12-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతములు 

 

ఆరాధన వర్తమానము

ప్రభువు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! ఈ సమయము ప్రభువు మనకొరకు సిద్ధపరచిన సమయము. ఆయన ప్రతి దానికి సమయము నిర్ణయించాడు. ఈ సమయము దేవునిని స్తుతించడానికి, మహిమపరచబడటానికి నిర్ణయించబడింది. అయితే ఆయనను స్తుతించాలి అంటే, ఖచ్చితముగా నీవు ఆయన గూర్చిన సత్యము నీవు ఎరిగి ఉండాలి.

అసలు ఎందుకు దేవునిని స్తుతించాలి? మనలను సృష్టించాడు, రక్షించాడు, మనలను కొనసాగిస్తున్నాడు. ఇంకా ధ్యానిస్తే, ఆయన సృష్టించిన ప్రతి దానిపై దేవుని ఉద్దేశ్యము ఉంది. ఆయన ఉద్దేశ్యము మన జీవితములో నెరవేరబడటానికి ఇంకా మనలను సజీవులుగా ఉంచారు. ఈ దినము మనము స్తుతించడానికి కారణము ఏమిటి అంటే, ఆయన మన యెడల తన చిత్తము కలిగి ఉన్నాడు.

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ -యిర్మీయా 29:11

ఇంకా మనము భూమి మీద ఉన్నాము అంటే, రాబోవు కాలములో మనపై ఉన్న దేవుని ఉద్దేశ్యము కొరకే! ఆయన ఉద్దేశ్యములు హానికరమైనవి కాదు గానీ, మేలుకరమైనదె! ఆశీర్వాదకరమైన ఉద్దేశ్యము!

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనుండి బయలుదేరినప్పుడు సంతోషముగానే వచ్చారు. అయితే ఫరో చనిపోయినపుడు మాత్రము, కొత్త కీర్తన పాడి స్తుతించారు. బయలుదేరినప్పుడు కొంత సంతోషము ఉంది, అయితే రాబోవు కాలమందు మరి ఎక్కువ సంతోషము ఉంది. సంతోషమునుండి అధిక సంతోషమునకు దినదినము మనము నడిపించబడుతున్నాము.

వారైతే జరిగినదానిని బట్టి ప్రభువును స్తుతించారు. మనము మాత్రము వెలిచూపు వలన కాదు గానీ, విశ్వాసము చేత నమ్మి స్తుతిద్దాము! దేవుడు కలిగిన ఉద్దేశ్యమును ఖచ్చితముగా ఈ దినమే ఆరంభించేవాడుగా ఉన్నాడు.

దేవుడు తన చిత్తాన్ని తానే నెరవేర్చుకొనేవాడుగా ఉన్నాడు. అయితే మనము యదార్థమైన భక్తిని మనము కనపరచాలి. “నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును” అని ప్రభువు చెప్పినట్లుగా, ఆయన స్వరము ఏమి చెప్తుందో, ఆ ప్రకారమే మన జీవితమును సిద్ధపరచుకోవాలి, అప్పుడు ఆ సమాధానకరమైనది, ప్రయోజనకరమైనది నీవు చూడగలుగుతావు.

ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10

ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి ఆయనను వెంబడించువారు, మరొకటి ఆయనను వెంబడించని వారు. ఆయనను వెంబడించేవారు అంటే, ఆయన స్వరము లేదా ఆయన వాక్యము విని ఆ ప్రకారము జీవితమును సిద్ధపరచుకొనేవారు. వెంబడించని వారు అంటే, ఆయన స్వరము విని, లేదా వాక్యము విని ఆ ప్రకారము సిద్ధపడని వారు

ఎలీషాను పట్టుకోవడానికి శత్రువు సైన్యములు ఇంటిని చుట్టుముట్టినప్పుడు, పనివాడు మాత్రము సైన్యమును మాత్రమే చూసాడు. అయితే ఎలీషా మాత్రము పరలోక సైన్యమును చూసాడు.

అతడు–భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి –యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.౹ -2 రాజులు 6:16-17

ఎలీషాను ఏలియా పిలిచినపుడు, దేవుని పిలుపుగా అర్థం చేసుకొని, సిద్ధపడి వెంబడించాడు. గనుకనే లోకము చూడని లోతైన విషయములను, మండలములను, విషయములను చూసినవాడుగా ఉన్నాడు.

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:16-17

శిష్యులు యేసయ్యను వెంబడించారు గనుక వారు ఎరుగుదురు, చూచెదరు, పొందెదరు అని ప్రభువు చెప్పుచున్నారు. లోకమైతే ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; శిష్యులైతే ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.

నీవు ఆయనను చూచెదవు, గనుక ఆయనను ఎరిగెదవు. ఆయనను ఎరుగుదువు గనుక నీవు ఆయనను పొందెదవు.

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10

“వాటిని” అంటే, నీ కొరకు సిద్ధపరచినవి. నీ కొరకు సిద్ధపరచినదానిని నీవు చూచెదవు, అవి ఏమై ఉన్నవో, ఎటువంటివో నీవు ఎరిగెదవు, వాటిని నీవు రాబోవు దినములలో ఖచ్చితముగా పొందెదవు. వీటిని గూర్చి మనకు పరిశుద్ధాత్ముడు బయలుపరచేవాడుగా ఉన్నాడు. ఈ సత్యమును నమ్మి మనము ఆరాధిద్దాము!

ఆరాధన గీతము

నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును

 

వారము కొరకైన వాక్యము

ఈ 2025 ప్రత్యేకమైన సంవత్సరముగా మన జీవితములఓ ఉండబోతుంది. 2025 లో దేవుని వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మనము సిద్ధపడాలి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో, అవి అన్నీ క్రీస్తునందు ఔను అన్నట్టుగానే ఉన్నాయి. క్రీస్తును కలిగి ఉన్న ప్రతివారి జీవితములో, ప్రభువు చేసిన వాగ్దానములు నెరవేరబడవలసినదే. గనుక మన ప్రయాస క్రీస్తును కలిగిఉండటానికే అని ఉండాలి. పేతురు అంటున్నాడు – “మేము ఎక్కడికి వెళ్ళెదము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు”. అయితే ఎలా అంటున్నాడు?

సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ -యోహాను 6:68

“యెవనియొద్దకు” అని చూస్తే, ఇద్దరే ఇద్దరు మన ముందు ఉన్నారు. నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు ఒకరైతే, అపవాది మరొకరు. పేతురు యేసయ్య యొక్క మాట యొక్క శక్తిని అనుభవించాడు గనుకనే, నిన్నే వెంబడిస్తాను అని చెప్పగలుగుతున్నాడు.

క్రైస్తవ జీవితము అంటే, క్రీస్తు యొక్క అనుభవము కలిగిన జీవితము. క్రీస్తు లేకుండా క్రైస్తవ జీవితము కాదు!

దేవుని యొక్క వాగ్దానము స్వతంత్రించుకోవడానికి ఎలా మనము భక్తిని కనపరచాలి? ఎలా వెంబడించాలి అని ఈ దినము ప్రభువు నేర్పబోతున్నాడు. నీవు ముందుకే కొనసాగించబడాలి గానీ వెనుకకు మళ్ళకూడదు అనేది దేవుని చిత్తము. వాగ్దానము నెరవేర్చబడటము కొరకు ముందుకు కొనసాగించబడటము ఆపై సాక్షిగా నిలబడటము. వెనుకకు మళ్ళడము అంటే, వాగ్దానము గూర్చిన విశ్వాసము లేక పోగొట్టుకోవడం.

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹ మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹ -ఫిలిప్పీయులకు 2:5-8

దేవుని మాటకు లోబడినవాడిగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా తగ్గించుకున్నాడు గనుకనే –

అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. -ఫిలిప్పీయులకు 2:9-11

క్రీస్తు తనను తాను తగ్గించుకున్నందుకు దేవుడు ఆయనను హెచ్చించాడు. నీవు కూడా యేసయ్య మనసు ధరించినపుడు తగ్గించుకొనేవాడివిగా ఉంటావు. అప్పుడు నీవు కూడా సమయము వచ్చినపుడు హెచ్చించబడతావు.

యేసయ్య తండ్రి మాటకు విధేయత చూపించినవాడుగా ఉన్నాడు. అటువలెనే నీవు లోబడేవాడివిగా, లోబడే దానివిగా ఉండాలి. శిష్యులు క్రీస్తుతో కూడిన అనుభవము కలిగి ఉన్నారు గనుక, వారు ఇంక వెనుకకు చూడలేదు. యదార్థమైన భక్తి ఖచ్చితంగా ధైర్యము పుట్టిస్తుంది. యదార్థమైన భక్తి అంటే, అనుభవపూర్వకమైనది. ఆచారయుక్తమైన భక్తి భక్తే కాదు, అనుభవపూర్వకమైన భక్తి మాత్రమే యదార్థమైన, నిజమైన భక్తి!

షద్రకు, మేషాకు మరియు అబెద్నగోల భక్తి వారికి ధైర్యము పుట్టించింది. అందుకే వారు అగ్నిగుండములో వేసే సమయములో వారి భక్తిని చూపించారు. అటువంటి భక్తి కనపరచారు గనుకనే, వారు అద్భుతం చూడగలిగారు.

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2

మనము చేశ్తున్న భక్తికి కావలసినవాటిని అన్నింటినీ మనకు దయచేస్తున్నాడు. భక్తి అంటే ఆయనను వెంబడించడమే అని తెలుసుకున్నాము. గొర్రెలు కాపరిని వెంబడిస్తున్నదానిని బట్టి వాటికి కావలసిన వాటిని అన్నింటినీ ఆయన సమకూర్చేవాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా మనకు కావలసిన సమస్తము ఆయన మనకు దయచేసేవాడు అని నమ్మి మనము కూడా దేవునిని వెంబడిస్తున్నాము. గనుక, మనకు కావలసిన సమస్తము ఆయనే దయచేసేవాడుగా ఉన్నాడు. గనుకనే నీవు చూపించే యదార్థమైన భక్తిని బట్టి, నీకు కావలసినవి నీ దేవుడు నీకు ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు.

నీతిమంతులు, యదార్థవంతులు సింహమువలే ధైర్యముగా ఉంటారు. నీ భక్తి నీకు భౌతికముగాను, ఆత్మీయముగానూ కూడా ఆశీర్వాదకారణముగా ఉంటుంది.

ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి . యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.౹ -అపొస్తలుల కార్యములు 10:1

ఈ సాక్ష్యము మనము కూడా పొందుకోవాలి. ఈ కొర్నేలీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అనగా ఎల్లప్పుడు దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నీవు కూడా భక్తిపరుడుగా పిలువబడాలి అంటే, నీవు కూడా ఎల్లప్పుడూ దేవునితో సహవాసము చేయాలి. ప్రాక్టికల్ గా మనము దేవునిని వెంబడించాలి.

నీవు భక్తిపరుగా ఉండాలి నీవు నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రయాసపడుటకు ఇష్టము కలిగినవారిగా ఉండాలి. సాకులు చెప్పే జీవితమునకు స్వస్తి చెప్పాలి. నీ భక్తిని నీవు దేవునికి కనపరచాలి.

అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థనచేయు వాడు.౹ -అపొస్తలుల కార్యములు 10:2

దేవుని యెడల భక్తిని కనపరచాలి అంటే దేవుని భయము ఖచ్చితముగా కలిగి ఉండాలి.

పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అనిపిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.౹ అతడు దూతవైపు తేరి చూచి భయపడి–ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత–నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.౹ -అపొస్తలుల కార్యములు 10:3-4

ఖచ్చితముగా భక్తిపరుడి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నీ భక్తి నీ ప్రార్థనకు జవాబు తీసుకొస్తుంది. కొర్నేలీ ఇంటివారితో సహా భక్తిని కనపరచడమును బట్టి, దూత దిగిరావడము జరిగింది. అనగా దేవుని చేత దర్శించబడుతున్నాడు. ఏలియాను దూత దర్శించి, శక్తిని మించిన ప్రయాణము కొరకు సిద్ధపరచి, మరణము చూడకుండా కొనిపోబడ్డాడు.