10-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ దినమును ప్రభువు మనకొరకు సిద్ధపరచాడు గనుక ఈ దినము మన ప్రభువుని మహిమపరచాలి. దేవుడు చేసిన మేలులను బట్టి, చూపిన కృపలను బట్టి మనము ఆయనను స్తుతించాలి. దేవుడు ఏమై ఉన్నాడో అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నవారు ఖచ్చితముగా ఈ దినము ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. నీ దేవుడు ఎల్లప్పుడూ నీ సంతోషమును కోరుకొనేవాడు. మన వ్యక్తిగతమైన జీవితములలో అపవాది అనేకరకమైన ఉచ్చులు బిగించి, మనలను దుఃఖములో, బాధలో ఉండిపోయేలాగా పన్నాగములు పన్నుతుంది.

అయితే నీవు సంతోషముగా ఉండి, ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలి అనేది నీ దేవుని ఆశ. దానికొరకై సమస్తమును సిద్ధపరచేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు – ద్వితీయోపదేశకాండము 10:17-18

నా దేవుడైన యెహోవా నాకు పరమదేవుడై ఉన్నాడు, నాకు ప్రభువై ఉన్నాడు అని నీవు ఎరిగినట్టయితే నీ ధైర్యము వేరేలా ఉంటుంది, నీ సంతోషము పరిపూర్ణమవుతుంది.

ఆయన పరమదేవుడనీ, పరాక్రమవంతుడనీ ఎందుకు చెప్పబడుతుంది? అపవాది ఎప్పుడూ అబద్ధమునే తెలియచేస్తాడు. ఆ అసత్యము ఏమిటి అంటే? మన జీవితము అనేకమైన పరిస్థితుల గుండా వెళుతుంది. అయితే అపవాది మన పరిస్థితులు మారవు, ఇంక మన పరిస్థితి అంతే అనే ఆలోచనలు పుట్టిస్తాడు. అయితే నీవు నమ్ముకున్న నీ ప్రభువు పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఆయన పరాక్రమవంతుడు, శక్తివంతుడు గనుక దేనినుండైనా కాపాడగలిగే సమర్థుడు. ఈ సత్యము నీవు ఎరిగినపుడు, అపవాది పుట్టించే అబద్ధములకు నీవు లొంగిపోవు.

యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి – నహూము 1:2-3

నీ దేవుడు రోషము గలవాడు. అయితే దేవుడు రోషము చూపించడానికి కారణము ఏమిటి? ఆయన సొత్తైన నిన్ను అపవాది దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆయన రోషమును కనబరచేవాడుగా ఉన్నాడు. ఈ సత్యము నీవు ఎరిగితే, ఆ సత్యమే స్థిరపరచబడుతుంది.

యెహోవా ప్రతికారము చేస్తాడు అని వ్రాయబడింది, అయితే ఎందుకు? ఎవరికి ప్రతికారము చేస్తాడు? అపవాదికే ప్రతికారము చేసేవాడుగా ఉన్నాడు. నీవు అపవాది బిడ్డగా జీవించినంతసేపూ నిన్ను రక్షించడానికి దినమెల్లా తన చేతులు చాచి ఎదురుచూస్తాడు. నీవు ఆయన దగ్గరకు రాగానే, అవే చేతులు ఖడ్గముగా మార్చబడి, నీ శత్రువుకు ప్రతికారము చేసేవాడుగా ఉన్నాడు.

నీవు అపవాదిని బట్టి కోల్పోయిన సంతోషమును రెట్టింపుగా నీకు దయచేస్తాడు. అపవాది ఎప్పుడూ మన దుఃఖమునే కోరుకుంటాడు. అపవాది కీడును తలంచింది అయితే ప్రభువు ఆ కీడును మేలుగా మారుస్తాడు. అలా ఆయన తన రోషమును కనపరుస్తాడు.

అపవాదికీ మన జీవితమే కావాలి దేవుడికీ మన జీవితమే కావాలి. అయితే అపవాది మన దుఃఖమును కోరుకుంటాడు, నీ దేవుడు మాత్రం నీ సంతోషమును కోరుకుంటాడు. నీవు దేవుడి సొత్తు అదే సత్యము.

మన దేవుడు ఎంత శక్తివంతుడు అంటే, మృతమైన దానిని సహితము సజీవముగా చేయగలవాడు. ఈ లోకములో వైద్యులను కూడా దేవుడుగానే భావిస్తారు. అయితే మన దేవుడికీ వారికి తేడా ఏమిటి అంటే, వైద్యులు జీవము ఉన్నంతవరకే వారు సరిచేయగలరు, మన దేవుడైతే మృతమైనప్పుడు సహితము జీవింపచేయగలవాడు. డాక్టర్లు రిపేర్ మాత్రమే చేయగలరు, నీ దేవుడు మాత్రము రిస్టోర్ చేయగలడు.

గనుక నీవు నీ దేవునికి మహిమకరముగా ఉండటానికి నీవు ప్రయత్నించాలి. నిన్ను నీవు ఆయనకొరకు సిద్ధపరచుకొంటే, ఆయన మహిమ కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. అందుకే మన జీవితములో ఉన్న పరిస్థితులను బట్టి మనము భయపడనవసరము లేదు. అయితే ఒకే ఒక కండిషన్ ఏమిటి అంటే, నీవు ఆయన బిడ్డగా నీవు జీవించడమే! నీ దేవుడు ప్రభువు అయి ఉన్నాడు, పరాక్రమవంతుడు మరియు రోషము గలవాడైఉన్నాడు.

ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే – ద్వితీయోపదేశకాండము 10:21

ఆయన ఏ సమయమునకు కావలసిన దానిని ఆ సమయమునకు సిద్ధపరచి ఉన్నాడు గనుక గడచిన కాలములో కార్యము అయిపోయింది. రానున్న కాలమునకు గొప్ప కార్యము సిద్ధపరచబడింది. ఇప్పటివరకు నీ జీవితములో గొప్పకార్యములు చేసింది ఆయనే, ఇకముందు జరగబోయే కార్యములు కూడా ఆయనే చేస్తాడు. గనుక ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లించాలి.

ఈరోజు నీవు స్తుతించడమును బట్టి నీ జీవితములో జరగవలసిన గొప్ప కార్యములు త్వరపడి జరుగుతాయి.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23

ఈ సమయములో దేవుని రక్షణ అంటే నీ జీవితములో దేవుడు సిద్ధపరచిన గొప్ప కార్యములు జరుగునట్లు మార్గములు తెరువబడతాయి. నీ జ్ఞానముతో ఈ గొప్పకార్యమును నీవు జరిగించలేవు. నీ ఊహకు మించినదే దేవుడు చేసే గొప్ప కార్యము. గనుక నేను ఖచ్చితముగా నేను గొప్పకార్యములు చూస్తాను అనే దృఢనిశ్చయము నీవు కలిగి ఉండాలి.

ఆరాధన గీతము

మహిమ నీకే ఘనత నీకే యేసయ్యా
నాకై నీవు చేసిన ఆ గొప్ప కార్యముకై
నిను మరువక నిత్యము స్తుతియించి ఆరాధింతును
హల్లెలూయా రక్షించినవానికే
హల్లెలూయ హెచ్చించినవానికే

శత్రువు నను బంధించినా
సమస్తము పోయినా
కోల్పోయినవాటిని రెట్టింపుగా
దీవించువాడవు నీవే
హల్లెలూయా రక్షించినవానికే
హల్లెలూయ హెచ్చించినవానికే

మహిమ నీకే ఘనత నీకే యేసయ్యా (JCY)

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు నూతనమైన బలమును పొందుట గూర్చి నేర్చుకుందాము. చాలా సందర్భాలలో నిరీక్షించే సమయం ఉంటుంది. ఆ సమయములో చాలామంది నీరసపడిపోతున్నారు. ఆశించినది జరగక ఆలస్యమయ్యే సమయములో మనలో నిరాశ, నిట్టూర్పు, నీరసముతో నిండిపోయేవారిగా ఉంటాము. అయితే సత్యమైన వాక్యము ఏమి చెప్పుచున్నది?

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు – యెషయా 40:29-31

నీవు దేని గురించైనా నిరీక్షణ కలిగి వేచి ఉంటే, ఇప్పుడు నీవు నూతనమైన బలము పొందుతావు అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ బలము దేనికొరకు అయి ఉంటుంది? దేని గురించి నీవు ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నావో, దానిని పొందుకోవటానికి, స్వతంత్రించుకోవడానికి ఈ బలము పొందుకుంటావు.

అయితే ఎక్కడ ఈ బలము అనుగ్రహించబడుతుంది? నీ ఆత్మకు బలము అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుడు శక్తి చేతకాదు, బలము చేతకాదు నా ఆత్మ చేతనే అని ప్రభువు చెప్పుచున్నాడు.

తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి –నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను – రోమా 4:17-21

ఇక్కడ అబ్రహామునకు దేనిని బట్టి బలము వచ్చింది అని ఆలోచిస్తే, “వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి” బలమును పొందుకున్నాడు తన నిరీక్షణ కనపరచాడు. అలా తాను పొందుకున్న బలమును బట్టి మృతతుల్యమైనది జీవింపచేయబడింది. అబ్రహాము కుమారునికొరకు ఎదురుచూస్తున్నాడు అయితే అబ్రహాము నూరేండ్లవాడు అయిపోయాడు, శారా గర్భము నిలిచిపోయింది. అటువంటి మృతతుల్యమైన పరిస్థినిని అబ్రహాము పొందుకున్న నూతనమైన బలము, అధిగమించి తాను నిరీక్షించిన దానిని పొందుకొనునట్లుగా అబ్రహామును మార్చింది.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము మనము గమనిస్తే- “తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక…”. మన జీవితములలో కూడా అనేకమైన ఆలోచనలు వస్తాయి అయితే దేవుని వాగ్దానమును సందేహించకూడదు. అబ్రహాము తన పరిస్థితిలలో దేవుని వాగ్దానమును నమ్మి, ఆయనను మహిమ పరచి, ఆయన చేయగల సమర్థుడు అని ఖచ్చితముగా నమ్మి, నూతన బలము పొందుకున్నాడు, దానిని బట్టి దేవుని ఆత్మ ద్వారా కార్యము జరిగింది.

అపవాది పుట్టించే ఆలోచనలను కొట్టివేసి, దేవుని వాగ్దానమును మాత్రము గట్టిగా పట్టి నిలబడాలి. కొన్ని విషయాలు త్వర త్వరగా జరుగుతాయి కానీ కొన్ని విషయాలు ఆలస్యము అవుతాయి. ఆలస్యము అయితే మాత్రము, దేనిని బట్టి నీవు నిరీక్షిస్తున్నావో ఆ దేవుని వాగ్దానమును బట్టి మాత్రము నిలబడి ఉంటే చాలు.

యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు – కీర్తన 37:34

కనిపెట్టుకొని యుండుము అంటే ఎదురుచూచుట. అనగా ఆయన కొరకు నీవు ఎదురుచూస్తే, నీవు ఎదురుచూస్తున్న దానిని నీవు స్వతంత్రించుకొనునట్లు ఆయన నీకు నూతనమైన బలమును అనుగ్రహిస్తాడు. బలత్కారులు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు.