10-09-2023 – ఆదివారం మొదటి ఆరాధన – అపవాదిని ఓడించడానికి

స్తోత్రగీతము – 1

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)

నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)
||స్తోత్రబలి||

రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)
||స్తోత్రబలి||

నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)
||స్తోత్రబలి||

వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)
||స్తోత్రబలి||

స్తోత్రగీతము – 2

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య  (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము             ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ                 ||యేసయ్య||

స్తోత్రగీతము – 3

వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

ఆరాధన వర్తమానము

మన ప్రభువు మంచివాడు అయి ఉన్నాడు. ఆయనను రుచి చూడనంతవరకూ నీకు ఆయన గూర్చి తెలియదు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనసు ఏంటో చాలమందికి తెలియదు. అయితే మనకైతే ఆయన ఎటువంటివాడో, మనపై ఎలా ఆయన ప్రేమ చూపిస్తున్నాడో ఎలా తెలుసుకోగలుగుతాము? సంతోషకరమైన సందర్భములలో కంటే, మనము వెళ్ళే కష్ట సమయములలో, ఆపదలలో మనము నాశనము కాకుండా తప్పించబడ్డప్పుడు ఖచ్చితముగా ఆయన ప్రేమ మనము గుర్తించగలుగుతాము. అప్పుడు మనము నిజముగా ఆయనను ఆరాధించగలుగుతాము. సంగీతము బట్టిగానీ, ప్రత్యేకమైన వాతావరణము బట్టిగానీ, మనము ఆరాధించము గానీ, మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి, ఆసక్తి గలిగి ఆరాధించాలి. ఆసక్తి ఉన్నప్పుడు ఆటంకము అడ్డగించలేదు. ఈ సత్యము ఎరిగిన దావీదు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో ఉంటానో అనే ఆసక్తిగలిగి ఉండేవాడు.రాజుగా విలాసవంతమైన జీవితము గడపగలిగే అవకాశము ఉన్నప్పటికీ, దేవుని సన్నిధిలో ఉండటానికే ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మనము కూడా అదేవిధానములో ఉండాలి.

ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. -కీర్తనలు 86:8-9

మన దేవుడు ఎటువంటివాడో ఈ మాటలో చూడగలము. మన దేవుడు అసాధారణమైన సామర్థ్యము గలిగినవాడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగినవాడు. అయితే ఎక్కడ ఆయన ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు?

దేవుని యొద్ద సమస్తమైన దేవదూతలు ఉండేవారు. అపవాది పడద్రోయబడకమునుపు, దేవుని సన్నిధిలో ఆరాధన ప్రధానిగా ఉన్నప్పుడు, తన మనసులో దేవునికంటే హెచ్చించబడాలి అనే ఆలోచన పుట్టినప్పుడు తన సన్నిధినుండి తోసివేసాడుగానీ, చంపలేదు.

అయితే అదాము హవ్వలు పాపము చేయుటకు ప్రేరేపించిన అపవాదిని మాత్రము శపించినవాడుగా ఉన్నాడు. ఏమని శపించాడు అని ఆలోచిస్తే, మనుష్యుల చేత తల చితుక త్రొక్కబడే శాపమును ఇచ్చాడు.

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.౹ -ఆదికాండము 3:15

దీనిని బట్టి మన దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనకు అర్థము అవుతుంది. మన అనుభవము దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడే మన జీవితమును మనము కట్టుకోగలుగుతాము. దేవుని ఆశ్చర్య కార్యములు అన్నీ, మన కొరకే, మన జీవితములద్వారా ఆయన మహిమను చూపాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కృపకొరకు కనిపెట్టేవారి యందు ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనవల్ల కాదో, అప్పుడు మనలను నడిపించేదే దేవుని కృప. కృప అనేది దేవుని అద్భుతము జరిగించడానికి ఒక ద్వారము. ఆ కృపద్వారానే నీ జీవితములో అద్భుతము జరుగుతుంది.

మనుష్యరీతిగా ఆలోచిస్తే, మనము ఎవరిబట్టి సంతోషము కలిగి ఉంటామో, వారికొరకు ఎమైనా చేయడానికి సిద్ధపడతాము. అయితే ఆయన కృప కొరకు కనిపెట్టుకొనేవారుగా ఉంటారో, వారిని బట్టి సంతోషించే దేవుడు కూడా వారికొరకు ఏమి చేయడానికైన ఇష్టపడతాడు.

“దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు” అంటే ఏమిటి? ఈ లోకములో అనేకసార్లు మనుష్యుల సహాయము బట్టి వారిని దేవుడుగా చూస్తాము. నిజానికి వారి సహాయము మన జీవితములో ఎంతో ప్రాధాన్యముగా ఉంటుంది. అయితే ఆ సహాయమును బట్టి దేవునికంటే గొప్ప స్థానము వారికి ఇవ్వడానికి లేదు. ఇశ్రాయేలీయులు కష్టాలలో ఉన్నప్పుడు, వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరుచుకున్నాడు.

అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.౹ మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.౹ -నిర్గమకాండము 3:14-15

మోషేతో ఎలా పరిచయము చేసుకున్నాడు అని చూస్తే, “ఉన్నవాడను అను వాడనై ఉన్నాను” అని చెప్పుచున్నాడు. “మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా” అని చెప్పుచున్న్నాడు. “తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము” అని చెప్పుచున్నాడు. ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యము. ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలు కష్టములో ఉన్నప్పుడు చూసిన “ఉన్నవాడైన” దేవుడు మన జీవితములలో కూడా కష్టములలో మనతోనే ఉన్నవాడుగా ఉన్నాను అని చెప్పుచున్నాడు. అందుకే “తరతరములకు జ్ఞాపకార్థనామము” అని చెప్పుచున్నాడు. ఈ సంగతి ఎరిగిన వారమైతే

నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను. -కీర్తనలు 86:12

సత్యము ఎరుగకుండా పూర్ణహృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మేలు పొందినప్పుడేకాదు గానీ, కష్టసమయములో శ్రమలోను సహితము సత్యము ఎరిగినవారుగా, నా దేవుడు ఉన్నవాడు అయినవాడు, ఈ నామము ఆయన జ్ఞాపకార్థముగా ఇచ్చినవాడు అయి ఉన్నాడు అనే సత్యము ఎరిగినవారుగా మనము ఆరాధించాలి.

ఆసాను గనుక జ్ఞాపకము చేసుకొంటే, తాను యుద్ధమునకు బయలుదేరినప్పుడు, “దేవా, నేను బలహీనుడనే, కానీ నీ నామము పేరట ఈ విస్తారమైన సైన్యమును ఎదుర్కొనడానికి వెళుతున్నాను” అని చెప్పుచున్నాదు. వాక్యము యొక్క అనుభవములోనికి రాకుండా క్రీస్తు జీవితమును నీ జీవితములో అనుభవించలేవు.

దేవుని నామములో అద్భుతములు జరుగుచున్నవి. అయితే ఆ నామము మనకు ఇవ్వబడింది అంటే మన అర్హత ఏమై ఉంటుంది? దేవుని అద్భుతములు మన జీవితములో పొందుకోవడానికి మనకు అర్హత ఇవ్వబడింది. ఎలా అయితే ఆసా సిద్ధపాటునుబట్టి విజయము అనుగ్రహించాడో, అలాగే మనము కూడా సత్యమును బట్టి సిద్ధపడ్డప్పుడు మన జీవితములలో అద్భుతములు చూడగలుగుతాము. ఈ సత్యము ఎరిగినవారుగా “నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను” అని చెప్పి మన ప్రభువును ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)
||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)
||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)
||నీ నామమునే||

వారము కొరకైన వాక్యము

మనము ఆత్మీయముగా కట్టబడాలి అనే ఆశ కలిగి, సిద్ధపాటు కలిగి ఉంటాము. అయితే, అపవాది మనలను పడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనము అపవాది తంత్రములు ఎరగకపోతే, ఎంతగా మనము ఆత్మీయముగా ఎదిగినప్పటికీ, అపవాది సమయము చూసి ప్రయోగించే తంత్రములకు పడిపోయేవారిగా ఉంటాము.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹ -ఎఫెసీయులకు 6:12

“మనము” అనే మాటలో నీవు కూడా ఉన్నావా? అనగా, నీవు పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నావు అని గ్రహించగలుగుతున్నావా? ఆత్మీయమైన జీవితములో ఈ పోరాటము ఉంటుంది అనే విషయము కూడా చాలామందికి తెలియదు. అయితే మనము ఈ సత్యము అనగా అపవాది ఎలా మనమీద దాడి చేస్తాడు, దానినుండి ఎలా మనము తప్పించుకోవాలి అనే సత్యము ఎరిగి ఉండాలి. ఒకసారి యోబు జీవితాన్ని ధ్యానము చేస్తే, ఈ విషయము స్పష్టముగా మనకు తెలుస్తుంది.

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా–నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది–భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను. అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు అని అడుగగా అపవాది–యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతనిచేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. -యోబు 1:6-10

అపవాది మాటలు చూస్తే, యోబుకు కలిగిన ప్రతి దానికి దేవుడవైన నీవు కంచెవేసావు కదా అని అడుగుతున్నాదు. అసలు అపవాదికి కంచెవేయబడి ఉంది ఎలా తెలిసింది? అంటే అప్పటికే యోబును నష్టపరచడానికి అనేకమైన ప్రయత్నాలు చేసాడు అనే కదా అర్థము. అయితే ఒక్కసారి అకస్మాత్తుగా యోబు జీవితములో ఆపద కలిగింది.

ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి –ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీదపడి వాటిని పట్టుకొనిపోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–దేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీదపడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి– నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనులమీద పడినందునవారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. -యోబు 1:13-19

అయితే ఈ నష్టము వెనుక అపవాది కార్యము, ప్రయత్నము ఉన్నట్టుగా యోబుకు తెలుసా? అస్సలు తెలియదు. అలాగే మన జీవితములో కూడా మనలను నాశనము చేయడానికి అపవాది ఖచ్చితముగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే అపవాది తంత్రములను ఎరిగినవారుగా మనము ఉండాలి. అందుకే మనము మనుష్యులతో కాదు పోరాడేది అనే విషయము మనము ఎరిగి ఉండాలి. మన జీవితాలలో అపవాది ఖచ్చితముగా దాడి చేస్తాడు. అయితే ఎలా మనము దాడి జరగకుండా మనలను కాపాడుకోవాలి? అలాగే దాడి జరిగినా కూడా ఎలా మనము నిలబడాలి అనేది మనము తెలుసుకుందాము.

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9

ఇక్కడ కాపరి గురించి చెప్తూ, “సంఘమునకు నేనే ద్వారమును” అని చెప్పుచున్నాడు. అంటే, సంఘములోని బిడ్డల ఆశీర్వాదమునకు ద్వారముగా ఉన్నాడు అని అర్థము. ఒకవేళ సింహమో, పులియో కాపరిని చంపేస్తే, గొర్రెలను సునాయాసముగా పట్టుకోవచ్చు. అలాగే సంఘకాపరి కూడా అపవాది దాడులకు భయపడని వాడుగా ఉండాలి.

సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. -లూకా 22:31-32

అపవాది అనేక రకాలుగా ప్రయత్నాలు చేసాడు అనే సంగతి సీమోనుకు తెలియదు. జల్లెడపట్టడము అంటే ఎక్కడ దొరుకుతాడో అని కనిపెట్టి వెతకడము. ఆ పరిస్థితులలో సీమోను నమ్మిక కోల్పోయే స్థితిలోనిని అతను వెళ్ళబోతున్నాదు అని ముందే యెరిగిన యేసయ్య తన కొరకు ప్రార్థించాడు అనే సంగతి ఇక్కడ మనము చూడగలము. అదేవిధముగా మన జీవితములో కూడా అపవాది ఇలాగే ప్రయత్నిస్తాడు అని మనము ఎరిగి ఉండాలి. అయితే ఈ సత్యము ఎరుగక మనము మనుష్యులను ద్వేషించేవారిగా ఉంటాము. యేసయ్య సీమోనును దండించలేదు గానీ అతని వెనుక ప్రేరేపించిన సాతానునే గద్దించాడు.

ఈ విషయములన్నింటిలో మనము గమనిస్తే చివరికి విజయము మాత్రము దేవుని బిడ్డలదే! అనగా దేవుని గూర్చిన సత్యము ఎరిగినట్టయితే నీది, నాదే! అపవాది తల తన బిడ్డలచేత చితుకత్రొక్కబడవలసినదే అని ఆదిమ దినాలలోనే దేవుడు నిర్ణయించాడు. అయితే అపవాది మనమీద దాడి చేయకుండా ఉండాలి అంటే యోబువలె మనలను మనమే సిద్ధపరచుకోవాలి.

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు. -యోబు 1:1

మనము కూడా, యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు. మనము ఇలా యోబు కలిగిన క్యారెక్టర్ కలిగినవారిగా సిద్ధపడాలి. ఒకసారి చెడు అని తెలిసిన తరువాత మనము విసర్జిస్తున్నామా? లేక మరలా అదే చెడువైపుకు వెళుతున్నామా? ఆత్మీయమైన జీవితములలో ఏ విషయములోనూ మినహాయింపులు ఉండకూడదు. ఆత్మీయజీవితము పోరాటముతోనే ముందుకు నడిచేదిగా ఉంది.

ప్రభువు ప్రేమ కలిగినవాడై, మనము చెడువిషయములలో ఉన్నప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తూనే ఉంటాడు. అయితే మనము ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా అదే పరిస్థితిలో కొనసాగుతుంటాము అయితే అలా మనము ఇకమీదట ఉండకూడదు. అయితే ఇలా సిద్ధపడకుండా దేవుని పని చేయాలి అంటే అది కుదరని పని. నీ సామర్థ్యము బట్టి నీవు ఏమి చెయ్యలేవు. అయితే నీ దేవుని సామర్థ్యము బట్టి నీవు ఏమైనా చేయగలవు. క్రీస్తును నమ్ముకున్న మనలో క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడకుండా క్రైస్తవులము అని చెప్పుకోవడము వ్యర్థము. మనలో చాలామంది భక్తి కనపరచేవారముగా ఉంటాము గానీ, దేవుని యందలి భయము లేని వారుగా ఉంటున్నాము. దేవుడు, నాలోనూ, నాతోనూ ఉంటున్నాడు అనే సంగతి మర్చిపోయేవారముగా ఉంటున్నాము. అయితే “చీకటిని పారద్రోలడానికి మనలను ఏర్పరచుకున్నాడు”. అంతే కానీ, చీకటిలో కలిసిపోవడానికి కాదు! దేవుని వెలుగును కలిగిన మనము, చీకటిలో ప్రకాశించాలి గానీ, చీకటిలో కలిసిపోకూడదు. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి గానీ, మరొకను నిన్ను సిద్ధపరచరు అనే సత్యము ఎరిగి ఉండాలి. మనలో జయము రావాలి అంటే మొదటి మెట్టు, అపవాదిని అపవాదికి సంబంధించిన దానిని అసహ్యించుకోవాలి. నా దేహము దేవునిది అనే సమర్పణ మనము కలిగి ఉండాలి.

యథార్థవర్తనులుగా, న్యాయవంతులుగా దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవారిగా మనము ఉంటే మన చుట్టూ, దేవదూతల చేత కంచెవేయబడుతుంది.

యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును -కీర్తనలు 34:7

దేవునియందలి భయభక్తులు కలిగి ఉన్నట్టయితే నీ మార్గములో నీకు దేవదూతల కావలి ఉంటుంది. మార్గము అనగా భౌతికమైన ప్రయాణములలోనైనా, లేక నీ జీవితపు ప్రయాణములలోనైనా సరే! మాటలద్వారా కూడా మనలను పడగొట్టాలి అనే ప్రయత్నము అపవాది చేస్తాడు. గనుక మన మాటలు మనము జాగ్రత్తగా మాటలాడాలి.

పేతురును జల్లెడ పట్టాలి అని అపవాది ప్రయత్నిస్తున్న సందర్భములో యేసయ్య ఎందుకు కలుగచేసుకున్నాడు? అని ఆలోచిస్తే, పేతురు యేసయ్యను వెంబడించినవాడుగా పేతురు ఉన్నాడు. మనము కూడా యేసయ్యను వెంబడించేవారిగా అనగా యేసయ్య తన వాక్యము ద్వారా ఏమి చెప్తే ఆ ప్రకారముగా మనము జీవించాలి. అప్పుడు మన జీవితములో కూడా యేసయ్య కలుగచేసుకుంటాడు. శిష్యుల జీవితములో చూస్తే, మరికొద్ది దినములలో యేసయ్య వారిని విడిచివెళ్ళేవాడుగా ఉన్నాడు గనుక, యేసయ్యను వెంబడించేవారిగా ఉన్నప్పుడు, యేసయ్య విడిచివెళ్ళాక అప్పగించినదానిని కొనసాగించగలుగుతారు. వెంబడించడము అంటే సమస్తము అనగా ఈ లోకమునకు సంబంధించిన ప్రతీ విషయమును విడిచిపెట్టాలి. అప్పుడు అపవాది దాడి చేయకుండా మనలను సిద్ధపరచుకుంటాము. అయితే ఒకవేళ అపవాది మనమీద దాడి చేసేస్తే ఏమి చెయ్యాలి? అపవాది శోధించినప్పుడు యేసయ్య ఏమి చేసాడో అదే మనము చేయాలి. అనగా వాక్యము చేతపట్టుకుని నిలబడి ఎదిరిస్తే ఖచ్చితముగా జయము మనదే!

గతవారము “గుమ్మముల గడియలు బలపరచడము” అనేదాని గురించి ప్రభువు మాట్లాడాడు. అంటే దాని అర్థము ఏమిటి? గడియ బలహీనముగా ఉంది అని అర్థము. ఇప్పుడు బలపరచాలి అంటే, అయితె ఆ గడియను బాగుచేయాలి లేదా కొత్త గడియ వేయాలి. మన జీవితములో కూడా మన జీవితములో అపవాది ప్రవేశించకుండా అడ్డగించవలసినది బలహీనముగా ఉన్నప్పుడు, ఆ విషయమును సరిజేసి, బలపరచి అపవాది ప్రవేశించకుండా మనము సిద్ధపడతాము. సరిచేయుట అంటే రిస్టోరేషన్. కొత్తది వేయుట అంటే, రీప్లేస్మెంట్. గనుక అపవాదితో జరిగే యుద్ధములో భయపడక యోబువలే పేతురువలే మనము సిద్ధపడదాము.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹ అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి౹ ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని౹ పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.౹ ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.౹ మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.౹ -ఎఫెసీయులకు 6:12-17

అపవాది మనలను పడగొట్టడానికి ప్రయత్నము ఉంటుంది గనుక ఆపద్దినము అనేది ఖచ్చితముగా ఉంటుంది. అలాగే మనము అపవాదికి సంబంధించిన ప్రతిదానిమీద పోరాడుచున్నాము. గనుక సమస్తము నెరవేర్చినవారమై, అనగా దేవుడు ఈరోజు తెలియచేసిన క్యారెక్టర్ కలిగినవారిగా ఉన్నప్పుడు అని అర్థము. ఈ క్యారెక్టర్ కలిగిలేకుండా సర్వాంగ కవచము ఏమీ ఉపయోగపడదు. మన హృదయములో రూపాంతరత లేకుండా మనము పోరాటములో నిలవలేము.

యోబు జీవితములో పరీక్షించుట కొరకే అపవాది అనుమతించబడ్డాడు అయితే దేవుడు విడిచిపెట్టక రెండంతల ఆశీర్వాదము దయచేసినవాడుగా ఉన్నాడు. నీవు నేను కూడా దేవుడు ఈరోజు తెలియచేసిన ప్రకారము మనము చెడుతనమును విడిచిపెట్టి, దేవుని యందలి భయభక్తులు కలిగి వెంబడిస్తే, ఖచ్చితముగా అపవాది పోరాటములో విజయము మనదే!