ఆరాధన వర్తమానము
ఆయన సన్నిధికి ఈ దినము మనలను నడిపించాడు. అయితే ఆయన సన్నిధికి ఎందునిమిత్తము మనలను నడిపించాడు అనేది మనము గ్రహించాలి. ఒక గొర్రెల మందను మనము చూస్తే, వాటి చుట్టూ ఒక కంచె వేసి ఒక దగ్గర పెట్టి వాటికి ఆహారము కాపరి సిద్ధపరుస్తాడు.
అలాగే ఈ దినము మనలను ఆయన సన్నిధిలో సమకూర్చిన దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఆ భోజనము, ఆహారము ఎందుకు ఇస్తున్నాడు అనే విషయము మనము అర్థము చేసుకోవాలి. నీ కాపరి మంచి కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెలకొరకు ప్రాణము సహితము పెట్టేవాడుగా ఉన్నాడు.
ఆహారము లేకపోతే గొర్రెలు బలహీనపడతాయి అనగా వాటి జీవము క్రమముగా సన్నగిల్లిపోతూ దినములు కొనసాగించుట కష్టమయ్యే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి. అలాగే ఈ దినము తన పరలోక మన్నాను ఇవ్వకపోతే మన జీవితము కొనసాగటము కష్టము అయ్యేదిగా ఉంటుంది. ఆ ఆహారము మనము సిద్ధపరచుకొనేది కాదు గానీ, మన ప్రభువే సిద్ధపరచే ఆహారము.
నీ జీవితము ఎందుకూ పనికిరాదు, నీ జీవితము ప్రయోజనకరమైనది కాదు అనే మాటలు ఎవరిద్వారా అయినా పలకబడుతున్నా, నీలో నీవే అలా అనుకుంటుంటే ప్రభువు చెప్పుచున్న మాట – “నీవు పనికిమాలినవాడవు కాదు, ప్రశస్తమైనవాడవు”.
వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితముగా నీ భక్తిశ్రద్ధలు కాపాడుకోవాలి. నిన్ను సాక్షిగా నిలబెట్టడమే సత్యము అయి ఉన్నది గనుక, నీవు ఏమాత్రము పనికిమాలిన వాడవు కాదు గానీ, ప్రశస్తమైనవాడవు. నీ జీవితము యొక్క సాక్ష్యము మార్చబడుతుంది. నీవు ప్రశస్తమైనవాడవు, ప్రయోజనకరమైనవాడవు, ప్రభువుకు కావలసినవాడవు, ఆమేన్! అటువంటి దేవుని ప్రేమను నీవు గ్రహిస్తే, నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును అని ఖచ్చితముగా చెప్పగలుగుతావు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ -యోహాను 3:16
తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు రెండు విషయములను అనుభవిస్తాడు. మొదటిది వాడికి నాశనము ఉండదు, వాడు నశించడు. రెండవది నిత్యజీవము అనే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము ప్రభువు ఇచ్చేది గానీ, మనకు మనమే చేసుకొనేది కాదు. యేసయ్యను నీవు విశ్వసిస్తే, ఈ రెండు విషయములు నీ జీవితములో జరగవలసినదే.
మొదట యేసయ్య రావాలి, ఆయనను మనము విశ్వసించాలి అప్పుడు నాశనము ఉండదు, నిత్యజీవము అనే ఆశీర్వాదము పొందుకుంటాడు. ఇది ఒక ఆత్మీయ నియమము
యేసయ్య రాకడ -> విశ్వసించుట -> విడుదల -> ఆశీర్వాదము
యేసయ్యను విశ్వసించుట అంటే ఏమిటి? “తానే తన ప్రజలను వారి పాపములనుండి రక్షించువాడు – మత్తయి 1:21”. గనుక యేసయ్య నా రక్షకుడు అనే సత్యము నీవు నమ్ముటయే విశ్వసించుట. అప్పుడు ఖచ్చితముగా నీ జీవితములో విడుదల పొందుకుంటున్నావు.
యేసయ్య నీ రక్షకుడు అని నీవు నమ్ముతున్నావు అంటే నీవు విడుదల పొందుకుంటున్నావు.
దేవుని మాటను ఒడిసి పట్టుకోవాలి. ఒకసారి ఈ సంగతి ఆలోచిస్తే, ఏదైన ఒకటి మన చేతిలోనుండి జారిపోతుంది అంటే ఎంతో ప్రయత్నము చేసి జారకుండా ఒడిసిపట్టుకుంటాము కదా, అలాగే, దేవుని మాటలు ఏ మాత్రము దూరము కాకుండా సిద్ధపడాలి.
విడుదల మరియు ఆశీర్వాదము రెండూ కలిసే ఉంటాయి. నీవు విడుదల పొందావు అంటే, నీ ఆశీర్వాదము ఖచ్చితమే!
పేతురును జ్ఞాపకము చేసుకొంటే, ప్రభువు నీళ్ళమీద నడుచుట చూసి, నీవే అయితే నేను కూడా వచ్చునట్లు సెలవిమ్మని అడిగాడు.
పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. -మత్తయి 14:28
“నీవే అయితే” అని పేతురు అడగటానికి కారణము ఏమిటి అని ధ్యానిస్తే, తన మొదటి అనుభవము ప్రకారము, యేసయ్య మాట సెలవిచ్చిన కారణముగా వలవేసి విస్తారముగా చేపలు పట్టాడు. గనుక యేసయ్యే అయితే ఆయన మాట ప్రకారము జరుగుతుంది అని విశ్వసించాడు.
ఆ అనుభవములో ఉన్నంత కాలము పేతురు రక్షించబడుతూనే వచ్చాడు. యేసయ్య ఏ మాట పలికాడో, ఆ మాటపై విశ్వాసముంచినంత కాలము, నీళ్ళపై నడవగలిగాడు. అయితే ఎప్పుడైతే తన విశ్వాసము సన్నగిల్లిందో, వెంటనే ములిగిపోయాడు. అందుకే విశ్వాసము అనేది ఎంతో ప్రాముఖ్యము.
యేసే నా రక్షకుడు అని విశ్వసించిన కాలమంతా, నీవు ఖచ్చితముగా విడుదల పొందుతావు, ఆశీర్వాదము పొందుతావు. అలా కాని యెడల, నీవు నష్టపోయేవాడివిగా ఉంటావు.
అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:10
యేసే నా రక్షకుడు అనే సత్యములో నీవు నిలబడి ఉండుటయే నీవు ఎరిగి ఉండుట. అదామును దేవుడు సృష్టించాడు. ఆ తరువాత ఆదాము ఏమి చెప్తే అది జరిగింది.
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.౹ -ఆదికాండము 1:28
దేవుని చేత సృష్టించబడిన ఆదాముకు అధికారము ఇవ్వబడింది. మనము కూడా దేవుని చేత సృష్టించబడ్డాము గనుక, మనకు కూడా అధికారము ఇవ్వబడింది. ఆదాము ముందుకు వచ్చిన దానికి ఏమి పేరు పెడితే ఆ పేరు స్థిరపరచబడింది. అలాగే ఆదాములోనుండి ఒక నూతనమైనదిగా హవ్వ వచ్చింది, తనకు కూడా ఆదాము ఏమి పేరు పెడితే ఆ పేరే స్థిరపరచబడింది.
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.౹ మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. -రోమా 8:37-38
“ఉన్నవియైనను” – ప్రస్తుతము నీముందున్నవి, “రాబోవునవియైనను” – తరువాత నీముందుకు రాబోవునవి. అయితే యేసయ్యను విశ్వసించినపుడు ఏమి జరుగుతుందో నీవు అనుభవపూర్వకముగా ఎరిగినపుడే ఈ అధికారమును నీవు అనుభవించగలుగుతావు.
మన జీవితములు కోల్పోయినవిగా ఉన్నపుడు, అనగా దేవుని చిత్తము ప్రకారము మహిమా జీవితములుగా ఉండవలసిన మన జీవితములు, పాపమును బట్టి మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్నపుడు, యేసయ్య ప్రేమను బట్టి నూతనముగా మార్చబడ్డాయి. అంతే కాదు గానీ, నీవు విశ్వాసముతో పలకగలిగే అధికారము నీకిచ్చాడు.
నీవు విశ్వాసముతో ఏ మాట అయితే ప్రకటిస్తున్నావో, దానిని పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షపరుస్తాడు. గనుక నేను ప్రశస్తమైనవాడను, ప్రయోజనకరమైనవాడను, ప్రభువుకు కావలసినవాడను అని ప్రకటించు! నీవున్న సమస్యలలో, నీవున్న నెగటివ్ పరిస్థితిలో విశ్వాసముతో ప్రకటించు.
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.౹ -ఆదికాండము 1:1-2
ఒక పరుగు పందెము జ్ఞాపకము చేసుకొంటే, అందరూ సిద్ధపడి ఉంటారు. “గో” అనే మాట వచ్చేవరకు అలాగే ఉంటారు అయితే ఆ మాట ఒక్కసారి రాగానే, వారు పరుగు మొదలుపెడతారు.
దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.౹ -ఆదికాండము 1:3
పరిశుద్దాత్మదేవుడు వెలుగు కలిగించడానికి సిద్ధముగానే ఉన్నాడు గానే, దేవుని నోటనుండి “కలుగును గాక” అనే మాట రాగానే, అక్కడ చీకటి తొలగించబడి వెలుగు కలిగింది. అలాగే నీవు యేసయ్య పై విశ్వాసముతో నీవు నీ పరిస్థితిలో ప్రకటించగానే, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయడము ప్రారంభిస్తాడు.
ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొంటే, ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా! తన ప్రేమను బట్టి అధికారము ఇచ్చాడు. గనుక మనము ఆయనను ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్
వారము కొరకైన వాక్యము
ఈ పరిశుద్ధమైన దినము ప్రభువు మనలను ప్రేమించి మనకిచ్చిన దినముగా ఉన్నది. ఈ దినమును ప్రభువు దినముగా మనము చూస్తాము. ప్రభువు అనుగ్రహించినదినముగా మనము దీనిని చూడవచ్చు. అందరికీ ఈ దినమును ప్రభువే అనుగ్రహించాడు గానీ, నీవైతే ఆయన స్వరము వినునట్లుగా ఆయన సన్నిధిలోనిన్ను సమకూర్చాడు. ఆయన నిర్ణయించినది ఈ దినము నీ కొరకు ఆయన ప్రకటించేవాడుగా ఉన్నాడు.
పేతురు నిర్ణయించబడ్డాడు కాబట్టే, ఆ దినమున పేతురు దోనెలోనే ప్రభువు కూర్చున్నాడు. అలాగే నీ జీవితము నిర్ణయించబడింది, ఆమేన్!
ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. -లూకా 5:2-3
ఈ దినము అందరికీ అనుగ్రహించబడింది గానీ నీకు ప్రత్యేకమైనది. నీవు అనాది కాల సంకల్పము చొప్పున ఏర్పరచబడ్డావు. యేసయ్య తన ప్రేమను క్రియలలో కనపరచాడు. అలాగే ఇప్పుడు మనము దేవుని యెడల ప్రేమను మన క్రియలలో కనపరచాలి. ఉత్సాహముగా ఇచ్చువారిని, ఉత్సాహము కనపరచువారిని ప్రభువు ప్రేమించువాడుగా ఉన్నాడు.
ఈ దినము అత్మీయముగా ఓడిపోయిన స్థితిలో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, నిరాశతో ఉన్నారో, వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని అనాదికాల సంకల్పము ప్రకారము నిర్ణయించబడిన నీ జీవితములో ఆయన చిత్తము నెరవేర్చడానికే ప్రభువు నీ జీవితములో ప్రవేశించాడు.
పేతురు దోనెలో ప్రభువు ఎక్కకమునుపు ఏమి జరుగుతుంది?
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, -లూకా 5:1
అనగా అక్కడ దేవుని వాక్యము యొక్క పరిచర్య జరుగుతుంది. అప్పుడు యేసయ్య అక్కడ రెండు దోనెలు చూసాడు. అందుకో ఒక దోనె ప్రభువు ఎన్నుకున్నాడు. అక్కడ ఉన్నవారికి అనగా జనసమూహములకు యేసయ్య వాక్యము బోధిస్తున్నాడు అనగా మాటలు ప్రకటించబడుతున్నాయి. అలా ప్రకటించుచుండగా, పేతురు దోనెను చూసాడు, ప్రవేశించాడు.
2024 లో కూడా ప్రభువు అనేకమైన మాటలు ప్రకటించాడు, ఈరోజు నీ జీవితములో దేవుని సంకల్పము నెరవేరునట్లు, నీ జీవితములో ప్రవేశించాడు. నీవు నిర్ణయించబడ్డావు అని నమ్ముతున్నావా? అయితే ఈ దినమే నీ జీవితములో దేవుని సంకల్పము ఆరంభించబడుతుంది.
యేసయ్య దోనెలు చూసినపుడు – “జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి”. అది వారి దైనందిన జీవితము అయి ఉన్నది. మన జీవితము కూడా ఒక పద్ధతిలో కొనసాగించబడుతుంది. ప్రతీ రోజూ ఒకేలా జరుగుతుంది, అయితే ఈ దినము ఒక ప్రత్యేకత కలిగి ఉంది.
ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. -లూకా 5:3
పేతురు ఎందుకు ప్రత్యేకముగా ఉన్నాడు అంటే, మొదట యేసయ్య ప్రజలకు మాటలు ప్రకటించాడు. ఆ తరువాత పేతురు దోనెలో ఎక్కి పేతురు సిద్ధపరచునట్లుగా తన మాటలు జనములకు ప్రకటిస్తున్నాడు. ఈ సిద్ధపాటును చూస్తే – మొదట పేతురును సిద్ధపరచుట తరువాత పేతురు ద్వారా అనేకులను సిద్ధపరచుట.
ప్రభువు మొదట నిన్ను సిద్ధపరుస్తాడు ఆ తరువాత నీ ద్వారా అనేకులను సిద్ధపరుస్తాడు.
ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. -లూకా 5:4-5
ఇక్కడ పేతురు యేసయ్యను సంబోధించిన విధానము చూస్తే, “ఏలినవాడా” అని పిలుస్తున్నాడు అంటే యేసయ్య బోధను విని ఎంతో కొంత గ్రహించి, ఏలినవానిగా ప్రభువును స్వీకరించినవాడుగా ఉన్నాడు.
దేవుని చిత్తము జరుగునట్లుగా నీ జీవితము సిద్ధపరచబడింది, అయితే అది నీ కొరకు మాత్రమే కాదుగానీ, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి.
ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా -లూకా 5:4
చేపలు దొరకలేదు అని పేతురు యేసయ్యతో చెప్పలేదు. అయితే పేతురు పరిస్థితి ఏమిటో ఎరిగినవాడై ఉన్నాడు. నీ జీవితములో కూడా అదే జరగబోతుంది. నీ జీవితమును మార్చడానికి యేసయ్య నీ జీవితములోనికి ప్రవేశించినవాడుగా ఉన్నాడు.
నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని” యేసయ్య పేతురుతో చెప్పాడు. అప్పుడు పేతురు తన పరిస్థితి గూర్చి చెప్పుచున్నాడు.
సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. -లూకా 5:5
నీ జీవితము కూడా ఎలా ఉందో, ఎంత శ్రమతో నిండి ఉందో, ఎంత నిరాశలో ఉన్నావో, ఎంత దుఃఖముతో నీవు నిండి ఉన్నావో ఎరిగినవాడుగా నీ ప్రభువు ఉన్నాడు. నీ జీవితములో ప్రవేశించిన ప్రభువు, నీ పరిస్థితుల విడుదల కొరకైన మార్గము నీకు చూపించేవాడిగా, సొల్యూషన్ ఇచ్చేవాడిగా ఉన్నాడు.
నీవు పనికిమాలినవాడవు కాదు గానీ ప్రభువు యొక్క పనికి కావలసినవాడవు
“నీవు దోనెను లోతునకు నడిపించి” అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా నీవు దేవుని గూర్చి తెలుసుకోవాలి, లోతైన ఆత్మీయత నీవు కలిగి ఉండాలి. ఆయనతో ఐక్యమయ్యే ఆత్మీయత నీవు వృద్ధిపరచుకోవాలి.
“రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు”, నీ జీవితములో ఇంతవరకు చేసిన ఉపవాసము, ప్రార్థన, చదివిన వాక్యము సరిపోదు, ఇంకా లోతుగా నాటబడాలి అని ప్రభువు చెప్పుచున్నాడు. అప్పుడు నీకొరకు సిద్ధపరచబడినది నీవు పొందుకుంటావు.
సమయము గడిచే కొద్దీ, నీవు జ్ఞాపకము చేసుకోవలసినది ఏమిటి అంటే నీకొరకు సిద్ధపరచినదానిని పొందుకోవటానికి నీవు దగ్గరవుతున్నావు.
“అయినను నీ మాటచొప్పున” అని పేతురు చెప్పి తాను తన దోనెను ముందుకు నడిపాడు. ఈ దినమున ప్రభువు మాట ప్రకారము నీవు నిలబడితే, ప్రభువు నీకొరకు సిద్ధపరచినది నీకొరకు ప్రత్యక్షపరచబడుతుంది. నీవు ఇంక శ్రమపడనవసరము లేదు.
విశ్వాసము అనేది ఒక ఉదాహరణగా చూస్తే, అన్నీ బాగా ఉన్నపుడు, నీ విశ్వాసమునకు అనుకూలముగా ఉన్నపుడు నీ విశ్వాసము బాగానే కనపరుస్తావు. అయితే లోతైన విశ్వాసము అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని శక్తిని బట్టి, మాటను బట్టి నిలబడే విశ్వాసము. అప్పుడు మనము కూడా “ఆలాగు చేసి” విస్తారమైన దీవనలు పొందుకొంటాను చెప్పగలుగుతాము.
వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. -లూకా 5:6-7
వారు ప్రభువు మాట ప్రకారము చేయగానే పేతురు విస్తారముగా దీవించబడ్డాడు. పేతురు జీవితములో “మనుష్యులను పట్టువాడుగా” దేవుని అనాదికాల సంకల్పము. పేతురు “సంజ్ఞలు” యొక్క అర్థము ఏమిటి అంటే ఆ అనాదికాల సంకల్పము నెరవేరునట్లుగా మనుష్యులను పిలిచుట. పేతురు గిన్నె నిండి పొర్లింది. ఈ దినము నీ జీవితము కూడా నిండి పొర్లిపోతుంది. నీ జీవితము దీవించబడునట్లుగా ఇప్పుడు ఆరంభించబడింది. గనుక నీవు లోతుగా నీ జీవితమును సిద్ధపరచుకో!