స్తోత్రగీతము – 1
కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3)
1. పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో…. (2)
2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుతమద్భుతమే …. (2)
3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2)
4. బూరధ్వనితో – పరిశుద్ధులతో యేసు రానై యు౦డే…
ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2)
స్తోత్రగీతము – 2
కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా…. ఆ అ
1. ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక -2
నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున -2
2. చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా -2
రాజ వంశములో – యాజకత్వము చేసెదను -2
3. నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు -2
నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు -2
4. ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు -2
నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను -2
స్తోత్రగీతము – 3
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)
||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)
||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)
||యేసయ్యా||
ఆరాధన వర్తమానము
ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోను ఆరాధించాలి అని వాక్యము చెప్తుంది. సత్యము ఎరిగినవారమై మనము ప్రభువుని స్తుతిద్దాము.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. -కీర్తనలు 18:1-2
దేవుడే నాకు బలమై ఉన్నాడు నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. నీవు దేవునిని ఎలా స్వీకరిస్తావో అలాగే ప్రత్యక్షపరచుకుంటాడు. కీర్తనా కారుడు దేవుడే నా కోట, నా బలము అని అనేకమార్లు తెలియచేస్తున్నాడు. బలము కలిగిన నీ దేవుడు బలమైన కార్యములు చేయగలుగుతాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో పౌలు ఎరిగి ఉన్నాడు. పౌలు సమయము అయిపోయింది. ఇప్పుడు నీ సమయం. నా బలమంతా నీవేనయా అని నీవు చెప్పాలి. మన దేవుడు బలహీనుల పక్షమున నిలబడేవాడుగా ఉన్నాడు.
మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు -కీర్తనలు 9:2-3
యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు -కీర్తనలు 9:10
ఎవరైతే ఆయనను ఆశ్రయించువారిగా ఉంటారో, వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నీవు నిశ్చింతగా చెప్పగలవు, నా బలమైన దేవుడినే నేను ఆశ్రయిస్తాను, గనుకా నా శత్రువులు నశించునట్లుగా ఆయన నా పక్షమున వ్యాజ్యమాడువాడు. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. మన దేవుడు నమ్మదగినవాడు. ఎటువంటి పరిస్థితులలో ఆయన నమ్మదగినవాడుగా ఉంటాడు? మృతమైన విషయములలో సహితము, ఊహించడానికి కూడ అవకాశము లేని సందర్భము లో సహితము ఆయనను నమ్ముకోవచ్చు. ఆయనను బట్టియే సమస్తము సృష్టించబడతాయి. అందుకే మన దేవునిని నమ్ముకోవలసిన వారముగా ఉన్నాము.
నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. -కీర్తనలు 5:11
మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. నా బలమంతా నీవే దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనస్పూర్తిగా చెప్పగలుగుతావా? నీవు ఎటువంటి స్థితిలో ఉన్నాసరే, ఒక విషయము జ్ఞాపకము పెట్టుకోవాలి. నీ దేవుడు ఎటువంటి కార్యములు చేయగలుగుతాడు అనే సత్యము ఎరిగి ఉండాలి. నీ దేవుడు నిన్ను సిగ్గు పడనివ్వడు అనే సత్యమును నీవు ఎరిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు, నీకు ఏది శత్రువుగా ఉందో అది ఆయనకు శత్రువుగా ఎంచుకుంటాడు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీవు యేసు అని పలుకుతుంటే, దాని అర్థము – దేవా నాకు సహాయము చేయుము. ఇశ్రాయేలీయులు మూలుగుతున్న పరిస్థితిలో ఆ మూలుగులను సహితము విన్న దేవుడు. ఏమి విని ఉంటాడు? వారి మూలుగుల ద్వారా వారు వ్యక్తపరచిన నీ బాధ, పరిస్థితి ఆయన గ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన నామము ఎరిగినవారు ఆయనను స్తుతిస్తారు. నీవు ఆత్మ ద్వారా దేవుని స్తుతించునపుడు ఆత్మ కార్యములు నీ జీవితములో జరిగించబడతాయి.
ఆరాధన గీతము
నా బలమంతా నీవేనయా
నా బలమంతా నీవేనయా
అలలు లేచినను
తుఫాను ఎగసినను
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా
సోలిన వేలలలో
బలము లేనపుడు
ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే
నన్ను ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా
మెయిన్ మెసేజ్
ఈరోజు “మాట తప్పని వాడు” అనే విషయము గూర్చి తెలుసుకుందాము. ఏ విధముగా దేవుని ఆశీర్వాదము మనము పొందుకోవచ్చు అని చూస్తే,
మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.౹ అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.౹ -దానియేలు 9:1-2
యిర్మియా ద్వారా చెప్పబడిన సంగతులు గ్రంథము ద్వారా తెలుసుకొని వాటి ప్రకారము చేయడానికి సిద్ధపడ్డాడు. మనము కూడా దేవుని వాక్య ప్రకారముగా చేయడానికి సిద్ధపడాలి.
ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.౹ -2 రాజులు 8:18-19
ఇక్కడ చూస్తే, దేవుని హృదయము గ్రహిస్తే, ఆయన తాను ఇచ్చిన మాటను జ్ఞాపకము చేసుకొనేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారము చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మన దేవుడు వాగ్దానమును ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము పరిస్థితులను బట్టి మారిపోదు గానీ, అననుకూలముగా ఉన్నప్పటికీ నెరవేర్చేవాడుగా ఉన్నాడు.
మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి –లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.౹ అందుకు అహరోను–మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.౹ -నిర్గమకాండము 32:1-3
ఇక్కడ మోషే కొండమీద ఆలస్యము చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఇంతవరకు నడిపిన దేవుడిని విడిచిపెట్టడానికి సిద్ధపడే సందర్భము ఇది. అయితే మన ఫోకస్ దేవునికి మోషేకు జరుగుతున్న సంభాషణ.
మరియు యెహోవా ఇట్లనెను–నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.౹ కావున నీవు ఊరకుండుము; నాకోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా -నిర్గమకాండము 32:9-10
ఒకవేళ మన జీవితములో కూడా కొన్నిసార్లు ఆలస్యము చేతనో, మరేకారణము చేతనో మన దేవునిని విడిచిపెట్టేవారముగా అయిపోతాము. అయితే మన దేవుడు ఎలా మన జీవితములో కార్యము చేస్తున్నాడో అని సత్యము ఎరిగినట్టయితే, అలా తప్పిపోము.
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని–యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? –ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము.౹ నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో–ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.౹ అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను. -నిర్గమకాండము 32:11-14
ఇక్కడ మోషే మాటలు గమనిస్తే, ఐగుప్తీయులు నీగురించి చెడ్డగా చెప్పుకోవడానికి ఎందుకు అవకాశము ఇవ్వాలి? మరొకలా చూస్తే, “దేవా నీవు వాగ్దానము చేసావు కదా, ఆ వాగ్దానము నెరవేరకపోతే ఐగుప్తీయులు నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు కదా!” అని అడుగుతున్నాడు. మన జీవితాలను మనము జ్ఞాపకము చేసుకుంటే, మనము దేవుని మాటను పట్టుకొనేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో, నీవు నెరవేర్చగలవు అని ఆ మాటనే పట్టుకోండి. ఒకవేళ అననుకూల పరిస్థితులు వచ్చినా సరే, మోషే పలికినట్టుగా మనము కూడా సత్యము ఎరిగి ఆయన సన్నిధిలో నిలబడాలి.
నా చిత్తమంతా కూడా నేనే నెరవేర్చుకుంటాను అని దేవుడు చెప్పాడు. నెరవేర్చేది ఆయనే గానీ నిలబడవలసినది మనమే. ఎలా నిలబడాలో, మోషేను చూసి మనము నేర్చుకుందాము. వాగ్దానమును నెరవేర్చడనికి ఆయన సిద్ధపడేవాడు, ఇష్టపడేవాడు.