండి భూలోకమునకు వచ్చి నిన్ను రక్షించుకోవడానికి ఒక మార్గము ఏర్పరచాడు. మన ఆత్మీయ జీవితము పరలోకపు ప్రభుత్వము అధికారమును బట్టి ముందుకు వెళుతుంది. అటువంటి పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు.

నీ దేవుడు ఎమై ఉన్నాడో ఎరిగి ఉంటే, యదార్థమైన భక్తి కనుపరచేవారుగా ఉంటావు. నీకు ఏమీ లేకపోయినా సరే దేవునికి స్తోత్రగానము చేస్తావు, సమస్తమూ కలిగి ఉన్నా కూడా స్తోత్రమును చేస్తావు. దావీదును గమనిస్తే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవునిని స్తుతించాడు. రాజు దగ్గరకు వచ్చినప్పుడు దేవునిని స్తుతించాడు. సైన్యములో చేర్చబడినప్పుడు దేవునిని స్తుతించాడు. రాజుగా ఉన్నప్పుడు కూడా దేవునిని స్తుతించాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవునిని స్తుతించేవాడుగా ఉన్నాడు. మనము కూడా అటువంటి స్థితిలో జీవించాలి. అప్పుడు మనముకూడా దేవుని హృదయానుసారులుగా ఉంటాము. అదే యదార్థమైన భక్తి.

ఆరాధన గీతము

నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2

ఎల్షడాయ్-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యేషువా -ఆరాధన

కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్షడాయ్ -ఆరాధన)

 

మెయిన్ మెసేజ్ | Main message

ఈ దినములు మనము వెలిగించబడి ప్రకాశించబడే దినములు. గిద్యోనును బయటకు తీసుకువచ్చిన దేవుడు నిన్ను కూడా తనకు మహిమ కలుగునట్లు బయటకు తీసుకొచ్చేవాడు. నీవున్న పడిపోయిన స్థితిలోనే దేవుడు తనకు మహిమ కలుగునట్లు నిన్ను నిలబెడతాడు. అప్పుడు చీకటిలో ఉన్నవారికి వెలుగుగా నీవుంటావు.

ఏ పునాది అయితే నీవు వేసావో, అదే పునాది పై నీవు నివసిస్తావు. అప్పుడు నీవు నీ నివాస స్థలమును వర్ణిస్తావు. నీవు కట్టేది ఆత్మీయ గృహము కనుక, నీతో నివసిస్తున్న దేవుని మహిమను వర్ణిస్తావు. అనగా నీవు చూడబోయే దినములు మహిమా దినములు. అయితే నీవు పాపములో ఉన్నప్పుడు సహితము దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు, నిన్ను సమకూర్చడానికి ఆయన కృప వెంబడిస్తుంది. ఆ ప్రకారము నీవు కృపను బట్టి మార్చుకుని కట్టబడుతుంటే, దేవుడు అనుగ్రహించు మహిమలో నీవు నివసిస్తావు.

దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ఎందుకు ఆయన తోడుగా ఉన్నాడు?

యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.౹ -ఆదికాండము 39:2

యోసేపును గమనిస్తే ఆయన చిన్నవాడు. అతని అన్నలు చాల పెద్దవారు.

యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.౹ -ఆదికాండము 37:2

మోషేకు తోడై ఉన్నట్టు యెహోషువకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు. యేసయ్యకు కూడా తోడై ఉన్నాడు

అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 3:2
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. -మత్తయి 1:22-23

“ఇమ్మానుయేలు” అనగా దేవుడు “మనకు” తోడై ఉన్నాడు. యేసయ్య ద్వారా దేవుడు నీకు నాకూ కూడా దేవుడు తోడై ఉన్నాడు. నికోదేము ఏమి చెప్తున్నాడు? దేవుడు తోడై ఉంటేనే కానీ ఈ గొప్పకార్యములు ఎవరూ చేయలేరు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా గొప్ప కార్యములు చేసారు. అలాగే నీవు కూడా, నేను కూడా గొప్ప కార్యములు చేయగలుగుతాము.

యోసేపును చూస్తే, అతడు చిన్నవాడు మరియు తండ్రి మిగతా అన్నలకంటే ఎక్కువగా ప్రేమించినవాడై ఉన్నాడు. అటువంటి సమయములో ఒక కలకన్నాడు యోసేపు.

అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.౹ అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.౹ అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి.౹ -ఆదికాండము 37:6-8

అప్పటికే తండ్రికి వారి గూర్చిన చెడ్డసమాచారము అందిస్తున్నాడని కోపము కలిగి ఉన్నారు అయితే కలను బట్టి మరింత పగ పెంచుకున్నారు.

అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి–నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు–మంచిదని అతనితో చెప్పెను.౹ అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.౹ -ఆదికాండము 37:13-14
అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి.౹ వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు; వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. -ఆదికాండము 37:18-20

యోసేపును చంపడానికి కారణము యోసేపునుకు వచ్చిన “కలలు”.

రూబేను ఆ మాట విని– మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.౹ -ఆదికాండము 37:21

కలను బట్టి యోసేపును చంపుదామనుకున్నారు. అయితే రూబేనును ద్వారా తప్పించబడ్డాడు.

అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.౹ -ఆదికాండము 37:26-27

ఇక్కడ కూడా కలను బట్టి చంపబడవలసిన యోసేపు, యూదా ద్వారా మరణమునుండి తప్పించబడ్డాడు. ఆ కల భావము మన అందరికీ తెలిసినదే అది “దేవుని చిత్తము”. అనగా “దేవుని చిత్తమును బట్టి” మరణమునుండి తప్పించబడ్డాడు.

ఇప్పుడు మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడూ అని చూస్తే, ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకువెళ్ళాలి. అది దేవుని చిత్తము అందుకే తోడై ఉన్నాడు. అలాగే మిగల్చబడిన వాగ్దానపు నెరవేర్పు కొరకు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే యేసు క్రీస్తును చూస్తే, “తన ప్రజలను తానే రక్షించునట్లు” దేవుని చిత్తము నెరవేర్చడానికి తోడై ఉన్నాడు.

దేవుని చిత్తము నీపై ఉంటే, నీకు వ్యతిరేకముగా కలిగే దురాలోచన నిలువదు. అపాయము ఉన్ననూ ఉపాయము లేని వారము కాదు అని పౌలు ఎందుకు చెప్పగలుగుతున్నాడు? దేవుని చిత్తము ప్రకారము పిలువబడ్డాడు.

దేవుని చిత్తములో ఉన్న నీవు అసాధారణమైనవాడవు, అసాధారణమైన దానివి. అందుకే నీ ఎదుటకు మరణము వచ్చినా సరే వెనుకకు వెళ్ళవలసినదే.

మరలా యోసేపు జీవితమును గమనిస్తే, మరణమునుండి తప్పించబడి అమ్మివేయబడి పోతీఫరు ఇంటికి వచ్చాడు.

యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను -ఆదికాండము 39:1-2

అయితే ఇక్కడ కూడా అన్యాయముగా ఒక నింద యోసేపును మరలా మింగడానికి ప్రయత్నిస్తుంది. యోసేపును కారాగారములో పడవేసారు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అయితే దేవుని చిత్తము ఉంది అని మర్చిపోకూడదు. ఈ చెరసాల అనుభవము సింహాసము వద్దకు తీసుకెళుతుంది. ఫరోకు వచ్చిన కల యొక్క భావము చెప్పగలిగే అవకాశము ద్వారా సింహాసనము వద్దకు తీసుకెళ్ళబడ్డాడు.

అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.౹ మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు.౹ నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో–చూడుము, ఐగుప్తు దేశ మంతటిమీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు–వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.మరియు ఫరో యోసేపుతో–ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.౹ -ఆదికాండము 41:38-44

మొదట మరణము, తరువాత అన్యాయము జరిగింది. అయితే పోతీఫరు ఇంటిలో అన్యాయము జరిగింది. అయితే వారికే న్యాయము విధించేవాడుగా యోసేపు చెయ్యబడ్డాడు. పోతిఫరు ఇంటివద్ద ఉన్నప్పుడు పోతిఫరు భార్య తప్ప మిగతా అన్నిటిమీద అధికారము కలిగినవాడుగా ఉన్నాడు. ఫరో వద్దకూడా, ఫరో సింహాసనము తప్ప మిగతా రాజ్యము అంతటా యోసేపు అధికారము కలిగినవాడుగా ఉన్నాడు. ఇలా దేవుని చిత్తము నెరవేర్చబడటానికి దేవుడు తోడై ఉన్నాడు. చివరికి ఏ కల అయితే యోసేపు కన్నాడో, అదే కల నెరవేరింది. అనగా దేవుని చిత్తము నెరవేరింది.

అందుకే నీవు నేను దేవుని చిత్తములో ఉన్నాము అనే సత్యము ఎరిగి జీవించాలి. అందుకే “పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడునట్లు, భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడును గాక” అని ప్రార్థన యేసయ్య నేర్పించాడు.

మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సిలువను గూర్చిన మాటలు చెప్పాడు. అయితే పౌలు సిలువలో ఏమి జరిగిందో చెప్పాడు. మొదటి దినము సమాధి చేయబడ్డాడు. రెండవ దినము చెరను చెరాగా పట్టుకుని పోయాడు అని పౌలే కదా చెప్పాడు. ఈరోజున దేవుని వాక్యము మర్మములు అనగా ఆయన చిత్తమును గూర్చిన మర్మములు మనకు తెలియచేయబడ్డాయి. అందుకే దేవుని చిత్తములో ఉన్నావు అనే సత్యము నీవు ఎరిగి ఉండుట ఎంతో ఆవశ్యకము. నా చిత్తాన్ని నేనే నెరవేర్చుకుంటాను అని దేవుడే చెప్పాడు కదా!

నీవు నడవలసిన మార్గమును నేను బోధించెదను, ఆ మార్గములో నేనే నడిపించెదను.