11-06-2023 – ఆదివారం మొదటి ఆరాధన – కృప వెంబడి కృప

స్తోత్రగీతము – 1

నా ప్రాణమా.. నీకే వందనం
నా స్నేహమా.. నీకే స్తోత్రము (2)
నినునే కీర్తింతును మనసారా థ్యానింతును (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్య || నా ప్రాణమా||

సర్వ భూమికి మహరాజా -– నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా – నీవే పరిశుద్దుడా (2)
సమస్తభూజనుల స్తొత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రణుతింతును (2)
|| హల్లెలూయ హల్లెలూయ ||

మహిమ గలిగిన లోకములో – నీవే రారాజువు
నీ మహిమతో నను నింపిన – సర్వశక్తుడవు (2)
వేవేల దుతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రణుతింతును(2)
|| హల్లెలూయ హల్లెలూయ ||
|| నా ప్రాణమా||

స్తోత్రగీతము – 2

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం
అన్నింట ఘన నామం (2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)
యేసునందే సత్యం యేసులోనే
మార్గం యేసే నా నిత్యజీవము (2)

ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా (2)

ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)

యేసే రక్తమే జయం యేసు నామమే జయం
యేసునందే విజయం (2)

స్తోత్రగీతము – 3

నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను
నీతో నడవాలి – కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య

ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా – ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా

శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా – ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచి దేవుడు ఏలయనగా ప్రేమ కనికరములు గలిగిన వాడుగా మన జీవితములలో ఉన్నాడు. మన ఆరాధనలకు ఆయన అర్హుడు అయి ఉన్నాడు. మన ఆలోచనలను గమనిస్తే, దేవుడివద్దనుండి మనము ఆశించినది దొరకనప్పుడు, ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు మనసు లేనివారముగా ఉంటాము. అయితే మన దేవుడు అన్ని వేళలా స్తుతింపదగినవాడు. మన దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అనగా మన జీవితములలో న్యాయము జరిగించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ సత్యమును అనగా “నా దేవుడు అన్యాయము చేయుట అసంభవము” అనే సత్యము మనము ఎల్లప్పుడు జ్ఞాపకము పెట్టుకోవాలి. అంతేకాదు గానీ, నీకు అన్యాయము జరుగుతుంటే ఊరకనే చూసేవాడు కాదు నీ దేవుడు, కానీ నీ పక్షమున నిలిచేవాడు నీ దేవుడు.

మనము ఎల్లప్పుడు మన దేవుని గూర్చిన సత్యములోనే మనము బ్రతకాలి. ఆయన మనకు సహాయకరమైన కేడెము-

ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. -ద్వితీయోపదేశకాండము 33:29

“ఆయన నీకు సహాయకరమైన కేడెము” ఇది ఈరోజు నీకొరకు దేవుడు వెల్లడిపరచుచున్న సత్యము. ఈ సత్యమందు నిలబడతావా? నీ ప్రతి పరిస్థితిలోనూ, ఆయనే నాకు సహాయకరమైన కేడెముగా ఉన్నాడు అని నిలబడతావా? మన పితరులు, వారికి అనుగ్రహించబడిన కృప, సహాయములను బట్టి దేవుని స్తుతించినవారుగా ఉన్నారు.

ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి –మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి -1 సమూయేలు 7:7-8

ఇశ్రాయేలీయుల జీవితములో వచ్చిన ప్రతీ కష్టములోనూ, యుద్ధములోను దేవుడే వారి పక్షమున నిలబడినవాడుగా ఉన్నాడు.

సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.౹ -1 సమూయేలు 7:9

“నేను నా శ్రమలో మొర్రపెట్టగా నన్ను నా శ్రమలోనుండి తప్పించెను” అని సాక్ష్యము భక్తుడు ఇస్తున్నాడు. నీ వ్యక్తిగతమైన జీవితములో నిన్ను భయపెడుతున్న ప్రతీ పరిస్థితిలో నీ దేవునికి ప్రార్థించి నిలబడితే, ఆయన నీ ప్రార్థనను అంగీకరించి, నీకు సహాయకరమైన కేడెముగా ఉంటాడు.

సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయులమీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారుచేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.౹ ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారువరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.౹ అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి–యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.౹ -1 సమూయేలు 7:10-12

దేవుని సహాయమును బట్టి దేవునికి ఒక పేరు పలికిరి, ఇంతవరకు సహాయము చేసిన మా దేవుడు, ఎబినేజరు అని చెప్పగలిగారు. మన జీవితములో అనేకమైన సందర్భములలో, నానా రకములైన పోరాటములలోనుండి మనలను రక్షించినవాడుగా మన దేవుడు ఉన్నాడు.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును -కీర్తనలు 3:5

ఈరోజు గడుస్తుందో లేదోకూడా తెలియని రోజులలో మనము ఉంటున్నాము. మన దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నదానిని బట్టి మాత్రమే ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉంటున్నాము. గనుక ఇకముందు ఎటువంటి పోరాటము వచ్చినా సరే, మనకు జయమే! ఎందుకు అంటే, మన దేవుడే మనకు సహాయకరముగా ఉన్నాడు గనుక. ఆయన మనకు ఎబినేజరుగా ఉన్నాడు. నేను నా ఇంటివారును యేహోవాను సన్నుతించెదము, సేవించెదము అని మనము కూడా ప్రకటించి స్తుతించి ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము (2)
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడిచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)
|| ఎబినేజరే ||

ఆశలే లేని నాదు బ్రతుకును
నీ కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)
|| ఎబినేజరే ||

జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యం ఆశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృప యే స్తోత్రం (2)
|| ఎబినేజరే ||

 

మెయిన్ మెసేజ్

మనము ఆరాధిస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే, దేవుని ఆజ్ఞలు విడుదల అవుతాయి. దేవుని వాక్కును వినేముందు మన హృదయమును సిద్ధపరచుకోవాలి. అప్పుడు దేవుని వాక్యము అనే విత్తనము నాటబడి, ఎదిగి ఫలిస్తుంది. అలా సిద్ధపరచుకోకపోతే, ఫలింపు అనేది చూడలేము. మన జీవితములో ఇంకా ముగించబడనివి ఉంటే, ఇంతవరకూ సహాయకరముగా ఉన్న ఎబినేజరే దానిని ముగించేవాడుగా ఉంటాడు. ఆమేన్!

ఏలియాతో సారెఫతు విధరాలి దగ్గరకి వెళ్ళమని చెప్పిన సందర్భములో –

అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;౹ నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.౹ -1 రాజులు 17:8-9

ఇక్కడ దేవుడు విధవరాలితో ఏమైనా చెప్పాడా అని చూస్తే అలా ఏమీ లేదు. అయితే ఆయన మాట పలకగా దాని ప్రకారము ఖచ్చితముగా జరగవలసినదే. ఏలీషా జీవీతములో కూడా యుద్ధసమయములో దేవుని సహాయమును ఆరాధనద్వారా పొందుకున్న విషయమును జ్ఞాపకము చేసుకోగలము.

ఈరోజు “కృప వెంబడి కృప” ను గూర్చి మనము నేర్చుకుందాము. అసలు మనకు కృప దొరకడమే మహా భాగ్యము. నన్ను వెదకని వారికి నేను దొరకితిని అనీ దేవుడు చెప్పుచున్నాడు.

ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ -యోహాను 1:17

ఏ కృప అయితే మన జీవితములలో అనుగ్రహించబడిందో ఆ కృప యేసు క్రీస్తు ద్వారానే మనము పొందుకున్నాము. ఆయనను నమ్ముట ద్వారా ఆరంభించబడిన కృప, మన జీవితమంతా కృప వెంబడి కృప గా స్థిరపరచబడవలసినదిగా ఉంది.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹ -యోహాను 1:14

కృప వెంబడి కృపలో కొనసాగించబడాలి అంటే మొదటిగా వాక్యములో మనము కొనసాగించబడాలి. ఎందుకనగా వాక్యము అనగా యేసు క్రీస్తు.

అదేమని చెప్పుచున్నది? – వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.౹ -రోమా 10:8

ఒక వాక్యాన్ని పలుతున్నప్పుడు ఆ వాక్యమును పూర్తిచేయగలుగునట్లుగా మన నోతిలో వాక్యము ఉంటున్నది.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ -యోహాను 3:16

ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారు, “నశింపక” అని వ్రాయబడింది. అంటే యేసయ్యను అంగీకరించిన వారి జీవితములో నాశనము అనేది ఉండదు. ఎందుకంటే, యేసయ్య జీవమై ఉన్నాడు. అంతే కాక, యేసయ్య వెలుగై ఉన్నాడు, వెలుగున్న చోట, చీకటికి తావు లేదు. అందుకే యేసయ్యను రక్షకుడుగా, ప్రభువుగా కలిగినవారి జీవితములో నాశనము ఉండదు.

ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. -మత్తయి 1:21

యేసయ్య పుట్టుక యొక్క ఉద్దేశ్యములలో ఒకటి, “తన వారిని రక్షించుట”. యేసయ్య అక్కడ ఉంటే అక్కడ జీవము ప్రత్యక్షపరచబడుతుంది. ఈ సత్యవాక్యము యొక్క అనుభవములోనికి మనము రావాలి. ఈ లోకములో ఉన్న ఆచారము ప్రకారము మనము కూడా నడవడానికి ప్రయత్నిస్తాము. మనము లోకములోనుండి ప్రత్యేకించబడినవారముగా ఉన్నాము గనుక, ఆయనను వెంబడించేవారిగానే మనము ఉండాలి. అప్పుడు ఆయన కృప మన జీవితములో వెంబడిస్తుంది. అందుకే మొదటిగా వాక్య ప్రకారము మన జీవితము ఉండునట్లు సరిచేసుకోవాలి. అందుకే కీర్తనాకారుడు “వాక్యము నా పాదములకు వెలుగు అయి ఉన్నది” అని చెప్పుచున్నాడు.

ఈరోజులలో ఎవరినైనా అడిగితే “ఆత్మీయముగా ఎదగాలి అని ప్రార్థించమని” అడుగుతారు. అయితే ఒకరు ప్రార్థన చేయగా ఆత్మీయ అభివృద్ధి కలగదు గానీ, వాక్యము ప్రకారముగా నడిచినప్పుడు ఆ అనుభవమును బట్టి నీ ఆత్మ ఖచ్చితముగా అభివృద్ధి చెందుతుంది. తొమ్మిది విషయాలలో నీవు సరిగ్గా ఉండి, ఒక్క విషయములో నీవు సరిగాలేకపోతే, తొమ్మిదింటిలో బాగానే ఉన్నావులే అని దేవుడు సంతోషించడు గానీ, ఆ ఒక్క దానిలో నీవు సరిచేసుకున్నప్పుడు, ఆయన బహుగా సంతోషించేవాడుగా ఉన్నాడు. అదీ ఆత్మీయ అభివృద్ధి. అప్పుడు కృప వెంబడి కృపలో నీ జీవితము కొనసాగించబడుతుంది. మన జ్ఞానమును బట్టియో, మనకు కలిగిన సంపదను బట్టియో, మనము కలిగిన పరపతిని బట్టియో మన జీవితములు కొనసాగించబడవు గానీ, ఆయన కృపను బట్టియే కొనసాగించబడుతుంది.

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. -రోమా 6:14

యేసయ్యను అంగీకరించిన ప్రతీ ఒక్కరు కృపను పొందుకున్నవారే. వారి జీవితములలో పాపము ప్రభుత్వము చేయదు. పాపము అనగా మన ఆలోచనలలో చెడు అని చెప్పబడుతున్న ప్రతీదీ పాపముగా మనము గ్రహిస్తాము. అయితే మరొకలా చూస్తే, పాపమును అనగా నాశనము, మరణము, నాశనము అని కూడ అర్థము చేసుకోగలము. ఎవరైతే కృపకు లోబడినవారుగా ఉన్నారో, వారి జీవితములో నాశనము, నష్టము, మరణము అనేవి ప్రభుత్వము చేయదు. దాని అర్థము కష్టము నష్టము రావు అని కాదు గానీ, వాటిని బట్టి నీవు, నీ జీవితము నాశనము కావు. అందుకే మనము కృపను ఆధారము చేసుకుని మన జీవితములను కొనసాగించాలి.

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2

ఈ మాటలను జాగ్రత్తగా గమనిస్తే, దేవునికి కలిగిన “మహిమ” మరియు “గుణాతిశయము” ను బట్టి, మనలను పిలిచినవాని గూర్చిన వాని గూర్చిన “అనుభవజ్ఞానము” మూలముగా జీవమునకు (శరీర సంబంధించిన), భక్తికిని (ఆత్మకు సంబంధించిన) కావలసిన ప్రతీదీ మనకు దయచేస్తున్నాడు. అంటే, నీ దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతి అనుభవపూర్వకముగా ఎరిగి ఉండుటనుబట్టి శరీరమునకు, ఆత్మకు అవసరమైన ప్రతీదీ, ఆయన యొక్క మహిమ, ఆయన గుణలక్షణములను బట్టి మనకు దొరకుతుంది. అదే అనుభవపూర్వకమైన జ్ఞానము వలన, కృపయు సమాధానము విస్తరించును అని వ్రాయబడింది.

దీనిని బట్టి, కృప వెంబడి కృపలో మనము కొనసాగించబడాలి అంటే, దేవుని గూర్చిన అనుభవము ఎంతో ప్రాముఖ్యము. ఈ అనుభవము మనము మొదటిగా చూసిన వాక్య ప్రకారము జీవించుట అనే విషయము ను బట్టి సంపాదించుకోగలుగుతాము.

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23

ఇక్కడ పాపమును బట్టి, “దేవుడు అనుగ్రహించు మహిమను” పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది. అయితే యేసయ్యను అంగీకరించిన మనము నీతిమంతులుగా తీర్చబడిన తరువాత, “దేవుడు అనుగ్రహించిన మహిమ” పొందుతాము అని స్వాభావికముగా అర్థము చేసుకోగలము కదా!

దేవుని గుణములను మనము అనుభవించినప్పుడు ఆయన కృపలో మనము కొనసాగించబడతాము. మన జీవితములకు అవసరమైన ప్రతీదీ ఆయనలోనే ఉంది. మన దేవుడు కనికరపూర్ణుడు. ఆయన కనికరమును ఎప్పుడు అనుభవించగలుగుతాము? ఒక ఉదాహరణ చూస్తే, రోడ్డు మీద ఇద్దరు బిచ్చగాళ్ళు ఉన్నారు అనుకుందాము. ఒకడు అరుస్తూ అడుగుతున్నాడు, ఒకడు మౌనముగా ఉండి అడుగుతున్నాడు అనుకోండి, ఎవరికి మనము దానము చేసే అవకాశము ఉంటుంది? గట్టిగా అరిచి అడిగేవడికే కదా! ఎందుకంటే, వాడి అరుపులో వాడు ఉన్న స్థితి తెలియచేయబడుతుంది. దానిని బట్టి చూసేవారికి వారిని గమనించే అవకాశము ఉంటుంది.

కృపవెంబడి కృపలో ఎదగాలి అంటే, ఈ క్రింది మూడు అనుభవములు మనము కలిగి ఉండాలి.
1. వాక్య అనుభవము
2. మహిమ అనుభవము
3. దేవుని గుణలక్షణముల అనుభవము